'నన్ను దోచుకుందువటే' మూవీ రివ్యూ

Friday,September 21,2018 - 12:05 by Z_CLU

నటీనటులు : సుధీర్ బాబు, నబా నటేశ్, నాజర్, తులసి, వేణు, రవివర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్

సినిమాటోగ్రఫీ : సురేష్ రగుతు

మ్యూజిక్ డైరెక్టర్ : అజనీష్ లోకనాథ్

ఆర్ట్ : శ్రీకాంత్ రామిశెట్టి

ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్

నిర్మాత : సుధీర్ బాబు

బ్యానర్ : సుధీర్ బాబు ప్రొడక్షన్స్

స్టోరీ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్ : ఆర్ ఎస్. నాయుడు

సెన్సార్ : క్లీన్ U

రన్ టైం : 140 నిమిషాలు

రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 21, 2018

రెగ్యులర్ గా సినిమాలు చేసుకునే ఓ హీరో ఏకంగా నిర్మాతగా మారాడంటే ఆ సినిమాపై అతడికి ఎంత నమ్మకం ఉండాలి. కమర్షియల్ గా సక్సెస్ అవుతున్న టైమ్ లో సొంత బ్యానర్ పెట్టి సినిమా తీశాడంటే కంటెంట్ పై ఎంత నమ్మకం ఉండాలి. అంత కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు కాబట్టే తనే హీరోగా, నిర్మాతగా నన్ను దోచుకుందువటే సినిమా తీశాడు సుధీర్ బాబు. మరి ఈ హీరో నమ్మకం నిజమైందా..? ప్రేక్షకుల మనసును ఈ సినిమా దోచుకుందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

 

కథ :

కార్తీక్ (సుధీర్ బాబు) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పెద్ద పొజిషన్ లో ఉంటాడు. ఉద్యోగులందరికీ అతడంటే హడల్. టార్గెట్లు పెట్టి హింసిస్తుంటాడు. అతడికి పనే ప్రపంచం. ఫ్యామిలీని కూడా పట్టించుకోని పనిరాక్షసుడు. ఎలాగైనా అమెరికా వెళ్లి డబ్బు సంపాదించి, ఆస్తులు పోగొట్టుకున్న తండ్రిని సుఖపెట్టాలనేది కార్తీక్ టార్గెట్.

ఇలాంటి వ్యక్తిని తన అల్లుడ్ని చేసుకోవాలని చూస్తాడు అతడి మేనమామ (రవివర్మ). కానీ తను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని కార్తీక్ తో చెబుతుంది అతడి మరదలు. మరదల్ని సేవ్ చేయడం కోసం తను సిరి అనే వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని తండ్రి, మేనమామ దగ్గర అబద్ధం చెబుతాడు కార్తీక్.

ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం చదువుకుంటూ, షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తున్న మేఘన (నబా నటేష్) హెల్ప్ తీసుకుంటాడు. సిరి పేరుతో కార్తీక్ తండ్రికి (నాజర్) దగ్గరైన అల్లరి పిల్ల మేఘన నిజంగానే వాళ్లతో కలిసిపోతుంది. ఒక దశలో కార్తీక్ ను కూడా ప్రేమిస్తుంది. కానీ కార్తీక్ మాత్రం ఆమె ప్రేమను అర్థం చేసుకోడు. చివరికి మేఘన ప్రేమను కార్తీక్ ఎలా గుర్తిస్తాడు? తండ్రిని ఎలా మెప్పించాడు? తను కోరుకున్న అమెరికా కలను నెరవేర్చుకున్నాడా లేదా అనేది క్లుప్తంగా ఈ సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు :

క్యారెక్టరైజేషన్ కుదిరితే సుధీర్ బాబు పాత్రలో ఎలా ఫిట్ అయిపోతాడో సమ్మోహనం సినిమాలో చూశాం. ఇప్పుడు కూడా అలాంటి క్యారెక్టరే దొరికింది. సుధీర్ బాబు చెలరేగిపోయాయి. టఫ్ బాస్ గా కొంచెం నెగెటివ్ షేడ్స్ లో మెప్పించిన సుధీర్, సేమ్ టైం తండ్రి దగ్గర ఏడ్చే సన్నివేశంలో కూడా అంతే బాగా మెప్పించి బెస్ట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నబా నటేష్ చూడ్డానికి ఓకే. యాక్టింగ్ కూడా ఓకే.

ఇతర నటీనటుల విషయానికొస్తే సుధీర్ బాబు తండ్రి పాత్రలో నాజర్ మెప్పించాడు. చూడ్డానికి రొటీన్ తండ్రి పాత్రలా అనిపించినప్పటికీ క్లయిమాక్స్ లో నాజర్ ప్లస్ అయ్యాడు. హీరోయిన్ తల్లిగా నటించిన తులసికి యాక్టింగ్ కు పెద్ద స్కోప్ ఇవ్వలేదు. ఆమెతో కామెడీ పండించడానికి చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. వేణు, రవివర్మ, జీవా, వర్షిణి తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.

టెక్నీషియన్స్ పనితీరు :

ఈ సెగ్మెంట్ లో కూడా మొదట సుధీర్ బాబు గురించే చెప్పుకోవాలి. నిర్మాతగా మారి తీసిన తొలి చిత్రంతో నిర్మాతగా కూడా మెప్పించాడు సుధీర్. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలా అని ఎక్కడా ఎక్కువ పెట్టలేదు. ఈ కథకు ఎంత పెట్టాలో అంతే బడ్జెట్ లో క్లీన్ ప్రాడెక్ట్ అందించాడు. కొత్త కుర్రాడు ఆర్ఎస్ నాయుడు ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తూనే దర్శకత్వం వహించాడు. హ్యాండిల్ చేసిన ప్రతి విభాగంలో కొన్ని మైనస్ లు ఉన్నప్పటికీ ఓవరాల్ గా మెప్పించాడు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. ఒక్క పాట మినహా మిగతా పాటలు పెద్దగా ఆకట్టుకోవు. నేపథ్యం సంగీతం పరవాలేదు. సురేష్ సినిమాటోగ్రఫీ,చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నాయి.

 

జీ సినిమాలు రివ్యూ :

‘నన్ను దోచుకుందువటే’ ట్రయిలర్ చూసినప్పుడే జనాలకు సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఉద్యోగుల విషయంలో టఫ్ గా ఉంటే ఓ బాస్, అమ్మాయి ప్రేమలో ఎలా పడ్డాడు, ఫైనల్ గా ఎలా మారాడు అనేది ఈ సినిమా బేసిక్ లైన్. మొన్న జరిగిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో కూడా చాలామంది ప్రముఖులు ఈ సినిమా కథను ఇలానే ఉహించారు. సో.. సినిమా స్టోరీ సింపుల్. కాకపోతే దీన్ని ఎంత పకడ్బందీగా ప్రజెంట్ చేశారనే విషయంపైనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఈ మేరకు మేకర్స్ బాగానే కష్టపడ్డారు. కథకు కొన్ని యాడ్-ఆన్స్ తగిలించి, సరికొత్త నేపథ్యాలు రాసుకున్నారు.

అంతా బాగుంది కానీ ఈ సింపుల్ కథను రెండున్నర గంటల పాటు చూపించడంలో తడబడ్డారు మేకర్స్. ఎందుకంటే రెండున్నర గంటలు చూపించేంత స్టఫ్ ఇందులో లేదు. అందుకే ఫస్టాఫ్ తేలిపోయింది. కార్తీక్ అనే టఫ్ బాస్ ను ప్రజెంట్ చేస్తూ సినిమా స్టార్ట్ చేసి, ఎటో తీసుకెళ్లిపోయారు. అలా కాస్త అయోమయంగా మొదలవుతుంది సినిమా. ఎప్పుడైతే హీరో కూడా హీరోయిన్ ను ఇష్టపడతాడో అప్పట్నుంచి సినిమా ఊపందుకుంటుంది. ఇక అక్కడ్నుంచి క్లయిమాక్స్ వరకు సినిమా పరుగులు పెడుతుంది. ఎమోషన్ ను పెర్ ఫెక్ట్ గా క్యారీ చేస్తుంది.

 నిజానికి ఈ సినిమాలో హీరో పాత్ర ఎంత బలంగా ఉందో హీరోయిన్ పాత్ర అంతకంటే బలంగా ఉంది. క్యారెక్టరైజేషన్లు అలాంటిది. సో.. టాలీవుడ్ ఆడియన్స్ కు తెలిసిన హీరోయిన్ ను, ఇలాంటి హీరోయిన్ పాత్రకు  పెట్టుకుంటే ఈ సినిమా మన మనసుల్ని మరింత దోచుకునేది. అలా అని నబా నటేష్ సరిగ్గా నటించలేదని చెప్పలేం. తెలుగులో మొదటి సినిమాకే ఆమెకిది చాలా బరువైపోయింది. దీనికి తోడు హీరోయిన్ ను హైపర్ యాక్టివ్ గా చూపించారు. అంత హైపర్ నెస్ నబాలో కనిపించలేదు.

 విలక్షణమైన కథలు, పాత్రలు ఎంచుకునే సుధీర్ బాబు.. నిర్మాతగా మారి రిస్క్ చేసినా తన పంథా మాత్రం వీడలేదు. ఈ విషయంలో సుధీర్ బాబును మెచ్చుకోవాలి. ఓవైపు నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటూనే మరోవైపు నటుడిగా బాగా చేశాడు. షార్ట్ ఫిలిం షూటింగ్ లో డైలాగ్స్ సరిగ్గా చెప్పలేని సన్నివేశంలో కామెడీ కూడా పండించాడు. ఈ సీన్ ను ట్రయిలర్ లో చూపించకుండా ఉన్నట్టయితే థియేటర్లలో ఇంకా బాగా పేలేది.

దర్శకుడి విషయానికొస్తే తొలి సినిమానే అయినప్పటికీ ఆర్ఎస్ నాయుడు మంచి సన్నివేశాలు రాసుకున్నాడు. ఇలాంటి కొన్ని ప్లస్ పాయింట్స్ మధ్య ఈ సినిమాను కాస్త వెనక్కి లాగే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అది సంగీతం మాత్రమే. మైండ్ లో రిజిస్టర్ అయ్యే పాటలు ఇందులో లేవు. హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ లేదు. కామెడీ కోసం ట్రై చేసిన సీన్లు పండలేదు. దీనికి తోడు హీరో, నాజర్ ను మినహాయిస్తే చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఆర్టిస్టులు లేరు. వీటిని మినహాయిస్తే, ఓ క్లీన్ ఎంటర్ టైనర్ కోరుకునే వాళ్లకు ‘నన్ను దోచుకుందువటే’ సినిమా నచ్చుతుంది.

 రేటింగ్ 2.75 /5