'రాక్షసుడు' మూవీ రివ్యూ

Friday,August 02,2019 - 02:53 by Z_CLU

నటీ నటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ , శరవణన్, రాజీవ్ కనకాల తదితరులు.

రచన: సాగర్

ఆర్ట్: గాంధీ నడికొడికర్

కెమెరా: వెంకట్ సి.దిలీప్

సంగీతం: జిబ్రాన్

నిర్మాత: సత్యనారాయణ కొనేరు

దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స

నిడివి : 149 నిమిషాలు

విడుదల తేది : 2 ఆగస్ట్ 2019

కెరీర్ లో ఫస్ట్ టైం క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా ఎంచుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తమిళ్ లో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘రాక్షసన్’ ను తెలుగులో రాక్షసుడు టైటిల్ తో రీమేక్ చేసాడు. మరి వరుసగా అపజయాలు అందుకుంటున్న శ్రీనివాస్ ఈ రీమేక్ సినిమాతో హిట్ అందుకున్నాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

ఎప్పటికైనా సినిమా డైరెక్టర్ అవ్వాలనుకునే అరుణ్ మొదటి సినిమా కోసం ఓ థ్రిల్లర్ కథను రెడీ చేసుకొని నిర్మాతలను కలుస్తుంటాడు. ఈ క్రమంలో దర్శకుడవ్వాలని అరుణ్ చేసిన ప్రతీ ప్రయత్నం విఫలం అవుతుంది. ఇక తప్పని పరిస్థితుల్లో తన బావ(రాజీవ్ కనకాల) సహాయంతో అన్ని పరీక్షల్లో పాసై ఎస్.ఐ ఉద్యోగం పొందుతాడు. అలా ఎస్.ఐ గా మారిన అరుణ్ హైదరాబాద్ లో జరిగే వరుస స్కూల్ పిల్లల దారుణ హత్యల కేసుపై ఫోకస్ పెడతాడు.

అదే సమయంలో అరుణ్ కి స్కూల్ టీచర్ కృష్ణవేణి(అనుపమ పరమేశ్వరన్) పరిచయం అవుతుంది. తొలిచూపులోనే కృష్ణవేణి ని చూసి ఇష్టపడతాడు. అరుణ్ చేసిన ఓ సహాయం వల్ల కృష్ణవేణి కూడా అతని ప్రేమలో పడుతుంది. అయితే అనుకోకుండా అరుణ్ అక్క కూతురు సిరి దారుణంగా హత్య చేయబడుతుంది. ఆ హాత్యతో ఇన్వెస్టిగేషన్ ను మరింత స్పీడప్ చేస్తాడు అరుణ్. చివరికి వరుస హత్యల వెనుక ఓ సైకో(శరవణన్) ఉన్నాడని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ సైకో ఎవరు..? వరుసగా స్కూల్ చదివే అమ్మాయిలను టార్గెట్ చేసి చిత్రహింసలు పెట్టి ఎందుకు హత్య చేస్తున్నాడు..? చివరికి అరుణ్ ఆ సైకో ని ఎలా అంతమొందించాడు.. అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి థ్రిల్లర్ జోనర్ ఫస్ట్ టైం అయినప్పటికీ హీరోగా మెప్పించాడు. అనవసరమైన హీరోయిజం ప్రదర్శించకుండా క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. కొన్ని సందర్భాల్లో నేచురల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అనుపమ పరమేశ్వరన్ తన క్యారెక్టర్ కి బెస్ట్ అనిపించుకుంది. రాజీవ్ కనకాల మరోసారి నటుడిగా మెస్మరైజ్ చేసాడు. కథలో వచ్చే కీలక సన్నివేశంలో రాజీవ్ కనకాల మంచి నటన కనబరిచాడు. చేసిన పాత్రలే కావడంతో శరవణన్ , సుజన్ జార్జ్, అభిరామి తదితరులు మరోసారి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

తమిళ వర్షన్ కి బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి సినిమాకు హైలైట్ గా నిలిచిన జిబ్రాన్ రాక్షసుడు కి కూడా హైలైట్ గా నిలిచాడు. కొన్ని సందర్భాల్లో వచ్చే థ్రిల్లింగ్ సన్నివేశాలకు అదిరిపోయే నేపథ్య సంగీతం అందించి సత్తా చాటుకున్నాడు. వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ మరో ప్లస్ పాయింట్. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ బాగుంది. కథలో ఎటువంటి మార్పులు చేయకుండా దర్శకుడు రమేష్ వర్మ థ్రిల్ చేయగలిగాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు రీమేక్ అయ్యాయి.అందులో కొన్ని విజయం సాదిస్తే చాలా వరకూ బోల్తా కొట్టాయి. రాక్షసుడు మొదటి కేటగిరిలోకొస్తుంది. తమిళ్ లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాదించిన రాక్షసన్ సినిమాను…. ఎటువంటి మార్పులు చేయకుండా కమర్షియల్ అంశాల జోలికి వెళ్ళకుండా తీయడం సినిమాకి కలిసొచ్చిన అంశం.

కొన్ని కథలను ఎటువంటి మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా తీయగలిగితే ప్రేక్షకులను మెప్పించ్చొచ్చు. సరిగ్గా ఇదే ఫార్ముల ఫాలో అయిపోయారు మేకర్స్. అందుకే దర్శకుడు కూడా పెద్దగా కష్టపడకుండా తన క్రియేటివిటీకి పదును పెట్టకుండా తమిళ్ వర్షన్ ని అచ్చుగుద్ది నట్టుగా దించేసాడు. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను తమిళ్ వర్షన్ నుండి వాడుకున్నారు. ఆ సంగతి తమిళ్ వర్షన్ చూసిన ప్రేక్షకులు ఇట్టే పసిగట్టేస్తారు.

సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకూ కథలో ఒక్క సీన్ కూడా మార్చకుండా ‘రాక్షసుడు’ ని తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో దర్శకుడు రమేష్ వర్మ అండ్ టీం సక్సెస్ అయ్యారు. ఆ మధ్య మాస్ ఇమేజ్ కోసం ఆరాటపడిన బెల్లంకొండ మరో సారి హీరోగా కంటెంట్ ఉన్న సినిమాను ఎంచుకొని నటుడిగా మంచి మార్కులు అందుకున్నాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బెస్ట్ ఇవ్వలేకపోయాడు. తమిళ వర్షన్ చూసిన వారికి రాక్షసుడు పెద్దగా ఆకట్టుకోదు.  మిగతా ప్రేక్షకులు మాత్రం థ్రిల్ అవుతూ కనెక్ట్ అవుతారు. ఓవరాల్ గా క్రైం థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ‘రాక్షసుడు’ నచ్చుతుంది.

రేటింగ్ : 3 /5