Movie Review - వరుడు కావలెను

Friday,October 29,2021 - 02:25 by Z_CLU

నటీనటులు: నాగశౌర్య, రీతువర్మ, నదియా, మురళీశర్మ, రోహిణీ, జయ ప్రకాష్ , వెన్నెలకిషార్, హిమజ , ప్రవీణ్, సప్తగిరి, పమ్మి సాయి, అనంత్, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

మాటలు: గణేష్ కుమార్ రావూరి

ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు

సంగీతం : విశాల్ చంద్రశేఖర్

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్

నిర్మాత: సూర్య దేవర నాగవంశీ

స్క్రీన్ ప్లే : శరత్ , గణేష్ రావూరి

కథ- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

విడుదల తేది : 29 అక్టోబర్ 2021

నిడివి : 133 నిమిషాలు

నాగశౌర్య, రీతువర్మ జంటగా లక్ష్మి సౌజన్య డైరెక్షన్ లో తెరకెక్కిన ‘వరుడు కావలెను’ ఈరోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన లక్ష్మీ సౌజన్య పూర్తి స్థాయిలో మెప్పించిందా? ఈ క్లీన్ ఫ్యామిలీ సినిమాతో శౌర్య  హిట్టు కొట్టాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

varudu-kaavalenu1

కథ :

సొంతంగా ఓ స్టార్టప్ కంపెనీ పెట్టి నడుపుతుంది భూమి(రీతు వర్మ). పెళ్ళికి దూరంగా ఉంటూ వచ్చిన సంబంధాల్ని పక్కన పెడుతూ కెరీర్ మీద దృష్టి పెడుతూ సీరియస్ యాటిట్యూడ్ తో లైఫ్ ని లీడ్ చేస్తుంటుంది. ఇక పారిస్ లో ఆర్కిటెక్ట్ గా సెటిలైన ఆకాష్(నాగశౌర్య) ఇండియా వచ్చి భూమితో లవ్ లో పడతాడు. పెళ్ళికి ఆమడ దూరంలో ఉండే భూమిని తన ప్రేమతో  పెళ్లి పీటలు ఎక్కించాలనుకుంటాడు.

మరోవైపు పెళ్లీడు వచ్చేసిందని భూమికి సంబంధాలు చూస్తూ తనని కన్విన్స్ చేసి పెళ్లి చేసే పనిలో ఉంటుంది భూమి తల్లి(నదియా). ఫైనల్ గా భూమి ఆకాష్ ఎలా ఒకటయ్యారు? వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా, ఎప్పుడు చిగురించింది? వీరిద్దరి ప్రేమకి ఫ్లాష్ బ్యాక్ ఉందా? అనేది సినిమా చూసి తెల్సుకోవాల్సిందే.

నటీనటుల పనితీరు :

ఆకాష్ పాత్రలో నాగశౌర్య మెప్పించాడు. సాఫ్ట్ లుక్ తో ఆకట్టుకొని సినిమాకు ప్లస్ అయ్యాడు. ముఖ్యంగా ప్రీ క్లైమక్స్ లో వచ్చే సన్నివేశాల్లో బాగా నటించి ఆ సన్నివేశాలకు బలం చేకూర్చాడు. భూమి లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ దొరకడంతో రీతు వర్మ తన నటనతో ఆకట్టుకుంది. భూమి పాత్రలో మంచి నటన కనబరిచింది.

నదియా, మురళి శర్మ ఎప్పటిలానే తమ క్యారెక్టర్స్ కి బెస్ట్ ఇచ్చారు. ఇప్పటివరకు ఎగ్రెసివ్ రోల్స్ లో చూసిన నదియాను ఈ సినిమాలో సాఫ్ట్ గా, సాత్వికంగా చూసి ఆడియన్స్ షాక్ అవ్వడం గ్యారెంటీ. రోహిణి ఒకే ఒక్క సీన్ కి పరిమితం అయ్యారు. ఫస్ట్ హాఫ్ లో  వెన్నెల కిషోర్ డైలాగ్ కామెడీ, సెకండాఫ్ లో సప్తగిరి-పమ్మీ సాయి ల్యాగ్ ట్రాక్ తో వచ్చే కామెడీ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా పమ్మి సాయి ట్రాక్ హిలేరియస్ ఎంటర్టైన్ మెంట్ అందించింది. జయప్రకాశ్, హిమజ, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు:

విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్, వంశీ పచ్చిపులుసు విజువల్స్ సినిమాకు మంచి సపోర్ట్ అందించాయి. అలాగే తమన్ కంపోజ్ చేసిన రెండు పాటలు కూడా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా దిగు దిగు నాగ సాంగ్ ఆడియన్స్ ని అలరించింది.  నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాకు కలిసొచ్చింది. ఏ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ వర్క్ అదిరింది.

శరత్, గణేష్ రావూరి కథనం ఆకట్టుకుంది. గణేష్ రావూరి రాసిన కొన్ని మాటలు సన్నివేశాలకు మరింత బలం చేకూర్చాయి. కొన్ని సింపుల్ సీన్స్ ను కూడా గణేష్ తన మాటలతో హైలెట్ చేశాడు. మొదటి సినిమా అయినప్పటికీ దర్శకురాలు లక్ష్మీ సౌజన్య సినిమాను బాగానే డీల్ చేశారు. కొన్ని సన్నివేశాలను ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లా తెరకెక్కించారు. సితార ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి ఫ్రేమ్ లో నిర్మాతల కమిట్ మెంట్ కనిపిస్తుంది. కథకు ఎంత అవసరమో, అంతకంటే ఎక్కువ ఖర్చుపెట్టారు నిర్మాతలు.

Varudu Kaavalenu nagashaurya ritu varma

జీ సినిమాలు సమీక్ష :

ఇప్పటికే మనం చాలా లవ్ స్టోరీస్ చూశాం. బోలెడన్ని ఫ్యామిలీ సినిమాలు చూశాం. వాటిలో లేనిది ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకురాలు లక్ష్మీ సౌజన్య. పెళ్లి చేసుకోకుండా ఒక సీరియస్ యాటిట్యూడ్ తో లైఫ్ ని లీడ్ చేసే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక ప్రేమకథను దాని వెనుక ఉన్న బాధను చెప్పే ప్రయత్నం చేసి డైరెక్టర్ గా సక్సెస్ అయ్యారు. ఒకమ్మాయి పెళ్లికి ఎందుకు దూరంగా ఉంది? తన మనసులో ఎవరైనా ఉండిపోయరా? అక్కడి నుండి ఆమె బయటికి రాలేకపోతుందా? లాంటి పాయింట్స్ తో ఒక కథను రెడీ చేసుకొని ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కథను చెప్పారు డైరక్టర్. అలాగే అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలకు నచ్చుతారో కూడా చెప్పే ప్రయత్నం చేశారు.

ఏ లవ్ స్టోరీ కైనా హీరో-హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి. అప్పుడే  ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది. కెమిస్ట్రీ వర్కౌట్ అయితేనే స్క్రీన్ పై హీరో-హీరోయిన్ లా కాకుండా అమ్మాయి అబ్బాయిల ప్రేమకథ చూస్తున్నట్లు ఫీలవుతారు ప్రేక్షకులు.  నాగశౌర్య , రీతు వర్మ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. దీంతో సినిమాలో లవ్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా శౌర్య -రీతు మధ్య వచ్చే డైలాగ్ సీన్స్ మెప్పించాయి. కొన్ని లవ్ సీన్స్ కి గణేష్ రావూరి అందించిన సంభాషణలు ప్లస్ అయ్యాయి. మొదటి సినిమాతోనే రైటర్ గా టాలెంట్ చూపించి తన రైటింగ్ తో సినిమాకు ప్లస్ అయ్యాడు.

మొదటి భాగంలో భూమి, ఆకాష్ పాత్రలను పరిచయం చేయడానికి వారి క్యారెక్టరైజేషన్ గురించి చెప్పడానికి కొద్దిగా టైం తీసుకున్న దర్శకురాలు తర్వాత ఆకట్టుకునే సన్నివేశాలతో సినిమాను స్పీడ్ గా నడిపించింది. అలాగే ఆఫీస్ లో వచ్చే సన్నివేశాలు, ‘కోల కళ్ళే’ ఇలా సాంగ్ కూడా ఫస్ట్ హాఫ్ కి కలిసొచ్చాయి.

ఇక సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పరవాలేదనిపిస్తుంది. ఆ ఎపిసోడ్ గతంలో వచ్చిన  కొన్ని లవ్ స్టోరీస్ ని గుర్తుచేస్తుంది తప్ప ఫ్రెష్ గా అనిపించలేదు. ఆ ఎపిసోడ్ లో వచ్చే ‘దిగు దిగు నాగు సాంగ్’ అలరిస్తుంది. కానీ ఆ సాంగ్ కి కొరియోగ్రఫీ సరిగ్గా కుదరలేదు. ఆ ఎపిసోడ్ తర్వాత వచ్చే లవ్ సీన్స్, సప్తగిరి-పమ్మి సాయి కామెడీ సెకండాఫ్ ని నిలబెట్టాయి. కాకపోతే ఆ ట్రాక్ కి ఇంకా పొడిగిస్తే ఎక్కడ ల్యాగ్ అనిపిస్తుందో అని ల్యాగ్ లేకుండా ఉన్నపళంగా కట్ చేసినట్టు అనిపించింది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి. క్లైమాక్స్ మాత్రం ఊహించేలానే ఉంది. కానీ హ్యాపీ ఎండింగ్ తో అది వర్కౌట్ అయింది.

ఓవరాల్ గా  ప్రేమకథతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘వరుడు కావలెను’ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.

రేటింగ్ : 3 /5