ఓం నమో వేంకటేశాయ మూవీ రివ్యూ

Friday,February 10,2017 - 03:18 by Z_CLU

విడుదల : ఫిబ్రవరి 10,2017

నటీనటులు : నాగార్జున. ప్రగ్యా జైస్వాల్, అనుష్క తదితరులు

సంగీతం : M.M.కీరవాణి

ఎడిటర్ : గౌతమ్ రాజు

ఆర్ట్ డైరెక్టర్ : కిరణ్ కుమార్ మన్నె

నిర్మాణం : ఏ.ఎం.ఆర్. సాయి కృప ఎంటర్టైన్మెంట్స్

నిర్మాత : మహేష్ రెడ్డి

కథ-మాటలు : J.K.భారవి

స్క్రీన్ ప్లే -దర్శకత్వం : రాఘవేంద్ర రావు

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సూపర్ హిట్ కాంబినేషన్ లో… వేంకటేశ్వర స్వామి మహా భక్తుడు హథీరాం బాబా కథతో తెరకెక్కిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. గతంలో ‘అన్నమయ్య’ సినిమాతో ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించి ఘన విజయం అందుకున్న వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా మరో ‘అన్నమయ్య’ లా ప్రేక్షకులను అలరించిందా…మళ్ళీ అలాంటి విజయం అందకుంటుందా… చూద్దాం…

om-namo-venkatesaya-3

కథ :

చిన్నతనం నుంచి దేవుడిని చూడాలనే ఆశతో అనుభవానంద స్వామి దగ్గర శిష్యుడిగా ఉంటూ ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, వేదాలు నేర్చుకొని చిన్నతంలోనే ఘోర తపస్సు చేసి పెద్దవాడైన రామా(నాగార్జున)… ఆ దీక్ష భగ్నం అవ్వడంతో ఇంటికి చేరతాడు. తన రాక కోసం ఎన్నో పూజలు చేసిన భవాని(ప్రగ్యా జైస్వాల్)ను పెళ్లిచేసుకోమని తల్లిదండ్రులు చెప్పడంతో సరేనని అంతలోనే భగవంతుడిని అన్వేషించాలనుకునే తన కోరికను మరదలకు చెప్పి పెళ్లి వద్దని తిరుమలకి ప్రయాణమవుతాడు. అలా దేవుడిని వెదుక్కుంటూ తిరుమల చేరుకున్న రామా.. చివరికి వేంకటేశ్వర స్వామి(శౌరభ్)ని తన దివ్యదృష్టితో ఎలా చూడగలిగాడు… ఆయనతో పాచికలు ఆడుతూ శ్రీవారికి ప్రియమైన భక్తుడిగా ఎలా మారాడు….. కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఏ విధంగా నిలిచిపోయాడనేది సినిమా కథాంశం..

 

నటీనటుల పనితీరు :

గతంలో ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ చిత్రాల్లో భక్తుడి పాత్రలతో ఎంతగానో ఆకట్టుకొని..  ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన నాగార్జున.. ఈ సినిమాలో మహా భక్తుడు హాథీరామ్ బాబాగా కనిపించి మరోసారి భక్తుడి పాత్రతో నూటికి నూరుమార్కులు కొట్టేశాడు. ఇలాంటి పాత్రలకు తనే కేరాఫ్ అడ్రెస్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు భక్తుడి పాత్రలో తన నటనతో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. వేంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ తర్వాత అంతగా ఆ పాత్రలో ఇమిడిపోయాడు సౌరభ్. చక్కటి శరీర సౌష్టవం, నటనతో ఆకట్టుకున్నాడు. మహాభక్తురాలు కృష్ణమ్మ పాత్రలో సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది అనుష్క. లక్ష్మీదేవిగా విమలా రామన్, భూదేవిగా అశ్మిత.. అనుభవానంద స్వామిగా సాయికుమార్, గోవిందరాజులు గా రావు రమేష్, గరుడగా అజయ్, గంటా గరుడాచలంగా బ్రహ్మానందం, అరుణాచలంగా పృథ్వి, రాజుగా జగపతిబాబు ఆకట్టుకున్నారు. వీళ్లతో పాటు తనికెళ్ళ భరణి, రఘుబాబు, సంపత్, వెన్నెల కిశోర్, శ్రీను రామ్ ప్రసాద్, గుండు సుదర్శన్, కాలకేయ ప్రభాకర్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముఖ్యంగా చెప్పాల్సింది కీరవాణి గురించే. కీరవాణి అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి కీర్తన, ప్రతి పాటతో పాటు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ‘కోటి కోటి దండాలయ్యా’,’అఖిలాండ కోటి బ్రహాండ నాయక’ పాటలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. వేదవ్యాస్, అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం పాటలకు మరింత అందం తీసుకొచ్చాయి. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ మరో హైలైట్. ముఖ్యంగా ‘మహాబలేశ్వరం’,’చిక్ మంగుళూరు’ లోకేషన్స్ ను తన కెమెరాతో చాలా అందంగా చిత్రీకరించాడు. పాటల చిత్రీకరణ చాలా బాగుంది. ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ కిరణ్ కుమార్ వేసిన సెట్స్. ఆర్ట్ డైరెక్టర్ గా కిరణ్ కుమార్ తన వర్క్ తో శెభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమా అతడికి మరో టర్నింగ్ పాయింట్. గౌతమ్ రాజు ఎడిటింగ్ బాగుంది. జె.కె.భారవి కథ మాటలు ఆకట్టుకున్నాయి. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రస్తుత తరంలో డివోషనల్ మూవీస్ తెరకెక్కించాలన్నా… ఇప్పటితరాన్ని కూడా ఈ తరహా సినిమాలవైపు ఆకర్షించాలన్నా.. అది రాఘవేంద్రరావుకే చెల్లింది. ఇన్ని దశాబ్దాలైనా దర్శకేంద్రుడిలో ఆ దర్శకత్వ చమక్కు ఏమాత్రం తగ్గలేదు.

om-namo-1

జీ సినిమాలు సమీక్ష :

భక్తిరస సినిమా చూసి చాలా ఏళ్ళు అయింది. ఇక నాగార్జున-రాఘవేంద్ర రావు కాంబినేషన్ కూడా చాలా ఏళ్లయింది. పైగా ‘అన్నమయ్య’ తర్వాత వేంకటేశ్వర స్వామి భక్తుడి కథతో సినిమా వచ్చి చాలా ఏళ్లయింది. అందుకే ఓం నమో వేంకటేశాాయ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంతా ఎదురుచూశారు. షూటింగ్ ప్రారంభం నుంచే భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా ఆ అంచనాలను మించిన తృప్తిని కచ్చితంగా అందిస్తుంది. చాలా తక్కువగా తెలిసిన కథకు అద్భుతమైన కల్పితాలు జోడించి, చూడచక్కని సన్నివేశాలతో, అందమైన స్క్రీన్ ప్లేతో సినిమాను తెరకెక్కించిన రచయిత జె.కె.భారవి, దర్శకుడు రాఘవేంద్ర రావు ను మెచ్చుకోని తీరాల్సిందే. ముఖ్యంగా తిరుమల గురించి ఇప్పటి వరకూ తెలియని ఎన్నో విషయాలను ఈ సినిమా ద్వారా తెలిపారు. ఇలాంటి సినిమాలకు మ్యూజిక్ ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ బాధ్యతను అద్భుతంగాా నిర్వర్తించాడు కీరవాణి. ఇక తిరుమల స్థలపురాణంతో కూడిన సన్నివేశాలతో సాగే పాట, పాటల పిక్చరైజేషన్, హథీరాం బాబా వేంకటేశ్వరుడితో పాచికలు ఆడే సన్నివేశాలు, కొండపై ఏనుగు చేసే ఫైట్, ఏనుగు వచ్చి చెరుకు తినే సన్నివేశం, హాథీరామ్ బాబాగానే ప్రసిద్ధి చెందుతావంటూ రామాకి వేంకటేశ్వర స్వామి అభయం ఇచ్చే సీన్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు మెయిన్ హైలైట్స్ గా నిలిచాయి. భక్తుడిగా ప్రేక్షకుల మెప్పు పొందిన నాగార్జున మరోసారి అలాంటి మహాభక్తుడి పాత్రలో పూర్తి స్థాయిలో మెప్పించి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. ఈ సినిమా చూసిన మరే హీరో, భక్తుడి పాత్రలు వేయడానికి ముందుకురాడు. అంతలా నాగార్జున ఇలాంటి పాత్రలకు సెట్ అయిపోయాాడు. ఫైనల్ గా ‘ఓం నమో వేంకటేశాయ’ భక్తిభావంతో కుటుంబమంతా చూడదగ్గ ఆధ్యాత్మిక భక్తిరస చిత్రంగా నిలిచిపోతుంది.

రేటింగ్   3.5/5