'రాజు గారి గది 2' రివ్యూ

Friday,October 13,2017 - 01:07 by Z_CLU

నటీనటులు : నాగార్జున, సమంత, సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్,షకలక శంకర్, నరేష్ తదితరులు

సంగీతం : ఎస్.ఎస్.థమన్

నిర్మాణం : పి.వి.పి సినిమాస్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్

నిర్మాతలు : ప్రసాద్ వి పొట్లూరి, కవిన్ అన్నే

మాటలు : అబ్బూరి రవి

స్క్రీన్ ప్లే,దర్శకత్వం : ఓంకార్

నాగార్జున ప్రధాన పాత్రలో ఓంకార్ దర్శకత్వంలో ‘రాజుగారి గది 2’ అనే హారర్ సినిమా వస్తుందనగానే సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి… ఇక సమంత ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తునగానే సినిమాపై ఉన్న అంచనాలు భారీ స్థాయికి చేరాయి. మరి మామ-కోడళ్ళు కలిసి నటించిన ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేసిందో..చూద్దాం.

కథ :

వ్యాపారం తో జీవితంలో ఎదగాలనే ఉద్ధ్యేశ్యంతో ఉన్న ఓ ముగ్గురు స్నేహితులు(అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్) గోవా సముద్ర తీరాన ఉన్న ఒకప్పటి రాజు గారి విల్లాను కొనుగోలు చేస్తారు… ఆ విల్లాను రిసార్ట్స్ గా మార్చి అందులో వ్యాపారం మొదలుపెడతారు. అయితే ఆ విల్లాలో ఓ గదిలో ఆత్మ ఉందని తెలుసుకున్న స్నేహితులు రుద్ర(నాగార్జున) అనే మెంటలిస్ట్ ను కలిసి తమ వ్యాపారానికి అడ్డుగా ఉన్న సమస్యను పరిష్కరించమని కోరతారు. ఈ క్రమంలో ఆ విల్లాలో అడుగుపెట్టిన రుద్ర.. ఆత్మ గురించి ఏం తెలుసుకున్నాడు.. చివరికి ఆ ఆత్మ పగను ఎలా చల్లార్చాడు… అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు :

ఇప్పటి వరకూ ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసిన కింగ్ నాగార్జున ఫస్ట్ టైం మెంటలిస్ట్ క్యారెక్టర్ తో మరో సారి మెస్మరైజ్ చేశాడు. సమంత చేసింది గెస్ట్ రోల్ అయినప్పటికి తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులకు తనలోని కొత్త యాంగిల్ చూపించి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచింది. అశ్విన్, వెన్నెల కిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా తమ కామెడీతో ఎంటర్టైన్ చేశారు. సీరత్ కపూర్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక రావు రమేష్, నరేష్ తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

ఇలాంటి హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మెయిన్ పిల్లర్ అంటే అది మ్యూజిక్ డైరెక్టరే… తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసి సినిమాకు ప్లస్ అయ్యాడు థమన్. దివాకర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో హైలైట్. తన కెమెరా వర్క్ తో సినిమాను మరింత క్వాలిటీ గా చూపించాడు. ముంబయి టీం చేసిన వాటర్ విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. అబ్బూరి రవి అందించిన మాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘అమ్మాయి లోనే అమ్మ ఉంది’ లాంటి కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ హృదయాన్ని కదిలిస్తాయి. ఎడిటింగ్ పరవాలేదు. ఏ.ఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ బాగుంది. స్టోరీ రొటీన్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ లో ఓంకార్ స్క్రీన్ ప్లే – డైరెక్షన్ బాగుంది.


జీ సినిమాలు సమీక్ష :

‘జీనియస్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ‘రాజు గారి గది’ సినిమాతో తానేంటో చూపించిన ఓంకార్ మళ్ళీ తనకి కలిసొచ్చిన హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథనే సెలెక్ట్ చేసుకొని అందులో ఫామిలీ ఎమోషన్ యాడ్ చేసి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఎంచుకున్నది రొటీన్ స్టోరీ అయినప్పటికీ దర్శకుడిగా తన స్క్రీన్ ప్లేతో మేజిక్ చేసి మెస్మరైజ్ చేశాడు.

నిజానికి ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ అంటే అది నాగ్ – సమంత అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. మొదటి నుంచి యూనిట్ చెప్తున్నట్లు అలా సాదాసీదా గా వెళ్తున్న సినిమాను తమ క్యారెక్టర్స్ తో నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లారు. కెరీర్ లో ఫస్ట్ టైం హారర్ సబ్జెక్ట్ చేసిన నాగ్.. మెంటలిస్ట్ పాత్రలో ఒదిగిపోయాడు.

సమంతకి తనలోని యాక్టింగ్ టాలెంట్ ను చూపించే మంచి పాత్ర ఈ సినిమాతో దొరికింది. చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ క్లైమాక్స్ లో తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. మొదటి భాగంలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్, నాగార్జున – సమంత క్యారెక్టర్స్ , ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ లో విజువల్ ఎఫెక్ట్స్, ఆసక్తికరంగా సాగే ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా…. రొటీన్ అనిపించే స్టోరీ, మొదటి భాగంలో వచ్చే కొన్ని బోరింగ్ సీన్స్ సినిమాకు మైనస్. ఓవరాల్ గా నాగ్ – సమంత పెర్ఫార్మెన్స్ తో ‘రాజుగారి గది 2’ సస్పెన్స్ థ్రిల్లర్ గా బాగానే ఎంటర్టైన్ చేస్తుంది.

రేటింగ్ : 3/5