Movie Review - రాజ రాజ చోర

Thursday,August 19,2021 - 08:24 by Z_CLU

నటీనటులు : శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైన, తనికెళ్ళభరణి, గంగవ్వ, అజయ్‌ ఘోష్‌ తది తరులు

మ్యూజిక్‌: వివేక్‌ సాగర్‌

సినిమాటోగ్రఫీ: వేదరామన్‌

నిర్మాణం : పీపుల్ మీడియా ఫ్యాక్టరి , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్

నిర్మాత : టీజి విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌

రచన -దర్శకత్వం : హసిత్ గోలి

నిడివి : 149 నిమిషాలు

సెన్సార్: U/A

రన్ టైమ్: 2 గంటల 29 నిమిషాలు

విడుదల తేది : 19 ఆగస్ట్ 2021

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎప్పుడూ చెప్పనంత కాన్ఫిడెంట్ గా సినిమా నచ్చుతుందని, ‘రాజ రాజ చోర’ మీ మనసుల్ని దోచేస్తాడని గట్టిగా చెప్పాడు హీరో శ్రీ విష్ణు. మరి నిజంగానే శ్రీ విష్ణు చెప్పినట్లు ప్రేక్షకుల మనసుని ఈ సినిమా చోరీ చేసిందా ? ముందు నుండి టీం చెప్తున్నట్లు సినిమాతో హిలేరియస్ గా నవ్వించారా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

raja raja chora review in telugu
కథ :

జిరాక్స్ షాపులో వర్క్ చేసే భాస్కర్(శ్రీ విష్ణు) తన భార్య విద్య(సునైనా), పిల్లాడి చదువు కోసం అలాగే తన గర్ల్ ఫ్రెండ్ సంజన(మేఘ ఆకాష్) అవసరాలు తీర్చడం కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో రాజు వేషధారణలో దొంగతనం చేస్తూ పోలీస్ ఆఫీసర్ విలియమ్స్ రెడ్డి (రవిబాబు) కి పట్టుబడతాడు.

భాస్కర్, విద్య భార్యభర్తలు అయినప్పటికీ ఇద్దరికి మాటలు ఉండవు. తన లాయర్ చదువుకి సంబంధించి ఫీజ్ కోసం మాత్రమే భాస్కర్ తో మాట్లాడుతుంది విద్య. ఈ క్రమంలో దొంగతనం చేస్తూ పోలీస్ కి పట్టుబడిన భర్తను తన లాయర్ బుర్రతో స్టేషన్ నుండి ఎలా బయిటికి తీసుకొచ్చింది? అసలు పెళ్ళాం ఉండగా భాస్కర్ సంజనతో ఎందుకు రిలేషన్ పెట్టుకున్నాడు? దొంగతనం కేసులో పట్టుబడిన భాస్కర్ ని పోలీస్ వదిలేశాడా? చివరికి తను చేసిన తప్పులు తెలుసుకొని భాస్కర్ ఎలా మారాడు ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

హీరో శ్రీ విష్ణు సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. భాస్కర్ పాత్రతో నవ్వులు పంచాడు. ఇది వరకు చేసిన ఫన్నీ క్యారెక్టర్ కావడంతో చాలా ఈజ్ తో చేశాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడా ఎప్పటిలానే మెప్పించాడు. శ్రీవిష్ణు తర్వాత కచ్చితంగా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ విద్య. ఆ పాత్రలో సునైనా నటన బాగుంది. క్యారెక్టర్ కి నటిగా బెస్ట్ ఇచ్చింది. మరో నటి మేఘా ఆకాష్, సంజన పాత్రలో ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత మంచి పాత్ర దొరకడంతో రవిబాబు అలరించాడు.

అంజమ్మ పాత్రలో గంగవ్వ, కానిస్టేబుల్ పాత్రలో కాదంబరి కిరణ్, గుడిలో ప్రవచనాలు చెప్పే పాత్రలో తనికెళ్ళ భరణి, బ్యుల పాత్రలో ఇందు కుసుమ ఆమె భర్త పాత్రలో వాసు, డాక్టర్ కం రియల్ ఎస్టేట్ వ్యాపారి గా శ్రీకాంత్ అయ్యంగార్, జిరాక్స్ షాపు ఓనర్ గా అజయ్ ఘోష్ తమ పాత్రలకు న్యాయం చేసి సినిమా చూశాక కూడా ఆ పాత్రలు గుర్తుండేలా చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు మ్యూజిక్ పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. వివేక్ సాగర్ కంపోజ్ చేసిన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ సినిమాను నిలబెట్టింది. ముఖ్యంగా రాజ రాజ వచ్చే సాంగ్ తో పాటు క్లైమాక్స్ కి ముందు వచ్చే సిద్ శ్రీరామ్ తో పాడించిన సాంగ్ కూడా ఆకట్టుకుంది. చాలా చోట్ల నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలం చేకూర్చింది. వేదరామన్ కెమెరా వర్క్ బాగుంది. కొన్ని ఫ్రేమ్స్ విజువల్స్ గా ఎట్రాక్ట్ చేశాయి. విప్లవ్ ఎడిటింగ్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. సినిమాను క్రిస్పీగా కట్ చేశారు.

కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ వర్క్, శృతి కొర్రపాటి స్టైలింగ్ బాగున్నాయి. హసిత్ రాసుకున్న కథ బాగుంది. మొదటి సినిమా అయినప్పటికీ కొన్ని సన్నివేశాలను ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా తెరకెక్కించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

raja raja chora review in telugu
జీ సినిమాలు సమీక్ష :

దర్శకుడు హసిత్ తను చెప్పాలనుకున్న కథని మొదటి భాగం ఎంటర్టైనింగ్ గా రెండో భాగం ఎమోషనల్ గా చెప్పాడు. అందుకోసం ఫస్ట్ హాఫ్ లో రెండు మూడు హిలేరియస్ బ్లాక్స్ ప్లాన్ చేసుకొని నవ్వించాడు. అలాగే సెకండాఫ్ ను మంచి ఎమోషనల్ డ్రామాతో నడిపించాడు. రెండు విషయాల్లోనూ దర్శకుడిగా మంచి మార్కులే అందుకున్నాడు. మొదటి సినిమాకు ఒక మంచి కథను ఎంచుకోవడం మెచ్చుకొదగిన విషయం. అలాగే సన్నివేశాలకు తగ్గట్టుగా మంచి సంభాషణలు కూడా రాసుకున్నాడు. ముఖ్యంగా తనికెళ్ళ భరణి మాటలతో కథ ఇతి వృత్తాన్ని చెప్పడం బాగుంది.

తన మొదటి సినిమాకి ఫన్, ఎమోషన్, లవ్, ఫ్యామిలీ ఇలా అన్ని ఎలిమెంట్స్ కుదిరిన కథ ఎంచుకొని దర్శకుడిగా మంచి ప్రయత్నం చేశాడు హసిత్. ముఖ్యంగా క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించే నటీనటులను ఎంచుకోవడం హసిత్ కి కలిసొచ్చింది. స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంటుంది. కాకపోతే అందులో కొన్ని డ్రా-బ్యాక్స్ కనిపిస్తాయి. అలాగే లాజిక్స్ చూసుకోకుండా కొన్ని సన్నివేశాలను తెరకెక్కించాడు. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ లో హిలేరియస్ బ్లాక్స్ సెట్ చేసుకొని మెస్మరైజ్ చేస్సిన హసిత్ సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటి వరకు సినిమాను పరుగులు పెట్టించలేకపోయాడు. మళ్ళీ కొన్ని మలుపులతో ఆసక్తికరమైన డ్రామాతో కథను నడిపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ కి ముందు వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ద్వారా దోపిడీ అనేది మనల్ని మనం చేసుకునే మోసం అంటూ తనికెళ్ళ భరణి పాత్ర ద్వారా చెప్తూ హీరో ఒక్కడే కాదు అన్ని క్యారెక్టర్స్ లో దోపిడీ ఉందని చెప్తూ వారి రియలైజేషన్ తో ఎండ్ చేశాడు. ఒక పక్షిని చంపాక వాల్మీకి రియలైజ్ అయిన పాయింట్ ని  కథగా రాసుకొని హీరో క్యారెక్టరైజేషన్ తో  క్లైమాక్స్ లో చెప్పాడు దర్శకుడు.

కథ, డైలాగ్స్, మ్యూజిక్, కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్, శ్రీ విష్ణు – సునైనా నటన సినిమాకు మేజర్ హైలైట్స్ గా నిలిచాయి. ఫైనల్ గా ‘రాజ రాజ చోర’ నవ్విస్తూ చివర్లో ఏడిపిస్తూ, అందరి మనసుల్ని చోరీ చేస్తాడు.

రేటింగ్   3/5