సాక్ష్యం మూవీ రివ్యూ

Friday,July 27,2018 - 05:44 by Z_CLU

నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా తదితరులు

సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్

మాటలు: సాయిమాధవ్ బుర్రా

యాక్షన్: పీటర్ హైన్స్

సంగీతం: హర్షవర్ధన్

నిర్మాణం : అభిషేక్ పిక్చర్స్

నిర్మాత : అభిషేక్ నామా

కథ- స్క్రీన్ ప్లే – దర్శకత్వం : శ్రీవాస్

పంచ భూతాల కాన్సెప్ట్.. ఐదుగురు పెద్ద సింగర్స్ పాడిన 12 నిమిషాల పాటు పాడిన పాట.. 5 భారీ ఫైట్స్.. 40 కోట్ల భారీ బడ్జెట్.. ఇలా సాక్ష్యం సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి. ఈరోజు థియేటర్లలోకొచ్చిన సాక్ష్యం ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను అందుకుందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ :

స్వస్తిక్ నగరంలో ఉమ్మడి కుటుంబంతో అందరికీ ఆదర్శంగా, ఊరికి పెద్దగా ఉంటాడు రాజు గారు (శరత్ కుమార్). అదే ఊరిలో ఉంటూ తన తమ్ముళ్ళతో కలిసి అన్యాయాలకు, అక్రమాలకూ కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తాడు మునిస్వామి(జగపతిబాబు). తను చేసే ప్రతీ పనికి ఎదురు రావడంతో తన ముగ్గురు తమ్ముళ్ళు(రవి కిషన్, అశుతోష్ రానా)లతో కలిసి సాక్ష్యాలు లేకుండా రాజు గారు కుటుంబాన్ని మొత్తం హత్య చేస్తాడు ముని స్వామి. కానీ ఒక్క వారసుడు మాత్రం తప్పించుకుని చివరికి న్యూయార్క్ లో సెటిల్ అయిన వ్యాపారవేత్త శివ ప్రకాష్ (జయప్రకాష్)వద్ద విశ్వాజ్ఞ(బెల్లంకొండ సాయి శ్రీనివాస్)గా పెరిగి పెద్దవుతాడు.

అలా ఓ పెద్ద వ్యాపారవేత్త కొడుకుగా వీడియో గేమ్ డెవలపర్ గా జీవితాన్ని కొనసాగించే విశ్వజ్ఞ ఓ సందర్భంలో ఇండియా నుండి న్యూయార్క్ వచ్చిన సౌందర్య లహరి(పూజా హెగ్డే)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. పురాణాలు, ఇతిహాసాల మీదుగా ఆసక్తి ఉన్న సౌందర్యలహరి దగ్గర చాలా విషయాలు తెలుసుకుంటాడు. హఠాత్తుగా తన తండ్రి గురించి ఇండియాకి వెళ్ళిన సౌందర్య ను వెతుక్కుంటూ ఇండియాలో అడుగుపెడతాడు విశ్వాజ్ఞ.

ఇండియా వచ్చాక విశ్వ తనకు తెలియని వ్యక్తుల చావులకు కారణం అవుతాడు.. చంపే వాడికి చచ్చే వాడెవరో తెలియదు… చచ్చే వాడికి చంపెదేవరో తెలియదు విధి ఆడే ఈ ఆటలో ఏం జరిగింది… చివరికి తన కుటుంబాన్ని దారుణంగా చంపిన ముని స్వామీ ను అతని తమ్ముళ్ళను విస్వా ఎలా అంతమొందించాడు.. అనేది కథ.


నటీనటుల పనితీరు :

గత సినిమాలతో హీరోగా తానేంటో ప్రూవ్ చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తనకి కలిసొచ్చిన యాక్షన్ సబ్జెక్ట్ కావడంతో తన హీరోయిజంతో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ఫైట్స్, డాన్సులతో మెస్మరైజ్ చేశాడు. పూజా హెగ్డే క్యారెక్టర్ కు తగ్గట్టుగా కనిపించి జస్ట్ పరావలేదనిపించుకుంది. శరత్ కుమార్ ఉన్నది కాసేపైనా సినిమాకు ప్లస్ అయ్యాడు. మీనా కూడా కనిపించింది కాసేపే అయినా కుటుంబ పెద్దకు భార్యగా, కొడుకుని కాపాడుకునే తల్లిగా తన నటనతో ఆకట్టుకుంది.

జగపతిబాబు గెటప్ తో పాటు విలనిజం కూడా రొటీన్ గానే అనిపించింది. ముఖ్యంగా క్యారెక్టర్ లో దమ్మున్నా ఎందుకో తేలిపోయాడు జగ్గు. ఇక ఆశితోష్ రానా, రవి కిషన్ తమ విలనిజంతో ఓకే అనిపించారు. పెద్ద కథ కావడంతో చాలా మంది ఆర్టిస్టులు అప్పుడప్పుడూ మెరిసారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, జాన్సీ ల కామెడి వర్కౌట్ అవ్వలేదు.

టెక్నీషియన్స్ పనితీరు:

అర్జున్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మంచి గుర్తింపు అందుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్ సినిమాకు పర్ఫెక్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్ ను తన బీజీఏం తో బాగా ఎలివేట్ చేసి మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. ఆర్ధర్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సీన్స్, సాంగ్స్ పిక్చరైజేషన్ లో అతని పనితనం చూపించాడు. ఎడిటింగ్ పరవాలేదు. ఆర్ట్ వర్క్ బాగుంది.

పీటర్ హైన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. సాయి మాధవ్ బుర్రా అందించిన కొన్ని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. శ్రీవాస్ ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ స్క్రీన్ ప్లే కాస్త రొటీన్ అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటాయి. అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ వేల్యూస్ గ్రాండియర్ గా ఉన్నాయి. ప్రతీ సీన్ లో డబ్బు కనిపించింది.


జీ సినిమాలు రివ్యూ :

సినిమా సినిమాకు ఎవరైనా నటుడిగా ఎదుగుతారు. సేమ్ టైం మార్కెట్ కూడా పెంచుకోవాలనుకుంటారు. మొదటిది కష్టపడితే వస్తుంది. రెండోది ప్లానింగ్ తో వస్తుంది. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. నటుడిగా మెరుగు పడుతూనే, మార్కెట్ పెంచుకుంటున్నాడు. 40 కోట్ల సాక్ష్యం సినిమాను తన భుజాలపై సోలోగా నడిపించాడు.

నిజానికి శ్రీవాస్ ఈ కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకోవడం పెద్ద సాహసమే. 3 సినిమాల అనుభవంతో ఇలాంటి సబ్జెక్ట్ ని మోయడం చాలా కష్టం. సాయిశ్రీనివాస్ మాత్రం ఆ కష్టాన్ని ఇష్టంగా భరించాడు. ఈ మూవీ కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఇప్పటివరకు సాయిశ్రీనివాస్ చేసిన సినిమాలు ఒకెత్తు. సాక్ష్యం మరో ఎత్తు.

సినిమా ప్రారంభంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ టోటల్ సినిమాకే హైలైట్. ఆ ఎపిసోడ్ లో దూడతో తెరకెక్కించిన సీన్ అందరినీ మెస్మరైజ్ చేసింది. ఆకాశమే సాక్ష్యంగా చేసిన పాపాల‌కు పంచ‌భూతాలు వేసే శిక్షే సాక్ష్యం.. అని తను చెప్పాలనుకున్న పాయింట్ ను చాలా గ్రాండ్ గా చెప్పాడు దర్శకుడు. పంచభూతాలు అనే కాన్సెప్ట్ చాలా కొత్తది. మరీ ముఖ్యంగా ఓ రివెంజ్ డ్రామాకు పంచభూతాల్ని యాడ్ చేయడమంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. పేపర్ పై ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ కాన్సెప్ట్ ను అంతే ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే రూపంలోకి మార్చడంలో తడబడ్డాడు దర్శకుడు శ్రీవాస్.

కథ కోసం నిర్మాత పెట్టిన ప్రతీ రూపాయి స్క్రీన్ పై కనిపించింది. విజువల్ గా సాక్ష్యం ఎంతో గ్రాండియర్ గా కనిపిస్తుంది. కానీ ఇలాంటి కథల్ని డీల్ చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా సన్నివేశాల్లో చాలా బలం ఉండాలి. స్క్రీన్ పై సాయిశ్రీనివాస్ లో కనిపించిన ఎనర్జీ, సన్నివేశాల్లో కనిపించలేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్, సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కాస్త బోర్ కొట్టిస్తాయి. ఇక సినిమాలో వాల్మీకీ అనే ముఖ్య మైన క్యారెక్టర్ కి అనంత్ శ్రీరాం లాంటి వారిని సెలెక్ట్ చేసుకోవడం కూడా దర్శకుడి పొరపాటే అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ కి మరో నటుడిని ఎవరినైనా తీసుకుంటే బాగుండేది అనిపించింది.

తెలుగులో ఇప్పటికే చాలా రివేంజ్ డ్రామాలొచ్చాయి. కానీ సాక్ష్యం మాత్రం అందులో ఒకటి కాదు. కారణం రెగ్యులర్ రివేంజ్ డ్రామాకు శ్రీవాస్ అద్దిన పంచభూతాల కాన్సెప్ట్. న్యూయార్క్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట్రడక్షన్ లో వచ్చే సైకిల్ ఫైట్, పంచభూతాల సహకారంతో ప్రతీకారం తీర్చుకునే సన్నివేశాలు బాగా అలరిస్తాయి. ముఖ్యంగా పంచభూతాల్లో ఒకటైన వాయువు, అగ్ని, భూమిలతో కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు మేజర్ హైలైట్స్. ఓవరాల్ గా ఓ డిఫరెంట్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా సాక్ష్యం అలరిస్తుంది.

రేటింగ్2.75/5