'పలాస 1978' మూవీ రివ్యూ

Friday,March 06,2020 - 01:04 by Z_CLU

నటీ నటులు : రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ తదితరులు

సంగీతం : రఘు కుంచె

సమర్పణ : తమ్మారెడ్డి భరద్వాజ్

నిర్మాత : ధ్యాన్ అట్లూరి.

రచన- దర్శకత్వం : కరుణ కుమార్.

సెన్సార్ : A

విడుదల తేది : 6 మార్చ్ 2020

కొన్ని నెలలుగా అందరూ మాట్లాడుకుంటున్న ‘పలాస 1978’ సినిమా ఈ రోజే థియేటర్స్ లోకొచ్చింది. ఈ సినిమాతో కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మరి డెబ్యూ డైరెక్టర్ కంటెంట్ తో ఇంప్రెస్ చేశాడా…? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ

కథ :

పలాసలో ఓ వైపు జీడి బట్టీలో పనిచేస్తూ మరోవైపు కళాకారుడిగా తన అన్నయ్యతో కలిసి పాటల ప్రోగ్రామ్స్ చేస్తుంటాడు మోహన్ రావు(రక్షిత్). అయితే ఓ సందర్భంలో కులం పేరుతో తమను ద్వేషిస్తూ దూరం పెట్టే ఊరి పెద్ద షావుకారుకి ఎదురెళ్ళి నిలబడతారు అన్నదమ్ములు. దాంతో ఊరికి రౌడీగా ఉన్న భైరాగిను మోహన్ రావు , రంగారావు(తిరువీర్) లను చంపేందుకు పంపిస్తాడు పెద్ద షావుకారు. తమని చంపేందుకు ప్రయత్నించే భైరాగీతో పాటు పెద్ద షావుకారుని కూడా చంపేస్తారు మోహన్ రావు , రంగారావు. ఆ మర్డర్ కేసు నుండి వారిద్దరిని బయటికి తీసుకొచ్చి తన కింద పనిచేయమని, రాజకీయాల్లోకి వెళ్తున్న తనకు అండగా నిలబడమని కోరతాడు చిన్న షావుకారు(రఘు కుంచె).

తన తండ్రిని చంపి, తనను అవిటి వాడిని చేసిన మోహన్ రావు , రంగారావు లపై కక్ష కట్టి భైరాగీ కొడుకు వాసుతో కలిసి అన్నదమ్ములను చంపి తన పగ తీర్చుకునేందుకు చూస్తుంటారు తారకేసు. మరో వైపు పలాస కు కొత్తగా వచ్చిన ఎస్.ఐ సెబిస్టియన్(విజయ్) ఆ ఊళ్ళో ఎలాంటి గొడవలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నం చూస్తుంటాడు. ఈ క్రమంలో తన చిన్నాన్న అయిన చిన్న షావుకారుతో జత కట్టి అన్నదమ్ములను చంపడానికి వాసుతో కలిసి పన్నాగం పన్నుతాడు తారకేసి. శత్రువుల ఎటాక్ వల్ల తన అన్నయ్య రంగారావును , భార్య లచ్చిమి ను కోల్పోతాడు మోహన్ రావు. చివరికి తనకి కుటుంబం లేకుండా చేసిన చిన్న షావుకారు, వాసులపై మోహన్ రావు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు ..? తనలా
అనగదీయబడిన కులాల వారికి ఎలా అండగా నిలిచాడనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

రెండో సినిమాకే ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ రావడంతో మోహన్ రావు పాత్రకు రక్షిత్ పూర్తి న్యాయం చేయలేకపోయాడు. రక్షిత్ నటుడిగా ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రం పరవాలేదనిపించాడు. ముఖ్యంగా శ్రీకాకుళం యాసను బాగా పట్టుకున్నాడు. ఆ యాసతో రక్షిత్ డైలాగ్ డెలివరీ బాగుంది. నక్షత్ర తన పాత్రకు పర్ఫెక్ట్ అనిపించుకుంది. చిన్న షావుకారు పాత్రలో రఘు కుంచె మంచి మార్కులు అందుకున్నాడు. ఆ పాత్ర కోసం తనను తాను మలుచుకున్న విధానం ఆకట్టుకుంటుంది.

ఇప్పటికే మంచి నటుడిగా రుజువు చేసుకున్న తిరువీర్ మరోసారి రంగారావు పాత్రలో ఒదిగిపోయాడు. పోలీస్ క్యారెక్టర్ లో విజయ్ బాగా సూటయ్యాడు. తన నటనతో ఆ క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేసాడు. లక్ష్మణ్ తో పాటు మిగతా నటీ నటులు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి సినిమాకు బలం చేకూర్చారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు ప్రధాన బలం సినిమాటోగ్రఫీ. అరుల్ విన్సెంట్ కథకు తగిన విజువల్స్ అందించి తన వర్క్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా రాత్రివేళ వచ్చే సన్నివేశాలు అతని కెమెరా పనితనం తెలియజేసేలా ఉన్నాయి. ఇక రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు మ్యూజిక్ అందించడం కష్టం. పైగా పీరియాడిక్ అంటే ఛాలెంజే. ఈ సినిమాను ఓ ఛాలెంజ్ లా తీసుకొని కథకు తగిన సంగీతం అందించడంలో రఘు కుంచె సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ‘పలాస మా ఊరు’అనే పాటతో పాటు ‘నాదీ నకిలీసు గొలుసు’,’బావొచ్చాడోలప్ప’ పాటలు ఆకట్టుకున్నాయి. ఆ పాటలకు సాహిత్యంతో పాటు గానం కూడా చక్కగా కుదిరింది. కొన్ని సన్నివేశాలకు నేపథ్య సంగీతం బాగుంది. కోటగిరి వెంకటేశ్వర్రావు ఎడిటింగ్ బాగుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా పర్ఫెక్ట్ గా కట్ చేసారు.

కొన్ని సన్నివేశాల్లో అప్పటి వాతావరణం క్రియేట్ చేయడంలో ఆర్ట్ వర్క్ కీలక పాత్ర పోషించింది. యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను అలరిస్తాయి. కరుణ కుమార్ డైరెక్షన్ లో కొన్ని లోపాలున్నా రైటింగ్ అతని బలం అనిపించింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే , డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

ప్రస్తుతం తెలుగులో నేటివిటీ సినిమాలు వరుసగా వస్తున్నాయి. రూరల్ కథల్ని కొందరు కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కిస్తే మరికొందరు నేచురాలిటీకి దగ్గరగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తీస్తున్నారు. అయితే దర్శకుడు కరుణ కుమార్ రెండో విధానాన్ని ఎంచుకున్నాడు. కుల వివక్షపై కథ రాసుకొని దానికి పలాస నేపథ్యాన్ని జోడించి సినిమాను తీశాడు. సినిమా ఆరంభంలో వాసు అనే వ్యక్తి హత్య , ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ , మళ్ళీ ప్రస్తుత సన్నివేశాలతో సినిమాను రివేంజ్ ఫార్మేట్ లో చూపిస్తూ చివరికి తను చెప్పాలనుకున్న కథను సూటిగా సుత్తి లేకుండా క్లియర్ కట్ గా చెప్పాడు.

నిజానికి కుల వివక్ష కథతో సినిమా తీయడం అనేది కత్తి మీద సాము లాంటి వ్యవహారం. జరిగిన సంఘటనలు స్క్రీన్ పై నేచురల్ గా చూపిస్తూ తన స్క్రీన్ ప్లేతో కొంత వరకూ ఆకట్టుకోగలిగాడు దర్శకుడు. మనసులో ఫీలయింది పేపర్ పై పెట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువగా చేసాడనిపించింది. కాకపోతే మేకింగ్ కి వచ్చే సరికి దర్శకుడు కొన్ని సందర్భాల్లో తడబడ్డాడు. నేచురల్ గా తెరకెక్కించే క్రమంలో కరుణ కుమార్ దర్శకత్వంలో కొన్ని లోపాలు కనిపించాయి. లవ్ ట్రాక్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆ సన్నివేశాలు ఇంకా బాగా రాసుకుంటే బాగుండేది. ఇక సినిమాకు బలంగా నిలిచే సన్నివేశాలను మాత్రం బాగానే డీల్ చేశాడు. ఆ సందర్భంలో కాస్త అనుభవం ఉన్న దర్శకుడిలా కనిపిస్తాడు కరుణ కుమార్. ముఖ్యంగా కథలో కీలకమైన పాత్రలకు సరైన నటీ నటులను ఎంచుకొని వారి నుండి మంచి నటన రాబట్టగలిగాడు దర్శకుడు.

ఏ కథయినా ఎక్కువ భాగం హీరోపైనే ఆధారపడి ఉంటుంది. ఒకే ఒక్క సినిమా అనుభవంతో ఈ కుల వివక్ష కథను పూర్తిగా మోయలేకపోయాడు రక్షిత్. కథకు సరిపడే హీరోగా రక్షిత్ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. సినిమాకు అది కొంత వరకూ మైనస్. కాకపోతే శ్రీకాకుళం యాసతో పలాస కుర్రాడిగా మంచి మార్కులందుకున్నాడు. క్లైమాక్స్ వరకూ సినిమాను రివేంజ్ డ్రామాగా చూపిస్తూ క్లైమాక్స్ లో తను చెప్పాలనుకున్న పాయింట్ ను హైలైట్ చేస్తూ తన మనసులో ఉన్న భాదను బయటపెట్టాడు కరుణ కుమార్. ముఖ్యంగా బలమైన సన్నివేశాలకు అంతే బలం చేకూర్చే మాటలు రాసుకొని క్లాప్స్ కొట్టించాడు. కాకపోతే కథనం, కొన్ని సన్నివేశాలు గతంలో వచ్చిన సినిమాలను గుర్తు చేస్తాయి. స్లో నెరేషన్, కమర్షియల్ హంగుల లేకపోవడం సినిమాకు మైనస్. ఓవరాల్ గా ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ‘పలాస 1978’ మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు.

రేటింగ్ : 2.75/5