Movie Review - పాగల్

Saturday,August 14,2021 - 10:54 by Z_CLU

న‌టీన‌టులు:  విశ్వక్ సేన్‌, నివేదా పేతురాజ్‌, సిమ్రాన్ చౌద‌రి, మేఘ లేఖ‌, రాహుల్ రామ‌కృష్ణ, మురళీ శర్మ, మహేశ్ అచంట, ఇంద్రజ శంకర్ త‌దిత‌రులు.

సినిమాటోగ్రఫీ: మ‌ణికంద‌న్‌

మ్యూజిక్‌: ర‌ధ‌న్‌

ఎడిట‌ర్‌: గ్యారీ బి.హెచ్‌

నిర్మాణం :  శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా

స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు

నిర్మాత‌ : బెక్కెం వేణుగోపాల్‌

రచన – ద‌ర్శ‌క‌త్వం : న‌రేశ్ కుప్పిలి

విడుదల తేది : 14 ఆగస్ట్ 2021

సినిమా మాములుగా ఉండదు.  మూసుకున్న థియేటర్స్ కూడా ఓపెన్ చేయిస్తా అమ్మతోడు.  గుర్తుపెట్టుకోండి. తప్పయితే నా పేరు మార్చుకుంటా. ‘పాగల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ స్పీచ్ ఇది. మరి విశ్వక్ చెప్పినట్టే ‘పాగల్’ తో పూర్తి స్థాయిలో మెప్పించాడా ? కుర్ర హీరో కాన్ఫిడెన్స్ కి తగ్గట్టే సినిమా ఉందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

Nivetha Pethuraj As Theera In Vishwak Sen Paagal

కథ :

చిన్నతనం నుండి అల్లారు ముద్దుగా పెంచిన తన తల్లి(భూమిక) మరణించాక ఆమె ప్రేమను తన ప్రేయసి ప్రేమలో పొందాలని చూస్తుంటాడు ప్రేమ్ (విశ్వక్ సేన్).  పదహారు వేల మంది అమ్మాయిలకు ప్రపోజ్ చేసి తనకి అమ్మలా ప్రేమించే ప్రేయసి కోసం వెతుకుతుంటాడు.

ఈ క్రమంలో రాధా (మేఘ లేఖ) ని మ్యూజిక్ కాలేజ్ లో ఒక అమ్మాయిని(సిమ్రాన్)ని , అగ్లీ గా ఉండే మహాలక్ష్మి అనే అమ్మాయి ను ప్రేమిస్తాడు. వాళ్ళెవరు తనని ప్రేమించకపోవడంతో ఆత్మ హత్య చేసుకోవాలనుకుంటాడు. ఆ టైంలో తనకి  ఐ లవ్యూ చెప్పి  ప్రాణాలు కాపాడిన తీరా(నివేత పెతురాజ్) ని ప్రేమించడం మొదలు పెడతాడు. అసలు తీరా ఎవరు ? ప్రేమ్ ప్రాణాలు కాపాడటం కోసం లవ్ యూ చెప్పిన ఆ అమ్మయి నిజంగానే ప్రేమిస్తుందా ? ఫైనల్ గా తన తల్లి ప్రేమని తీరాలో చూసుకున్న ప్రేమ్ ఆమె ప్రేమను ఎలా పొందాడు? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

విశ్వక్ సేన్ ఇప్పటి వరకు కంప్లీట్ లవ్ స్టోరీ చేయలేదు. ఈ జోనర్ లో ఇదే అతనికి ఫస్ట్ సినిమా. ఇప్పటి వరకు ఇంటెన్స్ , యాంగ్రీ క్యారెక్టర్స్ చేసిన విశ్వక్ లవర్ బాయ్ గా ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో బాగా నటించాడు. ఓవరాల్ గా తన నటనతో సినిమాకు మెయిన్ హైలైట్ అయ్యాడు. ఎప్పటిలాగే నివేత పెతురాజ్ తన పెర్ఫార్మెన్స్ తో ఎట్రాక్ట్ చేసింది. ఈసారి చిన్మయి వాయిస్ కూడా ఆమెకి కలిసొచ్చింది. సిమ్రాన్ చౌదరి  , మేఘలేఖ చిన్న క్యారెక్టర్స్ లో కనిపించి జస్ట్ పరవాలేదనిపించుకున్నారు.

మురళి శర్మ తన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు. అలాగే మహాలక్ష్మి పాత్రలో నటించిన అమ్మాయి కూడా కాసేపు ప్రేక్షకులను నవ్వించింది. రాహుల్ రామకృష్ణ , మహేష్ ఆచంట డైలాగ్ కామెడీ తో నవ్వించారు. ముఖ్యంగా ప్రేమ్ మహాలక్ష్మి ని లవ్ చేసే సీన్స్ లో మహేష్ ఆచంట కామెడీ హైలైట్ గా నిలిచింది. రామ్ ప్రసాద్ తో పాటు  మిగతా ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్టులు పరవాలేదనిపించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు మ్యూజిక్ హైలైట్ అని చెప్పొచ్చు.  రధన్ సాంగ్స్ తో పాటు లియోన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ తో పాటు ఎమోషనల్ సాంగ్ , లవ్ సాంగ్ కూడా థియేటర్స్ లో ఎట్రాక్ చేశాయి. ఆ పాటలకు విజయ్ బిన్నీ కంపోజ్ చేసిన కోరియోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ కి కొరియోగ్రఫీ బాగా కుదిరింది. మ్యూజిక్ తర్వాత చెప్పుకోవాల్సింది విజువల్స్ గురించి. తన కెమెరా వర్క్ తో సినిమాకు టెక్నికల్ గా మరో ప్లస్ పాయింట్ అనిపించుకున్నాడు మణికందన్. ముఖ్యంగా కొన్ని సీన్స్ , సాంగ్స్ పిక్చరైజేషన్ లో అతని పనితనం కనిపించింది.

గ్యారీ ఎడిటింగ్ పరవాలేదు. దిలీప్ , సుబ్బరాయన్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ మాస్ ఆడియన్స్ ని మెప్పించేలా ఉంది. సందర్భాను సారంగా వచ్చే కొన్ని మాటలు బాగున్నాయి. నరేష్ రాసుకున్న పాయింట్ బాగుంది కానీ స్క్రీన్ ప్లే మైనస్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

Vishwak Sen Paagal First Look Film To Release On April 30 zeecinemalu

జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ :

చిన్నతనంలో తనని ఎంతో ఆప్యాయంగా అల్లారుముద్దుగా చూసుకునే తన తల్లి మరణం తర్వాత అలాంటి ప్రేమని ప్రేయసి ప్రేమలో చూసుకోవాలని ఆరాటపడుతుంటాడు హీరో. అమ్మ చెప్పిన మాటలు అలాగే ఫ్రెండ్ చెప్పిన మాటలు ప్రేమ్ ని చాలా ఇంఫ్లుఎన్స్ చేస్తాయి. దాంతో స్కూల్ డేస్ నుండే కనిపించిన ప్రతీ అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ పాయింట్ తో సినిమాను ముందుకు నడిపించేందుకు దర్శకుడు నరేష్ రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం తేడా కొట్టింది. ఇద్దరు అనాదల ప్రేమను స్క్రీన్ పై చూపించడానికి చాలా కష్టపడ్డాడు కొత్త దర్శకుడు.  ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్ మెంట్ తో నడిపించేసి సెకండాఫ్ లో అసలు లవ్ ట్రాక్ ఓపెన్ చేసి కథను ఎమోషనల్ గా నడిపించే ప్రయత్నం చేశాడు.

ఫస్ట్ హాఫ్ వరకూ టైం పాస్ ఎంటర్టైన్ మెంట్ తో సినిమా పరవాలేదనిపిస్తుంది. కానీ సెకండాఫ్ కొచ్చే సరికి మురళి శర్మ -విశ్వక్ సేన్ ట్రాక్ , ఆ తర్వాత వచ్చే విశ్వక్ సేన్ – నివేత పెతురాజ్ లవ్ ట్రాక్ ఇంప్రెస్ చేయలేకపోయాయి. ముఖ్యంగా మురళి శర్మ క్యారెక్టర్ తో వచ్చే సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెడతాయి. దానికి క్లైమాక్స్ లో దర్శకుడు క్లారిటీ ఇచ్చే వరకు ఆ ట్రాక్ ఎందుకు ప్లాన్ చేసాడో తెలియదు. కానీ అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. అక్కడ ప్రేక్షకుడు ఇవేం సన్నివేశాలు? అసలు ఈ ట్రాక్ ఏంటి ? అంటూ బోర్ ఫీల్ అవుతాడు. ఆ ట్రాక్ కొద్దిగా నవ్వించినప్పటికీ  ఎక్కువ విసుగు తెప్పించింది. ఇక కనిపించిన ప్రతీ అమ్మాయిలో అమ్మ ప్రేమ దొరుకుంతుందేమో అని ప్రేమ్ ఉగ్యోగం సద్యోగం లేకుండా అదే పనిగా తిరగడం కూడా చిరాకు తెప్పిస్తుంది.

సినిమాను ఎక్కడ స్టార్ట్ చేసాడో సరిగ్గా అదే ప్లేస్ లో ఎండ్ చేశాడు దర్శకుడు. హీరో సూసైడ్ ప్రయత్నం నుండి కథను మొదలు పెట్టి తర్వాత చైల్డ్ హుడ్ సీన్స్ అందులో మదర్ సెంటిమెంట్ చూపించాడు. ఆ తర్వాత అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తూ తిరిగే ప్రేమ్ క్యారెక్టర్ తో హైదరాబాద్ -వైజాగ్ మధ్య కథను తిప్పాడు. చాలా వరకు కొత్త దర్శకుడు నరేష్ లాజిక్స్ మిస్ అయ్యాడు. ముఖ్యంగా ట్రైన్ లో నుండి హీరో దూకేయడం ఆ తర్వాత జస్ట్ చేతికి బ్యాండ్ వేసుకొని కనిపించడం వంటివి ప్రేక్షకుడికి మింగుడు పడవు. ట్రైన్ లో నుండి దూకేసిన నెక్స్ట్ డే నుండే మాములుగా తిరిగేస్తాడు హీరో. ఇక హీరోయిన్ మాత్రం ఒక చిన్న యాక్సిడెంట్ తో హాస్పిటల్ పాలవుతుంది. ఇలాంటివి రాసుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ థియేటర్స్ లో ఆడియన్స్ కి సిల్లీగా అనిపిస్తాయి.

దర్శకుడు తను అనుకున్న కథని అందరికీ కనెక్ట్ అయ్యేలా చూపించలేకపోయాడు. కాకపోతే కొన్ని సన్నివేశాలను మాత్రం అనుభవం ఉన్న దర్శకుడిలా తీశాడు. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగా సెట్ చేసుకున్నాడు. ఆ ట్విస్ట్ వర్కౌట్ అయింది.

విశ్వక్ సేన్ నటన, మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ , కొన్ని కామెడీ సీన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు హైలైట్ గా నిలివగా.. స్క్రీన్ ప్లే , లవ్ ట్రాక్ , బోర్ కొట్టించే సీన్స్ , డ్రాగ్ అనిపించే సెకండాఫ్  సినిమాకు మైనస్.  ఓవరాల్ గా లవ్ స్టోరీతో ‘పాగల్’ మెప్పించలేకపోయాడు.

రేటింగ్ : 2.25/5

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics