'నిశ్శబ్దం' మూవీ రివ్యూ

Friday,October 02,2020 - 10:59 by Z_CLU

నటీ నటులు : అనుష్క , మాధవన్ , అంజలి , సుబ్బరాజు , శాలిని పాండే తదితరులు

సంగీతం : గోపీసుందర్

నేపథ్య సంగీతం : గిరీష్ గోపాలకృష్ణ

ఛాయాగ్రహణం : షానియల్ డియో

క్రియేటివ్ ప్రొడ్యూసర్ : కోనా వెంకట్

నిర్మాత : TG విశ్వప్రసాద్

రచన -దర్శకత్వం : హేమంత్ మధుకర్

రన్ టైమ్ : 126 నిమిషాలు

విడుదల తేది : 1 అక్టోబర్ 2020

ఈ ఏడాది జనవరి నుండి వాయిదా పడుతూ వస్తున్న ‘నిశ్శబ్దం’ సినిమా ఎట్టకేలకు ఈ రోజు OTT ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అనుష్క ఛాలెంజింగ్ రోల్ చేసిన ఈ సినిమా మెప్పించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ

అమెరికాలో ఓ విల్లాలో కొన్నేళ్ళ క్రితం ఓ ప్రేమ జంట హత్య జరుగుతుంది. ఆ విల్లాలో ఓ ఆత్మ ఉందని అదే ఆ ఇద్దరినీ చంపిందని ప్రచారం జరుగుతుంది. మరో వైపు ఏళ్ల తరబడి పోలీసులు ఆ ఘటనపై ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. మూగ చెవిటి అమ్మాయి అయినా సాక్షి (అనుష్క) ని ఆర్ట్ గ్యాలరీలో పెయింట్స్ వేస్తుండగా చూసి ఇష్టపడి తనతో ప్రేమాయణం కొనసాగించి నిశ్చితార్థం చేసుకుంటాడు మ్యూజిషియన్ ఆంటోని(మాధవన్).

నిశ్చితార్థం అయిన మరుసటి రోజే ఉన్నపళంగా సాక్షి స్నేహితురాలు సోనాలి( శాలిని పాండే) మిస్ అవుతుంది. ఆ బాధ నుండి సాక్షి ని బయటకి తీసుకురావడానికి ఆంటోని హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తాడు. సాక్షి వేయాలనుకునే పెయింటింగ్ ఓ విల్లాలో ఉందని తెలుసుకొని తనను అక్కడికి తీసుకెళ్తాడు. అయితే ఆ విల్లాలోకి ఎంటరయిన కాసేపటికే ఆంటోనీ హత్య చేయబడతాడు. ఆ విల్లా నుండి సాక్షి ప్రాణాలతో బయటపడుతుంది. మళ్ళీ ఆ విల్లాలో హత్య జరగడం హాట్ టాపిక్ అవుతుంది. దీంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఆ హత్య కేసుపై క్రైం డిటెక్టివ్ మహా(అంజలి) ప్రత్యేక శ్రద్ధ పెట్టి మిస్టరీని ఛేదించే పనిలో ఉంటుంది. ఇంతకీ సోనాలి ఎలా మిస్సయింది..? సాక్షితో కలిసి విల్లాలోకి ఎంటరయిన ఆంటోనిని చంపిందెవరు..? అనేది నిశ్శబ్దం మిగతా కథ.

నటీనటుల పనితీరు :

సాక్షి పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకొని మాటలు లేకుండా కేవలం హావభావాలతో నటించి సినిమాకు హైలైట్ గా నిలిచింది అనుష్క. ఓ విభిన్న పాత్ర దక్కితే ఎంత ఎఫర్ట్ పెడుతుందో మరోసారి రుజువుచేస్తూ పాత్రలో లీనమై సాక్షిగా ఆకట్టుకుంది. పాజిటీవ్, నెగిటివ్ గల ఆంటోని క్యారెక్టర్ లో మాధవన్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాడు. క్రైం డిటెక్టివ్ గా మహా పాత్రలో అంజలి మెప్పించింది. సుబ్బరాజు, శాలిని పాండే తమ పాత్రలకు న్యాయం చేసారు. మైకేల్ మేడ్సన్ విలనిజంతో మంచి మార్కులు అందుకున్నాడు.

సాంకేతిక వర్గం పనితీరు :

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎట్రాక్ట్ చేసే నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. అయితే ఈ సినిమాకు గిరీష్ గోపాలకృష్ణ అందించిన నేపథ్య సంగీతం చాలా థ్రిల్లర్ సినిమాలకు విన్నట్టుగా అనిపిస్తుంది తప్ప కొత్తగా అనిపించలేదు. నిజానికి ఏదైనా కొత్త సౌండింగ్ ట్రై చేసి ఉంటే బాగుండేది. గోపీసుందర్ అందించిన పాటలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. షానియల్ డియో సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్. నిర్మాత పెట్టిన ప్రతీ రూపాయిని తన కెమెరాలో చూపిస్తూ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాడు షానియల్. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. కోనా వెంకట్ స్క్రీన్ ప్లే కొంత వరకూ ఆకట్టుకున్నా ఫైనల్ గా గతంలో వచ్చిన థ్రిల్లర్ సినిమాలను గుర్తుచేస్తుంది. హేమంత్ మధుకర్ రాసుకున్న కథలో కొత్తదనం లేదు. సాక్షి అనే చెవిటి మూగమ్మాయి పాత్రతో దర్శకుడు చేసిన ప్రయోగం చివరికి రొటీన్ అనిపిస్తుంది. పీపుల్ మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుడి ఊహకి అందకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ముందుకు సాగాలి. అప్పుడే ఆడియన్ సినిమాకు కనెక్ట్ అయి థ్రిల్ అవుతాడు. కానీ ‘నిశ్శబ్దం’ విషయానికొచ్చేసరికి సినిమా మొదలైన కాసేపటికే ఇదొక క్రైం థ్రిల్లర్ అని, తర్వాత సన్నివేశంలో ఏం జరగనుందో కూడా ప్రేక్షకుడు ఊహించేలా ఉంది. సినిమాను హారర్ ఎలిమెంట్ తో స్టార్ట్ చేసిన దర్శకుడు కాసేపటికే ఇదొక థ్రిల్లర్ సినిమా అని, కథలో దెయ్యం లేదని ప్రేక్షకుడు పసిగట్టేలా తెరకెక్కించాడు. సాక్షి అనే క్యారెక్టర్ తప్ప హేమంత్ రాసుకున్న కథలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకుడిని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు.

అయితే పాత్రలకు సూటయ్యే నటీనటులను ఎంపిక చేసి కొంత వరకూ సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ముఖ్యంగా ఆంటోని పాత్రకు మాధవన్ ని తీసుకోవడం కొత్తగా అనిపిస్తుంది. కానీ మాధవన్ క్యారెక్టర్ లో ట్విస్ట్ తెలిసాక ఇది గతంలో చూసిన పాత్రే కదా అనిపిస్తుంది. అలాగే సుబ్బరాజు పాత్రకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు హింట్ ఇవ్వడంతో ఆ పాత్ర తాలూకు ట్విస్ట్ కి ప్రేక్షకుడికి థ్రిల్ కలిగించదు.

నిజానికి కథకు అమెరికా లోకేషన్స్ ఎందుకు ఎంచుకున్నారో మేకర్స్ కే తెలియాలి. బహుశా ఇక్కడ చాలా థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి కాబట్టి అమెరికా బ్యాక్ డ్రాప్ లో కొత్తగా ఉంటుందని అక్కడికి వెళ్లి షూట్ చేసినట్టు ఉంది తప్ప కథకు ఎక్కడా పర్ఫెక్ట్ బ్యాక్ డ్రాప్ అనిపించదు. సినిమా మొదలైన కాసేపటికే ఆంటోని హత్య చేయబడం, ఆ మర్దర్ ఎవరు చేసారనే కోణంలో అమెరికన్ పోలీసులు దర్యాప్తు చేస్తుండటంతో మొదటి భాగమంతా దానితోనే సాగిపోతుంది. దానివల్ల సినిమా గతంలో వచ్చిన మర్డర్ మిస్టరీలను తలపిస్తుంది. ఇక రెండో భాగంలో దర్శకుడు రాసుకున్న ట్విస్టులు కూడా ప్రేక్షకుడిని థ్రిల్ కలిగించేలా లేవు. ఎప్పటికప్పుడు పాత్రల తాలూకు అంతరార్థం పసిగట్టేలా ఉండటంతో ఫైనల్ గా ట్విస్టులు పేలలేదు. ఫైనల్ గా అనుష్క పాత్ర తాలూకు ట్విస్టుతో క్లోజ్ అయ్యే క్లైమాక్స్ కూడా ఆమె నటించిన ‘భాగమతి’ ని గుర్తుచేస్తుంది. నెమ్మదిగా సాగే సన్నివేశాలు, రొటీన్ అనిపించే కథ, ఊహించగలిగే ట్విస్టులు సినిమాకు మైనస్. ఓవరాల్ గా ‘నిశ్శబ్దం’ ఓ రొటీన్ క్రైం థ్రిల్లర్ అనొచ్చు.

రేటింగ్ : 2/5