'నిన్ను కోరి' రివ్యూ

Friday,July 07,2017 - 02:34 by Z_CLU

నటీనటులు : నాని, నివేత థామస్‌, ఆది పినిశెట్టి

సినిమాటోగ్రఫీ : కార్తీక్‌ ఘట్టమనేని

మ్యూజిక్ : గోపీసుందర్‌

నిర్మాత: దానయ్య డీవీవీ

స్క్రీన్ ప్లే-మాటలు : కోన వెంకట్‌

రచన, దర్శకత్వం : శివ నిర్వాణ

రిలీజ్ డేట్ : జులై 7, 2017

రేటింగ్ : 3/5

 

నానికి ఈమధ్య కాలంలో ఫ్లాప్ అన్నదే లేదు. ఓ మోస్తరు సినిమాను కూడా తన యాక్టింగ్ టాలెంట్ తో మినిమం గ్యారెంటీగా మార్చేస్తున్నాడు. అలా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో.. నిన్నుకోరి అంటూ ఓ ఎమోషనల్ డ్రామాను థియేటర్లలోకి తీసుకొచ్చాడు. ఈ సినిమాతో నేచురల్ స్టార్ తన సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేశాడా.. లేదా..

కథ :

కాలేజ్ స్టూడెంట్ గా జీవితాన్ని కొనసాగిస్తూ, మరోవైపు డాన్స్ నేర్చుకునే పల్లవి ఓ మంచి డాన్సర్ అవ్వాలనుకుంటుంది. ఓ డాన్స్ మాస్టర్ కోసం ఎదురుచూస్తుంటుంది. వైజాగ్ లో హాస్టల్ లో ఉంటూ పీహెచ్ డీ చదివే ఉమామహేశ్వరరావు( నాని) రోడ్ మీద ఓ పెళ్లి వేడుకలో డాన్స్ వేస్తూ పల్లవికి కనిపిస్తాడు. ఉమా మాస్ డాన్స్ చూసి ఫిదా అయిన పల్లవి.. అతడ్ని డాన్స్ మాస్టర్ గా ఫిక్స్ అవుతుంది. అలా డాన్స్ నేర్చుకునే స్టూడెంట్ గా పరిచయం అయిన పల్లవితో ప్రేమలో పడతాడు ఉమా. ఆ తర్వాత పల్లవి కూడా తనని ప్రేమిస్తుందని తెలుసుకొని పల్లవి హెల్ప్ తో తన ఇంటి పైన బ్యాచిలర్ గా అద్దెకు దిగి పల్లవి కుటుంబానికి దగ్గరవ్వాలని చూస్తాడు. ఆలా ప్రేమించుకుంటూ త్వరలో పెళ్లి చేసుకోవాలనుకునే పల్లవి-ఉమా జీవితంలోకి అనుకోకుండా ఎంట్రీ ఇస్తాడు అరుణ్(ఆది).. ఇంతకీ అరుణ్ ఎవరు.. చివరికి ఉమా-పల్లవి ప్రేమ పెళ్లిగా మారిందా..లేదా అనేది సినిమా కథాంశం.

 

నటీనటుల పనితీరు :

నాని సినిమా అనగానే ప్రేక్షకులు ఫస్ట్ ఎక్స్ పెక్ట్ చేసేది కొత్తదనమే. ఏ సినిమా చేసినా అందులో నాని పాత్ర, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటాయని ఇప్పటికే మెంటల్లీ ఫిక్స్ అయిపోయారంతా. ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, జెంటిల్ మేన్, రీసెంట్ గా వచ్చిన నేను లోకల్ సినిమాల్లో నాని పాత్రలన్నీ కొత్తవే. నిన్ను కోరి సినిమాలో కూడా నాని ఆ కొత్తదనమే చూపించాడు. ఇలాంటి క్యారెక్టర్ ను నాని ఇప్పటివరకు పోషించలేదు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో రాజమౌళి చెప్పినట్టు నానిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా కనిపించాయి. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ లో నానిలో మెచ్యూరిటీ కనిపించింది.

ఇక నివేత థామస్, ఆది ఆ పాత్రలకు పర్ ఫెక్ట్ అనిపిస్తారు. దూరమైన ప్రేమికుడ్ని నొప్పించలేక, పెళ్లాడిన వ్యక్తిని ఇబ్బందిపెట్టలేక సతమతమయ్యే పాత్రలో నివేత బాగా నటించింది. సరైనోడు సినిమాలో సీరియస్ విలన్ గా నటించిన ఆది.. ఈ సినిమాలో కచ్చితంగా కొత్తగా కనిపిస్తాడు. సినిమాలో ఈ 3 పాత్రలే కీలకం. కథ వీటి చుట్టూనే తిరుగుతుంది.

పృథ్వి, సుధాకర్, విద్యుల్లేఖ తమ కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశారు. మురళి శర్మ, తనికెళ్ళ భరణి, భూపాల్, హేమంత్ తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

సినిమాకు పనిచేసిన ప్రతీ టెక్నీషియన్ తమ ప్రతిభ చాటుకున్నారు. ముఖ్యంగా సాంగ్స్ , బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు గోపి సుందర్. రిలీజ్ కి ముందే సాంగ్స్ తో సినిమా పై భారీ హైప్ తీసుకొచ్చిన గోపి సుందర్ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాడు. ‘అడిగా-అడిగా’,’ఉన్నట్టుండి గుండె’,’వన్స్ అపాన్ ఏ టైములో’, ‘హేయ్ బదులు చెప్పవే’ పాటలు సాహిత్యం పరంగానూ ఆకట్టుకున్నాయి. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. కొన్ని సందర్భాల్లో కోన వెంకట్ రాసిన డైలాగ్స్ బాగా పేలాయి. ముఖ్యంగా ‘ప్రేమ అనేది ఒక్కరితోనే మొదలై ఒక్కరితో పూర్తయ్యేది కాదు’,’గెలుపు మొదలయ్యేటప్పుడు తెలియదు పూర్తయ్యేటప్పుడు తెలుస్తుంది’,’ ఈ అమ్మాయిలు కూడా అస్సలు అర్ధం కారు బాసు అన్ని అలవాట్లున్నోడ్ని ప్రేమిస్తారు- ఏ అలవాటు లేనోడ్ని పెళ్లిచేసుకుంటారు.’ అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. కోన వెంకట్ స్క్రీన్ ప్లే, దర్శకుడు శివ నిర్వాణ మేకింగ్ బాగుంది. డి.వి.వి.ఎంటర్టైన్ మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

ఇదొక ఎమోషనల్ ప్రేమకథ అనే విషయాన్ని రిలీజ్ కు ముందు నుంచే చెబుతూ వస్తున్నారు మేకర్స్. పాత్రలు కూడా కాస్త బరువగా ఉంటాయనే విషయాన్ని నాని ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నాడు. అలా మెంటల్లీ ప్రిపేర్ చేయడం నిన్నుకోరి సినిమాకు కలిసొస్తుంది. ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ.

నాని మార్క్ పంచ్ లు, డైలాగ్ డెలివరీ సినిమాలో ఉంది. నివేత, ఆది సపోర్ట్ తో సినిమా సేఫ్ వెంచర్ అనిపించుకుంటుంది. కాకపోతే మొదటిసారి మెగాఫోన్ పట్టుకున్న శివ నిర్వాణ మాత్రం రొటీన్ స్టోరీని ఎంచుకున్నాడనిపిస్తోంది. ఆ ఫీలింగ్ కలగకుండా మేజికల్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నప్పటికీ.. అక్కడక్కడ అభినందన, ప్రేయసి రావే, కన్యాదానం, గాలిపటం లాంటి సినిమాలు గుర్తొస్తాయి.

క్యారెక్టర్స్, ఫస్ట్ హాఫ్ లో వచ్చే రొమాంటిక్ సీన్స్, డైలాగ్స్, సెకండ్ హాఫ్ కామెడీ, స్క్రీన్ ప్లే సినిమాకు ప్లస్ పాయింట్స్ గా చెప్పొచ్చు. అక్కడక్కడ రొటీన్ గా అనిపించే సన్నివేశాలు, క్లైమాక్స్ లో ఎమోషన్ తగ్గడం మైనస్ పాయింట్స్.

నాని యాక్టింగ్ ఇష్టపడేవారికి, భిన్నమైన ప్రేమకథలు కోరుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది.