Movie Review - పుష్పక విమానం

Friday,November 12,2021 - 01:49 by Z_CLU

నటీ నటులు : ఆనంద్ దేవరకొండ , గీత్ సైని, శాన్వీ మేఘన , సునీల్ ,నరేష్ , హర్ష వర్ధన్, కిరీటి ధర్మరాజు తదితరులు.

సమర్పణ : విజయ్ దేవరకొండ,

సినిమాటోగ్రఫీ :హెస్టిన్ జోస్ జోసెఫ్

మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్
దాసాని

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతనేని

నిర్మాతలు:  గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి,

రచన-దర్శకత్వం: దామోదర

విడుదల తేది : 12 నవంబర్ 2021

రీసెంట్ గా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమాతో OTT ఆడియన్స్ ని మెప్పిన హీరో ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం‘ అనే సినిమాతో ఈరోజు థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి అన్నయ్య విజయ్ దేవరకొండ సపోర్ట్ తో పాటు అల్లు అర్జున్ సపోర్ట్ కూడా అందుకొని రిలీజ్ కి ముందే సినిమాపై బజ్ క్రియేట్ చేశాడు. మరి మోస్తారు అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆకట్టుకుండా ? ఆనంద్ దేవరకొండ కొత్త దర్శకుడితో సొంత బేనర్ లో చేసిన ఈ ప్రయత్నం విజయం అందుకుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ : 

గవర్న్ మెంట్ స్కూల్లో టీచర్ గా పనిచేసే చిట్టిలంక సుందర్(ఆనంద్ దేవరకొండ)  మీనాక్షి (గీత్ సైని) అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెడతాడు. కానీ పెళ్ళయిన కొన్ని రోజులకే భర్తను వదిలిపెట్టి మీనాక్షి వేరే వ్యక్తితో లేచిపోతుంది. దీంతో తన చుట్టూ ఉండే జనాలకు నిజం చెప్పలేక నానా ఇబ్బందులు పడుతూ తన భార్య ఇంట్లోనే ఉన్నట్టుగా మేనేజ్ చేస్తుంటాడు సుందర్.

తన స్కూల్ స్టాఫ్ కోసం తనకి ఏ మాత్రం పరిచయం లేని ఒకమ్మాయి(శాన్వి మేఘన) ని భార్యగా తీసుకొచ్చి వారికి పరిచయం చేసి డ్రామా ఆడతాడు.  భార్య లేచిపోయిన సంగతి ఎవరికీ చెప్పకుండా  ఆమె జాడ కోసం వెతుకుతూ ఉన్న సుందర్ కి మీనాక్షి చనిపోయిందని తెలుస్తుంది. మీనాక్షి మర్డర్ కాబడిందని తెలుసుకున్న ఎస్ ఐ(సునీల్) మీనాక్షి కేసులో భర్త సుందర్ ని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ మొదలు పెడతాడు. అసలు మీనాక్షి భర్తను వదిలి ఎక్కడికి వెళ్ళింది ? ఆమె కథ ఏమిటి ? ఇంతకీ ఆమెను మర్డర్ చేసిందెవరు ? అనేది మిగతా స్టోరీ.

నటీ నటుల పనితీరు : 

కెరీర్ ఆరంభంలోనే ఛాలెంజింగ్ పాత్రలు ఎంచుకుంటూ వెళ్తున్న ఆనంద్ దేవరకొండ మరోసారి అలాంటి పాత్రనే ఎంపిక చేసుకొని చిట్టి లంక సుందర్ గా మంచి నటన కనబరిచాడు. కొత్తగా పెళ్ళయిన స్కూల్ టీచర్ గా ఆకట్టుకున్నాడు. గీత్ సైనీ , శాన్వి మేఘన ఇద్దరూ తమ పాత్రలకు పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. శాన్వి మేఘనకి మంచి ఎనర్జిటిక్ రోల్ దక్కడంతో బెస్ట్ ఇచ్చింది. హౌజ్ వైఫ్ గా గీత్ సైని మీనాక్షి పాత్రలో పరవాలేదనిపించుకుంది. హర్ష వర్ధన్ , సునీల్ తమ ఎక్స్ పీరియన్స్ తో పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వర్ష బొల్లమ్మ ఎండింగ్ లో స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చి తలుక్కున మెరిసింది.

హెడ్ మాస్టర్ గా నరేష్ , టీచర్ గా గిరిధర్ , సుందర్ ఫ్రెండ్ గా కిరీటి కొన్ని సందర్భాల్లో నవ్వించారు. మీనా , శరణ్య ,షేకింగ్ శేషు, జోష్ రవి  మిగతా వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

సినిమాకు మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా పాటలు బాగున్నాయి. ముఖ్యంగా రామ్ మిర్యాల కంపోజ్ చేసిన “సిలకా”, “కళ్యాణం” సాంగ్స్ హైలైట్ గా నిలిచాయి. నేపథ్య సంగీతం పరవాలేదు. హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫీ బాగుంది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించాయి. అవి ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.

దామోదర కథ -కథనం రొటీన్ గానే ఉన్నాయి. కాకపోతే దర్శకుడిగా కొన్ని కామెడీ సన్నివేశాలను బాగా హ్యాండిల్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

– రజినీ కాంత్ ‘పెద్దన్న‘ రివ్యూ

pushpaka vimanam

జీ సినిమాలు సమీక్ష : 

కొన్ని కాన్సెప్ట్ లు స్క్రిప్టింగ్ లో  బాగుంటాయి. కానీ స్క్రీన్ పైకి వచ్చే సరికి తేడా కొడతాయి. ‘పుష్పక విమానం’ సరిగ్గా అలాంటి కథే అని చెప్పొచ్చు. పేపర్ మీద ఇది వర్కౌట్ అయ్యే కథే అనిపించొచ్చు. కానీ సినిమాగా వచ్చే సరికి రొటీన్  అనిపించింది. పెళ్లయిన కొత్తలో పెళ్ళాం లేచిపోతే భర్త పడే ఇబ్బందులతో ఫస్ట్ హాఫ్ ని కామెడీగా నడిపించిన దర్శకుడు మర్డర్ మిస్టరీతో సెకండాఫ్ ని ముందుకు నడిపించాడు. మొదటి భాగంలో కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. సెకండాఫ్ లో వచ్చే మర్డర్ మిస్టరీతో క్రైం డ్రామా మాత్రం ఆకట్టుకోలేదు. ముఖ్యంగా సునీల్ ఇంటరాగేషన్ సీన్లు తేలిపోయాయి. దాంతో ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత దర్శకుడు మర్డర్ మిస్టరీతో సినిమాను ఎంగేజింగ్ గా తెరకెక్కిస్తాడేమో అనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. సెకండాఫ్ లో నరేష్ ఇంట్లో వచ్చే కామెడీ సీన్ మాత్రం బాగా పేలింది. ఆ కామెడీ సీన్ థియేటర్స్ లో నవ్వు తెప్పించింది. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా పరవాలేదనిపిస్తుంది. అవి మినహా ఇస్తే సెకండాఫ్ లో చెప్పుకోదగిన సన్నివేశాలు కానీ ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే కానీ లేదు. అది సినిమాకు పెద్ద మైనస్.

ఫస్ట్ హాఫ్ లో భార్య  స్థానంలో మరో అమ్మాయిని డబ్బులిచ్చి తీసుకురావడం, మేనేజ్ చేయడం లాంటివి గతంలో వచ్చిన కొన్ని సినిమాలు అందులో సన్నివేశాలను గుర్తుచేస్తాయి. ముఖ్యంగా ‘పెళ్ళాం ఊరెళితే’ లో వేణు ట్రాక్ గుర్తొచ్చింది. కథలో ఫ్రెష్ నెస్ లేకపోవడం, స్క్రీన్ ప్లే కూడా రొటీన్ అనిపించడం, కొన్ని సందర్భాల్లో డ్రాగ్ అనిపించే సన్నివేశాలు, స్లో నరేషన్ సినిమాకు మైనస్ కాగా కామెడీ సన్నివేశాలు , మ్యూజిక్ , క్యారెక్టర్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్.

ఫస్ట్ హాఫ్  కామెడీ గా,  సెకండాఫ్  మర్డర్ మిస్టరీతో థ్రిల్లింగ్ గా తెరకెక్కించడానికి దర్శకుడు కష్టపడ్డాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా సెకండాఫ్ ని కాస్త ఎంగేజింగ్ గా థ్రిల్ కలిగించేలా గ్రిప్పింగ్ గా తెరకెక్కించి ఉంటే బెటర్ గా ఉండేది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ బాగానే ఉన్నప్పటికీ అది సినిమాకు పెద్దగా ప్లస్ అవ్వలేదు. ఫైనల్ గా ఫ్యామిలీ , క్రైం డ్రామాగా తెరకెక్కిన  ‘పుష్పక విమానం’  పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. కేవలం కామెడీ కోసం సినిమాకు వెళ్తే మాత్రం పరవాలేదనిపిస్తుంది.

రేటింగ్ : 2.5/5

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics