ఎన్టీఆర్-మహానాయకుడు రివ్యూ

Friday,February 22,2019 - 10:38 by Z_CLU

నటీనటులు: బాలకృష్ణ, విద్యా బాలన్, సుమంత్, రాజా దగ్గుబాటి, రానా దగ్గుబాటి, కళ్యాణ్ రామ్, సచిన్ ఖేడేకర్, తరుణ్, గ్రీష్మ తదితరులు.
మ్యూజిక్ : కీరవాణి
ఛాయాగ్రహణం : జ్ఞాన శేఖర్
మాటలు : సాయి మాధవ్ బుర్రా
సమర్పణ : సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
నిర్మాతలు : నందమూరి వసుందర, నందమూరి బాలకృష్ణ
దర్శకత్వం : క్రిష్
సెన్సార్ : U
నిడివి : 128 నిమిషాలు
విడుదల తేది : 22 ఫిబ్రవరి 2019

కథానాయకుడు సినిమా తర్వాత వెంటనే మహానాయకుడు సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కథలో చిన్న చిన్న మార్పులు చేయడంతో పాటు మరికొంత షూటింగ్ పెండింగ్ ఉండడంతో వాయిదావేశారు. అలా వాయిదాపడిన మహానాయకుడు సినిమా సరికొత్త హంగులతో ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ


కథ
కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ సినీప్రస్థానాన్ని చూపించారు. రాజకీయ పార్టీ స్థాపించబోతున్నానంటూ చేసే ప్రకటనతో ఆ సినిమాను ముగించారు. ఇక రెండో భాగం ఎన్టీఆర్-మహానాయకుడు బాలయ్య వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది. ఇది మనందరి కథ, మా నాన్న కథ అంటూ బాలయ్య వాయిస్ తో ప్రారంభమైన సినిమా, అక్కడ్నుంచి తన కొడుకు హరికృష్ణ (కల్యాణ్ రామ్)కు బసవతారకం (విద్యాబాలన్) ఫొటో ఆల్బమ్ చూపించడంతో కథ మొదలవుతుంది. ఇక అక్కడ్నుంచి మెల్లగా పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది.

జెండా, ఎజెండాను ఎన్టీఆర్ తయారుచేయడం.. జెమినీ రికార్డింగ్ వ్యాన్ ను చైతన్యరథంగా మార్చడం..  కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అఖండ విజయంతో గెలవడం.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం.. సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం.. ఇలా ఎన్నో సన్నివేశాలు చకచకా సాగిపోతుంటాయి. ప్రమాణస్వీకారం టైమ్ లో ఏఎన్నార్, చంద్రబాబు సంభాషణ ఆకట్టుకుంటుంది.

ఇక అక్కడ్నుంచి నాదెండ్ల భాస్కర రావు (సచిన్ ఖేడేకర్) ఎంట్రీ. అధికారాన్ని తన చెప్పుచేతల్లోకి తీసుకోవడం… ఎన్టీఆర్ దాన్ని వ్యతిరేకించడం… చంద్రబాబు (రానా) ఎమ్మెల్యేలందర్నీ కూడగట్టడం.. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం తర్వాత మళ్లీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వడంతో సినిమా ముగుస్తుంది.

నటీనటుల పనితీరు
పార్ట్-1లో చూసేసిన పాత్రలే కావడంతో మహానాయకుడులో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. తండ్రి ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయాడు. బసవతారకం పాత్ర పోషించిన విద్యాబాలన్, హరికృష్ణగా కల్యాణ్ రామ్ ఆకట్టుకున్నారు. పార్ట్-2లో కొత్తగా వచ్చిన పాత్రల్లో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది చంద్రబాబు క్యారెక్టర్. రానా ఈ పాత్ర పోషించాడు. మొత్తంగా కాకపోయినా అక్కడక్కడ చంద్రబాబును గుర్తుకుతెచ్చాడు.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో యంగ్ బసవతారకంగా గ్రీష్మ, యంగ్ ఎన్టీఆర్ గా తరుణ్ ఆకట్టుకున్నారు. నాదెండ్ల భాస్కరరావుగా సచిన్ ఖేడేకర్ బ్రహ్మాండంగా నటించాడు. రెండో భాగంలో నటన పరంగా బాలయ్య తర్వాత హైలెట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి రానా, సచిన్ పాత్రలు మాత్రమే.

టెక్నీషియన్స్ పనితీరు
పార్ట్-1 కథానాయకుడులో కనిపించినట్టుగానే పార్ట్-2లో కూడా క్రిష్ వర్క్ కనిపించింది. టెక్నీషియన్స్ అందరి దగ్గర్నుంచి బెస్ట్ ఔట్ పుట్ తీసుకున్నాడు క్రిష్. పార్ట్-1లో గెటప్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన క్రిష్, పార్ట్-2లో పొలిటికల్ కాన్ ఫ్లిక్ట్ ను, ఎమోషన్ ను బాగా క్యారీ చేయగలిగాడు. 2 గంటల్లోనే సినిమా ముగించాడంటే క్రిష్ ఎంత ప్యాక్డ్ గా స్క్రీన్ ప్లే రాసుకున్నాడో అర్థమౌతుంది.

ఇక క్రిష్ తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరక్టర్, సినిమాటోగ్రాఫర్ గురించి. మొదటి భాగంలో మెస్మరైజ్ చేసిన కీరవాణి, సెకెండ్ పార్ట్ లో కూడా అదరగొట్టాడు. ఈ సినిమాకు బ్యాక్ బోన్ కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్. కొన్ని సాధారణ సన్నివేశాలు కూడా కట్టిపడేశాయంటే దానికి కారణం కీరవాణి. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, బుర్రా సాయిమాధవ్ మాటలు అదనపు ఆకర్షణలుగా నిలిచాయి.

జీ సినిమాలు సమీక్ష :
ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాలో ఎమోషన్ మిస్ అయింది. నెరేషన్ చాలా ఫ్లాట్ గా ఉంటుంది. అందుకే కొంతమంది ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. ఆ మిస్టేక్ ను రెండో భాగం ఎన్టీఆర్-మహానాయకుడులో రిపీట్ చేయలేదు క్రిష్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన మహానాయకుడులో డ్రామా పుష్కలంగా ఉంది. ఎమోషన్ పరంగా కొంత పండింది.

సినిమా విషయానికొస్తే రెండు గంటల నిడివిలో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం, జనాల్లోకి వెళ్లి చేసిన ఆయన చేసిన ప్రచారం, నాయకుడి నుండి మహానాయకుడిగా ఎదిగిన తీరు, అలాగే ఆయన రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా ఎదుర్కొన్న సంఘటనలు, భాస్కరరావు ని ముఖ్యమంత్రి పదవి నుండి దింపి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం లాంటి కొన్ని అంశాలను చూపించారు.

నందమూరి తారకరామారావు బాల్యం, బసవ తారకంతో వివాహం తాలుకూ సన్నివేశాలతో ‘రామ రామ రామన్న కథ’ అనే పాటతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు క్రిష్… పార్టీ పెడుతున్నాం అంటూ ప్రకటించి తెలుగుదేశం జెండాని చేతితో గోడపై వేసి ఎన్టీఆర్ తన ఎజెండాను తెలిపే సన్నివేశం నుండి అసలు కథను మొదలు పెట్టాడు క్రిష్.

యవ్వనం నుండి రామారావు -బసవ తారకం మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ను చూపిస్తూ వచ్చిన క్రిష్ చివరికి బసవతారం మరణంతో సినిమాను పూర్తి చేశాడు. మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ లో బసవతారకం చెప్పే కథతో సినిమా చూపించిన క్రిష్ ‘మహానాయకుడు’ కథను కూడా బసవతారకం పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చెప్పుకొచ్చాడు. రామారావు-బసవతారకం మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలను బాగా తెరకెక్కించాడు. ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి.

ఇంటర్వెల్ వరకూ ఎన్టీఆర్ ను హీరోగా చూపించి రెండో భాగంలో ఎన్టీఆర్ కి చంద్రబాబు కుడిభుజంలా మారినట్టు చూపించారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు పాత్రే ఫ్రంట్ సీట్ లోకి వచ్చేస్తుంది. ముఖ్యంగా భాస్కరరావు ను ముఖ్యమంత్రి పదవి నుండి దింపే ప్లాన్ లో కీలకమైన ఏపీ ఎక్స్ ప్రెస్ ఎపిసోడ్ లో చంద్రబాబు కీలక పాత్ర పోషించి ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడానికి సహకరించినట్లుగా చూపించారు. ఆ సన్నివేశాల్లో చంద్రబాబు ఐడియాలజీ, రాజకీయాల మీద బాబు కి ఉన్న పట్టు లాంటి సన్నివేశాల్లో రానా హీరోలా కనిపిస్తాడు.

‘రెండు రూపాయలకే కిలో బియ్యం’ పథకం, ‘ఆడపడుచులకు ఆస్తిలో సగ భాగం’ ఇచ్చే పథకంతో పాటు తెలుగు గంగ ప్రాజెక్టు తో ముఖ్యమంత్రి గా సక్సెస్ అయిన ఎన్ఠీఆర్ …ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి తగ్గించడం అనే కాన్సెప్ట్ ను ప్రవేశ పెట్టి ఆ తర్వాత ఉద్యోగుల వ్యతిరేకతతో మళ్లీ వెనక్కి తీసుకోవడం లాంటి విషయాలను కూడా చూపించారు. అలాగే కొన్ని సందర్భాల్లో మొండితనంతో ముందుకెళ్లిన ఎన్ఠీఆర్ ధైర్యాన్ని ఆయన తెగించి చేసిన సాహసాలు చూపిస్తూనే రాజకీయ నాయకుడిగా ఎదుర్కొన్న ఒడిదుడుకులను కొంత వరకూ చూపించే ప్రయత్నం చేశారు.

అసెంబ్లీ లో విశ్వాస తీర్మానం తాలుకు సన్నివేశాలు బాగున్నాయి. అవి అందరినీ ఆకట్టుకునేలా తెరకెక్కించాడు క్రిష్. ఆ సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎన్ఠీఆర్ మీదకు వెళ్లి తిట్టే సీన్లు చాలా సహజంగా ఉన్నాయి. ఆ సన్నివేశాలు ఇప్పటి తరానికి అప్పటి రాజకీయ పరిస్థితులను తెలియజేసేలా ఉన్నాయి.

బసవతారకం పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కథ మొదలు పెట్టడం, ఆ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, అలాగే సెకండ్ హాఫ్ లో ఎన్ఠీఆర్ ను హైలైట్ చేయాల్సిన సన్నివేశాలను పెద్దగా పట్టించుకోకపోవడం, చంద్రబాబు క్యారెక్టర్ ను కాస్త హైలైట్ చేయడం ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తాయి. ఏదేమైనా ఇలా రెండు పార్టులుగా కాకుండా ఒకే పార్ట్ గా తీసి రక్తి కట్టించే సన్నివేశాలతో ఎన్టీఆర్ బయోపిక్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ జెనెరేషన్ లో ఓ క్లాసిక్ సినిమా అయ్యి ఉండేది. రెండు పార్టులుగా తీయడమే పెద్ద మైనస్.

ఓవరాల్ గా కొన్ని రాజకీయ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ తో ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ పొలిటికల్ డ్రామాగా పరవాలేదనిపిస్తుంది. కానీ కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఏ రేంజ్ కి
వెళ్తుందనేది వేచి చూడాలి.

రేటింగ్: 3/5