రివ్యూ - 'స్కంద'
Thursday,September 28,2023 - 01:18 by Z_CLU
నటీ నటులు : రామ్ పోతినేని, శ్రీలీల, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్, తదితరులు
డీవోపీ: సంతోష్ డిటాకే
సంగీతం: ఎస్ఎస్ థమన్
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
ప్రెజెంట్స్: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
రిలీజ్ : 28 సెప్టెంబర్ 2022
రన్ టైమ్ : 167 నిమిషాలు
‘ఇస్మార్ట్ శంకర్’ తో లవర్ బాయ్ ఇమేజ్ నుండి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో రామ్ , బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడనే న్యూస్ వచ్చినప్పటి నుండి ఈ కాంబో మూవీ పై భారీ బజ్ నెలకొంది. రామ్ ను బోయపాటి ఏ రేంజ్ మాస్ కంటెంట్ తో ప్రెజెంట్ చేస్తాడా ? అనే సందేహాలు ‘స్కంద’ చుట్టూ మొదలయ్యాయి. ఫైనల్ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన బోయపాటి , రామ్ కాంబో ‘స్కంద’ మాస్ ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలను అందుకొని మెప్పించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.
కథ :
తెలంగాణ ముఖ్యమంత్రి రాయుడు (శరత్ లోహిశ్వ) కొడుకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి (అజయ్ పూర్కర్) కూతురిని ప్రేమించి కాసేపట్లో పెళ్లి అనగా ఆమెను తన ఇంటికి ఎత్తుకెళతాడు. దీంతో రాయుడు , సంజీవ రెడ్డి మధ్య ఉన్న స్నేహం కాస్త వైరంగా మారుతుంది. తెలంగాణ సీఏం కొడుకు మీద పగతో దేనికి భయపడని ఓ క్రూరమైన వ్యక్తిను తెలంగాణకి పంపిస్తాడు సంజీవ్ రెడ్డి.
రాయుడు కూతురు (శ్రీలీల) చదివే కాలేజీలోనే చదివే భాస్కర్ (రామ్) ఆమెకి దగ్గరై, తన కొడుక్కి రంజిత్ రెడ్డి కూతురికి రాయుడు పెళ్లి చేసేందుకు రెడీ అవుతుండగా వారి ఇంట్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించి రాయుడు , రంజిత్ కూతుర్లను కిడ్నాప్ చేసి తన ఊరు రుద్రరాజవరం వెళతాడు. అసలు భాస్కర్ ఎవరు ? ఇద్దరు ముఖ్యమంత్రులతో అతనికి గొడవేంటి ? చివరికి ఇద్దరి ముఖ్యమంత్రులను ఎదురించేందుకు భాస్కర్ కి ఎవరు సపోర్ట్ చేశారు ? అనేది మిగతా కథ.
నటీ నటుల పనితీరు :
రామ్ సరికొత్త మాస్ కేరెక్టర్ తో మెస్మరైజ్ చేశాడు. ఫైట్స్ , డాన్స్ ల్లో మంచి ఎనర్జీ చూపించి సినిమాకు మేజర్ హైలైట్ అనిపించుకున్నాడు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం రామ్ పడిన కష్టం స్క్రీన్ పై కనిపించింది. శ్రీలీల నటన బాగుంది. తన కేరెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంది. సాంగ్స్ లో తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసింది. సయీ మంజ్రేకర్ తన పాత్రతో ఆకట్టుకుంది. శ్రీకాంత్ , దగ్గుబాటి రాజా తమ పాత్రలకు న్యాయం చేశారు. అజయ్, శరత్ విలనిజం బాగా పండించారు. పృధ్వీ , ప్రిన్స్ , గౌతమి , ఇంద్రజ తదితరులు ఆ పాత్రలకు పర్ఫెక్ట్ అనిపించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
సినిమాకు మ్యూజిక్ , ఫోటోగ్రఫీ హైలైట్ గా నిలిచాయి. తమన్ బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. యాక్షన్ ఎపిసోడ్స్ కి వచ్చే స్కోర్ థియేటర్స్ లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. సాంగ్స్ పరవాలేదు. సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ బాగుంది. ఫైట్స్ సీక్వెన్స్ లో అతని టాలెంట్ కనిపించింది. ఆర్ట్ డైరెక్షన్ బాగుంది. ఇక సినిమాకు స్టంట్ శివ డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి.
బోయపాటి కథ -కథనం రొటీన్ అయినప్పటికీ కొన్ని సన్నివేశాలు , యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ ప్రొడక్షన్ వెల్యూస్ గ్రాండ్ గా ఉన్నాయి.
జీ సినిమాలు సమీక్ష :
బోయపాటి శ్రీను డైరెక్షన్ అంటేనే మాస్. హీరోకి పెద్ద కుటుంబం పెట్టి ఆ కుటుంబానికి విలన్ ద్వారా ఓ ముప్పు క్రియేట్ చేసి రీవెంజ్ యాక్షన్ చూపించడంలో బోయపాటి దిట్ట. ఈ ఫార్ములాతో బ్లాక్ బాస్టర్స్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. ‘స్కంద’ కి కూడా అదే ఫార్మెట్ ఫాలో అయ్యాడు బోయపాటి. హీరోకి ఓ పెద్ద కుటుంబం, ఆ కుటుంబానికి ప్రాణమైన మరో కుటుంబానికి సమస్య, దాన్ని తన తండ్రి కోసం హీరో ఎలా సాల్వ్ చేశాడనేది కథా వస్తువుగా తీసుకున్నాడు. కాకపోతే కథలో ఊహించని డ్యూయల్ రోల్ ట్విస్ట్ , ఇద్దరు ముఖ్యమంత్రులపై ఓ పల్లెటూరి వ్యక్తి రివేంజ్ లాంటి కొత్త అంశాలు ప్లాన్ చేసుకున్నాడు. గతంలోనూ బోయపాటి సినిమాళ్లో డ్యూయల్ రోల్ కనిపించినా ఈసారి ఎవరూ ఊహించని విధంగా రెండో కేరెక్టర్ ను క్రియేట్ చేసి మాస్ ను మరింతగా మెప్పించాడు.
ఇస్మార్ట్ శంకర్ తో కంప్లీట్ మాస్ హీరోగా మారిన రామ్ ను మరింత మాస్ గా చూపించి మాస్ ప్రేక్షకులకు ఇంకా దగ్గర చేశాడు బోయపాటి. ముఖ్యంగా రామ్ రెండో పాత్ర లుక్ , ఆ కేరెక్టర్ తో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ను మెప్పించి సినిమాకు హైలైట్ అనిపిస్తాయి. కథా -కథనం వీక్ అయినప్పటికీ మాస్ ఎలివేషన్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ తో తన సినిమా నుండి మాస్ ప్రేక్షకులు కోరుకునే కంటెంట్ తో మెప్పించాడు బోయపాటి.
టికెట్టు కొన్న ప్రేక్షకుడికి, పెట్టిన డబ్బుకి సరిపడా భీభత్సమైన ఫైట్స్ చూపించి అలరించాడు దర్శకుడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ముందు వచ్చే ఫైట్స్ , సెకండాఫ్ లో ఫైట్స్ , క్లైమాక్స్ ఫైట్ మాస్ ఆడియన్స్ చేత క్లాప్స్ విజిల్స్ వేయించేలా ఉన్నాయి. హీరో రామ్ ఎలివేషన్స్ తో వచ్చే సదర్ ఫైట్ , జాకర్ ను చంపే యాక్షన్ ఎపిసోడ్ , ఇంటర్వెల్ బ్లాక్ యాక్షన్ , సెకండాఫ్ లో వచ్చే మరిన్ని ఫైట్స్ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలిచాయి. గండరా భాయ్ సాంగ్ లో రామ్ శ్రీలీల డాన్స్ ఫీస్ట్ అనిపిస్తుంది. ఓవరాల్ గా స్కంద మాస్ ఆడియన్స్ ను అలరించి మెప్పిస్తుంది.
రేటింగ్ : 3 /5