రివ్యూ - 'ప్రేమ విమానం'

Thursday,October 12,2023 - 06:59 by Z_CLU

నటీనటులు : సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్,  గోపరాజు రమణ,  అభయ్ బేతిగంటి తదితరులు

సంగీత దర్శకుడు : అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రాఫర్ : జగదీష్‌ చీకటి

ఎడిటర్ : అమర్ రెడ్డి

ఆర్ట్ డైరెక్టర్ : గంధి నడికుడికర్

సమర్పణ : దేవాన్ష్  నామా

నిర్మాణం : అభిషేక్ పిక్చర్స్

నిర్మాత : అభిషేక్ నామా

దర్శకత్వం : సంతోష్ కటా

విడుదల తేది : 13 అక్టోబర్ 2023

ప్లాట్ ఫామ్ : ZEE 5

మంచి కాస్టింగ్ తో ప్రముఖ నిర్మాత అభిషేక్ నామ తొలిసారి ఓటీటీ ప్రేక్షకుల కోసం నిర్మించిన ‘ప్రేమ విమానం’ జీ 5 ద్వారా  స్ట్రీమింగ్ కి వచ్చింది. మారి సంగీత్ శోభన్ , అనసూయ దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా తదితరులు నటించిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ : 

తన ఊరి సర్పంచ్ కూతురు అభిత ( శాన్వీ మేఘన) తో కిరాణా కొట్టు మణి(సంగీత్ శోభన్) ప్రేమలో పడతాడు. అభిత కూడా మణిని ప్రేమిస్తుంది.  ఇద్దరు చాటు మాటుగా కలుసుకుంటుంటారు. ఒక సందర్భంలో త‌మ ప్రేమ‌ను బ‌తికించుకోవ‌టానికి ఇద్దరూ దుబాయి పారిపోవాలని ప్లాన్ చేసుకుంటారు. అప్పుడు వారేం చేశార‌నే క‌థ ఓ వైపు .. మరో వైపు ఇద్ద‌రు చిన్న పిల్ల‌లు రాము(దేవాన్ష్ నామా), లచ్చి(అనిరుధ్ నామ) లకు విమానం ఎక్కాల‌నే కోరిక పుడుతుంది. వారిదేమో పేద రైతు కుటుంబం, పైగా  ప‌ల్లెటూరు దాంతో ఎలాగైనా ప‌ట్నం వెళ్లి విమానం ఎక్కాల‌నుకుంటారు. త‌మ ఊరి నుంచి పారిపోయి ప‌ట్నం వ‌చ్చేస్తారు.

ఓ వైపు పిల్లలు, మ‌రో వైపు ప్రేమ జంట ..పల్లెటూరి నుండి సిటీకి వ‌చ్చిన త‌ర్వాత వారి జీవితాళ్లో ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ఆ స‌మ‌స్య‌ల‌ను వారు  అధిగ‌మించారా ? వారి క‌ల‌ల‌ను నేర‌వేర్చుకున్నారా? అనే విష‌యం తెలియాలంటే ‘ప్రేమ విమానం’ సినిమా చూడాల‌ని చూడాల్సిందే.

నటీ నటుల పనితీరు :

దర్శకుడు రాసుకున్న పాత్రలకు నటీ నటులంతా పూర్తి న్యాయం చేశారు. దీంతో ప్రతీ పాత్ర గుర్తుండి పోయేలా ఉంది. మణి పాత్రలో సంగీత్ శోభన్, అభిత పాత్రలో శాన్వీ మేఘన ఆకట్టుకున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. దీంతో వీరిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ అలరించాయి.

మొదటి సినిమా అయినప్పటికీ రాము , లచ్చి పాత్రల్లో దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా ఒదిగిపోయారు. ఒక పేద రైతు కుటుంబంలో పిల్లల్లానే కనిపించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా అనిరుధ్ నామా కి మంచి ఫ్యూచర్ ఉంది. ఈ సినిమా తర్వాత తనకి మరిన్ని మంచి పాత్రలు వస్తాయనడంలో సందేహం లేదు.

రైతు పాత్రలో రవి వర్మ ఆమె భార్య పాత్రలో అనసూయ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అనసూయ మంచి మార్కులు స్కోర్ చేసింది. తనకి ఎలాంటి పాత్ర ఇచ్చిన అందులో ఇమిడిపోగలనని మరో సారి నిరూపించుకుంది. వెన్నెల కిషోర్,  గోపరాజు రమణ,  అభయ్ బేతిగంటి తమ పాత్రలకి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

 

 

సాంకేతిక వర్గం పనితీరు :

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్. పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. జగదీష్‌ చీకటి కెమెరా వర్క్ బాగుంది. కొన్ని ఫ్రేమ్స్ అతని వర్క్ తెలియజేసేలా ఉన్నాయి. అమర్ రెడ్డి ఎడిటింగ్ పరవాలేదు. గంధి నడికుడికర్ ఆర్ట్ వర్క్ , పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా క్రియేట్ చేసింది.

సంతోష్ కటా స్టోరీ , స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నాయి. తను చెప్పాలనుకున్న కథను నిజాయితీగా ఎలాంటి డైవర్షన్ లేకుండా కమర్షియల్ వైపు వెళ్ళకుండా రియలిస్టిక్ గా  స్క్రీన్ మీదకి తీసుకొచ్చాడు. అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ వేల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష : 

కొన్ని కథలు వినడానికి బాగుంటాయి. కానీ వాటిని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పల్లెటూరి కథ అంటే టీం అందరూ మంచి ఎఫర్ట్ పెట్టాలి. దర్శకుడు తన రైటింగ్ తో , ఆకట్టుకునే పాత్రలతో మేజిక్ చేయాల్సి ఉంటుంది. ‘ప్రేమ విమానం’కి ఇవన్నీ చక్కగా కుదిరాయి. సంతోష్ కటా తన రాసుకున్న రెండు కథలను ఒక చోట చేర్చి చివర్లో ఇచ్చిన ఊహించని ట్విస్ట్ బాగుంది. పల్లెటూరిలో ఒక ప్రేమ కథ , మరో ఎమోషనల్ కథ ఇలా రెండూ తీసుకొని ఆకట్టుకునేలా ఓ చోట కూర్చాడు.

దర్శకుడు తను రాసుకున్న పాత్రలకు  అనుభవం ఉన్న పర్ఫెక్ట్ అనిపించే నటీ నటులను తీసుకోవడంతో ఆ పాత్రలు బాగా పండాయి. ముఖ్యంగా ఎమోషనల్ కథలో రెండు కీలక పాత్రలకు నిర్మాత పిల్లలను తీసుకొని వారి చేత మంచి నటన రాబట్టాడు సంతోష్. అలాగే అనసూయ , రవి వర్మ వంటి అనుభవం ఉన్న యాక్టర్స్ ను తీసుకోవడంతో ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కవుట్ అయ్యాయి.

ఎమోషనల్ స్టోరీతో పోలిస్తే లవ్ స్టోరీ కొద్దిగా తగ్గిందనిపిస్తుంది. లవ్ సీన్స్ ఇంకా బాగా రాసుకుంటే బెటర్ గా ఉండేది. కానీ దర్శకుడు నేచురాలిటీ కి దగ్గర గా ఉండే సన్నివేశాలు రాసుకున్నాడు. దాంతో రెగ్యులర్ సినిమాలో చూసే డ్రామా ఇందులో కాస్త మిస్సయింది. రియలిస్టిక్ కథలను ఆ తరహా సన్నివేశాలను ఇష్టపడే వారికి ఇందులో లవ్ స్టోరీ నచ్చుతుంది. అలాగే లవ్ స్టోరీలో కావలసినంత ఎంటర్టైన్ మెంట్ కూడా క్రియేట చేశాడు. చిన్నప్పటి నుండి అన్న అని పిలిచే మనిషిని మామ అని పిలవాల్సి వచ్చిన సీన్స్ బాగా పండాయి.

భావోద్వేగాలు మనిషిని ముందుకు నడిపిస్తాయి. ఒక్కొక్క‌రి జీవితంలో ఒక్కో ఎమోష‌న్ ఉంటుంది. అనుకున్నది సాధిస్తే చాలు అనుకుంటారు వాళ్లు. బ‌య‌ట నుంచి చూసే వారికి ఇదేంటనిపించినా.. వారికి మాత్రం అదే ముఖ్య‌మ‌నిపిస్తుంది. అలాంటి ఎమోష‌న్స్ ఉన్న కొంద‌రి మ‌నుషుల క‌థతో రూపొందుతోన్న ప్రేమ విమానం ఆకట్టుకుంది. ముఖ్యంగా చివర్లో వచ్చే ట్విస్ట్ తో సినిమా మెప్పిస్తుంది. ఈ సినిమాతో మనం బలంగా కోరుకుంటే ఏదైనా మన చెంతకి వస్తుందని డానికి ప్రకృతి కూడా సహకరిస్తుందని గొప్పగా చెప్పాడు దర్శకుడు. అక్కడక్కడా కాస్త బోర్ కొట్టించే సీన్స్ పక్కన పెడితే , ఓవరాల్ గా ‘ప్రేమ విమానం’ ఓటీటీ ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగిస్తుంది.

రేటింగ్ : 3 /5