Movie Review - 'రంగ్ దే'

Friday,March 26,2021 - 02:22 by Z_CLU

నటీ నటులు : నితిన్,కీర్తి సురేష్, నరేష్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్,అభినవ్ గోమటం,సుహాస్ తదితరులు.

కెమెరామెన్ : పి.సి.శ్రీరామ్

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

కూర్పు: నవీన్ నూలి

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్

నిర్మాత :సూర్యదేవర నాగవంశీ

రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి

నిడివి : 130 నిమిషాలు

సెన్సార్ : U/A

రిలీజ్ డేట్: మార్చి 26, 2021

‘భీష్మ’ తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన నితిన్ ఇటివలే ‘చెక్’ తో మళ్ళీ ఫ్లాప్ అందుకున్నాడు. నెల గ్యాప్ లో ‘రంగ్ దే’ తో వెంటనే ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి వెంకీ అట్లూరి డైరెక్షన్ లో నితిన్ -కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన ‘రంగ్ దే’ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందా ? నితిన్ ఈసారి హిట్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

rangde movie telugu review
కథ :

పుట్టినప్పటి నుండి తనను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్న తల్లిదండ్రులు పక్కింట్లోకి వచ్చిన అను(కీర్తి సురేష్) మీదకి ఆ ప్రేమని షిఫ్ట్ చేయడంతో తట్టుకోలేకపోతాడు అర్జున్(నితిన్). అను ఎంట్రీ ఇచ్చాక ప్రతీ విషయంలో ఆమెతో పోలుస్తూ అర్జున్ ని తిడుతుంటాడు అతని తండ్రి. అను మాత్రం అర్జున్ ని వదిలి ఉండలేనంత ప్రేమ పెంచుకొని అతనితో లైఫ్ పంచుకోవాలని చూస్తుంది.

చిన్నతనం నుండి అనుని ఓ శత్రువులా భావించే అర్జున్ ఓ కారణం చేత తల్లిదండ్రుల కోసం ఆమెను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని దుబాయ్ లో చదువుకోవడానికెళ్ళిన అను-అర్జున్ ఒకరిపై ఒకరు రివేంజ్ తీర్చుకుంటూ కొట్టుకుంటారు. ఫైనల్ గా అను ప్రేమను తెలుసుకొని అర్జున్ ఆమెకి మంచి భర్తలా ఎలా మారాడు అనేది రంగ్ దే కథ.

నటీ నటుల పనితీరు :

అర్జున్ పాత్రలో నితిన్ ఆకట్టుకున్నాడు. ఎనర్జిటిక్ రోల్ తో మంచి కామెడీ కూడా పండించాడు. అను పాత్రతో కీర్తి సురేష్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా రెండో భాగంలో వచ్చే సన్నివేశాల్లో కీర్తి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. నరేష్ , రోహిణి లు తమ క్యారెక్టర్స్ కి బెస్ట్ ఇచ్చారు. వెన్నెల కిషోర్ , బ్రహ్మాజీ తమ కామెడీ టైమింగ్ తో నవ్వించారు. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ లో అభినవ్ , సుహాస్ మంచి కామెడీ పండించారు. వారిద్దరి డైలాగ్ కామెడీ వర్కౌట్ అయ్యింది.

చాలా రోజుల తర్వాత స్క్రీన్ పై కనిపించిన వినీత్ తన రోల్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. కౌసల్య, గాయత్రి రఘురాం, మాస్టర్ రోనిత్ కమ్ర తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

ఏ లవ్ స్టోరీకైనా మెస్మరైజ్ చేసే విజువల్స్, మేజిక్ చేసే మ్యూజిక్ ముఖ్యం. ఆ రెండూ ‘రంగ్ దే’ ని టెక్నికల్ గా నిలబెట్టాయి. పీ.సి.శ్రీరాం సినిమాటోగ్రఫీ , దేవి మ్యూజిక్ సినిమాకు బిగ్గెస్ట్ ఎస్సెట్. పీ.సి పిక్చరైజ్ చేసిన ప్రతీ ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా కనిపించింది. రిలీజ్ కి ముందే సాంగ్స్ తో బజ్ క్రియేట్ చేసిన దేవి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు మరింత ప్లస్ అయ్యాడు. అన్ని పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ‘నా కనులకెపుడు’ పాట సినిమాకే హైలైట్. దేవి పాటలకు శ్రీమణి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాను ఎక్కువ సాగతీయకుండా పర్ఫెక్ట్ గా కట్ చేశాడు నవీన్. వెంకీ అట్లూరి ఎంచుకున్న కథ రొటీన్ అనిపించినా కథనం, సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

rangde movie telugu review

జీ సినిమాలు సమీక్ష :

మొదటి సినిమా ‘తొలి ప్రేమ’ తో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకొన్న వెంకీ అట్లూరి ఈసారి కూడా తనకి కలిసొచ్చిన లవ్ స్టోరీనే ఎంచుకున్నాడు. కాకపోతే ఈసారి ఫ్యామిలీ బాండింగ్ , ఎమోషన్ సన్నివేశాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ‘రంగ్ దే’ ని తెరకెక్కించాడు. హీరో -హీరోయిన్ చైల్డ్ ఎపిసోడ్, పెరిగి పెద్దయ్యాక వారిద్దరి మధ్య ఉండే టామ్ అండ్ జెర్రీ రివేంజ్ గేమ్ తో మొదటి భాగాన్ని ఎంటర్టైనింగ్ నడిపించిన వెంకీ అట్లూరి రెండో భాగాన్ని ఎమోషనల్ సన్నివేశాలు, కామెడీతో ప్యాక్ చేసి మెప్పించాడు.

కథ పరంగా సినిమా కొన్ని లవ్ స్టోరీస్ ని గుర్తుచేసినప్పటికీ కథనం మాత్రం ఆకట్టుకుంటుంది. ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్ , ఎమోషనల్ సెకండాఫ్ ప్రేక్షకులను అలరిస్తాయి. రెండో సినిమాలో సెకండాఫ్ కి కంప్లైంట్స్ అందుకున్న వెంకీ అట్లూరి ఈసారి రెండో భాగాన్ని ఎమోషనల్ గా రాసుకున్నాడు. నితిన్ -కీర్తి సురేష్ ల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడంతో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అయ్యాయి. సెంటిమెంట్ తో వచ్చే ఎమోషనల్ సీన్స్ వెంకీ అట్లూరిలో ఉన్న మెచ్యూరిటీ తెలియజేసేలా ఉన్నాయి.

సినిమా డ్రాప్ అవుతున్న సమయంలో కమెడియన్స్ ని వాడుకుంటూ కామెడీ పండించాడు వెంకీ అట్లూరి. ముఖ్యంగా బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. అలాగే క్యారెక్టర్స్ కి బెస్ట్ ఇచ్చే ఆర్టిస్టులను ఎంచుకొని అక్కడే సగం విజయం అందుకున్నాడు వెంకీ. ముఖ్యంగా అను పాత్రతో కీర్తి సురేష్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. నితిన్ కూడా అర్జున్ గా మెప్పించి అలరించాడు.

ఓవరాల్ గా ఫ్రెండ్ షిప్ , లవ్, కామెడీ, ఫ్యామిలీ, సెంటిమెంట్… ఎలిమెంట్స్ తో వెంకీ అట్లూరి తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామాగా ‘రంగ్ దే’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ప్లస్ పాయింట్స్ :

– నితిన్ , కీర్తి సురేష్

– దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్

– PC శ్రీరామ్ సినిమాటోగ్రఫీ

– కామెడీ

ఎమోషనల్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్:

– కథ

– సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు

– ఊహించగలిగే సీన్స్, ట్విస్టులు

రేటింగ్ – 3 /5