'రెమో' రివ్యూ

Friday,November 25,2016 - 01:09 by Z_CLU

నటీనటులు : శివ కార్తికేయన్, కీర్తి సురేష్, శరణ్య

సినిమాటోగ్రఫీ : పి.సి.శ్రీరామ్

మ్యూజిక్ : అనిరుథ్

నిర్మాణం : 24AM స్టూడియోస్

నిర్మాత : ఆర్.డి.రాజా

రచన, దర్శకత్వం : బక్కియరాజ్ కణ్ణన్

విడుదల : నవంబర్ 25 ,2016

కథ:

ఒక సందర్భంలో కావ్య (కీర్తి సురేష్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు హీరో(శివ కార్తికేయన్). కావ్యను తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఫిక్స్ అయి, ఆమె కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధం అవుతాడు. కావ్య కోసం తన గెటప్ మార్చి లేడి గెటప్ లో కావ్య పనిచేస్తున్న హాస్పిటల్ లో రెమో(శివ కార్తికేయన్) పేరు తో నర్సు గా జాయిన్ అవుతాడు. అప్పటికే నిశ్చితార్ధం అయిపోయిన కావ్యను రెమో ఎలా ప్రేమలో పడేసాడు. చివరికి కావ్యను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడా? లేదా ? అనేది ఈ సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు :

శివ కార్తికేయన్ నటన బాగుంది. కానీ తెలుగులో ఈ సినిమాతో పరిచయం కావడం సాహసమనే చెప్పాలి. ఎందుకంటే… ఇలాంటి సినిమాలు తెలుగులో బోలెడన్ని ఉన్నాయి. కథానాయకుడిగా రెండు పాత్రలతో శివకార్తికేయన్ నటన బాగుంది కానీ… టాలీవుడ్ లో ఇప్పటి వరకూ పరిచయం లేని హీరో కావడంతో..తమిళ్ లో సూపర్ హిట్ అయిన అతడి మేనరిజమ్స్ ఇక్కడ వర్కవుట్ కాలేదు. ఇక కీర్తి సురేష్ కావ్య పాత్ర లో నేచురల్ కనిపించి మెప్పించింది. దర్శకుడు కె.ఎస్.రవి కుమార్ అతిధి పాత్రలో అలరించాడు. శ్రీ దివ్య కూడా ఓ అతిథి పాత్రలో కనిపించి అలరించింది. శరణ్య పొన్ వణ్ణం, సతీష్, రాజేంద్రన్, యోగి బాబు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు:

పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. మూవీలో ప్రతి ఫ్రేమ్ ఎట్రాక్టివ్ గా కనిపించింది. ఇక అనిరుథ్ మ్యూజిక్ బాగుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. రాజేష్ మూర్తి రాసిన మాటలు అలరించాయి. ఎడిటింగ్ పరవాలేదు. బక్కియరాజన్ స్క్రీన్ ప్లే బాగుంది.

జీ సినిమాలో సమీక్ష :

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియని శివ కార్తికేయన్… తమిళ్ లో తాను నటించిన కమర్షియల్ సినిమాల డబ్బింగ్ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి ఉంటే బాగుండేది. తెలుగులో ఇలాంటి లేడి గెటప్ సినిమాలు చూసేసిన టాలీవుడ్ ఆడియన్స్ ను ఈ సినిమా అంతగా ఆకట్టుకోదు. శివ కార్తికేయన్, కీర్తి సురేష్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మినహా సినిమాలో పెద్దగా హైలెట్స్ లేవు. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు దగ్గరైన కీర్తి సురేష్.. ఇందులో హీరోయిన్ గా నటించడం ఒక్కటే కాస్త జనాల్ని థియేటర్లకు తీసుకొచ్చే ఎలిమెంట్ గా మారింది. కొన్ని సన్నివేశాల్లో తన ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకొని సినిమాకు హైలైట్ గా నిలిచింది కీర్తి సురేష్. శివకార్తికేయన్ లేడి గెటప్ లో పండించిన కాస్త కామెడీ, లవ్ సీన్స్, యాక్షన్ సీన్స్ బాగున్నప్పటికీ, తెలుగు ఆడియన్స్ ఎంతవరకు కనెక్ట్ అవుతారనేది పెద్ద డౌట్. కేవలం దిల్ రాజు ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేయడం వల్లనే తెలుగులో దీనికి పబ్లిసిటీ వచ్చింది. లేదంటే ఎన్నో డబ్బింగ్ సినిమాల్లా ఇది కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోవాల్సిందే. ఫైనల్ గా… రెమో సినిమా ఓకే అనిపిస్తుంది తప్ప, టచ్ చేసే ఎలిమెంట్స్ చాలా తక్కువ.

రేటింగ్ : 2.5/5