ఆపరేషన్ గోల్డ్ ఫిష్ రివ్యూ

Friday,October 18,2019 - 03:43 by Z_CLU

నటీనటులు: ఆది సాయికుమార్‌, అబ్బూరి ర‌వి, స‌షా ఛెట్రి, కార్తిక్‌రాజు, నిత్యాన‌రేష్‌, పార్వ‌తీశం మనోజ్‌ నందం, రావు రమేష్‌, అనీష్‌ కురువిల్లా, కృష్ణుడు

కెమెరా: జైపాల్‌రెడ్డి
ఆర్ట్‌: జె.కె.మూర్తి
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
ఎడిటింగ్‌: గ్యారీ బీహెచ్‌
యాక్షన్‌: రామకృష్ణ, సుబ్బు, నభా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
బ్యానర్ : వినాయకుడు టాకీస్
నిర్మాత : ఆర్టిస్టులు, టెక్నీషియన్లు
సెన్సార్ : U/A
రన్ టైమ్ : 127 నిమిషాలు
రిలీజ్ డేట్ : అక్టోబర్ 18, 2019

ఆపరేషన్ గోల్డ్ ఫిష్.. కొన్నాళ్లుగా ఇండస్ట్రీని ఆకర్షిస్తున్న సినిమా. ఫస్ట్ లుక్, ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై అందరి ఫోకస్ పడింది. అలా ఓ మోస్తరు అంచనాల మధ్య ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా రిజల్ట్ ఏంటి? ఆది సాయికుమార్ హిట్ కొట్టాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ


కథ

ఒకదానితో ఒకటి సంబంధం లేని రెండు ప్లాట్స్ ను కలిపే కథ ఇది. కార్తీక్ (కార్తీక్ రాజు), సోలమన్ (పార్వతీశం), తాన్య (సాషా ఛత్రి), నిత్య (నిత్యా నరేష్) ఒకే కాలేజ్ లో చదువుకుంటారు. అప్పుడే పరిచయమైన ఈ గ్యాంగ్, తక్కువ టైమ్ లోనే బాగా కలిసిపోతుంది. కార్తీక్, సోలమన్ ఇద్దరూ మిగతా ఇద్దరితో ప్రేమలో పడతారు. ఒక టైమ్ లో వీళ్లంతా ఔటింగ్ కోసం బయటకు వెళ్తారు. సరిగ్గా అప్పుడే ఉగ్రవాదులు వీళ్లను కిడ్నాప్ చేస్తారు.

మరోవైపు ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే ప్లాన్ అమలుచేస్తారు ఉగ్రవాదులు. మిలిటెండ్ ఘాజీ బాబా (అబ్బూరి రవి) ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. ఈ ఆపరేషన్ ను ఫరూక్ ఇక్బాల్ ఇరాఖీ (మనోజ్ నందం) అనే మిలిటెంట్ కు అప్పగిస్తారు. పైన చెప్పుకున్న నలుగురు కాలేజ్ స్టూడెంట్స్ ను ఇరాఖీ కిడ్నాప్ చేస్తాడు. వాళ్లను విడిపించడం కోసం
రంగంలోకి దిగుతాడు ఎన్ఎస్జీ కమాండో అర్జున్ (ఆది సాయికుమార్). ఇంతకీ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అంటే ఏంటి? స్టూడెంట్స్ కు ఉగ్రవాదులకు సంబంధం ఏంటి? ఫైనల్ గా ఘాజీ బాబాను అర్జున్ పట్టుకున్నాడా లేదా అనేది కథ.

 

నటీనటుల పనితీరు

ఎన్ఎస్జీ కమాండోగా అర్జున్ లుక్ బాగుంది. అతడి యాక్టింగ్ మాత్రం ఎప్పట్లానే రొటీన్ గా ఉంది. కమాండో మేనరిజమ్స్ ను అర్జున్ చూపించలేకపోయాడు. ఘాజీ బాబాగా అబ్బూరి రవి బాగా సెట్ అయ్యాడు. అతడి యాక్టింగ్ కూడా బాగుంది. ఇక మరో ఉగ్రవాది ఇరాఖీగా మనోద్ నందం ఫస్ట్ టైమ్ నెగెటివ్ రోల్ లో కనిపించి మెప్పించాడు. హీరోయిన్లు సాషా, నిత్యా ఆకట్టుకోగా.. కార్తీక్ రాజు, సోలమన్, కృష్ణుడు, రావు రమేష్, అనీష్ కురువిల్లా తమ పాత్రల మేరకు మెప్పించారు.

 

టెక్నీషియన్స్ పనితీరు

శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోవు. జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది. అబ్బూరి రవి నటుడిగానే కాకుండా, స్క్రిప్ట్ డిజైన్ లో పాలుపంచుకున్నాడు. కశ్మీర్ పండిట్లపై అతడు, దర్శకుడు కలిసి చేసిన రీసెర్చ్ వర్క్ ఆకట్టుకుంటుంది. సినిమాలో కొన్ని యథార్థ సన్నివేశాల్ని చూపించడం కూడా బాగుంది. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ ఓకే అనిపించుకుంటుంది.

ఇక నిర్మాతల గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోడానికేం లేదు. ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్లు అంతా కలిసి డబ్బులేసుకొని ఈ సినిమాను తీశారు. నిర్మాణ విలువలు ఓకే.

ఇక దర్శకుడు సాయి కిరణ్ విషయానికొస్తే.. ఇంతకుముందే చెప్పుకున్నట్టు అతడు చేసిన రీసెర్చ్ వర్క్ బాగుంది. దర్శకుడిగా మరోసారి సక్సెస్ అయ్యాడు సాయికిరణ్.

జీ సినిమాలు సమీక్ష

ఒకదానికొకటి సంబంధం లేని 2-3 కథల్ని కలుపుతూ ఓ కొలిక్కి తీసుకొచ్చే విధానం పాతదే. ఈ ఫార్మాట్ లో గతంలో కొన్ని తెలుగు సినిమాలు వచ్చాయి కూడా. కాకపోతే ఇదే ఫార్ములాకు దేశభక్తి ఎలిమెంట్ ను జోడించాడు దర్శకుడు సాయికిరణ్ అడివి. కాకపోతే ఈ క్రమంలో సాయికిరణ్, అబ్బూరి రవి కలిసి రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం అక్కడక్కడ గాడి తప్పింది. ఉత్కంఠ కలిగిస్తుందనుకున్న గోల్డ్ ఫిష్ కాస్తా అక్కడక్కడ చేతిలోంచి జారిపోతుంది.

హీరో పాత్రకు కశ్మీర్ పండిట్ల బ్యాక్ డ్రాప్ సెట్ చేయడం బాగుంది. ఉగ్రవాదుల పాత్రల ఎంపిక కూడా బాగుంది. కానీ సీరియస్ గా చెప్పాల్సిన ఈ కథలోకి రొమాన్స్, కామెడీని తీసుకురావడానికి దర్శకుడు చేసిన విశ్వప్రయత్నం బెడిసికొట్టింది. కార్తీక్ రాజు, పార్వతీశం, సాషా, నిత్య మధ్య వచ్చే సన్నివేశాలు అంతగా మెప్పించవు. దీనికి తోడు కృష్ణుడుతో పెట్టిన కామెడీ మరీ చవకబారుగా ఉంది. ఒక్క సీన్ లో కూడా కృష్ణుడి కామెడీ పండలేదంటే అర్థం చేసుకోవచ్చు. బహుశా సెంటిమెంట్ కోసం దర్శకుడు, కృష్ణుడ్ని రిపీట్ చేసి ఉంటాడు.

ఇవన్నీ ఒకెత్తయితే.. ప్రీ-క్లయిమాక్స్ కు ముందు ఎమోషన్ కోసం కృష్ణుడి ప్రాణం తీయడం మరీ అతిగా అనిపిస్తుంది. నిజానికి హీరోహీరోయిన్ల గ్యాంగ్ తో కృష్ణుడికి ఉన్న ఎటాచ్ మెంట్ ను బాగా చూపించి, ఆ తర్వాత ఆ పాత్రను చంపేస్తే అనుకున్న ఎమోషన్ పండేది. కానీ అలాంటి ప్రయత్నం జరగలేదు. దీనికితోడు కిడ్నాప్ చేసిన అసలు వ్యక్తుల్ని వదిలేసి, కృష్ణుడి పాత్రను చంపేయడం కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. స్క్రిప్ట్ ను గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటే కృష్ణుడి లాంటి పాత్రల అవసరం ఉండేది కాదేమో.

ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు సినిమాను పడుతూలేస్తూ నడిపిన దర్శకుడు.. అద్భుతమైన ట్విస్ట్ తో ఇంటర్వెల్ కార్డు వేస్తాడు. ఈ ట్విస్ట్ మాత్రం ప్రతి ఒక్కర్ని ఎట్రాక్ట్ చేస్తుంది. అందులో ఎవ్వరికీ ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఇక అక్కడ్నుంచి సినిమా పరుగులు పెడుతుందని భావించిన ప్రేక్షకులకు, సెకండాఫ్ లో కూడా అక్కడక్కడ నిరాశ తప్పదు. ఇలా పడుతూ లేస్తూ క్లైమాక్స్ కు చేరుకుంటుంది కథ.

ఆది సాయికుమార్ తో పాటు ఎవ్వరి పెర్ఫార్మెన్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. చివరికి రావు రమేష్ లాంటి నటుడ్ని కూడా సైడ్ ట్రాక్ లోకి నెట్టేయడం ఈ సినిమా స్క్రిప్ట్ లో ప్రధాన లోపం. బడ్జెట్ లో దొరికిన ఆర్టిస్టులు, పరిమిత వనరులు, టెక్నీషియన్స్ అండతో.. ఉన్నంతలో ఈ సినిమాను క్వాలిటీగా తీయగలిగాడు దర్శకుడు. ఓవరాల్ గా టైటిల్ తో, ఆది లుక్ తో ఎట్రాక్ట్ చేసినంతగా.. కంటెంట్ తో కదిలించలేకపోయింది ఈ గోల్డ్ ఫిష్. యాక్షన్, థ్రిల్ కోరుకునే ప్రేక్షకులను ఇది అంతోఇంతో ఎట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది.

రేటింగ్ 2.5/5