'ఒక్కడు మిగిలాడు' రివ్యూ

Friday,November 10,2017 - 05:08 by Z_CLU

నటీ నటులు : మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు

సినిమాటోగ్రాఫర్  : వి.కోదండ రామరాజు

నిర్మాణం : ఎస్.ఎం.ఆర్ ఫిలింస్ Pvt.Ltd

స్క్రీన్ ప్లే: గోపీమోహన్

సంగీతం : శివ నందిగామ

దర్శకత్వం : అజయ్ ఆండ్రూస్ నూతక్కి

 

వ్యవస్థకి విరుద్ధంగా పోరాడే వీరుడిగా, మరోవైపు ప్రస్తుత పరిస్థితుల మధ్య నలుగుతున్న వ్యవస్థను ట్రాక్ పై పెట్టే లీడర్ లా మంచు మనోజ్ డ్యూయెల్ రోల్స్ లో నటించిన ‘ఒక్కడు మిగిలాడు’ ఈరోజే థియేటర్స్ లోకి  వచ్చింది. మరి ఈ రెండు విభిన్న క్యారెక్టర్స్ మనోజ్ ప్రేక్షకులను ఎలా ఎంటర్ టైన్ చేశాడో చూద్దాం..

కథ :

సూర్య(మనోజ్) శ్రీలంక శరణార్థి సంతతికి చెందినవాడు. యూనివర్సిటీ హాస్టల్ లో ముగ్గురు అమ్మాయిలు రేప్ చేయబడి హత్యకు గురవుతారు. అయితే వారు ఆత్మహత్య చేసుకున్నారని క్రియేట్ చేస్తాడు మంత్రి. ఆ అన్యాయాన్ని ఎలాగైనా ఎదుర్కొని ప్రజలందరికీ ఆ విషయాన్ని తెలియజేసి ఆ ముగ్గురి చావులకు కారకులైన మంత్రి కొడుకులను శిక్షించాలని స్టూడెంట్ లీడర్ గా పోరాటం చేస్తాడు సూర్య. ఈ క్రమంలో సూర్యపై నేరస్తుడిగా ముద్ర వేస్తారు పోలీసులు.. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ లో ఓ కానిస్టేబుల్(పోసాని)కి తన బ్యాక్ గ్రౌండ్ వివరిస్తాడు . శ్రీలంకలో సైన్యం చేతిలో నిత్యం నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోతున్న శరణార్థుల హక్కుల కోసం పోరాడుతూ ఉంటాడు పీటర్(మనోజ్). ఓ సారి సైన్యం దాడి చేయటంతో తన వాళ్ళను ఓ పడవ ఎక్కించి తాను వీరమరణం పొందుతాడు. ఆ పడవ శ్రీలంక నుంచి ఇండియా చేరడానికి 10 రోజులు పడుతుంది. ఆ పడవలో ఒక్క పసిగుడ్డు సూర్య తప్ప అందరూ చనిపోతారు. ఈ కథ విన్న కానిస్టేబుల్ సూర్యని ఎలాగైనా కాపాడాలనుకుంటాడు. కట్ చేస్తే సూర్య మీద హత్య ప్రయత్నాలు మొదలవుతాయి. వ్యవహారం సీఎం దాకా వెళ్తుంది. చివరికి ఏం జరిగింది, సూర్య పోరాడిన కేసుకు న్యాయం జరిగిందా…? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు :

ఈ సినిమాతో నటుడిగా తనకుతానే ఓ ఛాలెంజ్ విసురుకున్నాడు మనోజ్. ఒకవైపు వ్యవస్థకి విరుద్ధంగా పోరాడే వీరుడిగా, మరోవైపు ప్రస్తుత పరిస్థితుల మధ్య నలుగుతున్న వ్యవస్థను గాడిలో పెట్టే లీడర్ గా మంచు మనోజ్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్ లో తన నటనతో మెస్మరైజ్ చేశాడు. హీరోయిన్ అనీషా.. జర్నలిస్ట్ క్యారెక్టర్ కి న్యాయం చేసింది. దర్శకుడు అజయ్ హీరో క్యారెక్టర్ కి ఈక్వల్ అనిపించే పాత్రతో బాగానే పెర్ఫార్మ్ చేశాడు. ఇక పోసాని, సుహాసిని, మురళీమోహన్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

టెక్నీషియన్స్ పనితీరు:

కోదండ రామరాజు సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. శివ నందిగామ మ్యూజిక్ పరవాలేదు. కొన్నిచోట్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ లో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేది. గోపీమోహన్ స్క్రీన్ ప్లే పెద్దగా ఎంటర్టైన్ చేయలేకపోయింది. ఇక దర్శకుడు అజయ్ విషయానికొస్తే.. అనుకున్న కథను ఇంట్రెస్టింగ్ గా చెప్పలేకపోయాడనిపించింది. మనుగడ పేరుతో అణిచివేతకు గురై దశాబ్దాల నుంచి హక్కుల కోసం పోరాడుతున్న శరణార్థుల గురించి వెండితెరపై చూపాలన్న అతని ఆలోచన బాగున్నప్పటికీ.. దాన్ని తెరపై చూపించడంలో తడబడ్డాడు. కొన్ని సందర్భాల్లో వచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

మంచు మనోజ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తూ ఓ సినిమా వస్తుందనగానే ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా పై టాలీవుడ్ లో బజ్ నెలకొంది. ట్రైలర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా మనోజ్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ అవుతుందనే టాక్ వినిపించింది. ఒక హీరోగా మనోజ్ ఇలాంటి స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేసుకోవడం, ఈ టైమ్ లో ఇలాంటి ప్రయోగం చేయడం అభినందించాల్సిన విషయమే.. అయితే దర్శకుడు అనుకున్నది అనుకున్నట్టుగా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో గ్రిప్పింగ్ గా చెప్పలేకపోయాడు. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్.

మనోజ్ చేసిన పీటర్ క్యారెక్టర్ ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ ను పోలి ఉంటుంది. ఈ పాత్రతో పాటు సముద్రం ఎపిసోడ్ , సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్, డిఫరెంట్ బ్యాక్ డ్రాప్, యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్స్ గా నిలుస్తాయి. సాంగ్స్, ఫస్ట్ హాఫ్ లో బోర్ కొట్టించే సీన్స్, సెకండ్ హాఫ్ లో సాగదీతలా అనిపించే స్క్రీన్ ప్లే  మైనస్ అని చెప్పొచ్చు.

చక్కటి సందేశంతో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ జస్ట్ పరవాలేదనిపిస్తుంది.

రేటింగ్ : 2.5 /3