'రాగల 24 గంటల్లో' మూవీ రివ్యూ

Friday,November 22,2019 - 12:30 by Z_CLU

న‌టీన‌టులు: సత్యదేవ్, ఈషా రెబ్భ, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ, రవివర్మ తదితరులు.

ఛాయాగ్రహణం : గ‌రుడ‌వేగ అంజి

సంగీతం : రఘు కుంచె

కథ: వై.శ్రీనివాస్ వర్మ

మాటలు: కృష్ణభగవాన్

నిర్మాణం : కార్తికేయ సెల్యూలాయిడ్స్

నిర్మాత : శ్రీనివాస్ కానూరు

స్క్రీన్ ప్లే- దర్శకత్వం : శ్రీనివాస్ రెడ్డి

రన్ టైమ్ : 134 నిమిషాలు

సెన్సార్: U/A

రిలీజ్ డేట్: 22 నవంబర్ 2019

చాలా సస్పెన్స్ థ్రిల్లర్లు వస్తున్నాయి. కాకపోతే అందులో నటించే నటీనటులు, స్క్రీన్ ప్లే ఆధారంగా లుక్, రిజల్ట్ మారిపోతుంది. రాగల 24 గంటల్లో అనే థ్రిల్లర్ కూడా అలాంటిదే. ఈషా రెబ్బ లాంటి హీరోయిన్, సత్యదేవ్ లాంటి పెర్ఫార్మర్ ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇంతకీ మూవీ రిజల్ట్ ఏంటి? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ


కథ :

విద్య (ఈషా రెబ్బ) ఓ అనాధ. అనాథ శరణాలయంలోనే పుట్టి పెరుగుతుంది. ఇక రాహుల్ (సత్యదేవ్) ఇండియాలోనే ఫేమస్ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. ఓ షూట్ సందర్భంగా అనుకోకుండా విద్యాను చూస్తాను. తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లయిన తర్వాత రాహుల్ అసలు రంగు బయటపడుతుంది. రాహుల్ పెద్ద అనుమానపు పక్షి. ఇంకా చెప్పాలంటే అతిపెద్ద శాడిస్ట్. విద్యను చిత్రహింసలు పెడుతుంటాడు. క్లోజ్ ఫ్రెండ్స్ అయిన విద్య-గణేశ్ (గణేష్ వెంకట్రామన్) రిలేషన్ షిప్ ను కూడా అనుమానిస్తుంటాడు.

సరిగ్గా అదే టైమ్ లో అనుకోని విధంగా హత్యకు గురవుతాడు రాహుల్. దీంతో పోలీసులు విద్యను అనుమానిస్తారు. ఆ అనుమానాలకు తగ్గట్టే విద్యా కూడా తనే హత్య చేశానంటూ లొంగిపోతుంది. ఇంతకీ రాహుల్ ను నిజంగానే విద్య హత్య చేసిందా? మోడల్ మేఘన (ముష్కాన్ సేథీ) హత్యకు రాహుల్ మర్డర్ కు ఏమైనా లింక్ ఉందా? అనేది బ్యాలెన్స్ కథ.

నటీనటుల పనితీరు:

ముందుగా ఈషా రెబ్బ గురించే చెప్పుకోవాలి. విద్య పాత్రలో ఒదిగిపోయింది. మంచి భార్యగా కనిపిస్తూనే, హంతకురాలు అనే ముద్ర వేయించుకునే సీన్స్ లో చక్కగా నటించింది. ఈషా రెబ్బ తర్వాత సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరోసారి తన పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశాడు సత్యదేవ్. కథ జానర్ ను దృష్టిలో పెట్టుకొని అతడి పాత్రను ఎక్కువగా రివీల్ చేయకూడదు కానీ, ఆ క్యారెక్టర్ లో సత్యదేవ్ జీవించాడు. ఇంకా చెప్పాలంటే కొన్ని సన్నివేశాల్లో ఈషా కంటే సత్యదేవ్ కే ఎక్కువ మార్కులు పడతాయి.

ఇక ఫ్రెండ్ పాత్రలో గణేశ్ వెంకట్రామన్, అదిరే అభి ఆకట్టుకోగా.. ఏసీపీ నరసింహ పాత్రలో శ్రీరామ్ అక్కడక్కడ ఓవరాక్షన్ చేశాడు. మోడల్ గా, మంచి అమ్మాయిగా ముస్కాన్ సేథీ తన గ్లామర్ తో మెప్పించింది. అభాస్ పాల్ పాత్రలో కృష్ణభగవాన్ ఆకట్టుకోలేకపోయాడు. అసలు అతడికి సరైన క్యారెక్టరైజేషన్ ఇవ్వలేదు.

టెక్నీషియన్స్ పనితీరు:

సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కు టెక్నికల్ సపోర్ట్ చాలా అవసరం. ఈ సినిమాకు ఆ సపోర్ట్ అంతంతమాత్రంగానే దక్కింది. అంజి కెమెరావర్క్ అక్కడక్కడ మాత్రమే మెరవగా, తమ్మిరాజు ఎడిటింగ్ చాలా నీరసంగా సాగింది. ఇక రఘుకుంచె బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అక్కడక్కడ ఆకట్టుకోగా.. చిన్నా ఆర్ట్ వర్క్ ఎక్కడా కనిపించలేదు.

చాన్నాళ్ల తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్న దర్శకుడు శ్రీనివాసరెడ్డి తనదైన మార్క్ చూపించలేకపోయాడు. రీసెంట్ గా వచ్చిన కొన్ని సక్సెస్ ఫుల్ థ్రిల్లర్స్ కు పోటీగా ఈ సినిమాను నిలపలేకపోయాడు. డైరక్షన్ పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ.. స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం కొన్ని తప్పులు చేశాడు. నెక్ట్స్ ఏం జరగబోతోందనే విషయాన్ని ముందుగానే ఊహించేలా ఉన్నాయి చాలా సీన్లు.


జీ సినిమాలు సమీక్ష :

థ్రిల్లర్ సినిమాల్లో అందరూ ఫాలో అయ్యే సూత్రం ఒకటి ఉంటుంది. అసలు మేటర్ ను ఆఖరి నిమిషం వరకు రివీల్ చేయకూడదనేది ఆ కామన్ ఫార్ములా. ‘రాగల 24 గంటల్లో’ సినిమాకు కూడా దర్శకుడు అదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. కాకపోతే అసలు విషయాన్ని దాచాలనే తాపత్రయంలో, ఇంట్రెస్టింగ్ గా లేని సన్నివేశాల్ని చాలా చొప్పించాడు. అసలు సమస్యంతా ఇక్కడే వచ్చింది. రాగల 24 గంటల్లో సినిమా ఫస్టాఫ్ సహనాన్ని పరీక్షిస్తుంది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు సెకండాఫ్ నుంచి మూవీ ఊపందుకుంటుంది.

ఉన్నంతలో దర్శకుడు చేసిన మంచి పని ఏంటంటే.. స్ట్రయిట్ గా సినిమా కథలోకి ఎంటరైపోయాడు. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకే సస్పెన్స్ పెంచేస్తాడు. కానీ అక్కడ్నుంచి అసలు విషయాన్ని దాచే క్రమంలో అనవసర సన్నివేశాలు ఇరికించాడు. దీనికి తోడు పెట్టిన సీన్స్ లో లాజిక్ లేకపోవడం కూడా కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. ఉదాహరణకు ఏసీపీ పాత్రనే తీసుకుంటే.. జైలు నుంచి ముగ్గురు ఖైదీలు తప్పించుకున్నారనే విషయాన్ని ఏసీపీ స్థాయి అధికారి న్యూస్ ఛానెల్ చూసి తెలుసుకోవడం కామెడీ గా అనిపిస్తుంది.

జైలు నుంచి తప్పించుకున్న ఖైదీల్ని ఇంట్లో కూర్చోబెట్టి హీరోయిన్ తన గతం చెప్పడం కూడా చూడ్డానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయితే క్లైమాక్స్ తర్వాత స్టార్టింగ్ లో చూసిన సీన్స్ కు ఓ లాజిక్ ఉందనిపిస్తుంది. మొత్తమ్మీద కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ వేసిన దర్శకుడు.. సెకెండాఫ్ నుంచి కథను చక్కగా నడిపించాడు. అప్పటివరకు దాచుకున్న స్టఫ్ ను ఒక్కొక్కటిగా బయటపెడుతూ సినిమాను సేఫ్ గా క్లైమాక్స్ కు తీసుకెళ్లాడు.

అయితే క్లైమాక్స్ లో దర్శకుడు మరోసారి తడబడ్డాడు. అప్పటికే రన్ టైమ్ ఎక్కువైందని భావించాడో లేక ఎలా ముగించాలో అర్థంకాక అలా చేశాడో కానీ.. కథ ముగింపు సరిగ్గా అనిపించదు. క్లైమాక్స్ లో ఓ పెద్ద పోలీసాఫీసర్ ను బహిరంగంగా హత్య చేస్తుంటే ఎవ్వరూ చూడకపోవడం, అడ్డుకోలేకపోవడం లాంటివి లాజిక్ కు అందవు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు కూడా అంత కన్విన్సింగ్ గా అనిపించవు. ఇవన్నీ పక్కనపెడితే.. రాగల 24 గంటల్లో అనే టైటిల్ కు మాత్రం మంచి జస్టిఫికేషన్ ఇవ్వగలిగారు.

ఓవరాల్ గా ఓ మోస్తరుగా థ్రిల్ అందించడంలో ‘రాగల 24 గంటల్లో’ సినిమా సక్సెస్ అయింది. ఈషా రెబ్బ నటనతో పాటు ఆమె అందాలు సినిమాకు ప్లస్ కాగా, టోటల్ మూవీకి సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ బ్యాక్ బోన్ గా నిలిచింది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లు ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.

రేటింగ్2.5/5