Movie Review - నాట్యం

Friday,October 22,2021 - 01:40 by Z_CLU

న‌టీన‌టులు: సంధ్యారాజు, క‌మ‌ల్ కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్‌, ఆదిత్య మీన‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భానుప్రియ‌ తదితరులు..
స్క్రిప్ట్‌, కెమెరా, ఎడిటింగ్‌, ద‌ర్శ‌కత్వం: రేవంత్ కోరుకొండ‌
నిర్మాణ సంస్థ‌: నిశ్రింక‌ళ ఫిల్మ్‌
సంగీతం: శ్రవణ్ భ‌రద్వాజ్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సంధ్యా రాజు
నిడివి: 2 గంటల 16 నిమిషాలు
సెన్సార్: U
రిలీజ్ డేట్: అక్టోబర్ 22, 2021

తెలుగులో డాన్స్ బేస్డ్ సినిమాలనగానే సాగరసంగమం, మయూరి, స్వర్ణకమలం లాంటి సినిమాలు గుర్తొస్తాయి. మరి అదే నేపథ్యంలో వచ్చిన నాట్యం సినిమా ఆ కోవలో చేరుతుందా? క్లాసిక్ అనిపించే మెటీరియల్ ఈ సినిమాలో ఉందా? జీ సినిమాలు రివ్యూ

natyam movie review in telugu zeecinemalu
కథ

నాట్యం అనే ఊరిలో గురువు గారు (ఆదిత్య మీనన్) అందరికీ శాస్త్రీయ నృత్యం నేర్పిస్తుంటారు. ఆ కళాక్షేత్రంలోనే తల్లి (భానుప్రియ) చాటు బిడ్డగా పెరుగుతుంది కూతురు సితార (సంధ్య రాజు). చిన్నప్పట్నుంచే సితారకు నాట్యం అంటే ప్రాణం. గురువుగారు ఆమెకు నాట్యం నేర్పిస్తారు. కాదంబరి కథతోనే అరంగేట్రం చేస్తానని పట్టుబడుతుంది సితార. కానీ గురువుగారు ఒప్పుకోరు.

మరోవైపు రోహిత్ (రోహిత్ బెహల్) హైదరాబాద్ లో మంచి డాన్సర్. అమెరికాలో జరిగే ఇంటర్నేషనల్ డాన్స్ కాంపిటిషన్ కోసం ప్రిపేర్ అవుతుంటాడు. మంచి కాన్సెప్ట్ కోసం నాట్యం ఊరికి వస్తాడు. అక్కడ సితారతో పరిచయం ఏర్పడుతుంది. ఓ టైమ్ లో ఇద్దరూ తన్మయత్వంతో డాన్స్ చేస్తుంటారు. ఆ సమయంలో రోహిత్ ను సితార ముద్దాడుతుంది. నాట్య కళకు అవమానం జరిగిందంటూ సితారను ఊరి నుంచి తరిమేస్తారు.

హైదరాబాద్ కు వచ్చిన సితార.. రోహిత్ తో కలిసి అమెరికాలో డాన్స్ కాంపిటిషన్ కు ప్రిపేర్ అవుతుంది. మరి సితార అనుకున్నది సాధించిందా? తన ఊరికి తిరిగి వచ్చిందా? పోయిన పరువును సంపాదించుకుందా? ఇంతకీ గురువుగారు వద్దన్న కాదంబరి కథ వెనక ఉన్న రహస్యం ఏంటి? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు

సితారగా సంధ్యా రాజు మెప్పించింది. స్వతహాగా కూచిపూడి డాన్సర్ కావడం వల్ల ఈ పాత్రను ఆమె చాలా ఈజీగా చేసేశారు. డాన్స్ లో ఎక్స్ ప్రెషన్ కూడా ఓ భాగం కాబట్టి నటించడానికి ఆమెకు పెద్దగా ఇబ్బంది కలగలేదు. కమల్ కామరాజు మాత్రం సర్ ప్రైజ్ చేశాడు. ఇన్నాళ్లూ ఓ నటుడిగానే తెలిసిన కమల్, ఈ సినిమాలో శాస్త్రీయ నృత్యం చేసి మెప్పించాడు. సాఫ్ట్ గా కనిపిస్తూ, క్లైమాక్స్ లో కన్నింగ్ గా మారే పాత్రలో శుభలేఖ సుధాకర్ మెప్పించారు. నాట్యం నేర్పించే గురువు పాత్ర పోషించిన ఆదిత్య మీనన్ లో సాత్వికత కనిపించలేదు. స్వతహాగా నాట్యం నేర్పించే గురువులంతా సాఫ్ట్ గా, సాత్వికంగా కనిపిస్తారు. భానుప్రియను ఆ పాత్ర కోసం ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు. హీరోగా నటించిన రోహిత్ బెహల్ డాన్స్ బాగానే చేశాడు కానీ అతడి లుక్ లో నెటివిటీ మిస్ అయింది. యాక్టింగ్ కూడా అంతంతమాత్రమే.

టెక్నీషియన్స్ పనితీరు

టెక్నికల్ గా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ఈ సినిమాకు స్క్రిప్ట్ రాసి దర్శకత్వం వహించాడు రేవంత్ కోరుకొండ. అక్కడితో ఆగకుండా కెమెరా, ఎడిటింగ్ బాధ్యతలు కూడా తనే నిర్వర్తించాడు. ఈ నాలుగు విభాగాల్లో కెమెరా పరంగా రేవంత్ కు ఫుల్ మార్కులు పడతాయి. స్క్రిప్ట్, డైరక్షన్ విభాగంలో మాత్రం సగం మార్కులే ఇవ్వాల్సి ఉంటుంది. ఎడిటింగ్ అయితే బాగాలేదు. చాలా చోట్ల సన్నివేశాల నిడివి తగ్గించొచ్చు. ఆ ప్రయత్నం చేయలేదు రేవంత్. ఇక శ్రవణ్ భరధ్వాజ్ సంగీతం సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. డాన్స్
బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమాకు సంగీతం చాలా ఇంపార్టెంట్. తన రోల్ కు వందశాతం న్యాయం చేశాడు శ్రవణ్. అద్భుతమైన 2 పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. ఆర్ట్ వర్క్, వీఎఫ్ఎక్స్ అన్నీబాగున్నాయి. నిశ్రింకళ ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

natyam movie review in telugu zeecinemalu

జీ సినిమాలు రివ్యూ

కథను చెప్పడంలో రెండు రకాలు. చాలామంది మేకర్స్ కథకు కమర్షియాలిటీ జోడిస్తారు. ఫన్ కోటింగ్ ఇస్తారు. ఎంటర్ టైన్ మెంట్ మిక్స్ చేసి చెప్పాలనుకున్న పాయింట్ చెబుతారు. చాలా కొద్దిమంది మాత్రం తాము చెప్పాలనుకున్న కథకు ఎలాంటి హంగులు యాడ్ చేయకుండా, సూటిగా చెబుతారు. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన నాట్యం సినిమా ఈ రెండో టైపు. క్లాసికల్ డాన్స్ ఔన్నత్యాన్ని చాటిచెబుతూ, అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్నిచ్చింది ఈ సినిమా. కానీ మొదటి టైపులో చెప్పకపోవడం వల్ల అంతగా మెప్పించదు.

ఒకే కథను పుస్తకంలో చదువుకోవడానికి, తెరపై చూడ్డానికి చాలా తేడా ఉంటుంది. నాట్యం విషయంలో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పుస్తకంలో ఉన్న కథను (నిజానికి ఇది నవలా చిత్రం కాదు) యథాతథంగా తెరపైకి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది తప్ప, ఓ రెగ్యులర్ సినిమాలో ఉన్న ఎమోషన్స్, హై-పాయింట్స్ ఇందులో కనిపించవు. ఇంకా చెప్పాలంటే సినిమాలో డాన్స్ ఎపిసోడ్స్ మినహాయిస్తే, మిగతాదంతా ఫ్లాట్ గా సాగుతుంది.

కథ ప్రారంభమవ్వడమే నవలా శైలిలో మొదలవుతుంది. అక్కడ్నుంచి అది అలా సాగుతుందంతే. మధ్యలో హీరో యాడ్ అవ్వడం, విలన్ పరిచయం అన్నీ అలా జరిగిపోతుంటాయి తప్ప ఎక్సైట్ మెంట్ ఇవ్వవు. ఇంటర్వెల్ ఎపిసోడ్ కు వచ్చేసరికి దర్శకుడు ఓ చిన్న ట్విస్ట్ తో సినిమాను మలుపుతిప్పినప్పటికీ అప్పటికే సినిమాతో కనెక్ట్ కోల్పోతాడు ప్రేక్షకుడు.

సెకెండాఫ్ లో కూడా దర్శకుడు సేమ్ మిస్టేక్ రిపీట్ చేశాడు. అప్పటివరకు సహ-నృత్యకారుడిగా ఉన్న కమల్ కామరాజు నెగెటివ్ గా మారడం, హీరోయిన్ ను నమ్మించి తిరిగి ఊరికి తీసుకొచ్చి మోసం చేయడం, క్లైమాక్స్ లో కాదంబరి రూపకం లాంటివి ఇంట్రెస్టింగ్ గా అనిపించినప్పటికీ, ఆకట్టుకునేలా నెరేషన్ సాగలేదు. ఈ సినిమాకు స్క్రిప్ట్‌, కెమెరా, ఎడిటింగ్‌, ద‌ర్శ‌కత్వం లాంటి కీలక బాధ్యతలన్నింటినీ రేవంత్ కోరుకొండ‌ ఒక్కడే తీసుకున్నాడు. కొన్ని బాధ్యతలు తగ్గించుకొని, స్క్రిప్ట్ పై పూర్తిగా దృష్టిపెట్టి ఉంటే బాగుండేది. మరీ ముఖ్యంగా హీరోహీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్, కీలకమైన కాదంబరి ఎపిసోడ్ పై ఎక్కువ దృష్టి పెట్టాల్సింది.

లీడ్ రోల్ పోషించిన సంధ్యారాజు మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆమె డాన్స్, యాక్టింగ్ లేకపోతే ఈ సినిమాను ఈమాత్రం కూడా ఆస్వాదించలేం. ఇక ఈ మొత్తం సినిమాలో సర్ ప్రైజింగ్ ప్యాకేజీ కమల్ కామరాజు. ఎన్నో పాత్రలు చేసి, అందరికీ సుపరిచితుడైన ఈ నటుడు, క్లాసికల్ డాన్స్ కూడా చేసి ఓ చిన్నపాటి షాకిచ్చాడు. శివుడి పాటలో సంధ్యారాజు, కమల్ మెస్మరైజ్ చేశారు.

టెక్నికల్ గా ఈ సినిమాను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మహేష్ ఆర్ట్ వర్క్, సంధ్యారాజు ప్రొడక్షన్ డిజైన్, థండర్ స్టుడియోస్ వీఎఫ్ఎక్స్ సినిమాకు కనిపించని పిల్లర్స్ గా నిలిచాయి. ఎక్కడా వంక పెట్టడానికి వీల్లేని విధంగా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. మూవీ మొత్తం చాలా రిచ్ గా, కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఇవన్నీ ఒకెత్తయితే.. శ్రవణ్ భరధ్వాజ్ సంగీతం మరో ఎత్తు. తెరపై సంధ్యారాజు, తెరవెనక శ్రవణ్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. శివుడి పాటకు గూస్ బంప్స్ వస్తాయి. పోనీ-పోనీ ఈ ప్రాణమే సాంగ్ కూడా హైలెట్ గా నిలుస్తుంది.

ఓవరాల్ గా చెప్పాలంటే.. నాట్యం సినిమాలో మంచి డాన్స్ ఎపిసోడ్స్, మరికొన్ని ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నప్పటికీ.. నెరేషన్ ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తుంది.

రేటింగ్2.75/5