'చెక్' మూవీ రివ్యూ

Friday,February 26,2021 - 01:20 by Z_CLU

నటీ నటులు : నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరి తదితరులు.

సంగీతం : కళ్యాణి మాలిక్

ఛాయా గ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్

ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి

నిర్మాత : వి.ఆనంద ప్రసాద్

రచన – దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి.

నిడివి : 140 నిమిషాలు

విడుదల తేది : 26 ఫిబ్రవరి 2021

విభిన్న కథా చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న చంద్ర శేఖర్ ఏలేటి డైరెక్షన్ లో ‘చెక్’ సినిమా చేశాడు నితిన్. ఇద్దరు కలిసి ఫస్ట్ టైం క్రైం డ్రామా జోనర్ లో స్పోర్ట్ నేపథ్యంలో సినిమా చేసారు. మరి ఈ కాంబో ‘చెక్’ తో ప్రేక్షకులను మెప్పించి అలరించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 

కథ :

చిన్నతనం నుండి మోసాలు చేస్తూ అనాథగా పెరిగిన ఆదిత్య(నితిన్) ను అనుకోకుండా NIA అధికారులకి చిక్కి  ఉగ్రవాది అనే ముద్ర వేసుకొని జైలులో అడుగుపెడతాడు . అలా చేయని తప్పుకి జైలుకి వెళ్లి ఉరి శిక్ష దాక వెళ్ళిన ఆదిత్య లాయర్ మానస(రకుల్) సహాయంతో శిక్ష నుండి తప్పించుకోవాలని చూస్తుంటాడు. మానసకి తన జీవితంలోకి అనుకోకుండా వచ్చి కనుమరుగైన యాత్ర(ప్రియా ప్రకాష్ వారియర్) గురించి చెప్తూ తన కేసుని వాదించమని కోరుకుంటాడు. ఈ క్రమంలో జైలులో ఉండే శ్రీమన్నారాయణ(సాయి చంద్) ద్వారా చదరంగం నేర్చుకుంటూ వరుసగా చెస్ పోటీల్లో విజయం సాధించి చివరికి నేషనల్ లెవెల్ లో మాస్టర్ ప్లేయర్ అనిపించుకుంటాడు.

ఇంతకీ ఆదిత్య జీవితంలోకొచ్చిన యాత్ర ఎవరు ?  అతని జీవితాన్ని జైలుకి పరిమితం చేసిన వారెవరు ? చివరికి ఆదిత్య ఉరి శిక్ష నుండి తప్పించుకున్నాడా లేదా ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

మొదటి సారి ఖైదీ రోల్ చేసిన నితిన్ ఆదిత్య పాత్రలో ఒదిగిపోయాడు. ఛాలెంజింగ్ రోల్ ని అంతే ఛాలెంజింగా చేసి నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు. లాయర్ పాత్రలో రకుల్ ఆకట్టుకుంది. కాకపోతే యాక్టింగ్ స్కోప్ లేకపోవడంతో నటిగా మెప్పించలేకపోయింది. ప్రియా ప్రకాష్ వారియర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే కొన్ని సీన్స్ , సాంగ్ తో సరిపెట్టుకుంది.

చెస్ ప్లేయర్ గా సాయి చంద్ నటన బాగుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో చేసిన పోలీస్ క్యారెక్టర్స్ కావడంతో మురళి శర్మ, సంపత్ రాజ్ మరో సారి ఆ రోల్స్ తో మెప్పించారు. ఆదిత్యతో కలిసి జనాలను మోసం చేసే క్యారెక్టర్ లో  సిమ్రాన్ చౌదరి డీసెంట్ అనిపించుకుంది. లాయర్ పాత్రలో పోసాని అలరించాడు. శంకర్ గా హర్ష వర్ధన్  ఆదిత్య స్నేహితుడు స్వామీ పాత్రలో కృష్ణ చైతన్య తమ పాత్రలకి న్యాయం చేశాడు. మిగతా వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

క్రైం డ్రామా సినిమాల్లో సన్నివేశాలకు మరింత బలం చేకూర్చే నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. ‘చెక్’ కి అలాంటి నేపథ్య సంగీతాన్నే అందించి మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు కళ్యాణీ మాలిక్. సినిమాలో ఉన్న ఒకే ఒక్క పాట ‘నిన్నూ చూడకుండా’ కూడా ఆకట్టుకుంది. రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరా పనితనం  బాగుంది. వివేక్ అన్నామలై ఆర్ట్ వర్క్ సినిమాకు ప్లస్ అయ్యింది. అనల్ అనిరుద్దన్ ఎడిటింగ్ ఫరవాలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని అలరించేలా ఉన్నాయి.

చంద్ర శేఖర్ ఏలేటి రాసుకున్న కథ బాగుంది.. కానీ కథనం ఆకట్టుకోలేకపోయింది. భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగినట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

కొందరు దర్శకుల నుండి కొత్త కథలతో సరికొత్త సినిమాలు ఆశిస్తారు ప్రేక్షకులు. ఆ లిస్టులో దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి ఒకడు. తొలి సినిమా నుండే విభిన్న కథలను ఎంచుకుంటూ విభిన్న చిత్రాల దర్శకుడిగా ముద్ర వేసుకున్న చంద్ర శేఖర్ ఈసారి కూడా క్రైం డ్రామాలో స్పోర్ట్ ని మిక్స్ చేసి ప్రయోగం చేశాడు. కాకపోతే ఆ ప్రయోగానికి మంచి కథనం , ఆసక్తికలిగించే సన్నివేశాలు, ట్విస్టులు రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు.

ముఖ్యంగా లాజిక్స్ గాలికొదిలేసి సినిమాను ఫ్లాట్ స్క్రీన్ ప్లే తో నడిపించాడు. ఒక టెర్రరిస్టుని జైలు అధికారి మాటిమాటికి పిలుస్తూ సరదాగా మాట్లాడటం , అతన్ని మిగతా ఖైదీలాగానే ట్రీట్ చేయడం వంటివి ప్రేక్షకులకు మింగుడు పడవు. ఇక చంద్ర శేఖర్ కథలో రాసుకున్న చెస్ ఎలిమెంట్ కూడా క్రైం డ్రామాలో ఇబ్బందిగా ఇరికించినట్టుగా అనిపించిందే తప్ప సినిమాను నిలబెట్టలేకపోయింది. పైగా జైల్లో ఎంటరయ్యాక హీరో రాత్రికి రాత్రి చెస్ నేర్చుకొని రోజు రోజుకి మాస్టర్ లా దూసుకుపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. దాంతో క్లైమాక్స్ కి ముందు వచ్చే చెస్ గేమ్ సన్నివేశాలు కూడా ఆసక్తిగా అనిపించవు.  ఇవన్నీ స్క్రిప్టింగ్ స్టేజిలో సరిచేసుకుంటే బాగుండేది.

యూత్ ఫుల్ లవ్ స్టోరీ సినిమాల నుండి బయటికొచ్చి ఇలాంటి ప్రయత్నం చేసినందుకు నితిన్ ని మెచ్చుకోవాలి. నటుడిగా ఈ సినిమాతో నితిన్ మరోసారి ఆకట్టుకున్నాడు. కాకపోతే పైన చెప్పుకున్నట్లు కథనం వీక్ గా ఉండటం బలమైన సన్నివేశాలు , ఊహించని ట్విస్టులు లేకపోవడం, ఫ్లాట్ నెరేషన్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ క్లిక్ అవ్వకపోవడంతో పాటు క్లైమాక్స్ సిల్లీగా అనిపించడం  సినిమాకు మైనస్ గా నిలిచాయి.

ప్లస్ పాయింట్స్ :

నితిన్

నేపథ్య సంగీతం

ఫైట్స్

సాంగ్

మైనస్ పాయింట్స్ :

బలమైన సన్నివేశాలు లేకపోవడం

ఫ్లాట్ స్క్రీన్ ప్లే

నిడివి

ఫ్లాష్ బ్యాక్

రేటింగ్ : 2.5/5