రారండోయ్ వేడుక చూద్దాం రివ్యూ

Friday,May 26,2017 - 03:30 by Z_CLU

నటీనటులు : నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, సంపత్

సంగీతం : దేవిశ్రీప్రసాద్‌

స్క్రీన్‌ప్లే : సత్యానంద్‌

సినిమాటోగ్రఫీ : ఎస్‌.వి.విశ్వేశ్వర్‌ (విషు)

ఎడిటింగ్‌ : గౌతంరాజు

నిర్మాత : నాగార్జున అక్కినేని

కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల

విడుదల తేదీ : మే 26, 2017

 

నాగచైతన్య రకుల్ ప్రీత్ జంటగా కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నిర్మాణంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కుతుందనగానే ఈ సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో ఆ అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజే థియేటర్స్ లోకొచ్చింది. మరి ట్రైలర్, సాంగ్స్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసి రారండోయ్ అంటూ ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించిన ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేసిందో చూద్దాం.

కథ :

పల్లెటూరిలో ఓ పెద్దమనిషిగా కొనసాగే ఆది(సంపత్) ఏకైక కూతురు భ్రమరాంబ(రకుల్ ప్రీత్) చిన్నతనం నుంచి నాన్న గారాల పట్టిగా పెరిగి పెద్దవుతుంది. అలా నాన్నని కుటుంబాన్ని అమితంగా ప్రేమించే భ్రమరాంబను కజిన్ బ్రదర్ పెళ్లిలో చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శివ(నాగ చైతన్య). అలా భ్రమరాంబతో ప్రేమలో పడిన శివ.. ఆదికి తన తండ్రి కృష్ణ(జగపతి బాబు) కి గొడవ ఉందని ఆ గొడవే తన ప్రేమకు అడ్డుగా మారిందని తెలుసుకుంటాడు.ఇంతకీ ఆది-కృష్ణ కి ఏమవుతాడు..? వారిద్దరి మధ్య గొడవేంటి.. చివరికి శివ-భ్రమరాంబ కలిశారా లేదా అనేది స్టోరీ.

 

నటీనటుల పనితీరు :

ప్రతీ సినిమాకు నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఈ సినిమాలో శివ అనే ఎనర్జిటిక్ కుర్రాడి క్యారెక్టర్ తో నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు. ముఖ్యంగా కొన్ని ఇంటర్వెల్ బ్యాంగ్ లో చైతూ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. వీటితో పాటు ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్ లో కూడా చైతూ బాగా ఇంప్రూవ్ అయ్యాడు.
టాలీవుడ్ లో లీడింగ్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కు ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ దక్కింది. అసలు సినిమా అంతా ఆమె చేసిన భ్రమరాంబ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుందంటే, రకుల్ ఎలాంటి ఛాన్స్ దక్కించుకుందో అర్థంచేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు రకుల్ చేసిన సినిమాల్లో ది బెస్ట్ ఇదే. రకుల్ కూడా భ్రమరాంబగా బాగా మెప్పించింది.
ముఖ్యంగా పల్లెటూరి అమ్మాయిగా సినిమా అంతా లంగావోణీ లో సరికొత్త లుక్ లో అందరినీ ఆకట్టుకుంది. జగపతి బాబు, సంపత్ తమ నటనతో సినిమాకు ప్లస్ అయ్యారు. వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేసి సినిమాలో కామెడీకి లోటులేకుండా చేశాడు. ఇక చలపతి రావు, అన్నపూర్ణమ్మ, కౌసల్య, రఘు బాబు,పోసాని, పృథ్వి, సత్య కృష్ణ, సురేఖ వాని,అనిత చౌదరి,రజిత, బెనర్జీ, సప్తగిరి, తాగుబోతు రమేష్, ప్రియా, బేబీ అవంతిక, హైపర్ ఆది, మహేష్ ఆచంట తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు :

సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది దేవిశ్రీ ప్రసాద్ గురించే. సినిమా రిలీజ్ కి ముందే తన పాటలతో మెస్మరైజ్ చేసి సినిమాను ఓ మెట్టు పైకి తీసుకెళ్లాడు దేవి. మూవీలో పాటలన్నీ బాగున్నాయి. ఎవరైనా ఈజీగా హమ్ చేసుకోవచ్చు. ఈ పాటలన్నీ పిక్చరైజేషన్ పరంగా కూడా ఆకట్టుకున్నాయి. ఆ మొత్తం క్రెడిట్ అంతా కొత్త కెమెరామెన్ విశ్వేశ్వర్ కే దక్కుతుంది. సినిమాను మొదటి సీన్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు అందంగా చూపించాడు విషు. మరీ ముఖ్యంగా నాగచైతన్య, రకుల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండిందంటే దానికి కారణం సినిమాటోగ్రఫీనే.
ఎడిటింగ్ పరవాలేదు. ఫైట్స్ బాగున్నాయి. కొన్నిసందర్భాల్లో వచ్చే మాటలు, మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో చైతూ చెప్పే డైలాగ్స్ బాగా పేలాయి. స్క్రీన్ ప్లే బాగుంది. దర్శకుడిగా కళ్యాణ్ కృష్ణ మరోసారి మెరిశాడు. కొన్ని సీన్స్ లో తన మెరుపులు చూపించాడు. ఇక సినిమా స్టార్టింగ్, ఎండింగ్ లో నాగార్జున అందించిన వాయిస్ మరో ప్లస్ పాయింట్. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాల తర్వాత నాగచైతన్య ఈ సినిమాను సెలక్ట్ చేసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఛాయిస్. నటుడిగా అతడిలోని మరో కోణాన్ని, ఇంకొన్ని వేరియేషన్స్ ను చూపించింది రారండోయ్ వేడుక చూద్దాం సినిమా. నాగ్ నటించిన నిన్నే పెళ్లాడతా, మన్మధుడు సినిమాలను ఈ మూవీతో కంపేర్ చేయలేం. కానీ ఆ రెండు సినిమాల్లో కనిపించిన నాగార్జున.. ఈ సినిమాలో నాగచైతన్యను చూస్తే చాలాచోట్ల గుర్తుకొస్తారు.
‘ఒక రాజకుమారుడు లాంటి అబ్బాయి తనకు వరుడిగా రావాలనుకునే ఈడొచ్చిన పిల్ల కథే ఈ కథ మన కథ’ అంటూ నాగార్జున వాయిస్ ఓవర్ తో స్టార్టయిన సినిమా.. రకుల్, చైతు ఎంట్రీతో మరింత ఎంటర్టైనింగ్ గా ముందుకు సాగింది. సినిమా ఊహించినట్టే ఉన్నప్పటికీ, దాన్ని ఎంటర్ టైనింగ్ గా మలచడంలో దర్శకుడు కల్యాణ్ కృష్ణ సక్సెస్ అయ్యాడు.
డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైనింగ్ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ ను నడిపించిన కళ్యాణ్ కృష్ణ, సెకండ్ హాఫ్ లో లవ్- ఎమోషన్-సెంటిమెంట్ సీన్స్ తో ఎంటర్టైన్ చేశాడు. శివ అనే ఎనర్జిటిక్ క్యారెక్టర్ లో చైతు తన నటనతో అదుర్స్ అనిపించి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ఇక జగపతిబాబు-నాగచైతన్య అయితే తండ్రికొడుకులుగా భలే సెట్ అయిపోయారు. జగపతిబాబుకు మరో మంచి క్యారెక్టర్ దొరికింది.
చైతన్య పెర్ఫార్మెన్స్, రకుల్ ప్రీత్ క్యారెక్టర్, ఎంటర్టైనింగ్ సీన్స్, సాంగ్స్, చైతు-రకుల్ మధ్య వచ్చే లవ్ సీన్స్, జగపతి బాబు-చైతు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఫైనల్ గా రారండోయ్ వేడుక చూద్దాం అంటూ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను కూడా బాగా ఎంటర్టైన్ చేస్తుంది.

 

రేటింగ్ : 3.25 /5