రాజా ది గ్రేట్ మూవీ రివ్యూ

Wednesday,October 18,2017 - 02:59 by Z_CLU

నటీనటులు – రవితేజ, మెహరీన్‌, ప్రకాష్‌ రాజ్‌, రాధికా శరత్‌కుమార్‌, శ్రీనివాసరెడ్డి తదితరులు

సమర్పణః దిల్‌రాజు

సంగీతంః సాయికార్తీక్‌

సినిమాటోగ్రఫీః మోహనకృష్ణ

ఎడిటింగ్‌: తిమ్మరాజు

ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌

ఫైట్స్‌: వెంకట్‌

సహ నిర్మాతః హర్షిత్‌ రెడ్డి

నిర్మాతః శిరీష్‌

దర్శకత్వంః అనిల్‌ రావిపూడి

రన్ టైం: 149 నిమిషాలు

రిలీజ్ డేట్ :  18-10-2017

దాదాపు రెండేళ్ళ గ్యాప్ తర్వాత రవితేజ సినిమా చేస్తున్నాడనగానే ‘రాజా ది గ్రేట్’ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ రేంజ్ లో క్యూరియాసిటీ నెలకొంది. దీనికి తోడు అంధుడి పాత్ర అనేది అంతా రవితేజ వైపు చూశారు. భద్ర వంటి సూపర్ హిట్ తర్వాత దిల్ రాజు – రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే భారీ అంచనాలతో విడుదలైంది. మరి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాతో రవితేజ ఎలా ఎంటర్టైన్ చేసాడో…చూద్దాం.

కథ :
పుట్టుకతోనే అంధుడైన రాజా(రవి తేజ) చిన్నతనం నుంచే అన్ని విధాల శిక్షణ పొంది తనకంటూ ఓ సెపరేట్ ప్రపంచాన్ని సృష్టించుకొని… తనకున్న లోపాన్ని పక్కనపెట్టి అన్నిటిలో ది గ్రేట్ అనిపించుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో దేవ్ రాజ్(వివన్ భటేనా) చేతిలో తండ్రిని పొగుట్టుకొని.. అతని నుంచి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించే లక్కీ(మెహ్రీన్) ని కాపాడే భాద్యతను తీసుకుంటాడు రాజా. పుట్టుకతో అంధుడైన రాజా లక్కీను దేవ్ రాజ్ నుంచి ఎలా కాపాడాడు….చివరికి దేవ్ రాజ్ ను ఎలా అంతమొందించాడు.. అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు :

దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ్ రవితేజ.. రాజా అనే అంధుడి పాత్రతో మెస్మరైజ్ చేసి నటుడిగా గ్రేట్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో రాజా గా ది బెస్ట్ అనిపించుకున్న రవితేజ చివరి వరకూ అదే ఎనర్జీ చూపించాడు. లక్కీ అనే ఇంపార్టెంట్ రోల్ లో తన గ్లామరస్ యాక్టింగ్ తో ఆకట్టుకొని సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది మెహ్రీన్. ఇక ఈ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన రవితేజ కొడుకు మాస్టర్ మహాధన్… రాజా చిన్నప్పటి క్యారెక్టర్ తో మెస్మరైజ్ చేశాడు. అనంత లక్ష్మి గా అమ్మ పాత్రలో రాధికా ఒదిగిపోయి నటించింది. విలన్ గా వివన్ భాటేనా తనదైన శైలి నటనతో ఆకట్టుకున్నాడు.
‘నాకే నే నచ్చేస్తున్నా’ సాంగ్ లో గెస్ట్ అప్పీరియన్స్ తో ఆకట్టుకుంది రాశి ఖన్నా. శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ళ భరణి,పోసాని, పృథ్వి,రఘుబాబు, బిత్తిరి సత్తి, విద్యు లేఖ తమ కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశారు. క్లెమాక్స్ కి ముందు వచ్చే సాంగ్ లో సంపూర్ణేష్ , తాగుబోతు రమేష్, సప్తగిరి ఆకట్టుకున్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, ప్రకాష్ రాజ్, అన్నపూర్ణమ్మ, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల, ఆలి, జయప్రకాశ్ రెడ్డి, వైవా హర్ష, చమ్మక్ చంద్ర,సన, హరి తేజ, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు :

ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ఇద్దరి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఆ ఇద్దరు సినిమాటోగ్రాఫర్ మోహన కృష్ణ , మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్.. సాయి కార్తీక్ ఎనర్జిటిక్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా ‘రాజా ది గ్రేట్ రా’.. అంటూ సాగే టైటిల్ సాంగ్, ‘అలభే..అలభే’,’ నాకే నే నచ్చేస్తున్నా’,’ఎన్ని యాలో’ పాటలు బాగా ఆకట్టుకున్నాయి. ఇక మోహన కృష్ణ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా డార్జిలింగ్ లొకేషన్స్ , సాంగ్స్ పిక్చరైజేషన్ లో కెమెరామెన్ గా తన పనితనం చూపించాడు. రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ బాగుంది. వెంకట్ మాస్టర్ కంపోజ్ చేసిన ఫైట్స్ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అనిల్ రావిపూడి డైలాగ్స్, ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే సినిమాకు బలం చేకూర్చాయి. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

‘బెంగాల్ టైగర్’ సినిమా తర్వాత దాదాపు రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ్ రవితేజ ఫుల్ లెంగ్త్ అంధుడి క్యారెక్టర్ ను ఒప్పుకొని నటుడిగా గ్రేట్ అనిపించుకున్నాడు. ఒక యంగ్ డైరెక్టర్ చెప్పిన కథను నమ్మి రాజా క్యారెక్టర్ లో ఇమిడిపోయి తన స్టైల్ లో ఎంటర్టైన్ చేశాడు. ‘పటాస్’, ‘సుప్రీమ్’ తో వరుస సూపర్ హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి మరోసారి తన మార్క్ వినోదం అందించాడు.

ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ తో పరవాలేదనిపించుకున్న అనిల్ రావిపూడి సెకండ్ హాఫ్ లో మెస్మరైజ్ చేసే స్క్రీన్ ప్లే , బలమైన సీన్స్ తో సినిమాను ఓ రేంజ్ కి తీసుకెళ్లాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్ గా నిలిచి దర్శకుడిగా అనిల్ రావిపూడి టాలెంట్ చూపించింది.

రవితేజ క్యారెక్టర్, కామెడీ సీన్స్, ఫైట్స్, కబడ్డీ సీన్, సాంగ్స్, ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ కి ముందు వచ్చే ‘ఎన్ని యాలో’ సాంగ్ పిక్చరైజేషన్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలువగా…. ఫస్ట్ హాఫ్ లో వచ్చే రొటీన్ కామెడీ సీన్స్, బోరింగ్ సీన్స్ సినిమాకు మైనస్.

ఓవరాల్ గా అంధుడి కథతో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రాజా ది గ్రేట్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది

రేటింగ్3/5