'రాజావారు రాణిగారు' మూవీ రివ్యూ

Friday,November 29,2019 - 11:08 by Z_CLU

న‌టీన‌టులు : కిర‌ణ్ అబ్బవ‌ర‌మ్‌, ర‌హ‌స్య‌గోర‌క్‌, రాజ్‌కుమార్ కాశిరెడ్డి, ఎజుర్వేద్ గుర్రం, స్నేహా మాధురి శ‌ర్మ‌, దివ్య‌నార్ని తదితరులు

సంగీతం : జే క్రిష్‌

ఛాయాగ్రహణం : విద్యాసాగ‌ర్ చింటా, అమ‌ర్‌దీప్‌గుట్ట‌ల‌

నిర్మాణం : ఎస్‌.ఎల్ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌

నిర్మాత : మ‌నోవికాస్, మనోజ్

రచన- ద‌ర్శ‌క‌త్వం : ర‌వికిర‌ణ్ కోలా

రిలీజ్ : సురేష్ ప్రొడక్షన్స్

విడుదల తేది : 29 నవంబర్ 2019

‘రాజా వారు రాణి గారు’ అంటూ కొత్తవారందరూ కలిసి ఓ పల్లెటూరి ప్రేమకథతో ఈరోజే థియేటర్స్ లో అడుగు పెట్టారు. ఇంతకీ సినిమా ఎలా ఉంది ? మరి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొత్తవాళ్ళు సక్సెస్ అయ్యారా ? జీ సినిమాకు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

ఓ పల్లెటూరులో ఆర్.ఎం.పి డాక్టర్ కొడుకు రాజా(కిరణ్ అబ్బవరం) అదే ఊరిలో ఉండే రేషన్ షాప్ డీలర్ కూతురు రాణి(రహస్య గోరక్) ని ప్రేమిస్తాడు. తన ప్రేమను రాణికి తెలియచేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. రాజా ప్రేమ విషయాన్ని రాణికి తెలియజేయడంలో అతని స్నేహితులు చౌదరి (రాజ్ కుమార్ కాశి రెడ్డి), నాయుడు(ఎజుర్వేద్ గుర్రం) సహకరిస్తుంటారు.

రాజా తన ప్రేమ విషయాన్ని చెప్పే లోపే పై చదువుల కోసం రాణి మరో ఊరికి షిఫ్ట్ అవుతుంది. ఇక రాణి వెళ్ళిన ఊరు తెలియకపోవడంతో నిత్యం తననే  తలుచుకుంటూ ఆమె రాక కోసం అదే ఊరిలో పడిగాపులు కాసిన రాజా చివరికి రాణితో తన ప్రేమ విషయాన్ని చెప్పి రాణిని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది సినిమా కథాంశం.

నటీ నటుల పనితీరు :

ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన టాలెంట్ నిరూపించుకున్న కిరణ్ సిల్వర్ స్కీన్ మీద హీరోగా ఆకట్టుకున్నాడు. అమాయకపు పల్లెటూరి కుర్రాడిగా కిరణ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక రహస్య గోరక్ కథానాయికగా పూర్తి స్థాయిలో మెప్పించలేదు కానీ ఉన్నంతలో పరవాలేదు అనిపించుకుంది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకోదు. ఇక చౌదరి పాత్రలో రాజ్ కుమార్ కాశి రెడ్డి మంచి నటన ప్రదర్శించాడు. తన కామెడీ టైమింగ్ తో సినిమాకే హైలైట్ గా నిలిచాడు. ఈ సినిమాతో అతనికి మరిన్ని కామెడీ పాత్రలు వచ్చే అవకాశం ఉంది. ఇక నాయుడు పాత్రలో ఎజుర్వేద్ కూడా అలరించాడు. ముఖ్యంగా మెడికల్ షాప్ దగ్గర వచ్చే సన్నివేశం, తుప్పల్లో రొమాన్స్ సన్నివేశంలో అతని కామెడీ బాగా పేలింది.

చౌదరి తండ్రి పాత్రలో కిట్టయ్య బాగా నటించాడు. కొడుకుతో వాదానికి దిగే సన్నివేశంలో తన మాటలతో మంచి కామెడీ పండించాడు. అలాగే రాజా తండ్రి పాత్రలో కేదార్ శంకర్ ఆకట్టుకున్నాడు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు తన మ్యూజిక్ తో ప్లస్ అయ్యాడు జే క్రిష్. ఒక పల్లెటూరి ప్రేమకథకు అవసరమైన వినసొంపైన పాటలు అందించడంతో పాటు సన్నివేశాలకు తగిన నేపథ్య సంగీతం ఇచ్చాడు. ముఖ్యంగా ‘రాజా వారు రాణి గారు’ టైటిల్ సాంగ్ తో పాటు నమ్మేలా లేదే పాట బాగా ఆకట్టుకుంది.  సినిమాకు విద్యాసాగ‌ర్ చింటా, అమ‌ర్‌దీప్‌గుట్ట‌ల‌ సినిమాటోగ్రఫీ మరో హైలైట్ గా నిలిచింది. పల్లెటూరిలో నేచురల్ లోకేషన్స్ ను బ్యూటిఫుల్ గా చూపించారు. పాటల చిత్రీకరణ కూడా ఆకట్టుకునేలా ఉంది.

విప్ల‌వ్ ఎడిటింగ్ బాగుంది. పాటలకు స‌న‌పాటిభ‌ర‌ద్వాజ్ పాత్రుడు, రాకెందుమౌళి అందించిన సాహిత్యం చక్కగా కుదిరింది. రవికిరణ్ రాసుకున్న కథ రొటీన్ గానే ఉన్నా స్క్రీన్ ప్లే , అలాగే కొన్ని సన్నివేశాలు, మేకింగ్ మోస్తరుగా ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగినట్టుగా ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

పల్లెటూరి ప్రేమకథలో పాత్రలు, సన్నివేశాలు అద్భుతంగా ఉండాలి అప్పుడే ప్రేక్షకులు ఆ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అయితే ఈ విషయంలో ‘రాజావారు రాణిగారు’ కొంత వరకే సక్సెస్ అయింది. పాత్రలు బాగున్నా ఎందుకో బలమైన సన్నివేశాలు పడలేదు. అందువల్ల ప్రేమ కథలో ఫీల్ క్యారీ అవ్వలేదు.

ఓ కుర్రాడు ఒకమ్మాయిని ప్రేమిస్తూ ఆ అమ్మాయికి తన ప్రేమ విషయం చెప్పడానికి ప్రయత్నాలు చేయడం, ఆ అమ్మాయి ఊరి దాటి వెళ్ళాక ఆమె కోసం ఆలోచిస్తూ ఆమెను చూడటం కోసం ఎంతగానో నిరీక్షించడం. ఇది ఒకప్పటి సినిమాల్లో వచ్చేసిన ప్రేమకథే. దాన్నే కాస్త పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా కొన్ని పాత్రలతో నేచురల్ గా మళ్లీ చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

తను చెప్పాలనుకున్న స్వచ్చమైన పల్లెటూరి ప్రేమకథను అంతే స్వచ్చంగా మధురంగా చెప్పే ప్రయత్నంలో కొంత వరకూ సక్సెస్ అయ్యాడు దర్శకుడు.

కాకపోతే సినిమాలో బలమైన సన్నివేశాలు రాసుకోవడం, ప్రేమకథను గ్రిప్పింగ్ గా చూపించడంలో మాత్రం విఫలమయ్యాడు. కొన్ని సందర్భాల్లో సినిమా నత్త నడకన సాగుతూ ఏదో షార్ట్ ఫిలిం చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రొడక్షన్ వాల్యూస్ చీప్ గా అనిపించాయి. అదంతా పక్కన పెడితే పాత్రలకు సరిపడే నటులను ఎంచుకోవడం, వారితో ఆ పాత్రలను చేయించడం, ఆ పాత్రల ద్వారా ఎంటర్టైన్ మెంట్ క్రియేట్ చేయడంలో మాత్రం దర్శకుడిగా మంచి మార్కులే అందుకున్నాడు రవికిరణ్. ముఖ్యంగా చౌదరి -నాయుడు పాత్రలతో పాటు హీరోయిన్ అమ్మమ్మ పాత్రకు బాగా డిజైన్ చేసి మంచి కామెడీ క్రియేట్ చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాడు.

హీరో కిరణ్ కూడా రాజా పాత్రకు బెస్ట్ ఇచ్చాడు. అతని నేచురల్ యాక్టింగ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. హీరోయిన్ రహస్య గోరంక్ కి సరైన డైలాగ్స్ కానీ ఆమె క్యారెక్టర్ ఎలివేట్ అయ్యే సన్నివేశాలు గానీ పడలేదు. దాంతో ఆ అమ్మాయి క్యారెక్టర్ కి ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ అవ్వరు. అలా కాకుండా సినిమా మధ్యలో హీరో హీరోయిన్ మధ్య బలమైన సన్నివేశాలు వారిలో ప్రేమికులను మాత్రమే చూసేలా ఏదైనా కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే సన్నివేశాలుంటే బెటర్ గా ఉండేది. కొన్ని సందర్భాల్లో హీరోయిన్ ఎక్కడుందో ఇప్పుడున్న టెక్నాలజీతో హీరో పసిగట్టలేడా అనే సందేహం ప్రేక్షకులకు కలగక మానదు సరిగ్గా అప్పుడే సినిమాను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారని ఇది ఇప్పటి కథ కాదని గుర్తుచేసుకోవాల్సి వస్తుంది. అంత వరకూ సినిమా ఎక్కడా ఒకప్పటి కథను తలపించదు. ప్రస్తుత కథలాగే అనిపిస్తుంటుంది.

ఫైనల్ గా పాటలు, కొన్ని సన్నివేశాలు, అక్కడక్కడా వచ్చే కామెడీ కోసం ‘రాజావారు రాణిగారు’ని కలవచ్చు.

రేటింగ్ : 2.5 /5