గ్యాంగ్ లీడర్ రివ్యూ

Friday,September 13,2019 - 02:04 by Z_CLU

నటీనటులు : నాని, కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు

సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌

సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌

మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి

రచనా సహకారం: ముకుంద్ పాండే

నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం)

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

సెన్సార్ : U/A

నిడివి : 155 నిమిషాలు

రిలీజ్ డేట్ : 13, సెప్టెంబర్ 2019

 

‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ కంటెంట్ తో సూపర్ హిట్ అందుకున్న నాని ఇప్పుడు విక్రమ్ కుమార్ తో కలిసి ‘గ్యాంగ్ లీడర్’ అంటూ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి కామెడీ రివేంజ్ సినిమాతో నాని మరో హిట్ అందుకున్నాడా ..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

తమ కుటుంబానికి అన్యాయం చేసి తమ జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన దేవ్(కార్తికేయ)పై ఓ ఐదుగురు మహిళలు పగ తీర్చుకోవడానికి ప్లాన్ వేసుకుంటారు. పుట్టుక నుండి చావు వరకూ కంప్లీట్ లైఫ్ సర్కిల్ ను గుర్తుచేసే ఆ గ్యాంగ్ ఓ లీడర్ కోసం వెతుకుతుండగా ఆ సమయంలో వారికి పెన్సిల్ పార్థసారధి( నాని) అనే రివేంజ్ రైటర్ బెస్ట్ ఛాయిస్ అవుతాడు.

కాపీ కొట్టి కొన్ని పుస్తకాలు రాసి పెద్ద రివేంజ్ రైటర్ లా ఫీలయ్యే పెన్సిల్ ను కలిసి తమ పగకి సపోర్ట్ అందించమని అడుగుతారు. అయితే ముందుగా కుదరదంటూ ఆ తర్వాత వారికి సపోర్ట్ చేయడానికి సిద్దమవుతాడు పెన్సిల్. ఇంతకీ ఆ గ్యాంగ్ ఎవరు..? వారికి దేవ్ ఎలాంటి హాని చేశాడు. చివరికి పెన్సిల్ సహకారంతో దేవ్ పై ఆ గ్యాంగ్ పగ తీర్చుకోవడమే గ్యాంగ్ లీడర్ కథాంశం.

 

నటీ నటులు :

ఎప్పటిలాగే తన నటనతో కట్టిపడేశాడు నాని. కాకపోతే కొన్ని సందర్భాల్లో నాని నటన రొటీన్ అనిపించింది. ఎందుకో నాని నేచురల్ స్టార్ అనే లైన్ దగ్గరే ఆగిపోయాడనిపిస్తుంది. అతడి మేనరిజమ్స్ లో మొనాటనీ కనిపించింది. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ప్రియాంక అరుళ్ మోహన్ గ్లామర్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తొలిసారి విలన్ గా కనిపించిన కార్తికేయ విలనిజంతో పరవాలేదు అనిపించాడు.  లక్ష్మీ, శరణ్య తమ నటనతో క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. శ్రియా రెడ్డి తో పాటు ప్రాణ్య నటనతో ఆకట్టుకున్నారు.

వెన్నెల కిశోర్ ఆశించిన రేంజ్ లో కాకపోయినా ఉన్నంతలో నవ్వించాడు. సత్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి తమ క్యారెక్టర్స్ తో పరవాలేదు అనిపించుకున్నారు.

 

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కలిసొచ్చింది. ‘హోయన హోయన’ పాటతో పాటు ‘రా రా’ పాట కూడా ఆకట్టుకుంది. కొన్ని సందర్భాల్లో నేపథ్యం సంగీతం కూడా బాగుంది. పోలెండ్ కు చెందిన మిరోస్లా కుబా బ్రోజెక్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. సినిమాను నవీన్ నూలి పర్ఫెక్ట్ గా ఎడిట్ చేసాడు. కొన్ని సందర్భాల్లో వచ్చే కామెడీ డైలాగ్స్ అలరించాయి.

విక్రమ్ కుమార్ కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా సాదాసీదాగా ఉంది. దర్శకుడిగా కొన్ని సన్నివేశాలను బాగానే డీల్ చేసినా కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రేక్షకుడు తననుండి ఊహించింది ఇవ్వలేకపోయాడు విక్రమ్. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

తన మేకింగ్ స్టైల్ తో ఎప్పుడూ ఎట్రాక్ట్ చేసే విక్రమ్ ఈసారి ఓ సింపుల్ రివేంజ్ స్టోరీను ఎంచుకొని అంతే సింపుల్ గా సినిమాను తెరకెక్కించాడు. అందువల్ల ‘గ్యాంగ్ లీడర్’ కామెడీ రీవెంజ్ సినిమాల్లో బెస్ట్ అనిపించుకోలేకపోయింది. ప్రతి దర్శకుడిపై కొన్ని అంచనాలుంటాయి. గతంలో చేసిన సినిమాను బట్టి ప్రేక్షకులు సినిమా చూసే ముందు ఆ దర్శకుడి నుండి ఎంతో కొంత ఆశిస్తారు. ‘గ్యాంగ్ లీడర్’ విషయంలో కూడా అదే జరిగింది. పైగా విక్రమ్- నాని కాంబినేషన్ అనగానే సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. మెగాస్టార్ హిట్ సినిమా టైటిల్ ను పెట్టుకోవడం కూడా కలిసొచ్చింది.

ముందు నుండి సినిమా విషయంలో ఎలాంటి సస్పెన్స్ మైంటైన్ చేయకుండా క్లారిటీ ఇచ్చేసారు మేకర్స్. ప్రమోషన్స్ లో ఇదొక కామెడీ రివేంజ్ స్టోరీ అని చెప్పేసిన విక్రమ్, సినిమా టీజర్-ట్రైలర్ లో కూడా అదే చూపించాడు. సినిమా ప్రారంభంలోనే అసలు పాయింట్ కూడా చూపించేసాడు. దీంతో ప్రేక్షకులకు కథపై పెద్దగా ఆసక్తిగా ఏర్పడలేదు. మొదటి భాగం అంతా కామెడీతో బాగానే నెట్టుకొచ్చినా రెండో భాగం మాత్రం కాస్త తడబడింది. కథలో కొన్ని లాక్స్ ఉన్నప్పటికీ వాటి ‘కీ’ ముందే ప్రేక్షకుడి చేతిలో పెట్టేసాడు దర్శకుడు. అందువల్ల సినిమాలో ఉన్న రెండు మూడు ట్విస్టులు కూడా ముందే ఊహించేసుకోవచ్చు. అలా కొన్ని ఆసక్తి రేకెత్తించే సన్నివేశాలకు ముందు హింట్ వదలడం వల్ల పెద్దగా ఆసక్తి అనిపించదు. పైగా కొన్ని సన్నివేశాలను మరీ సాగ దీసినట్టుగా అనిపిస్తాయి.

కథకు నానితో పాటు మిగతా క్యాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఎంచుకున్నాడు విక్రమ్. ఆ విషయంలో విక్రమ్ ను మెచ్చుకోవచ్చు. కాకపోతే కార్తికేయ క్యారెక్టర్ కి మాత్రం పూర్తి న్యాయం జరగలేదు. అతని విలనిజాన్ని దర్శకుడు పూర్తిస్థాయిలో హైలెట్ చేయలేకపోయాడు. దాంతో కార్తికేయ ను విలన్ గా ఊహించుకోలేం. సినిమాలో ఉన్న అన్ని సాధారణ పాత్రల్లో అదీ ఒకటి అనిపిస్తుంది తప్ప పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ముఖ్యంగా కార్తికేయ క్యారెక్టర్ కి సంబంధించి వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తేలిపోయింది.

మొదటి భాగంలో గ్యాంగ్ తో కలిసి నాని బాగానే ఎంటర్టైన్ చేసినా రెండో భాగంలో కాస్త బోర్ కొట్టించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా లేదు. రివేంజ్ లో కామెడీ ని యాడ్ చేయడం వల్ల ఎమోషన్ క్యారీ అవ్వలేదు. ఓవరాల్ గా నాని తన గ్యాంగ్ తో అలరించాడు. కాకపోతే విక్రమ్ గత సినిమాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ఊహించుకొని వెళ్తే మాత్రం నిరాశ తప్పదు.

 

రేటింగ్ : 2.75/5