'నెక్స్ట్ నువ్వే' రివ్యూ

Friday,November 03,2017 - 04:15 by Z_CLU

నటీనటులు: ఆది సాయికుమార్, రష్మీ, వైభవి, బ్రహ్మాజీ, అవసరాల శ్రీనివాస్, హిమజ
మ్యూజిక్ : సాయి కార్తీక్
నిర్మాణం : V4 మూవీస్
నిర్మాత : బన్నీ వాస్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం : ప్రభాకర్
రిలీజ్ డేట్ : 3 నవంబర్ ,2017

నెక్ట్స్ నువ్వే.. ఈ ఒక్క సినిమా చుట్టూ చాలా బజ్ నడిచింది. బుల్లితెర స్టార్ ప్రభాకర్ దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంగా తీసిన సినిమా ఇది. హీరో ఆది సాయికుమార్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న మూవీ ఇది. అటు ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన వి-4 మూవీస్ బ్యానర్ తొలి చిత్రమిది. మరి ఇలా భారీ ఆశలు, భారీ అంచనాల మధ్య ఈరోజు థియేటర్లలోకి వచ్చిన “నెక్ట్స్ నువ్వే” ఎలా ఉంది..?

కథ :
ఎప్పటికైనా వెండితెరపై గొప్ప డైరెక్టర్ అవ్వాలనుకుంటూ బుల్లితెరపై ‘సంసారం సేమియా ఉప్మా’ అనే ఓ సీరియల్ డైరెక్ట్ చేస్తూ జీవితాన్ని గడిపుతుంటాడు కిరణ్(ఆది సాయికుమార్). స్టార్ హీరోయిన్ అవ్వాలని ఇంటెన్షన్ , సీరియల్ హీరోయిన్ అయిందనే ఫ్రస్ట్రేషన్ కలగలిపిన స్మిత(వైభవి), ఎప్పటికైనా మంచి జీవితాన్ని అనుభవించాలనుకునే శరత్(బ్రహ్మాజీ), రష్మీ(రష్మీ గౌతమ్) ఇలా ఈ నలుగురు కలిసి అరకులో కిరణ్ తండ్రి(పోసాని) కొన్న ఓ ప్యాలెస్ లో హోటల్ ఓపెన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఈ నలుగురు ఓపెన్ చేసిన ఆ రిసార్ట్ లో ఏం జరిగింది.. ఆ ప్యాలెస్ లో ఈ నలుగురు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు.. ఫైనల్ గా ఆ ప్యాలెస్ నుండి ఎలా బయటపడ్డారు..అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు :
ఇప్పటివరకూ హారర్ సినిమాలో నటించని ఆది సాయికుమార్ తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తనకు హారర్ జానర్ ఫస్ట్ టైం అయినప్పటికీ థ్రిల్లింగ్ సీన్స్ తో ఇంప్రెస్ చేశాడు. ఆది తర్వాత చెప్పుకోవాల్సింది బ్రహ్మాజీ గురించే.. తన కామెడీ టైమింగ్ తో ఫుల్ గా ఎంటర్టైన్ చేసి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. వైభవి తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా.. రష్మీ తన గ్లామరస్ రోల్ తో మెస్మరైజ్ చేసింది. హిమజ తన రోల్ కి బెస్ట్ అనిపించుకుంది. పృథ్వి, పోసాని, రఘుబాబు, రఘు కారుమంచి, తాగుబోతు రమేష్ తమ వంతుగా కామెడీ పండించారు. ఇక అవసరాల శ్రీనివాస్, జయప్రకాశ్ రెడ్డి, వేణుగోపాల్, సత్యకృష్ణ, ఎల్.బి.శ్రీరామ్, బెనర్జీ,రజిత, శ్రీరామ్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

టెక్నీషియన్స్ పనితీరు :
హారర్ సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి కీలకమైన పనిని పెర్ఫెక్ట్ గా పూర్తిచేశాడు సంగీత దర్శకుడు సాయికార్తీక్. తన కెరీర్ బెస్ట్ రీ-రికార్డింగ్ ఇచ్చాడు. దీంతో పాటు రెండు పాటలతో కూడా ఆకట్టుకున్నాడు. కృష్ణకాంత్, సాగర్ నారాయణ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పరవాలేదు. పిక్సలాయిడ్ చేసిన గ్రాఫిక్స్ బాగున్నాయి. కొన్ని సందర్భాలలో వచ్చే కామెడీ డైలాగ్స్ బాగా పేలాయి. ప్రభాకర్ మేకింగ్ బాగుంది. V4 మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :
గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్, స్టుడియో గ్రీన్… ఇలా మూడు ప్రతిష్టాత్మక బ్యానర్లు కలిసి “V4 మూవీస్” అనే ప్రొడక్షన్ హౌజ్ ను స్థాపించి ప్రభాకర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారనగానే ‘నెక్స్ట్ నువ్వే’ సినిమా పై ఓ రేంజ్ లో అంచనాలు పెరిగాయి. మరీ ముఖ్యంగా తమిళ్, కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమాకు  రీమేక్ అనగానే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దర్శకుడిగా రీమేక్ సినిమాతో జర్నీ స్టార్ట్ చేసిన ప్రభాకర్ టి.వి.రంగంలో తనకున్న అనుభవంతో ఈ సినిమాకు న్యాయం చేశాడు. ట్రైలర్ తో అందర్నీ ఆకట్టుకున్న ప్రభాకర్.. రీమేక్ సినిమా అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ కు నచ్చేట్టుగా మార్పులు చేసి సినిమాను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ముఖ్యంగా  సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఎక్కడా కామెడీ మిస్ అవ్వకుండా ప్రభాకర్ రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా బాగుంది.

పేరుకు ఇది హారర్-కామెడీ సినిమానే అయినప్పటికీ.. ఇందులో హారర్ తక్కువగా, కామెడీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే రెండున్నర గంటల సినిమాలో ఓ 2 గంటల పాటు హ్యాపీగా నవ్వుకోవాలంటే నెక్ట్స్ నువ్వే చూడాల్సిందే. కొన్ని చోట్ల అమాయకంగా కనిపిస్తూ.. మరికొన్ని చోట్ల పేరడీ చేస్తూ బ్రహ్మాజీ పండించిన హాస్యం టోటల్ మూవీకే హైలెట్ గా నిలిచింది. బ్రహ్మాజీ డైలాగ్స్ వచ్చిన ప్రతిసారి థియేటర్లలో నవ్వులు వినిపించాయంటే ఈ క్యారెక్టర్ ఎంత క్లిక్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కామెడీ పండించారు. కీలకమైన మలుపు దగ్గర కూడా ఎక్కువగా భయపెట్టకుండా కామెడీ పండించి తనలోని చమక్కు చూపించాడు దర్శకుడు ప్రభాకర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది నెక్ట్స్ నువ్వే మూవీ.

పృథ్వి సీరియల్ కామెడీ సీన్, బ్రహ్మాజీ కామెడీ, ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు మెయిన్ హైలెట్స్. కథ, స్క్రీన్ ప్లేలో చిన్నచిన్న పొరపాట్లు, 2-3 రొటీన్ అనిపించే సీన్లు, లాజిక్స్ మిస్ అవ్వడం మైనస్ పాయింట్స్. కానీ తన కామెడీతో ఈ మైనస్ పాయింట్స్ ను బ్రహ్మాజీ మరిచిపోయేలా చేయడం గ్యారెంటీ.

కంప్లీట్ ఫన్, చిన్న హారర్ ఎలిమెంట్ కోరుకునే వాళ్లకు నెక్ట్స్ నువ్వే సినిమా భలేగా నచ్చుతుంది.

రేటింగ్   3/5