'రెడ్' మూవీ రివ్యూ

Thursday,January 14,2021 - 01:38 by Z_CLU

న‌టీన‌టులు: రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌, సంపత్, నాజ‌ర్,సత్య తదితరులు

సంగీతం: మణిశర్మ

ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి

సమర్పణ: కృష్ణ పోతినేని

నిర్మాణం : స్ర‌వంతి మూవీస్‌

నిర్మాత: ‘స్రవంతి’ రవికిశోర్‌

దర్శకత్వం: కిశోర్‌ తిరుమల.

నిడివి : 146

విడుదల తేది : 14 జనవరి 2021

కెరీర్ లో ఫస్ట్ టైం క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో డబుల్ రోల్ తో ‘రెడ్’ సినిమా చేసాడు రామ్. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తమిళ్ సినిమా ‘తడమ్’ కి రీమేక్ గా తెరకెక్కిన ‘రెడ్’ మరి సంక్రాంతి బరిలో ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేసింది ? ‘ఇస్మార్ట్ శంకర్’ తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న రామ్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

red-movie-telugu-review 3

కథ :

ఇంజినీరింగ్ పూర్తిచేసి సొంతంగా కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకొని వర్క్ చేస్తుంటాడు సిద్దార్థ్ (రామ్). చిన్న దొంగతనాలు, మోసాలు చేస్తూ పబ్బం గడుపుతూ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు ఆదిత్య(రామ్). సిద్దార్థ్ మహిమ అనే అమ్మాయిను ప్రేమించి పెళ్ళాడాలని డిసైడ్ అవుతాడు. అదే సమయంలో ఆదిత్య కూడా గాయత్రి(అమృత అయ్యర్) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. అయితే ఆకాష్ హత్య కేసులో ఫోటో ఆధారంగా సిద్దార్థ్ ని నిందితుడిగా అరెస్ట్ చేస్తాడు CI నాగేంద్ర(సంపత్). సిద్దార్థ్ ని ఇంట్రాగేషణ్ చేస్తుండగా తనలాగే ఉన్న ఆదిత్య పోలీసులకి చిక్కుతాడు. ఆకాష్ హత్య కేసుని డీల్ చేసే ఎస్.ఐ యామిని(నివేత పెతురాజ్) నాగేంద్రతో కలిసి ఇద్దరిని ఇంట్రాగేషణ్ చేస్తుంది. ఇంతకీ సిద్దార్థ్, ఆదిత్య ఒకరికొకరు ఏమవుతారు? ఆ ఇద్దరిలో ఆకాష్ ని హత్య చేసిందెవరు..? ఫైనల్ గా ఇద్దరిలో ఎవరికైనా శిక్షపడిందా ? లేదా అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

రామ్ పోతినేని డ్యుయల్ రోల్ లో మంచి నటన కనబరిచాడు. అటు సిద్దార్థ్ గా ఇటు ఆదిత్య గా మంచి వేరియేషన్ చూపిస్తూ నటించాడు. డాన్సుల్లో తన ఎనర్జీ చూపించి అభిమానులను అలరించాడు. పోలిస్ క్యారెక్టర్ లో నివేత పెతురాజ్ బాగా నటించింది. ఇప్పటికే కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్న నివేత మరోసారి సారి యామినిగా నటనతో ఆకట్టుకుంది. కథానాయికగా మాళవిక శర్మ జస్ట్ పరవాలేదనిపించుకుంది. రొమాంటిక్ సీన్స్ , సాంగ్ లో ఎట్రాక్ట్ చేసింది. అమృత ఐయ్యర్ తన రోల్ కి బెస్ట్ ఇచ్చింది. ఫ్రెండ్ పాత్రలో సత్య మంచి కామెడీ పండించాడు. వెన్నెల కిషోర్ జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కనిపించాడు.

పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో సంపత్ , తల్లి పాత్రలో సోనియా అగర్వాల్ , జడ్జ్ గా నాజర్ ఎప్పటిలానే మంచి నటన కనబరిచి క్యారెక్టర్స్ కి బలం చేకూర్చాడు. పవిత్రా లోకేష్ , పోసాని ,నర్రా శ్రీనివాస్ , పమ్మి సాయి, మహేష్ ఆచంట మిగతా నటీ నటులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు ప్రధాన బలం మణిశర్మ సంగీతం. ‘నువ్వే నువ్వే’ , డించక్ పాటలతో పాటు తన నేపథ్య సంగీతంతో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. మణిశర్మ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. తన ఎక్స్ పీరియన్స్ తో సినిమాకు మంచి విజువల్స్ అందించాడు సమీర్. జునైద్ సిద్దిక్ ఎడిటింగ్ బాగుంది. కాకపోతే కొన్ని సన్నివేశాలు ఇంకాస్త ట్రిమ్ చేసి ఉండాల్సింది. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ వర్క్ సినిమాకు ప్లస్ అయ్యింది. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు మరో హైలైట్ అని చెప్పొచ్చు.

కిషోర్ తిరుమల డైలాగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా రామాయణం మగాడు కాకుండా ఒక ఆడది రాసుకుంటే అనుమానం అనేది అక్కడే ఆగిపోయేది లాంటి డైలాగ్ కిషోర్ రైటింగ్ లో ఉన్న డెప్త్ తెలియజేస్తుంది. దర్శకుడిగా ఒరిజినల్ సినిమాను కొన్ని మార్పులతో తెరకెక్కించి డైరెక్టర్ గా పరవాలేదనిపించుకున్నాడు కిషోర్. స్రవంతి మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

red-movie-telugu-review 2

జీ సినిమాలు సమీక్ష :

ఏ రీమేక్ అయినా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని మన ప్రేక్షకులను అలరించేలా మార్పులు చేసుకొని తెరకెక్కిస్తే సక్సెస్ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. దానికి ‘గబ్బర్ సింగ్’ లాంటి సినిమాలే ఉదాహరణ. అయితే కొన్ని సార్లు మార్పులు చేయకుండా మక్కి కీ మక్కి తీసిన ఆడియన్స్ ను మెప్పించొచ్చు. అయితే కిషోర్ తిరుమలకి రీమేక్ చేయడం ఫస్ట్ టైం కావడంతో రిస్క్ తీసుకోకుండా కేవలం చిన్న చిన్న మార్పులతో ఉన్నది ఉన్నట్టు తీసాడు. నిజానికి క్రైం థ్రిల్లర్ సినిమాలకు సీన్ బై సీన్ వెళ్ళే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడం చాలా ముఖ్యం. కిషోర్ ఆ దిశగా ఆలోచించి కథను ఓన్ చేసుకొని తన రైటింగ్ తో స్క్రీన్ ప్లే ఇంకాస్త ఆసక్తిగా రాసుకుంటే బెటర్ గా ఉండేది.

తమిళ్ లో అరున్ విజయ్ తడమ్ చేసినప్పుడు అతనిపై ఎలాంటి అంచనాలు లేవు. అందుకే సినిమా అక్కడ మంచి విజయం అందుకుంది. కాకపోతే రామ్ సినిమా అంటే కొంచెం ఎనర్జీ పెర్ఫార్మెన్స్ తో పాటు డాన్సులు లాంటివి ఎక్కువగా ఊహిస్తారు. ఆ మార్క్ నుండి తప్పించుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త జానర్ లో సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికి సినిమాలో అతని ఎనర్జీ మిస్ అయితే ప్రేక్షకులు నిరాశ పడుతున్నారు. ‘రెడ్’ విషయంలో కూడా అదే జరిగింది. నటన పరంగా రెండు క్యారెక్టర్స్ కి బెస్ట్ ఇచ్చినా రామ్ నుండి ఇలాంటి సినిమా ఊహించని ఆడియన్స్ చాలా వరకు బోర్ గా ఫీలవుతారు.

సినిమా ప్రారంభమైన కాసేపటికే ఐటెం సాంగ్ , కామెడీ వచ్చేస్తాయి. అక్కడి నుండి సినిమా అంతా పోలీస్ స్టేషన్ లో ఇంట్రాగేషణ్ మీదే రన్ అవుతుంది. ఇంట్రాగేషన్ సన్నివేశాలు బాగానే ఉన్నా కాసేపటికే సినిమా బోర్ కొట్టేస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో థియేటర్స్ కొచ్చిన తనని కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నట్టు ఆడియన్ ఫీలవుతాడు. ఆ విచారణ సన్నివేశాల్ని మరింత వేగంగా చూపిస్తూ తెరకెక్కిస్తే బాగుండేది. రామ్ డ్యుయల్ రోల్, మణిశర్మ నేపథ్య సంగీతం , నటీ నటుల పెర్ఫార్మెన్స్ , విజువల్స్ సినిమాకు హైలైట్ గా కాగా స్లో సాగే స్క్రీన్ ప్లే , డ్రాగ్ అనిపించే సీన్స్ , థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా థ్రిల్ కలిగించకపోవడం సినిమాకు మైనస్. ఓవరాల్ గా తడమ్ కి రీమేక్ గా తెరకెక్కిన ‘రెడ్’ ని రామ్ డ్యుయల్ రోల్ కోసం ఓసారి చూడొచ్చు.

రేటింగ్ : 2.5 /5