ఓ పిట్ట కథ మూవీ రివ్యూ

Friday,March 06,2020 - 03:32 by Z_CLU

న‌టీన‌టులు: విశ్వంత్, సంజ‌య్‌రావు, నిత్యాశెట్టి, బ్ర‌హ్మాజీ, బాల‌రాజు తదితరులు
పాట‌లు: శ్రీజో
ఆర్ట్: వివేక్ అన్నామ‌లై
ఎడిట‌ర్‌: డి.వెంక‌ట‌ప్ర‌భు
కెమెరా: సునీల్ కుమార్
సంగీతం: ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అన్నే ర‌వి
నిర్మాత‌: వి.ఆనంద ప్ర‌సాద్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: చెందు ముద్దు
రన్ టైమ్: 127 నిమిషాలు
సెన్సార్: U
రిలీజ్ డేట్: మార్చి 6, 2020

ఓ పిట్ట కథ.. పేరుకు ఇది చిన్న సినిమానే కావొచ్చు. కానీ మహేష్, చిరంజీవి లాంటి స్టార్స్ రంగంలోకి దిగి ప్రచారం చేసేసరికి ఇది కాస్తా విడుదలకు ముందు పెద్ద సినిమాగా మారిపోయింది. అలా భారీ హైప్ తో ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా రిజల్ట్ ఏంటి? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

కథ

అరకులో హీరోయిన్ కిడ్నాప్ తో కథ మొదలవుతుంది. కాకినాడలో ఉండే వీర్రాజుకు ఏకైక సంతానం వెంకటలక్ష్మి (నిత్యాషెట్టి). కూతురు, సినిమా థియేటర్, ఓ ఇల్లు.. ఇదే అతడి ప్రపంచం. వెంకటలక్ష్మి అంటే సినిమా థియేటర్ లో పనిచేసే ప్రభు (సంజయ్ రావు)కు చాలా ఇష్టం. అదే సమయంలో వెంకటలక్ష్మి ఇంటికి అతడి బావ క్రిష్ (విశ్వంత్) వస్తాడు. క్రిష్ కు కూడా వెంకటలక్ష్మి అంటే చాలా ఇష్టం.

వెంకటలక్ష్మిపై ఉన్న ఇష్టాన్ని వీర్రాజుకు చెప్పాలని ప్రభు రెడీ అవుతాడు. అదే సమయంలో మరదలు వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకునే కోరికను మామయ్యకు చెప్పడానికి క్రిష్ కూడా రెడీ అవుతాడు. సరిగ్గా అప్పుడే ఫ్రెండ్స్ తో కలిసి అరకు వెళ్లిన వెంకటలక్ష్మి కిడ్నాప్ కు గురవుతుంది. ఆమె వెళ్లిన కారు లోయలో పడి తగలబడి పోతుంది. దీంతో విషయం పోలీస్ స్టేషన్ కు వెళ్తుంది. ఎస్సై అజయ్ కుమార్ (బ్రహ్మాజీ) రంగంలోకి దిగుతాడు.

ఇంతకీ వెంకటలక్ష్మికి ఏమైంది? ప్రభు-క్రిష్ పై పోలీసాఫీసర్ అజయ్ కుమార్ ఎందుకు అనుమానపడతాడు. ఫైనల్ గా ఏమౌతుంది అనేది ఈ పిట్ట కథ స్టోరీ.

నటీనటుల పనితీరు

సినిమా మొత్తం ఓ 5-6 పాత్రల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నిత్యాషెట్టి గురించే. పల్లెటూరి అమ్మాయిగా చలాకీగా భలే ఆకట్టుకుంది నిత్యా. ఆమె యాక్టింగ్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఇక విశ్వంత్ ఎప్పట్లానే తన పాత్రకు న్యాయం చేశాడు. ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చిన బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు ఉన్నంతలోనే బాగానే ఆకట్టుకున్నాడు. కానీ నటన పరంగా ఆయన మెప్పించలేకపోయాడు.

నిజానికి ప్రభు అనే పాత్రతో ఆడుకోవచ్చు. నాని లాంటి నటుడికి ఇలాంటి క్యారెక్టర్ పడితే ఓ రేంజ్ లో ఉండేది. చాలా బలమైన ఈ క్యారెక్టర్ ను సంజయ్ మోయలేకపోయాడు. అది అతడి తప్పు కూడా కాదు. పోలీస్ గా బ్రహ్మాజీ ఎప్పట్లానే ఆకట్టుకున్నాడు.

 

టెక్నిషియన్స్ పనితీరు

టెక్నికల్ గా సినిమా గురించి చెప్పుకోవడానికేం లేదు. సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్, పల్లెటూరి అందాల్ని, హీరోయిన్ ను బాగా చూపించగలిగాడు. ఫైట్ సీక్వెన్స్ తో పాటు మరికొన్ని ఎపిసోడ్స్ లో మాత్రం అతడి వర్క్ మెప్పించదు. మ్యూజిక్ డైరక్టర్ ప్రవీణ్ లక్కరాజు కూడా అంతే. ఏమైపోతానే అనే లిరిక్స్ తో సాగే ఓ పాటను బాగా కంపోజ్ చేసిన ఈ సంగీత దర్శకుడు.. రీ-రికార్డింగ్ విషయంలో మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయాడు. ఎడిటర్ వెంకట ప్రభు కూడా కొన్ని మిస్టేక్స్ చేశాడు. స్క్రీన్ ప్లే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇతడు కూాడా ఓ కారణం.

దర్శకుడి విషయానికొస్తే.. తొలి సినిమాకే కాస్త కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే ఎంచుకున్నాడు చెందు ముద్దు. స్క్రీన్ ప్లే అక్కడక్కడా మెరిసినా, ఓవరాల్ గా పెద్దగా కిక్ ఇవ్వలేదు. డైలాగ్స్ బాగున్నాయి, ముఖ్యంగా సందర్భానుసారంగా వచ్చే కామెడీని చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. ఓవరాల్ గా తనలో విషయం ఉందని పిట్టకథతో నిరూపించుకున్నాడు.

జీ సినిమాలు రివ్యూ

పిట్ట కథ అంటూనే ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. నిజానికి దీన్ని లాంగ్ స్టోరీ అనే కంటే లాంగ్ ట్విస్టులు అంటే సరిపోయేది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఓ చిన్న లవ్ స్టోరీ తీసుకొని దానికి మంచి ట్విస్టులు అద్దే ప్రయత్నం చేశారు. అయితే నటీనటుల పెర్ఫార్మెన్స్ పండకపోవడం వల్ల, స్లో నెరేషన్ కారణంగా ఈ సినిమా ట్యాగ్ లైన్ కు తగ్గట్టు నిజంగానే చాలా “లాంగ్” అనిపిస్తుంది.

పేరుకు ఇది చిన్న సినిమానే అయినప్పటికీ ప్రమోషన్ మాత్రం భారీ స్థాయిలో చేశారు. మహేష్ బాబు నుంచి చిరంజీవి వరకు ఎవ్వర్నీ వదల్లేదు. కొడుకు సినిమా కోసం అలా ఓ రేంజ్ లో కష్టపడిన బ్రహ్మాజీకి అతడు కోరుకున్న ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ అతడు ఎక్స్ పెక్ట్ చేసిన రిజల్ట్ మాత్రం రాలేదనే చెప్పాలి. మరీ ముఖ్యంగా సంజయ్ రావు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మరిన్ని సినిమాలు చేయాలన్నా, ఓ మంచి హిట్ కొట్టాలన్నా సంజయ్ చాలా కష్టపడాలి.

ఇక సినిమా విషయానికొస్తే, అరకులో జరిగే హీరోయిన్ కిడ్నాప్ తో కథ మొదలవుతుంది. అక్కడ్నుంచి నెమ్మదిగా ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ ఉంటుంది. ఇద్దరు హీరోలున్న ఈ సినిమాలో ఎవరు హీరో, ఎవరు విలన్ అనే సస్పెన్స్ ను ప్రీ-క్లైమాక్స్ వరకు కొనసాగించడం చాలా కష్టం. కొత్త దర్శకుడైన చందు ముద్దుకు అది మరింత కష్టమైంది. దీంతో 2 గంటల సినిమా కూడా అక్కడక్కడ విసిగిస్తుంది. ఉన్నంతలో ఈ సినిమాకు పండు క్యారెక్టర్ చేసిన కామెడీ ప్లస్ అయింది.

ఈ సినిమాను నిలబెట్టేవి, ప్రేక్షకుడ్ని కుర్చీలో కూర్చోబెట్టేవి పోలీస్ స్టేషన్ సన్నివేశాలు మాత్రమే. ఎందుకంటే, ట్విస్టులన్నీ అక్కడే రివీల్ అవుతుంటాయి. అలాంటి కీలక సన్నివేశాల్లో దర్శకుడు మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడం ఈ సినిమా ఓ సగటు పిట్టకథగానే మిగిలిపోయింది. ఉన్నంతలో నటీనటుల పరంగా హీరోయిన్ నిత్యాషెట్టి, టెక్నికల్ గా సినిమాటోగ్రఫర్ సునీల్ కుమార్ ఈ పిట్టకథను చక్కగా నడిపించారు.

ఫస్టాఫ్ మొత్తం సరదాగా సాగిపోయే ఈ సినిమా ఇంటర్వెల్ కు వచ్చేసరికి మంచి రసకందాయంలో పడుతుంది. అసలు హీరోయిన్ ను కిడ్నాప్ చేసిందెవరు అనే విషయంలో లాక్ వేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కానీ అక్కడ్నుంచి మళ్లీ సినిమా ఫ్లాట్ గా తయారవుతుంది. దీనికితోడు దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా ఆడియన్ ను కొన్నిసార్లు కన్ఫ్యూజన్ లో పడేస్తుంది. అలా పడుతూలేస్తూ, క్లైమాక్స్ కు వచ్చేసరికి కథ సుఖాంతం అనిపించారు.

నిజానికి ఇలాంటి స్క్రీన్ ప్లేతో ఇద్దరు మీడియం రేంజ్ హీరోలు ఈ పిట్టకథను చేసి ఉంటే రిజల్ట్ ఓ రేంజ్ లో ఉండేది. విశ్వంత్ లాంటి చిన్న హీరో, సంజయ్ లాంటి కొత్త హీరో కలిసి చేయడం వల్ల, లో-ప్రొడక్షన్ వాల్యూస్ తో తీయడం వల్ల పిట్టకథ మెప్పించలేకపోయింది.

బాటమ్ లైన్ – హిట్టు కథ కాదు

రేటింగ్2.5/5