రాజుగారి గది 3 మూవీ రివ్యూ

Friday,October 18,2019 - 12:52 by Z_CLU

న‌టీన‌టులు: అవికాగోర్‌, అశ్విన్, అలీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శ్రీను, హ‌రితేజ‌, అజ‌య్ ఘోష్‌, ఊర్వ‌శి త‌దిత‌రులు
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాణం, ద‌ర్శ‌క‌త్వం: ఓంకార్‌
బ్యాన‌ర్‌: ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఛోటా కె.నాయుడు
ఎడిట‌ర్‌: గౌతంరాజు
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సాహి సురేశ్‌
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
సెన్సార్ : U/A
రన్ టైమ్ : 120 నిమిషాలు
రిలీజ్ డేట్ : 18 అక్టోబర్ 2019

తెలుగు ప్రేక్షకులకు హారర్ కామెడీ కొత్తకాదు. ఇదే జానర్ లో మరో హారర్ కామెడీ రాజుగారి గది 3 ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. అన్నీ తానై ఓంకార్ తీసిన ఈ సినిమా రిజల్ట్ ఏంటి? తమ్ముడు అశ్విన్ కు అన్నయ్య ఓంకార్ ఓ హిట్ ఇవ్వగలిగాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ

హైదరాబాద్ లోని ఓ పెద్ద హాస్పిటల్ లో ఫిజియో థెరపిస్ట్ గా పనిచేస్తుంది మాయ (అవికా గౌర్). ఆమెకు ఎవరైనా ఐ లవ్ చెప్పారంటే ఇక వాళ్ల సంగతి అంతే. దెయ్యం వచ్చి వాళ్ల పని పడుతుంది. ఓసారి ఇలానే డాక్టర్ శశి (బ్రహ్మాజీ) మాయకు ఐ లవ్ యు చెప్పి దెయ్యం చేతిలో దెబ్బలు తింటాడు. విషయం తెలుసుకున్న శశి.. తన కాలనీవాసులను బాగా ఇబ్బంది పెడుతున్న అశ్విన్ (అశ్విన్ బాబు)కు మాయకు పరిచయం అయ్యేలా చేస్తాడు.

మాయకు అశ్విన్ ఐ లవ్ యు అని చెబితే ఇక తమ కాలనీకి అశ్విన్ తో ఇబ్బందులు తప్పుతాయని శశి భావిస్తాడు. అనుకున్నట్టుగానే అశ్విన్ తో దెయ్యం ఓ ఆట ఆడుకుంటుంది. అయితే అందరిలా అశ్విన్, మాయను వదలడు. దెయ్యం అంతు చూసేందుకు తన మామ (అలీ)తో కలిసి మాయ పుట్టిపెరిగిన కేరళకు వెళ్తాడు. మాయ తండ్రి గరుడ(అజయ్ ఘోష్) ఓ క్షుద్రమాంత్రికుడని తెలుసుకుంటాడు. ఇంతకీ మాయ కోసం దెయ్యం ఎందుకలా ప్రవర్తిస్తుంది? ఆ దెయ్యం నుంచి మాయను అశ్విన్ ఎలా కాపాడుకున్నాడనేది బ్యాలెన్స్ కథ.

 

నటీనటుల పనితీరు

హీరోహీరోయిన్ల కంటే ఈ సినిమాలో మిగతా ఆర్టిస్టుల గురించే ఎక్కువగా చెప్పుకోవాలి. నకిలీ మాంత్రికుడి పాత్ర పోషించిన అజయ్ ఘోష్, దాదాపు అలాంటి పాత్రనే పోషించిన ఊర్వశి మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ఇక కమెడియన్ అలీకి చాన్నాళ్ల తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ పడింది. చాలా రోజుల తర్వాత అలీ పంచ్ లు చూస్తారు ఆడియన్స్. బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, ధన్ రాజ్ కూడా ఉన్నంతలో ఆకట్టుకున్నారు.

తమ్ముడు అశ్విన్ ను ఫుల్ లెంగ్త్ హీరోను చేయాలనుకున్న ఓంకార్ కల ఈ సినిమాతో తీరిపోయింది. ఓ స్టార్ హీరోకు ఏమాత్రం తీసిపోని విధంగా అశ్విన్ కు మంచి ఎలివేషన్స్ పడ్డాయి. అశ్విన్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. పాటల్లో స్టెప్పులు కూడా బాగున్నాయి. కాకపోతే డైలాగ్ మాడ్యులేషన్, వాయిస్ లో ఇంకాస్త మెచ్యూరిటీ అవసరం. అవికా గౌర్ కు క్లైయిమాక్స్ లో తప్ప ఇంకెక్కడా నటించే అవకాశం, అవసరం రాలేదు. ఆమె టాలీవుడ్ రీఎంట్రీకి ఈ సినిమా పనికిరాదు.

 

టెక్నీషియన్స్ పనితీరు

టెక్నీషియన్స్ లో కెమెరామెన్ లేదా సంగీత దర్శకుడి గురించి చెప్పుకుంటాం. కానీ ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక వర్గంలో సాయిమాధవ్ బుర్రా గురించి ముందుగా మాట్లాడుకోవాలి. సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. 2-3 కామెడీ ఎపిసోడ్స్ పండాయంటే దానికి కారణం ఆ సన్నివేశాల్లో పడిన డైలాగ్స్. ఇక సినిమాను 2 గంటల్లోనే ముగించారంటే గౌతంరాజు ఎడిటింగ్ ను అర్థంచేసుకోవచ్చు. 2 గంటల్లోనే ముగించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్.

సినిమాలో ఆర్ట్ వర్క్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ బాగుంది. సినిమాటోగ్రఫీ ఓవరాల్ గా బాగుంది. ఛోటా కె నాయుడు సీనియారిటీ కనిపించింది. నిర్మాతగా ఓంకార్ ఈ సినిమాకు ఎంత అవసరమో అంత బడ్జెట్ పెట్టాడు. ఇంకాస్త డబ్బులుంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను కూడా 2డీ గ్రాఫిక్స్ లో కాకుండా, నటీనటులతో 1870 బ్యాక్ డ్రాప్ లో తీసేవాడేమో. దర్శకుడిగా మాత్రం ఈసారి సక్సెస్ అయ్యాడు. మంచి టీమ్ ను సెలక్ట్ చేసుకోవడంతో పాటు రాజుగారి గది 2లో మిస్ అయిన ఎంటర్ టైన్ మెంట్ ను జోడించడంలో ఈసారి సక్సెస్ అయ్యాడు.


జీ సినిమాలు సమీక్ష

రాజుగారి గది అనే టైటిల్ కు 1,2,3 తగిలించుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఓంకార్. కాకపోతే ఇవేవీ సీక్వెల్స్ కావు. గత రెండు సినిమాలకు రాజుగారి గది 3కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇంకా చెప్పాలంటే “దిల్లుకు దుడ్డు 2” అనే తమిళ సినిమాకు రీమేక్ ఇది. కేవలం సోల్ తీసుకున్నామని ఓంకార్ చెప్పినప్పటికీ, చాలా చోట్ల తమిళ కమెడియన్ సంతానం నటించిన సీన్లను రిపీట్ చేశారు. ఓవరాల్ గా రాజుగారి గది 3లో తమిళ వాసనలు లేకుండా చేయడంలో, కామెడీని పండించడంలో ఓంకార్ సక్సెస్ అయ్యాడు. కాకపోతే కొన్ని చోట్ల చూపించిన అతి-కామెడీ ఈ సినిమాకు మైనస్.

రాజుగారి గది 1, రాజుగారి గది 2లో సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన ఓంకార్, ఈసారి మాత్రం హారర్ కంటే ఎక్కువగా కామెడీనే నమ్ముకున్నాడు. కాకపోతే ఆ కామెడీని సినిమా అంతా బ్యాలెన్స్ చేయలేకపోయాడు. ఫస్టాఫ్ లో కాస్త తక్కువగా, సెకెండాఫ్ లో ఎక్కువగా ఈ కామెడీ కనిపిస్తుంది. చివరికి క్లైమాక్స్ ఎపిసోడ్ లో కూడా ఆఖరి నిమిషం వరకు కామెడీ సీన్లు పెట్టడంతో సినిమాలో సీరియస్ నెస్ తగ్గింది. ఓంకార్ కావాలనే ఇలా చేశాడనే విషయం కూడా అర్థమౌతోంది. స్టార్ ఎట్రాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ లేని ఇలాంటి కథలో కావాల్సింది కాలక్షేపం అనే విషయాన్ని ప్రీ-ప్రొడక్షన్ లోనే గ్రహించాడు. అలానే సినిమాను చూపించాడు.

అశ్విన్ కు ఈసారి హీరోయిజం చూపించే అవకాశం వచ్చింది. ఓంకారన్నయ్య అండతో బాబు చెలరేగిపోయాడు. అవికా గౌర్ మాత్రం సినిమాకు పెద్దగా ప్లస్ కాలేకపోయింది. తమన్న ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకుందో సినిమా చూసిన వాళ్లకు ఈజీగానే అర్థమైపోతుంది. అలీ, అజయ్ ఘోష్, ఊర్వశి లేకపోతే ఈ సినిమా లేదు. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ మొత్తం వీళ్ల ముగ్గురిపైనే నడిచింది. కాకపోతే ప్రీ-క్లైమాక్స్ కు ముందు అర్థంలేని కామెడీతో (ధనరాజ్ తో ఏకంగా వల్గర్ కామెడీ చేయించాడు) కాస్త బోర్ కొట్టించాడు దర్శకుడు.

ఇలాంటి కథలు, సినిమాలకు టెక్నికల్ అంశాలు పెర్ ఫెక్ట్ గా ఉండాలనే విషయం ఓంకార్ కు బాగా తెలుసు. ఆ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. కెమెరామెన్ గా ఛోటాను, డైలాగ్స్ కోసం సాయిమాధవ్ బుర్రాను తీసుకోవడంతోనే సగం సక్సెస్ కొట్టేశాడు. ఇతర విభాగాలు కూడా తలో చేయి వేయడంతో డీసెంట్ ఔట్ పుట్ వచ్చింది.

ఓవరాల్ గా రాజుగారి గది 3 పక్కా టైమ్ పాస్ మూవీ. 2 గంటల పాటు సరదాగా నవ్వుకోవడానికి ఇది పనికొస్తుంది. కాకపోతే A,B,C సెంటర్ల ప్రేక్షకుల్లో ఎవరు ఎక్కువగా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారనే విషయంపై బాక్సాఫీస్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.

రేటింగ్2.5/5