'రారా' మూవీ రివ్యూ

Friday,February 23,2018 - 03:09 by Z_CLU

నటీనటులు : శ్రీకాంత్, నజియ, సీతా నారాయణ, గిరిబాబు, అలీ, రఘు బాబు, పోసాని, పృథ్వి, జీవ, షకలక శంకర్, నల్ల వేణు, హేమ తదితరులు.

సంగీతం : రాప్ రాక్ షకీల్

ఛాయాగ్రహణం : పూర్ణ

నిర్మాణం : విజి చెరిష్ విజన్

రిలీజ్ డేట్ : 23 ఫిబ్రవరి 2018

 

శ్రీకాంత్ హీరోగా నటించిన ‘రా రా’ ఈరోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్ టైన్ చేసిందో..చూద్దాం.

కథ :

100 సినిమాలకు దర్శకత్వం వహించిన ఓ టాప్ డైరెక్టర్(గిరి బాబు) కొడుకు రాజ్ కిరణ్(శ్రీకాంత్). తన తండ్రిలా గొప్ప దర్శకుడు అవ్వాలని భావించి దర్శకుడిగా మారి వరుసగా ఓ 3 సినిమాలు తీస్తాడు. ఆ మూడూ ఫ్లాప్ అవుతాయి. అయితే ఫ్లాప్ డైరెక్టర్ గా ఉన్న తనని చూసి అనారోగ్యం పాలవుతుంది రాజ్ కిరణ్ తల్లి. ఓ హిట్ సినిమా దర్శకుడిగా చూడాలనుకున్న తన తల్లి కోరిక తీర్చడానికి ఆఖరి ప్రయత్నంగా హిట్ సినిమా తీసి తానెంతో నిరుపించుకోవాలనుకుంటాడు. ఆ దిశగా ఓ హారర్ సినిమాను తీయడం కోసం తన టీంతో కలిసి ఊరికి దూరంగా ఉండే ఓ పాడుబడ్డ బంగ్లాకి షిఫ్ట్ అవుతాడు. అలా సినిమా చేయడం కోసం ఆ బంగ్లాకి వెళ్ళిన రాజ్ కిరణ్ మధువధిని అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అంతలోనే మధువధిని అమ్మాయి కాదని దెయ్యమని తెలుసుకుంటాడు. అయితే తనని అమితంగా ప్రేమిస్తున్న దెయ్యం నుంచి రాజ్ కిరణ్ ఎలా ఎస్కేప్ అయ్యాడు… అసలు మధువధిని ఎలా చనిపోయింది.. చివరికి సినిమా తీశాడా..లేదా అనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు :

నటుడిగా ఇప్పటికే 120కి పైగా సినిమాల్లో నటించిన శ్రీకాంత్ ఇప్పటివరకూ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో ఎంటర్ టైన్ చేశాడు. నిజానికి ఈ రోల్ శ్రీకాంత్ కి కొత్త కావొచ్చు కాని ఇప్పటికే కొందరు హీరోలు ఇలాంటి క్యారెక్టర్స్ తో హారర్ కామెడీ సినిమాలు చాలానే చేశారు. అందుకే ఈ క్యారెక్టర్ ని ఆడియన్స్ కొత్తగా ఫీల్ అవ్వలేదు. కథానాయికలు నజియ, సీతా నారాయణ్ తమ గ్లామర్ తో సినిమాకు ప్లస్ అయ్యారు ముఖ్యంగా నజియా తన గ్లామర్ తో పాటు యాక్టింగ్ తోనూ ఆకట్టుకొని సినిమాకు హైలైట్ గా నిలిచింది. షకలక శంకర్ తన కామెడి టైమింగ్ తో కొంత వరకూ ఎంటర్ టైన్ చేశాడు. అలీ కామెడీ పేలలేదు. పృథ్వి, హేమ, రఘుబాబు, ఫణి, చమ్మక్ చంద్ర మోస్తరుగా ఎంటర్ టైన్ చేశారు. ఇక గిరి బాబు,పోసాని, జీవ, వేణు, జబర్దస్త్ శ్రీను, భద్రం తదితరులు పరవాలేదనిపించుకున్నారు.

 

టెక్నిషియన్స్ పనితీరు :

సినిమాకు తగిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి సినిమాకు ప్లస్ అయ్యాడు రాప్ రాక్ షకీల్. ముఖ్యంగా ‘రారా’ అంటూ నేష్మ మౌష్మి పాడిన పాట హైలైట్ గా నిలిచింది. పూర్ణ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. ఆర్ట్ వర్క్ బాగుంది. కొన్ని సందర్భాల్లో వచ్చే కామెడీ డైలాగ్స్ ఎంటర్ టైన్ చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.

జీ సినిమాలు సమీక్ష:

కెరీర్ లో ఫస్ట్ టైం శ్రీకాంత్ ఓ హారర్ కామెడీ సినిమా చేయడం, పైగా మోహన్ లాల్, చిరంజీవి వంటి స్టార్స్ ఈ సినిమా ప్రచార చిత్రాలను విడుదల చేయడం ‘రారా’ సినిమాపై కాస్త బజ్ క్రియేట్ చేశాయి. రెండేళ్ళ క్రితం షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా రిలీజ్ అయింది.

ఇక సినిమా విషయానికొస్తే… తెలుగులో ఇప్పటికే ఎన్నో హారర్ కామెడీ సినిమాలొచ్చినా మళ్ళీ ఓ హారర్ కామెడీ సినిమా వస్తుందంటే ఆ జోనర్ సినిమాలను అమితంగా ఇష్టపడే ప్రేక్షకులు మళ్ళీ థియేటర్స్ లో వాలిపోతారు. అందుకే శ్రీకాంత్ కూడా ఈ జోనర్ లో సినిమా చేసి ప్రేక్షకుడిని థియేటర్స్ కి ‘రా రా’ అంటూ పిలిచాడు. నిజానికి ఈ జోనర్ లో కొత్తగా చెప్పేదేం ఉండదన్న సంగతి ప్రేక్షకులకు కూడా తెలిసిందే. ఈ సినిమా చూస్తున్నంత సేపు అదే దెయ్యం.. అవే క్యారెక్టర్స్..అదే సినిమా అనే ఫీల్ కలుగుతుంది. అందుకే కొన్ని సందర్భాల్లో శ్రీకాంత్ అసలు ఈ జోనర్ లో ఎందుకీ సినిమా చేశాడు. ఏదో ఓ సినిమా చేసేయాలన్న ఉద్దేశ్యంతోనా.. లేదా తనకి కొత్తగా ఉంటుందనే ఆలోచనతోనా..అనే అనుమానం వస్తుంది.

షూటింగ్ సమయంలో జరిగిన గొడవల వల్ల దర్శకుడి పేరు వేయకుండానే సినిమాను విడుదల చేశారు నిర్మాతలు. నిజానికి తెలుగు ప్రేక్షకులకు ఇదో కొత్త అనుభూతి. ఎన్ని గొడవలు జరిగినప్పటికీ ఎవరో ఒకరి పేరు దర్శకుడిగా వేయడం సహజమే. కాని ఈ సినిమా పోస్టర్ మీదే కాదు స్క్రీన్ మీద కూడా దర్శకుడి పేరు కనిపించలేదు. సో ఈ సినిమాకి పనిచేసిన ముందు దర్శకుడు…ఆ తర్వాత మధ్యలో సినిమాను టేకప్ చేసిన దర్శకుడి గురించి కూడా ఎక్కడా అనౌన్స్ చేయలేదు యూనిట్.. ఆ దర్శకుల గురించి తెలియకపోవడంతో దర్శకత్వం గురించి చెప్పేదేం లేదు. కాని అర్థం పర్థం లేని సన్నివేశాలతో ఇద్దరూ కలిసి సినిమాను కిచిడి చేసారన్న సంగతి మాత్రం సినిమా చూశాక అర్థమౌతుంది.

శ్రీకాంత్ పెర్ఫార్మెన్స్, నజియ, సీతా నారాయణ గ్లామర్, కొన్ని సందర్భాల్లో వచ్చే రొమాంటిక్ సీన్స్, సెకండ్ హాఫ్ లో వచ్చే షకలక శంకర్ కామెడీ సినిమాలో కాస్తో కూస్తూ చెప్పుకోదగ్గ హైలైట్స్ కాగా వీక్ డైరెక్షన్, నెరేషన్, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్ మధ్య వచ్చే సంభాషణలు, రొటీన్ అనిపించే సన్నివేశాలు సినిమాకు మైనస్.

ఓవరాల్ గా హారర్ కామెడీ సినిమాలను అమితంగా ఇష్టపడే వాళ్ళకి జస్ట్ పరవాలేదనిపించొచ్చు.. కాని మిగతా వారికీ మాత్రం పిచ్చ బోర్ కొట్టించే సినిమా ‘రారా’.

రేటింగ్ : 2 / 5