'నోటా' మూవీ రివ్యూ

Friday,October 05,2018 - 02:29 by Z_CLU

న‌టీన‌టులు : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ్రీన్, స‌త్య‌రాజ్, నాజ‌ర్ త‌దిత‌రులు

సంగీతం : సమ్. సి.ఎస్

సినిమాటోగ్ర‌ఫీ : శాంత‌న కృష్ణ‌ణ్

క‌థ‌ : షాన్ క‌రుప్పుసామి

నిర్మాణం : స‌్టూడియో గ్రీన్

నిర్మాత‌ : జ్ఞాన‌వేల్ రాజా

ద‌ర్శ‌కుడు : ఆనంద్ శంక‌ర్

నిడివి : 149 నిమిషాలు

విడుదల తేది : 5 అక్టోబర్ 2018

టాలీవుడ్ లో వరుస విజయాలతో సెన్సేషనల్ స్టార్ అనిపించుకున్న విజయ్ దేవర కొండ ‘నోటా’ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆనంద్ శంకర్ డైరెక్షన్ లో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే థియేటర్స్ లోకొచ్చింది. విజయ్ దేవర కొండ యంగ్ చీఫ్ మినిస్టర్ గా మెస్మరైజ్ చేసాడా… ‘నోటా’ తమిళ్, తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందా… జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ

కథ :

ముఖ్యమంత్రి వాసుదేవ్ (నాజర్) కొడుకు వరుణ్(విజయ్ దేవరకొండ) లండన్ లో గేమ్ డిజైనర్ గా జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటాడు. ఓ సందర్భంలో తన తండ్రి వాసుదేవ్ ఒక కేసు నిమిత్తం జైలుకు వెళ్లాల్సి ఉండటంతో ఇండియా రాగానే ఇష్టం లేకుండానే ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తాడు వరుణ్. రాజకీయంలో ఎటువంటి అనుభవం లేని వరుణ్ ముఖ్యమంత్రి అయ్యాక కొన్ని సంఘటనలలో రాజకీయ నాయకులు ఎలా ప్రవర్తిస్తాడు వెనుక ఎలాంటి రాజాకీయాలు చేస్తుంటారో తెలుసుకుంటాడు. అలాగే తను ముఖ్యమంత్రి అవ్వడం వెనుక ఒక స్వామిజి హస్తం ఉంటుందని తెలుసుకుంటాడు.. తన తండ్రి వాసుదేవ్ జైలుకి వెళ్ళిన అనంతరం వరుణ్ జర్నలిస్ట్ మహేంద్ర(సత్య రాజ్)తో కలిసి చాలా మార్పులు తీసుకొస్తాడు. మరో వైపు ప్రతి పక్ష పార్టీ లీడర్ కూతురు కళా (సంచన నటరాజన్) వరుణ్ గురించి నెగిటీవ్ గా ప్రచారం చేస్తుంటుంది. చివరికి తన తండ్రి జైలు నుండి బయటికొచ్చాక ఏం జరిగింది.. వరుణ్ రాజకీయ పరిస్థితులను ఎలా కంట్రోల్ చేసాడు.. చివరికి వరుణ్ తనను తాను జనం మెచ్చిన నాయకుడిగా ఎలా తీర్చిదిద్దుకున్నాడు.. అనేది సినిమా కథాంశం.

 

నటీ నటుల పనితీరు :

ఇప్పటి వరకూ విజయ్ చేసిన అన్ని పాత్రల్లోకి ఇది భిన్నమైన పాత్ర. వెండితెరపై రాజకీయ నాయకుడిగా మెప్పించాలంటే ఏ నటుడికైనా ఛాలెంజే. వరుణ్ అనే యంగ్ చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ ను ఛాలెంజింగ్ గా తీసుకున్న విజయ్ ఆ క్యారెక్టర్ బెస్ట్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాలో తనలోని ఎమోషన్ ని బయటపెట్టే పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసాడు. ఇక నాజర్ ఎప్పటిలాగే క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసారు. సత్య రాజ్ జర్నలిస్ట్ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. క్యారెక్టర్ కి స్కోప్ లేకపోవడంతో మెహ్రీన్ మూడు నాలుగు సీన్లకే పరిమితం అయి పరవాలేదనిపించుకుంది. సంచన నటరాజన్ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రియదర్శి ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించి ఓకె అనిపించాడు. మిగతా నటీ నటులంతా వారి క్యారెక్టర్స్ కి న్యాయం చేసారు.

సాంకేతికవర్గం పనితీరు :

శాంత‌న కృష్ణ‌ణ్ సినిమాటోగ్రఫీ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచింది. కొన్ని సన్నివేశాల్లో కెమెరా వర్క్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. స‌్యామ్ సిఎస్ అందించిన పాటలు అలరించలేకపోయాయి. కొన్ని సందర్భాల్లో వచ్చే నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. రెండో భాగంలో ఇంకొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేస్తే బాగుండేది. ఆర్ట్ వర్క్ బాగుంది. ఆనంద్ శంకర్ డైరెక్షన్ పరవాలేదు అనిపించినా…. స్క్రీన్ ప్లే మాత్రం తేడా కొట్టింది. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.

జీ సినిమాలు సమీక్ష :

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.. వచ్చినప్పుడు మాత్రం అందరి చూపు ఆ పొలిటికల్ సినిమా మీదే ఉంటుంది. రిలీజ్ కి ముందే ఆ సినిమా ఏదో ఒక కాంట్రవర్సీ తో వార్తల్లో కూడా నిలుస్తుంది. సరిగ్గా ‘నోటా’ సినిమకి కూడా ఇదే జరిగింది… ఓ పార్టీ ని సపోర్ట్ చేసే కంటెంట్ తో సినిమా తెరకెక్కిందని ‘నోటా’ పై రిలీజ్ కి ముందే కేసులు పెట్టారు. అయితే ప్రతీ సినిమాకు ఇలాంటి కాంట్రవర్సీ లు చూసి చూసి అలవాటైయిపోయిన విజయ్ మాత్రం ఆ మేటర్ ని లైట్ తీసుకున్నాడు.. ప్రస్తుతం తమిళనాడు, తెలంగాణాలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్టా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినిమా విషయానికొస్తే తమిళ నవలను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్ శంకర్ తన స్క్రీన్ ప్లే తో ఆసక్తి కరంగా తెరకెక్కించడంలో విఫలం అయ్యాడు. ముఖ్యంగా పొలిటికల్ డ్రామాలో ఉండాల్సిన ఇంట్రెస్టింగ్ మసాలా డ్రామా సినిమాలో మిస్ అయ్యింది. సినిమా స్టార్ట్ అయిన కొంత సేపటికే కొన్ని బలమైన సన్నివేశాలు రాకపోతాయా.. అని ఎదురుచూసిన ప్రేక్షకులను కొంత వరకూ మాత్రమే అలరించగలిగాడు దర్శకుడు. ముఖ్యంగా రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేని యువకుడు ముఖ్య మంత్రి అయితే అతడికి ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి.. అతని చుట్టూ ఎలాంటి పరిస్థితులు అల్లుకుంటాయి అనే అంశాలపై దర్శకుడు మరింత దృష్టి పెడితే బాగుండేది.

ఓ నవల కథకి తమిళనాడులో జరిగిన కొన్ని సంఘటనలు జతచేర్చి ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యాడు. విజయ్ దేవరకొండ ఎంత మేజిక్ చేసినా చాలా సందర్భాల్లో అరవ వాసనే ఎక్కువగా డామినేట్ చేసింది. ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాక కూడా విజయ్ గదిలోనే ఉండటం లాంటి సన్నివేశాలు ప్రేక్షకుడికి బాగా బోర్ కొట్టిస్తాయి.

ఒక యువకుడు ముఖ్యమంత్రి అయితే అసలు సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయి.. యువత రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుంది… లాంటి అంశాలపై కూడా దర్శకుడు ఫోకస్ పెట్టి ఉంటే రిజల్ట్ బెటర్ గా ఉండేది. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్, క్యారెక్టర్స్, సినిమాటోగ్రఫీ, ఫస్ట్ హాఫ్ లో ధర్నా సన్నివేశం, సెకండ్ హాఫ్ కొన్ని సన్నివేశాలు సినిమాలో హైలైట్స్ కాగా స్క్రీన్ ప్లే, సాంగ్స్, సత్య రాజ్, నాజర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, ప్లీ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు మైనస్ అనిపిస్తాయి.

ఫైనల్ గా ‘నోటా’ తెలుగు ప్రేక్షకుల వోట్లు అందుకోలేకపోయింది.

రేటింగ్ : 2 / 5