నక్షత్రం రివ్యూ

Friday,August 04,2017 - 01:51 by Z_CLU

నటీనటులు : సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, తనీష్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, ప్రకాష్ రాజ్, శివాజీ రాజా

మాటలు : తోట ప్రసాద్, పద్మశ్రీ, కిరణ్ తటవర్తి

సంగీతం : భీమ్స్, భరత్, హరిగౌర

సినిమాటోగ్రఫీ : శ్రీకాంత్ నారోజ్

ఎడిటర్ : శివ.వై.ప్రసాద్

కొరియోగ్రఫీ : గణేష్, స్వామి

నిర్మాతలు :ఎస్.వేణుగోపాల్, సజ్జ, కె.శ్రీనివాసులు

కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : కృష్ణవంశీ

విడుదల తేదీ : ఆగస్ట్ 4

లవ్, యాక్షన్, సెంటిమెంట్.. ఇలా అన్నీ ఉన్న స్టోరీలైన్. సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, తనీష్, ప్రకాష్ రాజ్, జేడీ చక్రవర్తి లాంటి స్టార్స్ ఉన్న సినిమా. రెజీనా, ప్రగ్యాజైశ్వాల్, శ్రియ లాంటి ముద్దుగుమ్మలు మెరిసిన మూవీ. వీళ్లంతా ఒకెత్తు, క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ మరో ఎత్తు. ఇలా వీళ్లంతా కలిసి తీసిన నక్షత్రం ఈరోజు రిలీజైంది.

కథ

రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటుందో.. సమాజంలో ‘పోలీస్’ పాత్ర అలాంటిది. పోలీస్ అంటే హనుమంతుడు అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది నక్షత్రం. పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో వున్న ఓ యువకుడి కథే ఈ ‘నక్షత్రం’. అతడ్ని పోలీస్ కాకుండా అడ్డుకున్నది ఎవరు.. చివరికి సందీప్ కిషన్ పోలీస్ అయ్యాడా లేదా అనేది స్టోరీ. ఈ బేసిక్ ప్లాట్ కు లవ్, రొమాన్స్, సెంటిమెంట్ ను యాడ్ చేశాడు దర్శకుడు కృష్ణవంశీ.

నటీనటుల పనితీరు

ఇది కృష్ణవంశీ సినిమా. ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ ఔట్ పుట్ ఇవ్వాల్సిందే. కాకపోతే ముందుగా చెప్పుకోవాల్సింది తనీష్ గురించే. ఇన్నాళ్లూ హీరోగా కనిపించిన తనీష్, నక్షత్రంతో విలన్ గా మారాడు. ప్రతినాయకుడిగా చేసిన మొదటి సినిమాతోనే సూపర్బ్ అనిపించుకున్నాడు. ఇకపై ఇతడికి వరుసగా విలన్ పాత్రలే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నక్షత్రం సినిమాలో అంతలా క్లిక్ అయ్యాడు తనీష్.

హీరో సందీప్ కిషన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు వరకు అంతా కృష్ణవంశీ మార్కులో కనిపించారు. అలానే నటించారు కూడా. హీరో సందీప్ కిషన్ తన క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేశాడు. అతడి యాక్టింగ్ లో ఎంచడానికి ఏమీ లేదు. రామారావు అనే పాత్ర కోసం సందీప్ చాలా కష్టపడ్డాడు. ఇక అలెగ్జాండర్ అనే ప్రత్యేక పాత్రలో సాయిధరమ్ తేజ్ కనిపించి మెప్పించాడు.

ప్రగ్యా జైశ్వాల్ మంచి పాత్ర పోషించడంతో పాటు గ్లామరస్ గా కూడా కనిపించింది. ఇక రెజీనా విషయానికొస్తే ఫస్టాఫ్ అంతా ఈ ముద్దుగుమ్మ మేనియానే కనిపిస్తుంది. శ్రియ ఐటెంసాంగ్ సినిమాకు ఎక్స్ ట్రా బోనస్ లాంటిది. వీళ్లతో పాటు ప్రకాష్ రాజ్, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా తమ పాత్రల మేరకు చక్కగా నటించారు.

టెక్నీషియన్స్ పనితీరు

భీమ్స్, భరత్, హరిగౌర ఈ సినిమాకు సంగీతం అందించారు. రెండు పాటలతో పాటు నేపథ్య సంగీతం బాగుంది. శ్రీకాంత్ సినిమాటోగ్రఫీ, శివప్రసాద్ ఎడిటింగ్ బాగున్నాయి. కృష్ణవంశీ మార్క్ పాటలకు గణేశ్, స్వామి అందించిన కొరియోగ్రాఫీ బాగా కుదిరింది. కృష్ణవంశీ దర్శకత్వం,  స్క్రీన్ ప్లే, మాటలు ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్స్.

జీ సినిమాలు  సమీక్ష

దేశభక్తిని రగిల్చేలా గతంలో ఖడ్గం లాంటి సినిమా తీసిన కృష్ణవంశీ ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. ఖడ్గం తరహాలోనే నక్షత్రంలో కూడా దేశభక్తితో పాటు లవ్, సెంటిమెంట్, యాక్షన్ అన్నీ ఉన్నాయి. పోలీస్ కావాలని పరితపించే ఓ క్యారెక్టర్ కు ప్రస్తుతం నలుగుతున్న ఓ సమస్యను జతచేసి కృష్ణవంశీ చక్కగా కథ రాసుకున్నారు. మూవీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కృష్ణవంశీ మార్క్ కనిపిస్తుంది. పాత్రల నటన కూడా అతడి స్టయిల్ లోనే సాగుతుంది.

హీరోయిన్ల గ్లామర్ షో, సందీప్ కిషన్, తనీష్ పర్ఫార్మెన్స్, పాటలు సినిమాకు ప్లస్ పాయింట్స్. మరీ ముఖ్యంగా సాంగ్స్  అన్నీ కృష్ణవంశీ మార్క్ లో రొమాంటిక్ గా ఉన్నాయి. ఇక కీలకపాత్రలో కనిపించిన సాయిధరమ్ తేజ్, నక్షత్రం సినిమాకు పెద్ద ఎస్సెట్ గా మారాడు. కృష్ణవంశీ ప్రతి సినిమాలో మంచి పాత్రలు చేసే ప్రకాష్ రాజ్, శివాజీ రాజా నక్షత్రంలో కూడా నక్షత్రాల్లా మెరిశారు.

ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే పాత స్టోరీలైన్, స్క్రీన్ ప్లేలో చిన్నచిన్న లోపాలు, ముందే ఊహించగలిగే విధంగా క్లైమాక్స్ ఉండడం ఈ సినిమాకు మైనస్.

ఓవరాల్ గా నక్షత్రం సినిమా మొత్తం కృష్ణవంశీ మార్క్ కనిపిస్తుంది. మాస్ జనాల్ని ఇది ఫుల్ గా అలరిస్తుంది.

రేటింగ్ 3/5