Movie Review - 'వైల్డ్ డాగ్'

Friday,April 02,2021 - 02:31 by Z_CLU

నటీ నటులు : నాగార్జున , దియా మీర్జా, సయామీ ఖేర్, అలీ , ప్రకాష్, అతుల్ కులకర్ణి, అనిష్ కురువిల్లా తదితరులు.

సినిమాటోగ్రఫీ: షానీల్ డియో

డైలాగ్స్: కిరణ్ కుమార్

సహ నిర్మాతలు : ఎన్.ఎం. పాషా, జగన్మోహన్ వంచ

నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి

రచన-దర్శకత్వం : అహిషోర్ సోలొమాన్

సెన్సార్ : U/A

నిడివి : 129 నిమిషాలు

విడుదల తేది : 2 ఏప్రిల్ 2021

కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు కింగ్ నాగార్జున. ఈసారి అహిషోర్ సాల్మన్ అనే రైటర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘వైల్డ్ డాగ్’ సినిమా చేశాడు. టెర్రరిస్ట్ లను పట్టుకునే NIA ఆఫీసర్ క్యారెక్టర్ లో నాగార్జున నటించిన ఈ సినిమా ఈరోజే రిలీజయింది. మరి సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? నాగ్ కి ఎలాంటి విజయం అందించింది ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 nagarjuna wild dog

కథ : 

పూణేలో జాన్ బేకరీలో ఓ భారీ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. టెర్రరిస్ట్ లు పెట్టిన బాంబ్ కి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. ఆ సమయంలో బ్లాస్ట్ చేసిన ఉగ్రవాదులను పట్టుకునే పవర్ ఫుల్ ఆఫీసర్ కోసం చూస్తున్న ఇండియా గవర్న్ మెంట్ కి అంతకు ముందు ఇలాంటి కేసులను డీల్ చేసిన NIA ఆఫీసర్ వైల్డ్ డాగ్ అలియాస్ విజయ్ వర్మ(నాగార్జున)  ఒక్కటే చాయిస్ గా కనిపిస్తాడు. దాంతో  డెస్క్ జాబ్ చేస్తూ సాధారణ లైఫ్ లీడ్ చేస్తున్న విజయ్ వర్మ కి ఈ బాంబ్లాస్ట్ కేసు అప్పగించి సీక్రెట్ మిషన్ ద్వారా ఉగ్రవాదులను పట్టుకొని అప్పగించాలని  అతని పై అధికారి(అతుల్ కులకర్ణి) ద్వారా భాద్యతను అప్పగిస్తారు.

పై అధికారి ఆర్డర్ తో బరిలోకి దిగిన వైల్డ్ డాగ్  పూణేలో భారీ బ్లాస్ట్ చేసి మిగతా చోట్ల కూడా ప్లాన్ చేసే ఉగ్రవాదులను ఎలా హతమార్చాడు..? చివరికి ఈ బ్లాస్ట్ ల వెనుక ఉన్న ఖలీద్ అనే ఉగ్రవాదిని విజయ్ వర్మ అండ్ టీం నేపాల్ నుండి ఇండియాకి ఎలా తీసుకొచ్చారు ? అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు : 

పవర్ ఫుల్ NIA ఆఫీసర్ పాత్రకి నాగార్జున బెస్ట్ ఇచ్చాడు. నాగ్ బెస్ట్ రోల్స్ లో విజయ్ వర్మ కూడా చెప్పుకునేలా ఉంటుంది. విజయ్ వర్మ భార్య ప్రియా పాత్రలో దియా మీర్జా ఆకట్టుకుంది. కాకపోతే ఆమెకి సినిమాలో చాలా తక్కువ సన్నివేశాలు ఉన్నాయి. కథలో కీ రోల్ పోషించే ఆర్య పండిత్ క్యారెక్టర్ లో సయామీ ఖేర్ మంచి నటన కనబరిచింది. ఉగ్రవాది ఖలీద్ పాత్రలో నటించిన నటుడు క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు.

వైల్డ్ డాగ్ టీంలో మంచి రోల్స్ దక్కడంతో అలీ , ప్రకాష్ తదితరులు ఆకట్టుకొని నటులుగా రుజువుచేసుకున్నారు. అతుల్ కులకర్ణి , అనిష్ కురువిల్లా తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు థమన్  నేపథ్య సంగీతం బ్యాక్ బోన్ గా నిలిచింది.  షానీల్ డియో అందించిన విజువల్స్ బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో అతని కెమెరా పనితనం కనిపించింది.  శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ బాగుంది. కథకి  పర్ఫెక్ట్ అనిపించే తక్కువ నిడివితో సినిమాను ఎడిట్ చేయడం కొంత వరకు ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాల్లో మురళి ఆర్ట్ వర్క్ కూడా బాగుంది.

అహిషోర్ సోలొమాన్ రాసుకున్న కథ -కథనం రొటీన్ గా ఉన్నా దర్శకుడిగా మంచి మార్కులే అందుకున్నాడు. మ్యాట్నీ ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష : 

కొన్నేళ్ళుగా వంశీ పైడిపల్లి దగ్గర రైటర్ గా పనిచేస్తున్న అహిషోర్ సాల్మన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున సినిమా చేస్తున్నాడనే వార్త బయటికొచ్చినప్పటి నుండి ‘వైల్డ్ డాగ్’ సినిమాపై పాజిటీవ్ బజ్ కొలకొల్పింది. లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ సినిమాపై మరికొన్ని అంచనాలు పెంచింది.  అయితే దర్శకుడు సోల్మాన్ ఈ సినిమాతో పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.  దర్శకుడు ఎంచుకున్న కథతో పాటు కథనంలో కొత్తదనం కనిపించలేదు. ఇది వరకే ఇలాంటి కాన్సెప్ట్స్ తో సినిమాలు వచ్చేయడంతో ‘వైల్డ్ డాగ్’ రొటీన్ యాక్షన్ డ్రామా అనిపిస్తుంది. పైగా ఈ టైప్ కథలతో OTT లో సిరీస్ కూడా అవైలెబుల్ లో ఉన్నాయి. ఇక సన్నివేశాలకు బలం చేకూర్చే సరైన డైలాగులు లేకపోవడం కూడా మైనస్.

ఈ టైప్ కథల్లో ప్రేక్షకుడు ఊహించలేని ట్విస్టులు ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే టికెట్టు కొన్న ఆడియన్ థ్రిల్ అవుతాడు. ఈ సినిమాలో విషయంలో దర్శకుడు చేసిన  మిస్టేక్ అదే అనిపించింది. వైల్డ్ డాగ్ టీం డిఫరెంట్ ప్లానింగ్స్ తో ట్విస్టులు రాసుకునుంటే బాగుండేది. క్లైమాక్స్ లో అలాంటి ట్విస్టు ఒకటి ఉన్నా అది కూడా వావ్ అనిపించేలా లేదు. ఇంటర్వెల్ కి ముందు విలన్ ఎస్కేప్ అయ్యే సీన్ , రెండోభాగంలో వచ్చే నేపాల్ సన్నివేశాలు, క్లైమాక్స్ లో ఉగ్రవాదిని పట్టుకొని ఇండియాకి తీసుకొచ్చే  ఆకట్టుకున్నాయి. అయితే రెండో భాగంలో విలన్ మళ్ళీ ఎస్కేప్ సన్నివేశం అంత ఆసక్తిగా అనిపించదు. అండర్ కవర్ ఆపరేషన్ , ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ఇంకా ఆసక్తిగా ఉంటే బాగుండేది. నటీ నటుల నుండి దర్శకుడు బెస్ట్ తీసుకున్నాడు. అలాగే కొన్ని సన్నివేశాలను అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కించాడు.

ఇండియాలో కొన్ని బాంబ్లాస్ట్ లకి కారణమైన ఓ ఉగ్రవాదిని పట్టుకుని ఇండియా తీసుకొచ్చే ఓ  NIA ఆఫీసర్ కథ అనగానే ప్రేక్షకులు కొన్ని ఊహించుకొని థియేటర్స్ లోకి అడుగు పెడతారు. అయితే అలా ఎక్కువ ఊహించి సినిమాకొచ్చిన వారిని ‘వైల్డ్ డాగ్’ కొంత వరకు నిరుత్సాహపరుస్తుంది. మిగతా వారికి మాత్రం పరవాలేదనిపిస్తుంది. ఓవరాల్ గా టెర్రరిజం నేపథ్యంతో వచ్చిన  ఈ యాక్షన్ డ్రామాను ఓసారి చూడొచ్చు.

 

ప్లస్ పాయింట్స్ :

నాగార్జున

తమన్ నేపథ్య సంగీతం

సినిమాటోగ్రఫీ

కొన్ని సన్నివేశాలు

ప్రీ క్లైమాక్స్ – క్లైమాక్స్

 

మైనస్ పాయింట్స్ 

స్టోరీ

ఫ్లాట్ స్క్రీన్ ప్లే

ట్విస్టులు లేకపోవడం

 

రేటింగ్ : 2.75/5