రివ్యూ - 'రంగబలి'

Friday,July 07,2023 - 03:02 by Z_CLU

నటీనటులు: నాగ శౌర్య, యుక్తి తరేజ, సత్య, గోపరాజు, రాజ్ కుమార్,  షైన్ టామ్ చాకో తదితరులు

సంగీతం: పవన్ సిహెచ్

డీవోపీ: దివాకర్ మణి

ఎడిటర్: కార్తీక్  శ్రీనివాస్

ఆర్ట్: ఏఎస్ ప్రకాష్

నిర్మాణం : ఎస్ ఎల్ వి సినిమాస్

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

రచన, దర్శకత్వం: పవన్ బాసంశెట్టి

నిడివి : 141 నిమిషాలు

విడుదల : 7 జులై 2023

 

కమెడియన్ సత్యతో చేయించిన డిఫరెంట్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ  ‘రంగబలి’ పై బజ్ తీసుకొచ్చింది. ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ  మాస్ కమర్షియల్ సినిమాతో శౌర్య హిట్ కొట్టాడా ? కొత్త దర్శకుడు తన టాలెంట్ తో మెప్పించాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ :

రాజవరం అనే ఊరు , అక్కడ రంగబలి అనే ఫేమస్ సెంటర్ , ఆ ఊర్లో ఉండే కుర్రాడు శౌర్య(నాగ శౌర్య) కి సొంత ఊరంటే ఎంతో మమకారం , కానీ తండ్రి చెప్పిన మాట కోసం ఆ ఊరు వదిలి వైజాగ్ వెళతాడు. అక్కడ సహజ (యుక్తి తరేజ) అనే డాక్టర్ ని చూసి ఆమెతో  ప్రేమలో పడతాడు. తర్వాత సహజ కూడా శౌర్యతో ప్రేమలో పడుతుంది. వీరిద్దరి పెళ్లి వెంటనే ఓకే  చెప్పిన సహజ తండ్రి (మురళి శర్మ) శౌర్య సొంత ఊరు అక్కడ రంగబలి సెంటర్ గురించి విని తన కూతురు కావాలంటే ఆ ఊరు వదిలి రమ్మని చెప్తాడు. సొంత ఊరుని అలాగే ప్రేమించిన అమ్మాయిని ఏది వదలుకోవడం ఇష్టం లేని శౌర్య తనకొచ్చిన ప్రాబ్లెం కి సొల్యూషన్ వెతుకుటుంటాడు. ఈ క్రమంలో సొంత ఊరు తిరిగివచ్చిన శౌర్య రంగబలి సెంటర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అసలు విషయం తెలుసుకున్న శౌర్య తనకి అన్నయ్య లా ఉన్న స్థానిక ఎమ్మెల్యే పరశురామ్ (షైన్ టామ్ చాకో) తో గొడవ పెట్టుకుంటాడు. దీంతో శౌర్య జీవితం తారుమారు అవుతుంది. అసలింతకీ సహజ తండ్రికి రంగబలి సెంటర్ కి సంబంధం ఏమిటి ? పరశురామ్ తో శౌర్య ఎందుకు గొడవ పెట్టుకున్నాడు ? ఫైనల్ గా శౌర్య లవ్ ప్రాబ్లెం ఎలా సాల్వ్ అయింది ? అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు : 

శౌర్య పాత్రలో నాగశౌర్య మెప్పించాడు. సొంత ఊరుపై మమకారం ఉన్న కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో మాస్ ను ఎట్రాక్ట్ చేశాడు. యుక్తి తరేజ తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసి మంచి మార్క్స్ కొట్టేసింది. కానీ నటన పరంగా ఇంకా మెరుగు పడాల్సి ఉంది. సత్య తన కామెడీ టైమింగ్ , డిఫరెంట్ క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేసి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. సరైన క్యారెక్టరైజేషన్ పడకపోవడంతో షైన్ టామ్ చాకో ఇటు పవర్ ఫుల్ విలన్ గానూ అటు కామెడీ విలన్ గా రెండు రకాల మెప్పించలేకపోయాడు. రాజ్ కుమార్ డైలాగ్ కామెడీ అక్కడక్కడా పేలింది.

గోపరాజు , మురళీ శర్మ , అనంత శ్రీరామ్ తదితరులు తమ నటనతో వారి పాత్రలకు పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. బ్రహ్మాజీ , సప్తగిరి క్లైమాక్స్ లో మెరిశారు తప్ప కామెడీ పండలేదు.

 

సాంకేతిక వర్గం పనితీరు : 

పవన్ సీ హెచ్ అందించిన సాంగ్స్ పరవాలేదనిపించాయి. కానీ తన నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ కి పవన్ ఇచ్చిన స్కోర్ బాగుంది. దివాకర్ మణి అందించిన విజువల్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాగుంది. రంగబలి సెంటర్ ను క్రియేట్ చేయడంలో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ సక్సెస్ అయ్యాడు.

పవన్ రాసుకున్న కథలో ఉన్న పాయింట్ కొత్తగా ఉంది కానీ కథనం వీక్ అనిపిస్తుంది. దర్శకుడిగా కామెడీను హ్యాండిల్ చేయడంలో మంచి మార్కులు అందుకున్నాడు. ప్రొడక్షన్ వెల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష : 

ఒక ఊరు , అల్లరి చిల్లరిగా తిరుగుతూ గొడవలు పెట్టుకుంటూ నాన్నతో తిట్లు తినే హీరో , ఊళ్ళో ఉంటే ఇలాగే ఉండిపోతాడని , తన కొడుకుని ప్రయోజికుడ్ని చేయడం కోసం తపన పడే  హీరో తండ్రి మరో ఊరు పంపించడం , అక్కడ ఒక అందమైన అమ్మాయితో హీరో ప్రేమలో పడటం , తన ప్రేమకి హీరోయిన్ తండ్రి అడ్డు పడటం , ఆ ప్రాబ్లెం కి హీరో సొల్యూషన్ వెతకడం ఇదే బ్రీఫ్ గా రంగబలి కథ. అయితే ఊరిలో రంగబలి అనే సెంటర్ , దానికి ఆ పేరు రావడం వెనుక ఉన్న విషయం మాత్రం కొంత కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా మొదటి భాగమంతా కథ లేకపోయినా సత్య కామెడీతో ఎంటర్టైనయింగ్ గా నడిపించిన దర్శకుడు రెండో భాగంలో తడబడ్డాడు. తను రాసుకున్న కథని పర్ఫెక్ట్ గా డీల్ చేయడంలో కొత్త దర్శకుడు పవన్ సాగమే సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్ కథ మీద సన్నివేశాల మీద రైటింగ్ లో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలో పాత్రలు , కామెడీ బాగున్నా కథనం వీక్ అనిపించడం , సన్నివేశాలు రొటీన్ అనిపించడం తేడా కొట్టింది.

ఈ  సినిమా కోసం నాగ శౌర్య పడిన కష్టం స్క్రీన్ పై కనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం సిక్స్ ప్యాక్ బాడీ మెయింటైన్ చేసి మెప్పించాడు. పాత్రను చాలా ఈజ్ తో చేసిన విధానం ఆకట్టుకుంది. సత్య కామెడీ టికెట్టు కొన్న ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించి బయటికి పంపుతుంది.  సత్య కామెడీ టైమింగ్ ను , బాడీ లాంగ్వేజ్ ను దర్శకుడు పవన్ పర్ఫెక్ట్ గా వాడుకొని హిలేరియస్ కామెడీ రాసుకొని బాగా ఎంటర్టైన్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా సత్య కామెడీతో మెప్పించాడు. కానీ ఇంటర్వెల్ తర్వాత ప్రేక్షకుడిని అసలు కథలోకి  తీసుకెళ్లిన దగ్గరి నుంచి నిరాశ పరిచాడు. ముఖ్యంగా రంగబలి అనే సెంటర్ కి ఆ పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని చెప్పే ఫ్లాష్ బ్యాక్ పండలేదు. అలాగే తండ్రి కొడుకుల ఎమోషన్ కూడా ఊహించినంత వర్కవుట్ అవ్వలేదు. హీరో ఫైట్ చేయాలంటే వైట్ షర్ట్ వేసుకోవాల్సిందే అని చూపించడం లాంటివి సిల్లీగా ఉన్నాయి. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో శరత్ కుమార్ కేరెక్టర్ బాగున్నా ఆ క్యారెక్టర్ కి  బలమైన సన్నివేశాలు పడలేదు. అందువల్ల ఫ్లాష్ బ్యాక్ లో ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. దీంతో ఆ ఎపిసోడ్ ఫాస్ట్ ఫేజ్ లో ఇలా వచ్చి అలా వెళ్ళినట్టు అనిపిస్తుంది తప్ప ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అసలు కథకి మూలమైన మురళి శర్మ అతనికి ఆ సెంటర్ అంటే ఎందుకు అంత కోపమో చెప్పే సీన్ కూడా వర్కవుట్ అవ్వలేదు.

తన తొలి సినిమా కోసం ‘ఊరి సెంటర్ పేరు మార్చడం’ అనే కొత్త పాయింట్ తీసుకున్న దర్శకుడు దానికి ఆసక్తి కరమైన స్క్రీన్ ప్లే , బలమైన ఎమోషన్ రాసుకోవడంలో విఫలం అయ్యాడు. కామెడీ సీన్స్ , క్యారెక్టర్స్ మాత్రం బాగా రాసుకున్నాడు. ముఖ్యంగా సత్య కి ది బెస్ట్ కేరెక్టర్ రాసి బాగా నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ లో సత్య క్యారెక్టర్ తో ఫుల్లుగా నవ్వించి ఎంటర్టైన్ మెంట్ తో ఫుల్ మీల్స్ పెట్టిన దర్శకుడు మలిసగంతో మెప్పించలేక సగం మార్కులే అందుకున్నాడు. ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ కూడా వీక్ అనిపిస్తుంది.షైన్ టామ్ చాకో లాంటి నటుడ్ని పెట్టుకొని సరైన విలనిజం పండించలేకపోవడం కూడా మైనస్సే.

నాగ శౌర్య నటన , సత్య కామెడీ , అక్కడక్కడా వచ్చే డైలాగ్ కామెడీ ,యుక్తి తరేజ గ్లామర్ , పవన్ సీ హెచ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , విజువల్స్ సినిమాకు హైలైగ్స్ కాగా , సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు , ఇంపాక్ట్ క్రియేట్ చేయలేని ఫ్లాష్ బ్యాక్ , ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ సినిమాకు మైనస్ అనిపిస్తాయి. ఓవరాల్ గా సత్య హిలేరియస్ కామెడీ కోసం ‘రంగబలి’ ఒకసారి చూడొచ్చు.

 

రేటింగ్ : 2 .5 /5