Movie Review - 'వకీల్ సాబ్'

Friday,April 09,2021 - 09:39 by Z_CLU

నటీ నటులు : పవన్ కళ్యాణ్, శృతిహాసన్, నివేత థామస్, అంజలి,అనన్య, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు తదితరులు

కెమెరామెన్ : పి.ఎస్.వినోద్

సంగీతం : థమన్

సమర్పణ : బోణీ కపూర్

నిర్మాతలు : రాజు , శిరీష్

రచన- దర్శకత్వం : శ్రీరామ్ వేణు

నిడివి : 155 నిమిషాలు

సెన్సార్ : U/A

విడుదల తేది : 9 ఏప్రిల్ 2021

పవర్ స్టార్ నుండి సినిమా వచ్చి మూడున్నరేళ్ళవుతోంది. పాలిటిక్స్ లోకి వెళ్ళాక సినిమాలకు దూరంగా ఉన్న పవన్ ఎట్టకేలకు అభిమానుల కోసం మళ్ళీ సినిమాలు చేస్తున్నాడు. చిన్న గ్యాప్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్న పవన్ ముందుగా ‘వకీల్ సాబ్’ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే థియేటర్స్ లో అడుగుపెట్టింది. మరి ఈ కమ్ బ్యాక్ ఫిలింతో పవన్ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నాడా ?  సినిమా ఒరిజినల్ సినిమాను మించి మెస్మరైజ్ చేసిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

vakeelsaab-still-zeecinemalu

కథ :

హైదరాబాద్ లో ఓ కాలనీలో ఉంటూ వర్క్ చేసుకునే పల్లవి(నివేత థామస్) , జరీనా(అంజలి), దివ్య (అనన్య) అనుకోకుండా  ఓ రాత్రి  ముగ్గురు అబ్బాయిలతో రిసార్ట్స్ లో స్టే చేయాల్సి వస్తుంది. తప్పని పరిస్థితుల్లో స్నేహితుడి వల్ల రిసార్ట్ కి చేరుకున్న పల్లవిని ఇబ్బంది పెడుతూ హత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తాడు మంత్రి కొడుకు వంశీ (వంశీ కృష్ణ). దాంతో అతని నుండి తప్పించుకునే క్రమంలో వంశీ ముఖంపై దాడి చేస్తుంది పల్లవి.

పల్లవి చేసిన దాడి వల్ల గాయపడ్డ వంశీ తండ్రి సపోర్ట్ తో స్నేహితులతో కలిసి పల్లవి మీద రివేంజ్ తీర్చికునేందుకు చూస్తుంటాడు. ఈ క్రమంలో పల్లవి తనను గాయపరిచినట్టుగా ఆమెపై కేసు పెట్టి జైలుకి పంపిస్తాడు. స్నేహితురాలు పల్లవిని జైలు నుండి బయటికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్న జరీనా , దివ్య లకు ఆ కాలనీలో ఉండే సస్పెండ్ లాయర్ గా ఉన్న సత్య దేవ్(పవన్ కళ్యాణ్) తమ సమస్యకి పరిష్కారం చూపే వ్యక్తిగా కనిపిస్తాడు. జనం కోసమే నల్ల కోర్టు ధరించి వకీల్ సాబ్ గా మరీన సత్యదేవ్ ఫైనల్ గా పల్లవి కేసు టేకప్ చేసి తన వాదనలతో చివరికి పల్లవి , జారీన , దివ్యలకు ఎలా న్యాయం చేసాడనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

మహిళలకు అండగా నిలిచి న్యాయం వైపు పోరాడే వకీల్ సాబ్ పాత్రలో పవన్ కళ్యాణ్ మెప్పించాడు. పవన్ కెరీర్ బెస్ట్ క్యారెక్టర్స్ లో ఇది కూడా చెప్పుకునేలా ఉంటుంది. ముఖ్యంగా కోర్టు రూమ్ సన్నివేశాల్లో పవన్ నటన అభిమానులతో పాటు అందరినీ అలరిస్తుంది. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ లో పవన్ పవర్ కనిపించింది. పవర్ ఫుల్ డైలాగ్స్ తో అభిమానులతో విజిల్స్ వేయించాడు. ఓవరాల్ గా పాత్రలో ఒదిగిపోయి క్యారెక్టర్ కి బెస్ట్ ఇచ్చాడు పవన్.  శృతి హాసన్ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ కే పరిమితమైనప్పటికీ ఉన్నంతలో తన రోల్ కి న్యాయం చేసింది.

కథలో కీలకమైన పాత్రలు దొరకడంతో నివేతా థామస్ , అంజలి , అనన్య తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కోర్ట్ సన్నివేశాల్లో నివేతా , అంజలి మంచి నటన కనబరిచి ఆ సన్నివేశాలకు బలం చేకూర్చారు. నందాజీ పాత్రకి ప్రకాష్ రాజ్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. నెగిటివ్  రోల్స్ తో ముఖేష్ ఋషి,  వంశీ కృష్ణ మెప్పించారు. శరత్ బాబు అతిథి పాత్రలో మెరిశాడు. జడ్జి పాత్రలో కనిపించిన నటుడు ఆ రోల్ కి సరిగ్గా కుదిరాడు. శుభలేఖ సుధాకర్ , సాయాజీ షిండే , నాగినీడు , నాగ మహేష్ , శ్రీకాంత్ అయ్యంగార్ ,అనిష్ కురువిల్లా , కేదార్ శంకర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

రిలీజ్ కి ముందే తన పాటలతో సినిమాకు హైప్ తీసుకొచ్చిన తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచాడు. తమన్ అందించిన నాలుగు పాటలు విజువల్ గా కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “మగువా మగువా” సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ‘కదులు కదులు’ , ‘సత్య మేవ జయతే’ పాటలు మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి.  పి.ఎస్.వినోద్ కెమెరా వర్క్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. విజువల్స్ బాగా ఎట్రాక్ట్ చేశాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. సినిమాను పర్ఫెక్ట్ మీటర్ లో కట్ చేశాడు.

రవివర్మ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను బాగా అలరించాయి. తిరు అందించిన కొన్ని డైలాగ్స్ సన్నివేశాలకు మరింత బలం చేకూర్చాయి. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాగుంది.శ్రీరామ్ వేణు దర్శకుడిగా ఈ రీమేక్ ని బాగా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా  తను చేసిన మార్పులు క్లిక్ అయ్యాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

కొన్ని కథలు ఎన్ని భాషలో తీసినా మళ్ళీ ప్రేక్షకులు చూసేలా ఉంటాయి. అలాంటి కథలతో ఎన్ని సినిమాలు వచ్చినా ఈజీగా పాస్ అవుతుంటాయి. అలాంటి బలమైన కథే ఇది. ముగ్గురు మహిళలకు అండగా నిలబడి వారికి న్యాయం జరిగేలా పనిచేసే లాయర్ కథతో హిందీలో ‘పింక్’ అని తీసినా తమిళ్ లో ‘నెర్కొండ పావై’ వచ్చినా సూపర్ హిట్స్ సాధించాయి. అందుకే ఈ కథను మన తెలుగు ప్రేక్షకులకు కూడా చూపించాలనుకున్నాడు నిర్మాత దిల్ రాజు. ఇలాంటి బలమైన కథను అంతే బలమైన హీరో చెప్తే రీచ్ ఎక్కవగా ఉంటుందని భావించి పవన్ కి వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. అక్కడే ఈ సినిమా సగం విజయం సాధించింది. నిజంగా ఈ కథకి పవన్ పూర్తి న్యాయం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది పవన్ కి మంచి కమ్ బ్యాక్ ఫిలిం అని చెప్పొచ్చు.

ఇక కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న శ్రీ రామ్ వేణు ఈ రీమేక్ సినిమాను బాగా డీల్ చేశాడు. హిందీ , తమిళ్ లో లేని కమర్షియల్ ఎలిమెంట్స్ చేర్చి సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. ముఖ్యంగా కథ ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా కొన్ని మార్పులతో తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. “మగువా మగువా” సాంగ్ తో లీడ్ తీసుకొని సినిమా స్టార్ట్ చేసిన దర్శకుడు శ్రీరామ్ వేణు పదిహేను నిమిషాల పాటు కథ కోసం టైం తీసుకున్నాడు. సినిమా మొదలైన పదిహేను నిమిషాల తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ సీన్ అభిమానులకి విపరీతంగా నచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు. ఇక మొదటి భాగంలో ఒక వైపు కథను చెప్తూనే మరోవైపు పవన్ కి సెపరేట్ ఫ్లాష్ బ్యాక్ క్రియేట్ చేసి రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమాను ముందుకు నడిపించాడు దర్శకుడు. అయితే శ్రీ రామ్ వేణు రాసుకున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కొన్ని సన్నివేశాలు అలరించగా మరికొన్ని ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో  హీరో -హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ అంతఎఫెక్టివ్ గా అనిపించలేదు. అది మినహాయిస్తే ఫస్ట్ హాఫ్ లో పెద్దగా మైనస్ లు అనిపించవు.  ఇంటర్వెల్ బ్యాంగ్ దానికి ముందు వచ్చే పార్క్ లో ఫైట్ ఫస్ట్ లో మేజర్ హైలైట్ గా నిలిచాయి. ఇక రెండో భాగంలో కోర్ట్ రూమ్ సన్నివేశాలతో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు శ్రీరామ్ వేణు. ముఖ్యంగా సెకండాఫ్ లో పవన్ -ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే కోర్టు వాదన సన్నివేశాలు , పవన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకుడు పెట్టిన టికెట్టుకి సంతృప్తి కలిగిస్తాయి. అలాగే పవన్ సినిమాకి వర్క్ చేయడం ఇదే మొదటి సారి కావడంతో మ్యూజిక్ పరంగా బెస్ట్ ఇచ్చాడు తమన్. కొన్ని సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కి కూడా  తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ముఖ్యంగా మెట్రో ట్రైన్ ఫైట్ తర్వాత పవన్ స్టేషన్ లో నడుస్తూ వచ్చే షాట్ కి తమన్ ఇచ్చిన స్కోర్ రోమాలు నిక్కపోడిచేలా చేస్తుంది.

రిలీజ్ కి ముందే మేకర్ చెప్పినట్టు కథలో పవన్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి ప్రతీ పదినిమిషాలకు ఓ హై ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా సినిమా మీటర్ పెంచేలా నాలుగు అదిరిపోయే ఫైట్స్ పెట్టి మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టారు. పార్క్ ఫైట్ , బాత్రూమ్ ఫైట్ తో పాటు మెట్రో ట్రైన్ లో వచ్చే ఫైట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాగే రెండో భాగంలో పవన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగులు సన్నివేశాలకు మరింత బలం చేకూర్చి ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టిస్తాయి. నిజానికి ఈ రీమేక్ సినిమాను డీల్ చేయడం కష్టం.. అందులోకి పవన్ లాంటి స్టార్ ని పెట్టి అతని ఇమేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేసి సినిమా తీయడం కత్తి మీద సాము లాంటి పని. దాన్ని పర్ఫెక్ట్ గా డీల్ చేసి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు శ్రీరామ్ వేణు. పవన్ అభిమానుల కోసం కథలో చేర్చిన కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా మూడేళ్ళ తర్వాత పవన్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అలాగే చూపించాడు. ఓవరాల్ పవన్ కం బ్యాక్ ఫిలిం నుండి ఆశించే కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ రీమేక్ ని తెరకెక్కించిన దర్శకుడు ఆడియన్స్ కి ఓ డీసెంట్ సినిమా అందించాడు. ఫైనల్ గా కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా  కచ్చితంగా ఆకట్టుకుంటుంది.

ప్లస్ పాయింట్స్

పవన్ కళ్యాణ్

తమన్ మ్యూజిక్

ఫైట్స్

డైలాగ్స్

కోర్ట్ రూమ్ సన్నివేశాలు

మైనస్ :

ఫ్లాష్ బ్యాక్

లవ్ ట్రాక్

రొటీన్ అనిపించే సన్నివేశాలు

 

బాటమ్ లైన్ – పైసా వసూల్ సాబ్

రేటింగ్ : 3.25/5

*Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics