'రచయిత' రివ్యూ

Monday,February 19,2018 - 02:08 by Z_CLU

నటీ నటులు : విద్యాసాగర్ రాజు, సంచితా పడుకోనే, శ్రీధర్ వర్మన్, వడ్లమణి శ్రీనివాస్, హిమజ, ముణిచంద్ర, అభిలాష్, రాగిణి, సంజిత్, సుప్రియా, అన్మోన, అనిత తదితరులు

సంగీతం : షాన్ రెహమాన్

నేపధ్య సంగీతం : జీవన్.బి

మాటలు : కరుణాకర్ అడిగర్ల

ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్

నిర్మాణం : దుహర మూవీస్

నిర్మాత : కళ్యాణ్ ధూలిపల్ల

కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు

విడుదల తేది : 16 -02-2018

విద్యాసాగర్ హీరోగా స్వీయ దర్శకత్వంలో ఎమోషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘రచయిత’ ఇటివలే రిలీజ్ అయింది. జగపతి బాబు ప్రత్యేకంగా ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో కాస్త బజ్ క్రియేట్ అయింది. మరి ఈ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను ఏ మేరకూ మెప్పిస్తుందో…తెలుసుకుందాం.


కథ :

1950 కాలం నాటి కథ ఇది. పలు వైవిధ్యమైన నవలలతో పాప్యులర్ నవలా రచయితగా గుర్తింపు అందుకున్న ఆదిత్య వర్మ (విద్యాసాగర్ ) భయం నేపథ్యంలో తన తదుపరి నవలను రాయబోతున్నట్టు ప్రకటిస్తాడు. ఈ క్రమంలో తను చిన్నతనంలో ప్రేమించిన అమ్మాయి పద్మావతి (సంచిత పదుకొనె)ను వివాహం చేసుకునేందుకు ఆమె తల్లితండ్రులను ఒప్పిస్తాడు. వారిని ఒప్పించి తను నవల రాయడానికి ఎంచుకున్న ప్రశాంత ప్రదేశంలోని తన ఇంటికి పద్మావతిని కూడా తీసుకెళ్తాడు.

అయితే అలా ఆదిత్య వర్మతో ఆ ఇంట్లో అడుగు పెట్టిన పద్మావతి కి తన గతంలో జరిగిన సంఘటనలు కొన్ని గుర్తొస్తుంటాయి. మరోవైపు ఆ ఇంట్లో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు తన నవలలోని కొన్ని సంఘటనలుగా పద్మావతి కి చెప్తుంటాడు ఆదిత్య వర్మ.. ఇంతకీ పద్మావతి గతం ఏంటి.. ఆ ఇంటికి పద్మావతి సంబంధం ఏమిటి..? చివరికి ఆదిత్య వర్మ, పద్మావతి ఎలా ఒకటయ్యారు అనేది మిగతాకథ.

 

నటీ నటుల పని తీరు :

ఓ వైపు దర్శకుడిగా మరో వైపు కథానాయకుడిగా విద్యా సాగర్ ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో ఆయనలోని దర్శకుడిని డామినేట్ చేస్తూ నటించిన విధానం బాగుంది. పద్మావతి గా చక్కని అభినయంతో సినిమాకు హైలైట్ గా నిలిచింది సంచితా పడుకోనే. హిమజ పాత్ర చిన్నదే అయినప్పటికీ తన క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంది. ఇక శ్రీధర్ వర్మన్, వడ్లమణి శ్రీనివాస్,ముణిచంద్ర, అభిలాష్, రాగిణి, సంజిత్, సుప్రియా, అన్మోన తదితరులు పరవాలేదనిపించుకున్నారు.

టెక్నిషియన్స్ పనితీరు :

ఇలాంటి పిరియాడిక్ సినిమాలకు టెక్నికల్ గా చాలా సపోర్ట్ అవసరం. టెక్నికల్ గా ప్రతీ ఒక్కరూ తమ పనితనం చూపించారు. ముఖ్యంగా షాన్ రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది. అలాగే షాన్ కంపోజ్ చేసిన ట్యూన్స్ కి చక్కని సాహిత్యం అందించి పాటలకు ప్రాణం పోసాడు చంద్రబోస్. ముఖ్యంగా రానా ప్రియా అంటూ వచ్చే పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. జీవన్.బి నేపధ్య సంగీతం కూడా సినిమాకు పర్ఫెక్ట్ అనిపించేలా ఉంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పరవాలేదు. రాము ఆర్ట్ వర్క్ బాగుంది. ముఖ్యంగా వైజాగ్ లో సమద్ర సమీపాన వేసిన ఇల్లు సెట్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. కొన్ని సందర్భాలలో కరుణాకర్ అడిగర్ల అందించిన మాటలు ఆకట్టుకున్నాయి. రచయితగా తన పెన్ పవర్ చూపించాడు కరుణాకర్. విద్య సాగర్ కథ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే కుదరలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ పరవలేదనిపిస్తాయి.


జీ సినిమాలు సమీక్ష :

ఒక స్టార్ ఒక చిన్న సినిమాను ప్రమోట్ చేస్తున్నాడంటే అందులో ఎంతో కొంత మేటర్ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అలాగే రచయిత సినిమా బాబు నాకు నచ్చిన ఒక మంచి సినిమా అంటూ జగపతి బాబు తన స్టైల్ లో ప్రమోట్ చేయడంతో ఈ సినిమాపై కాస్తో కూస్తో బజ్ వచ్చింది. అయితే ఇలాంటి పీరియాడిక్ సినిమాలు కొందరికి అమితంగా నచ్చుతాయి. దానికి రీజన్స్ ఉండవు.

ఇక సినిమా విషయానికొస్తే 1950 కాలం నాటి కథతో ఒక ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా చేయాలంటే దానికి చాలా జాగ్రత్త వహించాలి. ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించాల్సి ఉంటుంది. నిజానికి ఆ విషయంలో దర్శకుడు విద్య సాగర్ పూర్తిగా విఫలం అయ్యాడు. 1950 నాటి కథను అప్పటిలా అనిపించే సంభాషనలతో రూపొందించి ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టించాడు. నిజానికి ఇలాంటి కాన్సెప్ట్ ని సినిమాగా తెరకెక్కించే టప్పుడు దానికి ప్రేక్షకులకు థ్రిల్ అయ్యేలా సన్నివేశాలుండాలి. ఆ విషయంలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులతో దర్శకుడిగా పరవాలేదనిపించాడు విద్యాసాగర్. అనుకోని సందర్భాల్లో వచ్చే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. ఇక నటుడిగా విద్యా సాగర్ ఈ రచయిత పాత్రను ఎంతగా ప్రేమించాడన్నది తెలుస్తుంది. ఆ క్యారెక్టర్ కి తన శైలి నటనతో పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. రచయిత పాత్ర, సంచితా పడుకోనే నటన, పాటలు, కొన్ని సందర్భాల్లో వచ్చే మాటలు, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాలో హైలైట్స్. రచయిత దగ్గర పనిచేయడానికి వచ్చిన పాత్రతో నవ్వించకపోగా ఆ క్యారెక్టర్ తో విసుగు తెపించడం, అసందర్భ సమయంలో వచ్చే కొన్ని మాటలు చిరాకు తెప్పించడం, స్క్రీన్ ప్లే, చెప్పాలనుకున్న కథను మరీ సాగ దీసి నట్టుగా చెప్తూ పోవడం సినిమాకు మైనస్.

రేటింగ్ : 2/5