'ప్రేమ కథా చిత్రమ్ 2' మూవీ రివ్యూ

Saturday,April 06,2019 - 01:40 by Z_CLU

న‌టీన‌టులు : సుమంత్ అశ్విన్‌, నందితా శ్వేత‌, సిధ్ధి ఇద్నాని, కృష్ణ తేజ‌, విధ్యులేఖ‌, ప్ర‌భాస్ శ్రీను, ఎన్‌.టి.వి.సాయి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

ఛాయాగ్రహణం : సి. రాం ప్రసాద్

సంగీతం : జె.బి

మాటలు : గ‌ణేష్‌

కో ప్రొడ్యూసర్స్ : ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి

నిర్మాత : ఆర్. సుదర్శన్ రెడ్డి

రచన – దర్శకత్వం  : హరి కిషన్

విడుదల తేది : 6 ఏప్రిల్ 2019

2013 లో చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం అందుకున్న ‘ప్రేమ కథా చిత్రమ్’ సినిమాకు సీక్వెల్ గా ‘ప్రేమ కథా చిత్రమ్ 2’ సినిమాను తెరకెక్కించారు. సుమంత్ అశ్విన్, నందితా శ్వేత, సిద్ది ఇద్నాని నటించిన ఈ సినిమా ఉగాది స్పెషల్ గా విడుదలైంది. మరి హార్రర్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా..? ‘ప్రేమ కథా చిత్రం’లాగే హిట్ సాదిస్తుందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ

కథ :

కాలేజీలో చదువుకుంటూ డాన్స్ స్టూడియో నడిపే సుధీర్ (సుమంత్ అశ్విన్) మంచితనం చూసి ప్రేమలో పడుతుంది బిందు(సిద్ది ఇద్నాని). ఓ వేడుకలో సుదీర్ కి తన ప్రేమ విషయాన్ని తెలియజేస్తుంది. కానీ అప్పటికే నందు అనే అమ్మాయితో ప్రేమలో ఉండటం వల్ల బిందు ప్రేమను నిరాకరిస్తాడు సుధీర్. ఆ భాధతో అదే వేడుకలో సూసైడ్ చేసుకుంటుంది బిందు.

కొన్ని నెలల తర్వాత ఏకాంతంగా గడపడానికి తను ప్రేమించిన నందు (నందితా శ్వేత) తో కలిసి ఊరి చివర ఉండే ఫామౌజ్ కి వెళ్తాడు సుధీర్. అనుకోకుండా నందు శరీరంలోకి ఓ ఆత్మ ప్రవేశిస్తుంది. అప్పటి నుండి సుధీర్ కి ప్రశాంతత దూరమవుతోంది. నందు శరీరంలో ఉన్న ఆత్మ ఎవరిదని తెలుసుకొనే క్రమంలో ఆ ఆత్మ చిత్ర అనే అమ్మాయిదని తెలుసుకుంటాడు సుధీర్. ఇంతకీ చిత్ర ఎవరు ? ఆమె ఆత్మ నందు శరీరంలోకి ఎందుకు ప్రవేశించింది.. చివరికి సుధీర్-నందు ఎలా ఒక్కటయ్యారు అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

సుమంత్ నటన పరవాలేదు. నటుడిగా ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. నందితా శ్వేత నటన ఆకట్టుకోలేదు. బహుశా గతంలో చూసేసిన దెయ్యం క్యారెక్టరే కావడం వల్ల ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. సిద్ది ఇద్నాని తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కృష్ణ తేజ కామెడీతో పాటు ప్రభాస్ శ్రీను కామెడీ కూడా పండలేదు. మిగతా నటీనటులు పరవాలేదు అనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

జే.బి అందించిన పాటలు అలరించలేకపోయాయి. ట్యూన్స్ కూడా గతంలో విన్నట్టుగానే అనిపించాయి. సన్నివేశాల్లో బలం లేకపోవడంతో నేపథ్య సంగీతం కూడా తేలిపోయింది. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. హరికిషన్ కథ-కథనం ఆకట్టుకోకపోగా డైరెక్షన్ కూడా వీక్ అనిపించింది. ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నంతలో పరవాలేదు.


జీ సినిమాలు సమీక్ష :

ఊరి చివర ఓ ఫాంమౌజ్ , అందులో పగతో రగిలిపోయే ఆత్మ , ఆ ఇంట్లో అడుగుపెట్టిన వారి శరీరంలోకి ప్రవేశించి భయపట్టే సన్నివేశాలు, తర్వాత హీరో ఆ ఆత్మ ఎవరిదో తెలుసుకోవడం.. చివరికి ఒకరి శరీరంలో ఉన్న ఆ ఆత్మ ను పంపించేందుకు ప్రయత్నాలు… ఇప్పటికే ఎన్నో హారర్ సినిమాల్లో చూసేసిన ఈ కథతోనే ‘ప్రేమ కథా చిత్రమ్ 2’ ను తెరకెక్కించాడు దర్శకుడు.

నిజానికి హార్రర్ కామెడీ సినిమాల ట్రెండ్ పోయింది. అప్పట్లో సక్సెస్ ఫార్ములా అనిపించుకున్న ఈ కాన్సెప్ట్ ను అదే ఫార్మేట్ లో తీస్తే ప్రేక్షకులకు ఎక్కట్లేదు. ఇటివలే వచ్చి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డ హారర్ కామెడీ సినిమాలే ఇందుకు ఉదాహరణ. ఇలాంటి సమయంలో మేకర్స్ చేసిన ఈ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. బహుషా ‘ప్రేమ కథా చిత్రమ్ 2’ అనే టైటిల్ ప్రేక్షకులను థియేటర్స్ కి తీసుకొస్తుందనుకున్నారేమో. నిజానికి  హారర్ కామెడీ సినిమాల్లో ‘ప్రేమ కథా చిత్రం’ ఓ ట్రెండ్ సెట్టర్. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో వరుసగా అదే ఫార్మేట్ లో సినిమాలు తీసి హిట్లు అందుకున్నారు కొందరు ఫిలిం మేకర్స్.

‘ప్రేమకథా చిత్రమ్ 2’ అనే టైటిల్ పెట్టారు కాబట్టి ప్రేమకథా చిత్రమ్ కి సీక్వెల్ అని తెలియజేసేలా  సినిమా స్టార్టింగ్ లో రావు రమేష్ వాయిస్ ఓవర్ తో పాటు సుధీర్ బాబు నటించిన కొన్ని షాట్స్ ఏవో వేసారు. అయినా ప్రేమకథా చిత్రమ్ కి ఇది  సీక్వెల్ కాదనే సంగతి థియేటర్ లో అడుగుపెట్టిన కాసేపటికే ప్రేక్షకుడు పసిగడతాడు.

బోరింగ్ లవ్ ట్రాక్ తో విసిగించే కామెడీ సన్నివేశాలతో మొదటి భాగాన్ని నెట్టేసిన దర్శకుడు రెండో భాగంలో కూడా అదే రీతిలో హార్రర్ కామెడీ సన్నివేశాలతో  విసిగించాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడికి చిరాకు తెప్పించేలా ఉన్నాయి. సినిమాలో ఓ సందర్భంలో ‘ఏం జరుగుతుంది’ అంటూ సుమంత్ అశ్విన్ చెప్పే డైలాగే ప్రేక్షకుడి మైండ్ లో కూడా తిరుగుతుంది. హారర్-కామెడీ సన్నివేశాలు భయపెడుతూ నవ్వించకపోగా ప్రేక్షకుడిని ఇబ్బంది పెడుతూ వారి సహనాన్ని పరీక్షించేలా ఉన్నాయి. కథకి బలం చేకూర్చే  ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో పాటు క్లైమాక్స్ కూడా తేలిపోయింది.

బాటమ్ లైన్ : రొటీన్ హార్రర్ చిత్రమ్

రేటింగ్ : 1.5  /5