పహిల్వాన్ మూవీ రివ్యూ

Thursday,September 12,2019 - 01:34 by Z_CLU

న‌టీన‌టులు: సుదీప్, సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్, కబీర్ దుల్హన్ సింగ్, సుశాంత్ సింగ్
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.కృష్ణ‌
బ్యాన‌ర్‌: వారాహి చ‌ల‌న చిత్రం
కెమెరా: క‌రుణాక‌ర్‌.ఎ
ఎడిట‌ర్‌: రూబెన్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: శివ‌కుమార్‌
కుస్తీ: ఎ.విజ‌య్‌
బాక్సింగ్‌: లార్లెల్ స్టోవాల్‌
స్టంట్స్‌: రామ్ లక్ష్మ‌ణ్, కె.ర‌వివ‌ర్మ‌
కొరియోగ్ర‌ఫీ: గ‌ణేశ్ ఆచార్య‌, రాజు సుంద‌రం
స్క్రీన్‌ప్లే: కృష్ణ‌, మ‌ధు, క‌న్న‌న్‌
డైలాగ్స్‌: హ‌నుమాన్ చౌద‌రి
రన్ టైమ్: 156
సెన్సార్ : U/A
రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 12, 2019

బాహుబలి, కేజీఎఫ్, సాహో సినిమాలు ఇచ్చిన స్ఫూర్తితో పహిల్వాన్ కూడా పాన్-ఇండియా లెవెల్లో రిలీజైంది. మరి సుదీప్ నటించిన ఈ సినిమా రిజల్ట్ ఏంటి? అన్ని భాషల్లో ఆడియన్స్ ను ఇది ఎట్రాక్ట్ చేస్తుందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ

గజపతినగరంలో ఉండే కృష్ణ (సుదీప్) ఓ అనాథ. ఎవరికి పుట్టాడో, ఎక్కడ పుట్టాడో కూడా తెలీదు. అలాంటి కృష్ణ ఓ రోజు వీధిలో ఫైట్ చేయడం చూస్తాడు సర్కార్ (సునీల్ షెట్టి). అతడ్ని ఇంటికి తీసుకొచ్చి పెంచి పెద్ద చేస్తాడు. కుస్తీ వీరుడిగా తయారుచేస్తాడు. నేషనల్ గేమ్స్ లో కృష్ణ మెడల్ సాధిస్తే చూడాలనేది సర్కార్ ఆశ. అందుకే ప్రేమ-పెళ్లి
లాంటి వ్యవహారాలకు అతడ్ని దూరంగా పెంచుతాడు. కానీ కృష్ణ మాత్రం రుక్మిణి (ఆకాంక్ష సింగ్)తో ప్రేమలో పడతాడు. సర్కార్ మాటను కాదని పెళ్లి చేసుకుంటాడు.

దీంతో సర్కార్-కృష్ణ మధ్య గ్యాప్ వస్తుంది. ఒక దశలో కుస్తీ పోటీల్ని కూడా వదిలేసి పూర్తిగా కుటుంబానికే పరిమితమైపోతాడు కృష్ణ. మరోవైపు బాక్సింగ్ పోటీల్లో అక్రమంగా ఎదుగుతున్న టోనీ (కబీర్ దుల్హన్ సింగ్)కి అడ్డుకట్ట వేయాలనుకుంటాడు కోచ్. కృష్ణను టోనీపై పోటీకి దించాలనుకుంటాడు. ఆల్రెడీ కుస్తీ మానేసిన కృష్ణ, బాక్సింగ్ వైపు ఎలా వచ్చాడు? తనను పెంచిన సర్కార్ కు ఎలా దగ్గరయ్యాడు అనేది బ్యాలెన్స్ కథ.

 

నటీనటుల పనితీరు

సుదీప్ ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్. 46 ఏళ్ల వయసులో కూడా బాడీ బిల్డింగ్ చేసి కృష్ణ పాత్ర కోసం చాలా డెడికేషన్ తో వర్క్ చేశాడు. సుదీప్ యాక్టింగ్, అతడు చేసిన ఫైట్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. సెకెండాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాల్లో సుదీప్ యాక్టింగ్ ఎక్స్ పీరియన్స్ మొత్తం కనిపిస్తుంది. కానీ డబ్బింగ్ మాత్రం దారుణంగా ఉంది. చాలా చోట్ల కన్నడంలో మాట్లాడుతున్నాడా, తెలుగులో మాట్లాడుతున్నాడో కూడా అర్థంకాలేదు. వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించి ఉంటే బాగుండేది.

సుదీప్ గురువుగా, పెంచిన తండ్రిగా సునీల్ షెట్టి నటన ఫర్వాలేదు. అతడి యాక్టింగ్ నార్త్ లో ఓకే కానీ, సౌత్ జనాలకు పెద్దగా నచ్చదు. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ ఉన్నంతలో బాగా చేసింది. కొన్ని చోట్ల గ్లామరస్ గా కూడా కనిపించింది. కానీ ఆమె పాత్రను మలిచిన విధానం బాగాలేదు. ఇక అప్పన్న కామెడీ తేలిపోయింది. సుశాంత్ సింగ్ కు ఇచ్చిన పాత్ర అస్సలు సూట్ కాలేదు.

 

టెక్నీషియన్స్ పనితీరు

టెక్నికల్ గా పహిల్వాన్ సినిమా బాగుంది. ఆర్ట్ వర్క్, లైటింగ్, కెమెరా, ఎడిటింగ్ అన్నీ బాగా సింక్ అయ్యాయి. కరుణాకర్ కెమెరా వర్క్ బాగుంది. యాక్షన్ సీన్స్ ను అతడు చాలా బాగా తీశాడు. విజయ్ కంపోజ్ చేసిన కుస్తీ ఫైట్స్, లారెల్ కంపోజ్ చేసిన బాక్సింగ్ ఎపిసోడ్స్ బాగున్నాయి. అర్జున్ జన్యా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాటలు
బాగాలేవు.

ఇక దర్శకుడి విషయానికొస్తే కృష్ణ రాసుకున్న కథ బాగుంది, డైరక్షన్ కూడా ఓకే. కానీ స్క్రీన్ ప్లే మాత్రం బాగాలేదు. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ లో అనవసర సన్నివేశాలు చాలా పెట్టేశారు. అవన్నీ కలిపి సినిమాను అతుకుల బొంతలా మార్చేశాయి. మరో ఇద్దరితో కలిసి కృష్ణ రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా చప్పగా ఉంది.

జీ సినిమాలు రివ్యూ

పహిల్వాన్ ట్రయిలర్ చూసిన జనాలు మరో రోమాంచిక స్పోర్ట్స్ డ్రామా వస్తుందని సంబర పడ్డారు. మరీ ముఖ్యంగా కుస్తీ నేపథ్యంలో ఇప్పటికే దంగల్ రావడంతో.. పహిల్వాన్ పై అంచనాలు ఆటోమేటిగ్గా పెరిగాయి. కానీ ట్రయిలర్ లో చూసినట్టు సినిమాలో ఉండదు. ఇది పూర్తిగా ఓ పహిల్వాన్ జీవితం కాదు. ఓ ప్రేమకథ లో రెజ్లర్ నటిస్తే ఎలా ఉంటుందో పహిల్వాన్ సినిమా అలా ఉంటుంది. సీరియస్ గా చేసే ఎక్సర్ సైజులు, ఉత్కంఠ కలిగించే పోటీలు, ఇంటర్నేషనల్ బౌట్స్, దేశభక్తి, క్రీడల్లో రాజకీయాలు లాంటి ఎలిమెంట్స్ ఊహించుకొని థియేటర్లకు వెళ్తే పహిల్వాన్ నిరాశపరుస్తాడు. ఇది పూర్తి స్థాయి స్పోర్ట్స్ డ్రామా కాదు.. ఓ క్రీడాకారుడి చుట్టూ అల్లిన ప్రేమకథాచిత్రం అని చెప్పాలి.

కుస్తీ పోటీల కోసమే హీరో పుట్టాడనే విధంగా చూపిస్తారు. ఇక సినిమా ఆ లైన్ లో వెళ్తుందనుకుంటే లవ్ ట్రాక్ పెట్టారు. ఎంతలా అంటే ఏకంగా కుస్తీనే మరిచిపోయేంతలా ఆ ఎపిసోడ్స్ తీశారు. పోనీ ఆ లవ్ ట్రాక్ అయినా పండిందా అంటే అదీ లేదు. హీరోయిన్ ఇంట్రడక్షన్ నుంచి, హీరోతో ఆమె ప్రేమలో పడడం, పెళ్లి వరకు అంతా ఎలాంటి ఫీల్ లేకుండా జరిగిపోతుంది. మరీ ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను పుట్టించడం కోసం రాసుకున్న సన్నివేశాలు దారుణం. తండ్రి చెప్పాడని ఆనందంగా నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్, తర్వాత హీరో ఎదురుపడేసరికి తండ్రిని గాలికి వదిలేసి హీరోని పెళ్లి చేసుకోవడం అస్సలు కన్విన్సింగ్ గా అనిపించదు. ఈ మాత్రం దానికి రాముడు-కృష్ణుడు-హనుమంతుడు అంటూ మైథలాజికల్ టచ్ ఇవ్వడం మరీ దారుణం.

ప్రేమ, పెళ్లి వ్యవహారాల్ని పక్కనపెట్టి చూస్తే పహిల్వాన్ అందరికీ నచ్చుతాడు. ఓ మల్లయోధుడిగా సుదీప్ పూర్తిస్థాయిలో సినిమాకు న్యాయం చేస్తాడు. అయితే ఇక్కడ కూడా దర్శకుడు కొన్ని పొరపాట్లు చేశాడు. సుదీప్ తో పోటీకి దించే మల్లయోధుల ఎంపికలో దర్శకుడు తడబడ్డాడు. మరీ ముఖ్యంగా రణస్థలిపురం రాజుగా సుశాంత్ సింగ్ ను పరిచయం చేసి, అతడితో సుదీప్ కు మల్లయుద్ధం పెట్టడం అస్సలు బాగాలేదు. బరిలో వీళ్లిద్దర్ని చూసిన ప్రేక్షకులకు కాస్త నవ్వొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఫస్టాఫ్ ను సాగదీసిన దర్శకుడు, సెకెండాఫ్ నుంచి గాడిలో పడే ప్రయత్నం చేశాడు. ప్రీ-క్లైమాక్స్ కు వచ్చేసరికి కుదురుకుంటాడు. ఆ సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ సినిమాను నిలబెడుతుంది. అయితే ఫస్టాఫ్ లో చేసిన గాయాలు, రెండో సగంలో కూడా ప్రేక్షకుల మనసుల్లో అలానే మెదులుతుంటాయి. పహిల్వాన్ కు ఇది పెద్ద మైనస్.

ప్లస్ పాయింట్స్
– సుదీప్ యాక్టింగ్
– కుస్తీ పోటీ సన్నివేశాలు
– ప్రీ-క్లైమాక్స్
– క్లయిమాక్స్

మైనస్ పాయింట్స్
– లవ్ ఎపిసోడ్స్
– సాంగ్స్
– స్క్రీన్ ప్లే
– ఫస్టాఫ్

ఓవరాల్ గా పహిల్వాన్ సినిమాను సుదీప్ కోసం మాత్రమే చూడొచ్చు. అంతకుమించి దీన్నొక పుల్ లెంగ్త్ స్పోర్ట్స్ డ్రామాగా భావించి మాత్రం థియేటర్లకు వెళ్లకూడదు.

రేటింగ్2.5/5