'నీదీ నాదీ ఒకే కథ' రివ్యూ

Friday,March 23,2018 - 05:56 by Z_CLU

నటీ నటులు : శ్రీ విష్ణు, సాట్నా టిటస్, పోసాని కృష్ణ మురళి, దేవి ప్రసాద్

సంగీతం : సురేష్ బొబ్బిలి

ఛాయాగ్రాహకుడు : రాజ్ తోట

ఎడిటర్ : బొంతల నాగేశ్వర్ రెడ్డి

నిర్మాతలు : ప్రశాంతి, కృష్ణ విజయ్ & అట్లూరి నారాయణ రావు

నిర్మాణం : అరన్ మీడియా వర్క్స్ & శ్రీ వైష్ణవీ క్రియేషన్స్

రచన & దర్శకుడు : వేణు ఊడుగుల

విడుదల తేది : 23 మార్చ్ 2018

‘అప్పట్లో ఒకడుండే వాడు’, ‘మెంటల్ మదిలో’ సినిమాలతో అలరించిన శ్రీ విష్ణు లేటెస్ట్ గా ‘నీది నాది ఒకే కథ’ థియేటర్స్ లోకొచ్చింది. టీజర్ , సాంగ్స్ తో ఎట్రాక్ట్ చేసి మోస్తరు అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్ టైన్ చేసింది… తెలుసుకుందాం.

కథ :

చిన్నతనం నుండి చదువు అబ్బకపోవడంతో డిగ్రీ మూడు సార్లు ఫెయిల్ అవుతాడు సాగర్. చివరికి తన చెల్లెలితో కలిసి ఎగ్జాం రాస్తాడు. ఇక సాగర్ తండ్రి దేవి ప్రసాద్(దేవి ప్రసాద్) సంఘంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా పరువు ప్రతిష్టలతో జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. సాగర్ తండ్రి దేవి ప్రసాద్ తన కొడుకు చదువుల్లో రాణించి మంచి ప్రయోజికుడు అవ్వాలనుకుంటాడు. అయితే భవిషత్తు మీద ఎలాంటి క్లారిటీ లేని సాగర్ ఒకానొక సందర్భంలో తన తండ్రి కోసం ఆయనకు నచ్చినట్లుగా మారాలనుకుంటాడు. ఈ క్రమంలో సాగర్ కి చదువులో అలాగే క్రమ శిక్షణలో బెస్ట్ అనిపించుకునే ధార్మిక అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తన తండ్రి ఇష్టపడేలా మారాలన్న ఉద్దేశ్యంతో ధార్మిక(సాట్నా టిటస్)కు దగ్గరైన సాగర్ అనుకోకుండా ఆమె ప్రేమలో పడతాడు. ఒకరినొకరు ఇష్టపడుతూ కలిసి జీవించాలనుకునే సాగర్ -ధార్మిక లు ఎలా ఒకటయ్యారు. చివరికి సాగర్ తన తండ్రికి నచ్చే విధంగా మారగలిగి చదువులో రాణించగలిగాడా..? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

ఇప్పటికే విభిన్న పాత్రలతో నటుడిగా ఆకట్టుకున్న శ్రీ విష్ణు మరో సారి తన పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా చిత్తూరు యాసతో సినిమాకు హైలైట్ గా నిలిచి ఇలాంటి క్యారెక్టర్స్ కి కేరాఫ్ అడ్రెస్ అనిపించాడు. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాట్నా టిటస్ తన క్యారెక్టర్ తో ఆకట్టుకొని సినిమాకు ప్లస్ అయింది. దర్శకుడు దేవి ప్రసాద్ తండ్రి పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో నటుడిగా మంచి మార్కులు అందుకున్నాడు. పోసాని కృష్ణ మురళి కామెడి టైమింగ్ తో అలరించారు. మిగతా నటీ నటులందరూ నేచురల్ నటనతో వారి పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు :

సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా ‘పార్వతి తనయుడవో’,ఏదో జరిగే’ పాటలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్ ను తన బాగ్రౌండ్ స్కోర్ తో బాగా ఎలివేట్ చేసాడు సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ బాగుంది. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాగుంది. కొన్ని సందర్భాల్లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. వేణు ఉడుగుల కాన్సెప్ట్ -స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది.


జీ సినిమాలు సమీక్ష :

ఈ మధ్య తెలుగులో కొత్త కాన్సెప్ట్ సినిమాలు వరుసపెట్టి వస్తున్నాయి. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఆ కేటగిరీ కి చెందిన సినిమానే. ఇప్పటికే హీరోగా విభిన్నమైన క్యారెక్టర్స్ కాన్సెప్ట్స్ తో మంచి గుర్తింపు అందుకున్న శ్రీ విష్ణు మరో సారి ఓ కొత్త క్యారెక్టర్, కాన్సెప్ట్ తో చేసిన సినిమా ఇది. ఇప్పటికే ‘అప్పట్లో ఒకడుండే వాడు’, ‘మెంటల్ మదిలో’ లాంటి విభిన్నమైన క్యారెక్టర్స్ తో నటుడిగా మంచి గుర్తింపు అందుకున్న శ్రీ విష్ణు మరో సారి కుర్రకారుకి బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ తో ఆకట్టుకున్నాడు.

ప్రతీ కుటుంబంలోనూ సాదరంగా కనిపించే సమస్యనే కథాంశంగా తీసుకున్న దర్శకుడు వేణు ఊడుగుల తను ఎంచుకున్న కథను బాగానే హండిల్ చేశాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు చూస్తే ఇది వేణు మొదటి సినిమా అనిపించదు. ఓ అనుభవం ఉన్న దర్శకుడు తెరకెక్కించినట్టుగా తన దర్శకత్వ ప్రతిభ చూపించాడు. నిజానికి ఇలాంటి కాన్సెప్ట్ డీల్ చేయడం కష్టమే. ఇదేదో మన కథ లాగే ఉందే అనిపించేలా సినిమాను తెరకెక్కించి అందరికీ కనెక్ట్ చేయగలిగాడు దర్శకుడు. ప్రస్తుత కొందరు ముసుగులు వేసుకొని బతుకున్నారన్న కథాంశాన్ని మనసుకు హత్తుకునేలా ప్రజెంట్‌ చేశాడు. ఇక ప్రస్తుత పోటీ ప్రపంచంలో ర్యాంకుల కోసం అలాగే వారి పరువు- ప్రతిష్టల కోసం కొందరు తల్లిదండ్రులు పిల్లలను ఎంత ఒత్తిడి చేస్తున్నారనే విషయాన్ని ఎమోషనల్ సీన్స్ తో స్క్రీన్ పై ఆవిష్కరించిన తీరు బాగుంది. ఇది మన కథలాగే ఉందనుకునే వారికి బాగా కనెక్ట్ అవుతుంది కానీ మిగతా వారికిదో డాక్యుమెంటరీ సినిమాలా అనిపించొచ్చు.

శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్, సాట్న టిటస్ క్యారెక్టర్, దేవి ప్రసాద్ -శ్రీ విష్ణు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, పోసాని కామెడి, సాంగ్స్, బాగ్రౌండ్ స్కోర్ క్లైమాక్స్ సినిమాలో హైలైట్స్ కాగా స్లో నేరేషన్ , సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు సినిమాకు మైనస్.

రేటింగ్ : 3 /5