'సరిలేరు నీకెవ్వరు' మూవీ రివ్యూ

Saturday,January 11,2020 - 12:49 by Z_CLU

నటీనటులు : మహేష్‌, రష్మిక, విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్‌, సంగీత, రావు రమేష్, అజయ్, బండ్ల గణేష్‌ తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌

ఛాయాగ్రహణం : రత్నవేలు

సమర్పణ : దిల్ రాజు

నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర

రచన -దర్శకత్వం: అనిల్‌ రావిపూడి

నిడివి : 169 నిమిషాలు

సెన్సార్ : U/A

విడుదల : 11 జనవరి 2020

కొన్నేళ్ళుగా సంక్రాంతికి దూరంగా ఉన్న సూపర్ స్టార్ మళ్ళీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సంక్రాంతి బరిలో దిగాడు. గతేడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనీల్ రావిపూడితో కలిసి ఈసారి కాస్త కామెడీ కూడా ట్రై చేశాడు. మరి మహేష్ సరిలేరు తనకెవ్వరు అనిపించాడా లేదా జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ


కథ :

దేశరక్షణే ద్యేయంగా పెట్టుకొని సరిహద్దుల్లో డ్యూటీనే ప్రాణంగా భావించే ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ(మహేష్ బాబు). ఒక మిషన్ లో భాగంగా అజయ్ తో కలిసి యుద్దానికి వెళ్ళిన అజయ్(సత్యదేవ్) ఓ ప్రమాదానికి గురై హాస్పిటల్ లో చేరతాడు. అతని చెల్లి పెళ్లి దగ్గరలోనే ఉందని తెలుసుకున్నఅజయ్ కృష్ణ తన పై స్థాయి వ్యక్తి కోరడంతో ఆ పెళ్లి పూర్తి చేయడం కోసం కర్నూల్ లో అడుగుపెడతాడు. అదే సమయంలో అజయ్ తల్లి మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ భారతి(విజయశాంతి)కి లోకల్ మినిస్టర్ ఎద్దుల నాగేంద్ర(ప్రకాష్ రాజ్) ఓ గొడవ నడుస్తుంటుంది. అయితే భారతి కి అండగా నిలిచి నాగేంద్రను అజయ్ ఎలా మంచి వ్యక్తిగా మార్చాడు..? చివరికి అతనికి ఏం తెలియజేశాడు అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే.

 

నటీనటుల పనితీరు:

సూపర్ స్టార్ మహేష్ మరోసారి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో వన్ మ్యాన్ షో చూపించాడు. అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ పాత్రలో ఫ్యాన్స్ తో పాటు అందరినీ ఆకట్టుకున్నాడు. కొన్ని సందర్భాల్లో పంచ్ డైలాగ్స్ తో చెలరేగిపోయాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో మాస్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించుకున్నాడు. ముఖ్యంగా ‘మైండ్ బ్లాక్’ సాంగ్ లో తన డాన్స్ లతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాడు. అర్థమవుతుందా అనే మేనరిజంతో బబ్లీ గర్ల్ పాత్రలో రష్మిక ఆకట్టుకుంది. కానీ పాత్రలో డెప్త్ లేకపోవడంతో నటిగా పూర్తిస్థాయిలో మార్కులు అందుకోలేకపోయింది. 13 ఏళ్ల తర్వాత మళ్ళీ మేకప్ వేసిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి భారతి పాత్రలో అద్భుతంగా నటించారు.  రీ ఎంట్రీకి సరైన పాత్రను ఎంచుకొని ప్రేక్షకులను మెప్పించారు.

ప్రకాష్ రాజ్ రొటీన్ విలన్ పాత్రలోనే కనిపించాడు. అందువల్ల సరైన విలనిజం పండలేదు. బండ్ల గణేష్ కామెడీ ట్రాక్ ఊహించినంత రేంజ్ లో లేదు. మహేష్ కి ఎప్పుడు పక్కనే ఉండే ప్రసాద్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ మంచి నటన కనబరిచాడు. రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హరిప్రియ, బండ్ల గణేష్, రఘుబాబు, జయప్రకాశ్ రెడ్డి అందరూ కామెడీ ట్రాక్ కు అంతో ఇంతో ఉపయోగపడ్డారు. సంగీత డిఫరెంట్ గా ట్రై చేసినా కొన్ని చోట్ల అతి అనిపిస్తుంది. మూవీ స్టార్టింగ్ లోనే తమన్నా ఇలా వచ్చి అలా స్పెషల్ సాంగ్ చేసి వెళ్లిపోతుంది. మిగతా నటీనటులంతా పరవాలేదనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు అనుకున్నంత స్థాయిలో కాకపోయినా ఉన్నతలో ప్లస్ అయింది. ముఖ్యంగా ‘సరిలేరు నీకెవ్వరు’ థీం సాంగ్, ‘సూర్యుడివో చంద్రుడివో’, మైండ్ బ్లాక్ సాంగ్స్ థియేటర్స్ లో క్లిక్ అయ్యాయి. మిగతా పాటలు అంతగా ఎట్రాక్ట్ చేయలేకపోయాయి. కొన్నిచోట్ల నేపథ్య సంగీతం బాగా ఇచ్చాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కి సౌండింగ్ బాగుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. కథకు తగ్గట్టుగా విజువల్స్ అందించాడు. ఎడిటింగ్ పరవాలేదు. ఆర్ట్ వర్క్ బాగుంది.

అనిల్ రావిపూడి కథ-కథనంలో కొత్తదనం లేదు. డైరెక్షన్ బాగుంది. కొన్ని యాక్షన్ సీన్స్, విలన్-హీరో మద్య వచ్చే సీన్స్ ను బాగానే హ్యాండిల్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

సూపర్ స్టార్ కి కొండంత క్రేజ్ ఉంది… ఎంటర్టైన్ మెంట్ లో అనిల్ రావిపూడి దిట్ట. ఈ ఇద్దరూ కలిస్తే ఓ బ్లాక్ బస్టర్ డెలివరీ అవ్వడం పక్కా అని అనుకున్నారంతా. కానీ అంత వరకూ వచ్చి కేవలం కొద్ది దూరంలోనే ఆగిపోయారు. భారీ అంచనాలతో థియేటర్స్ లో అడుగుపెట్టిన ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడిది ఎంటర్ టైన్మెంట్ స్కూల్. ఇప్పటిదాకా వినోదాన్ని కమర్షియల్ ఫార్ములాతో మిక్స్ చేస్తూ ఆ బలంతోనే హిట్లు కొడుతూ వచ్చాడు. ‘ఎఫ్2’ విషయంలో పూర్తిగా కామెడీ మీద ఆధారపడి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే మహేష్ బాబు లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న కథానాయకుడు దొరికితే వాటిని మించే సినిమాను ఇవ్వాలన్న తాపత్రయంతో మాస్ మసాలాని కామెడీని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం గట్టిగానే చేశాడు. ఇది కొంతమేరకే ఫలితాన్ని ఇచ్చింది. మొదటి భాగంలో ఆర్మీ ఎపిసోడ్ తర్వాత వచ్చే ట్రైన్ ఎపిసోడ్ ను సరిగ్గానే వాడుకున్నా ఆ ట్రాక్ తో హిలేరియస్ గా నవ్వించలేకపోయాడు దర్శకుడు. ఆ ఎపిసోడ్ లో కేవలం కొన్ని నవ్వులు మాత్రమే ప్రేక్షకులకు దొరుకుతాయి.

ఇక అప్పటివరకూ హీరోయిజం, కామెడీ మీద ఫోకస్ పెట్టి సినిమాను నడిపించేసిన అనిల్ ఇంటర్వెల్ టైంకి తనలో ఉన్న మాస్ డైరెక్టర్ ని బయట పెట్టి అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి థియేటర్స్ లో అరుపులు పుట్టించాడు. అలాగే నల్లమల యాక్షన్ ఎపిసోడ్ కూడా రెండో భాగంలో మాస్ ప్రేక్షకులను బాగా ఎట్రాక్ట్ చేసింది. అయితే హీరో-విలన్ మొదటిసారి ఓ భారీ యాక్షన్ మోడ్ లో కలిసినప్పుడు సెకండ్ హాఫ్ లో అంతకంటే ఎక్కువ యాక్షన్ డ్రామాను ఆశిస్తాం. కాని అనిల్ ఆలోచన మరోలా సాగింది. రొటీన్ అవుతుందేమోనన్న ఫీలింగ్ తో ప్రకాష్ రాజ్ ను కామెడీ విలన్ గా మార్చేసి ఇక యాక్షన్ కి ఎక్కడా స్కోప్ లేకుండా చేసాడు. సినిమాలో మంత్రి, సైనికుడి మధ్య నడిచే డ్రామాను ఒక సన్నివేశంలో చెస్ గేమ్ లో చూపిస్తూ చెప్పిన విధానం బాగుంది.

సమాజానికి సందేశం ఇచ్చేలా మహేష్ పార్టీ ఆఫీస్ స్పీచ్ బోర్ కొట్టిస్తుంది. ఇప్పటికే మహేష్ నుండి అలాంటి స్పీచ్ లు వినేయడంతో అది పెద్దగా ఎక్కలేదు. కథ  సీరియస్ గా మలుపు తీసుకుంటోందనుకున్న ప్రతిసారి అక్కడ కామెడీని చొప్పించే ప్రయత్నం చేయడం అంతగా పండలేదు. కాకపోతే రెండు మూడు ఎలివేషన్లు ఉన్న సీన్లు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచే హీరో లాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. అనిల్ కూడా మళ్ళీ అదే చూపించాడు. కానీ దానికి ఆర్మీ అనే ఎలిమెంట్ యాడ్ చేసి చెప్పాడంతే. అందువల్ల సినిమా కథలో గానీ కథనంలో కానీ కొత్తదనం కనిపించలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మరింత రంజుగా నడిపిస్తే ఇంకా బెటర్ గా ఉండేది. ఫైనల్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే అలరిస్తుంది.

రేటింగ్ : 2.75/5