'నగరం' రివ్యూ

Friday,March 10,2017 - 11:02 by Z_CLU

రిలీజ్ డేట్ : మార్చ్ 10 , 2017

నటీనటులు : సందీప్ కిషన్ , శ్రీ, రెజీనా

సినిమాటోగ్రఫీ : సెల్వ కుమార్ ఎస్.కె

సంగీతం: జావేద్‌ రియాజ్‌

సమర్పణ: అశ్వనికుమార్‌ సహదేవ్‌

మాటలు : శశాంక్‌ వెన్నెలకంటి

నిర్మాణం : ఎకెఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పొటెన్షియల్‌ స్టూడియోస్‌

కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం: లోకేష్‌

సందీప్ కిషన్, శ్రీ, రెజీనా ప్రధానపాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘మానగరం’..ఈ సినిమా ‘నగరం’ పేరుతో తెలుగులో అనువాదమైంది. ఈ సినిమాతో లోకేశ్ కనకరాజ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. రిలీజ్ కు ముందే తమిళనాట పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ రోజే థియేటర్స్ లోకొచ్చింది.. మరి తెలుగులో ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేసిందో… చూద్దాం…!

కథ :

ఓ సంఘటన చుట్టూ అల్లుకున్న నాలుగు వేర్వేరు కథల సమాహారమే ‘నగరం’ . రెజీనా ప్రేమ కోసం ఎంతకైనా తెగించే సందీప్ కిషన్.. రన్నింగ్ బస్ లో మరొకరిపై దాడి చేస్తాడు. తన ప్రేమను గెలుచుకునే ప్రయత్నంలో జాబ్ కోసం నగరానికి వచ్చి.. అనుకోని పరిస్థితుల్లో సర్టిఫికెట్స్ పొగొట్టుకుంటాడు శ్రీ. ఆర్థిక ఇబ్బందులతో క్యాబ్ డ్రైవర్ గా డ్యూటి ఎక్కుతాడు చార్లే. ఓ పిల్లాడిని కిడ్నాప్ చేయబోయి… మాఫియా డాన్ మధుసూదన్ కుమారుడిని కిడ్నాప్ చేసిన ఓ కిడ్నాప్ ముఠా. ఈ ముఠాలో చేరిన ఆశ, అమాయకత్వం కలిగిన మంచోడు రామ్ దాస్. వీరికి తోడు ఇగోయిస్టిక్ అంట్ కరప్టెడ్ పోలీసాఫీసర్ మరొకడు. వీరిలో చాలామందికి ఒకరి పేరు మరొకరికి తెలియదు. కానీ వారికి తెలియకుండానే ఒకరితో మరొకరికి సంబంధం ఉంటుంది. అది ఎలా.. వీరందరి జీవితం లో 48 గంటల్లో ఎలాంటి సంఘటన జరిగింది..అనేది సినిమా కథాంశం.

 

నటీనటులు పనితీరు :

హీరో ఇమేజ్ ను పక్కనపెట్టి మిగతా పాత్రల తరహాలో తనదీ ఓ క్యారెక్టర్ అనేలా కథలో ఇమిడిపోయాడు సందీప్ కిషన్. ఏ విషయాన్ని అంతగా లెక్కచేయని కుర్రాడిగా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రెజీనా క్యారెక్టర్ కు కథలో పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా ఉన్నంత వరకూ తన గ్లామరస్ యాక్టింగ్ తో ఎంటర్టైన్ చేసింది. జాబ్ కోసం నగరానికి వచ్చి ఇబ్బందుల పాలయ్యే యువకుడిగా ‘శ్రీ’ నటన ఆకట్టుకుంది. చార్లే, రామ్ దాస్ కు ఈ తరహా పాత్రలు కొత్తేమి కావు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేశారు. మధుసూదన్ తో పాటు కిడ్నాప్ గ్యాంగ్ టీమ్, పోలీసాఫీసర్ పాత్ర పోషించిన నటుడు మెప్పించారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

సంగీత దర్శకుడు జావెద్ రియాజ్ నేపథ్య సంగీతం, సెల్వకుమార్ ఎస్.కె. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. రిపీటెడ్ లా అనిపిస్తున్న కొన్ని సీన్స్ ను ఎడిటర్ ట్రిమ్ చేయాల్సి ఉంది. దర్శకుడు కథ, కథనాల ఎంపిక సరైనదే అయినా.. పాత్రలను ఇమడ్చటంలో కాస్త నెమ్మదించాడు. అయితే సస్పెన్స్, ట్విస్టుల విషయంలో థ్రిల్ ఫీలయ్యేలా  చేశాడు.

సమీక్ష:

ఈ తరహా కథతో ‘వేదం’, ‘చందమామ కథలు’, ‘మనమంతా’ సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమా విషయానికొస్తే… ఫస్ట్ హాఫ్ లో దర్శకుడు పాత్రలను పరిచయం చేసే ప్రయత్నం చేసినా.. ప్రేక్షకుడికి మాత్రం పూర్తిగా అవి కనెక్ట్ అవలేదు. ఓ వైపు స్కూల్ పిల్లాడి కిడ్నాప్, మరోవైపు బస్ లో జరిగిన దాడి, పోలీస్ స్టేషన్ సీన్స్ ఇవన్నీ ఓ క్రైమ్ సినిమా చూస్తున్నామన్న ఫీల్ ను క్రియేట్ చేశాయి. ఇంటర్వెల్ టైమ్ కు.. వీరందరికి ఒకరికి మరొకరితో ఉన్న లింక్ ను కనెక్ట్ చేసిన ట్విస్ట్ సినిమా పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ లో ఒక్కో క్యారెక్టర్ ను కథలో ఇన్వాల్వ్ చేసే సీన్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతాయి. కానీ సందీప్-రెజీనా మధ్య లవ్ స్టోరీని కూడా అంతగా ఎస్టాబ్లిష్ లేదు దర్శకుడు. కథ.. బలమైన పాత్రలు ఉన్నా.. కథలో క్యారెక్టర్స్ ను ఇంట్రడ్యూస్ చేయడానికి వాటన్నింటినీ స్టోరీలో ఇమడ్చడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయం తీసుకోవడం, స్లో నెరేషన్ సీన్స్ తో కాస్త విసిగించడం సినిమాకు మైనస్. పరుగులు తీయాల్సిన క్రైమ్ స్టోరీ ఈ సీన్స్ వల్ల కాస్త నత్తనడకన సాగాయని చెప్పాలి. హీరోహీరోయిన్స్, విలన్ తప్ప మిగతా వారెవరూ తెలుగు వారికి పెద్దగా తెలియకపోవడం.. రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఎక్కువ తమిళ వాసన కొట్టడం.. తెలుగులో ఈ సినిమాకు మైనస్. ఎంటర్ టైన్మెంట్ ఆశించకుండా క్రైమ్ థ్రిల్లర్ ను చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

 

రేటింగ్ : 2 .5 /5