'ఎన్.టి.ఆర్ కథానాయకుడు' మూవీ రివ్యూ

Wednesday,January 09,2019 - 02:18 by Z_CLU

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్, సుమంత్, రాజా దగ్గుబాటి, రానా దగ్గుబాటి , కళ్యాణ్ రామ్, నిత్య మీనన్, రకుల్,హన్సిక,పాయల్, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, క్రిష్ తదితరులు.

మ్యూజిక్ : కీరవాణి

ఛాయాగ్రహణం : జ్ఞాన శేఖర్

మాటలు : సాయి మాధవ్ బుర్రా

సమర్పణ : సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి

నిర్మాతలు : నందమూరి వసుందర, నందమూరి బాలకృష్ణ

దర్శకత్వం : క్రిష్

సెన్సార్ : U

నిడివి : 171 నిమిషాలు 

విడుదల తేది : 09 జనవరి 2019

 

తెలుగుతెరపై దేవుడిగా నీరాజనాలు అందుకున్న తండ్రి NTR చరిత్రను తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేయాలనే సంకల్పంతో బాలయ్య చేసిన సినిమా’ఎన్.టి.ఆర్’.. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం ‘ఎన్.టి.ఆర్ కథానాయకుడు’ సంక్రాంతి స్పెషల్ గా ఈ రోజే థియేటర్స్ లోకొచ్చింది. క్రిష్ డైరెక్షన్ లో ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన ఈ బయోపిక్ నందమూరి తారకరామారావుకి ఘన మైన నివాళి అందించిందా…? కథానాయకుడిగా బాలయ్య నందమూరి అభిమానులతో పాటు అందరినీ ఆకట్టుకోగాలిగాడా..? ఈ బయోపిక్ ను దర్శకుడిగా క్రిష్ ఎలా డీల్ చేసాడు… జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ .

 

కథ :

ఎన్టీఆర్‌ బాల్యం జోలికి వెళ్ళకుండా డైరెక్ట్‌గా ఆయన సినీ జీవితంతోనే కథను మొదలుపెట్టారు. ఓ హాస్పిటల్ లో క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి బసవరామ తారకం(విద్యాబాలన్‌) దగ్గరికి వెళ్లి హరికృష్ణ(కళ్యాణ్ రామ్) మాట్లాడే సన్నివేశం నుండి సినిమా ప్రారంభమవుతుంది. ఆమె ఎన్టీఆర్ ఆల్బమ్‌ను చూస్తుండగా కథ మొదలవుతోంది. రామారావు (బాలకృష్ణ) రిజిస్టర్‌ ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడ మిగతా ఉద్యోగుల పద్దతులు నచ్చక, అలాగే వారు లంచం తీసుకుంటూ పనిచేయడం చూడలేక చేరిన కొన్ని వారాలకే ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వెళ్లాలని
నిర్ణయించుకుంటాడు.

అయితే గతంలో రామారావు వేసిన నాటకం చూసిన సినిమా అవకాశం ఇస్తానంటూ ఆయన్ను కలిసేందుకు మద్రాస్‌ రమ్మని ఎల్వీ ప్రసాద్‌ (జిష్షు) పంపిన కబురు గుర్తుకొచ్చి అలా మద్రాసు చేరిన రామారావు సినీ ప్రయాణం ఎలా మొదలైంది. మొదట్లో నటుడిగా ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులేంటి….. ఆ తర్వాత ఆయన ఇండియన్ సూపర్ స్టార్ గా ఎలా ఎదిగారు… అక్కినేని నాగేశ్వర్రావు (సుమంత్‌)తో ఆయన అనుబంధం. వెండితెర దేవుడిగా నీరాజనాలు అందుకున్న ఆయన ఖ్యాతి.. ఆయన్ను రాజకీయాలవైపు నడిపించిన పరిస్థితులు, సంఘటనలను కథగాచూపించారు. ఇక చివరిగా కథానాయకుడు పార్ట్ ని ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పేరు ప్రకటించటంతో ముగించి మహానాయకుడు రెండో భాగంపై ఆసక్తి నెలకొల్పారు.

 

నటీ నటుల పనితీరు :

ఫస్ట్ లుక్ తోనే ఆకట్టుకున్న నందమూరి బాలకృష్ణ తండ్రి పాత్రలో మెప్పించాడు. గెటప్స్ తో చాలా సందర్భాల్లో తండ్రిని గుర్తుచేసాడు. ముఖ్యంగా నటుడిగా ఈ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకున్న బాలయ్య నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో తండ్రి హావ భావాలతో అభిమానులను బాగా అలరించాడు. ఇక రామారావు గారి భార్య బసవ తారకం పాత్రలో విద్యా బాలన్ బాగా నటించి రోల్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంది. అక్కినేని నాగేశ్వరావు గా సుమంత్ ఆకట్టుకొని తాతని గుర్తుచేసాడు. నాగిరెడ్డి గా ప్రకాష్ రాజ్, చక్రపాణిగా మురళి శర్మ, కే.వి.రెడ్డి గా క్రిష్ దాసరి గా చంద్ర సిద్దార్థ్, నారా చంద్రబాబు నాయుడుగా దగ్గుబాటి రానా, నాదెండ్ల భాస్కరరావు గా సచిన్ ఖేడ్కర్, త్రివిక్రమ రావు గా దగ్గుబాటి రాజా, సావిత్రిగా నిత్యా మీనన్, శ్రీదేవి గా రకుల్, జయప్రదగా హన్సిక, రేలంగి గా బ్రహ్మానందం, ఇలా అందరూ వారి వారి పాత్రలకు పర్ఫెక్ట్ అనిపించుకొని ఈ బయోపిక్ లో భాగమయ్యారు.

 

సాంకేతిక వర్గం పనితీరు:

సినిమాకు కీరవాణి మ్యూజిక్ పెద్ద ఎస్సెట్. ముఖ్యంగా  సినిమా టైటిల్ కార్డ్స్ లో వచ్చే ‘కథానాయక’, ‘వెండితెర దొర’ సాంగ్స్ అందరినీ ఆకట్టుకుంది. కొన్ని కీలక సన్నివేశాలకు కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. ఇక కీరవాణి తర్వాత మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించే.. జ్ఞాన శేకర్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సీన్స్ లో ఆయన పనితనం కనబడింది. ఆర్ట్ వర్క్ బాగుంది. అప్పటి వాతావరణాన్ని రీ క్రియేట్ చేయడంలో ఆర్ట్ డైరెక్టర్ కీలక పాత్ర పోషించాడు. ఎడిటింగ్ బాగుంది కానీ ఇంకాస్త ట్రిమ్ చేసి నిడివి తగ్గించి ఉంటే బాగుండేది. సాయి మాధవ్ బుర్రా అందించిన మాటలు ఆకట్టుకున్నాయి. కొన్ని సందర్భాల్లో వచ్చే డైలాగ్స్ ఆడియన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేసాయి. క్రిష్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే బాగుంది. NBKఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

జీ సినిమాలు రివ్యూ:

రాముడు, రావణుడు, కృష్ణుడు, బృహన్నల ఇలా ఏ పాత్ర అయినా మనకు గుర్తొచ్చేది నందమూరి తారక రామారావే. ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవడం అసంభవం. అలాంటి వ్యక్తి జీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తున్నప్పుడు, కేవలం గెటప్స్ మీద దృష్టిపెడితే సరిపోదు. ఇంకెంతో రీసెర్చ్ అవసరం. అంతకుమించి హోం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాలో కనిపిస్తాయి.

అయితే ఎన్టీఆర్ గెటప్స్ పైనే ఎక్కువగా దృష్టిపెట్టిన క్రిష్.. కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ఎమోషన్స్ పండించలేకపోయాడు. కొన్ని సన్నివేశాలు అతికించినట్టున్నాయి తప్ప, ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోయాయి. ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాలో ప్రధాన లోపం ఇదే. సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా అంత హిట్ అయిందంటే కారణం ఆ ఎమోషనల్ కనెక్ట్.

శ్రీకృష్ణుడి పాత్ర ఎలివేషన్, పది తలల రావణబ్రహ్మ ఎపిసోడ్, దివిసీమ ఉప్పెన ఎపిసోడ్స్ బ్రహ్మాండంగా ఆకట్టుకుంటాయి. మిగతావన్నీ కట్ అండ్ క్యారీ టైపులో సాగిపోతుంటాయి. దీనికి తోడు మిగతా కీలకపాత్రలు కూడా పెద్దగా క్లిక్ అవ్వకపోవడం మైనస్. సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్, బసవతారకం, త్రివిక్రమరావు పాత్రలు మాత్రమే ప్రముఖంగా కనిపిస్తాయి. మిగతావన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటాయి.

ఇలాంటి నెగెటివ్స్ పక్కనపెడితే.. తెలుగు సినీప్రేక్షకులకు ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా విందుభోజనంలా అనిపిస్తుంది. ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాలో సన్నివేశాలు, పాటలు అలా వచ్చి వెళ్తుంటే చప్పట్లు కొట్టకుండా ఉండలేం. దాదాపు అన్ని పాత్రలకు బాలయ్య ప్రాణప్రతిష్ట చేశారు. స్క్రీన్ ప్లేలో జర్క్ లు ఉన్నప్పటికీ.. సబ్-రిజిస్ట్రార్ ఉద్యోగానికి రాజీనామా చేయడం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు కథానాయకుడు సినిమాను క్రిష్ చక్కగా నడిపించాడు. పౌరాణిక, జానపద పాత్రల్లో బాలయ్యను అద్భుతంగా చూపించాడు.

కీరవాణి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. టైటిల్ సాంగ్ నుంచి స్టార్ట్ చేస్తే రోలింగ్ టైటిల్స్ లో సాంగ్ వరకు ప్రతి సీన్ లో కీరవాణి మేజిక్ చేశాడు. నిర్మాతగా బాలయ్య హండ్రెస్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. స్లో నెరేషన్, రన్ టైమ్ లాంటివి మినహాయిస్తే.. కథానాయకుడు సినిమా ఎన్టీఆర్ సినీవైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది.

రేటింగ్3/5