'మిస్టర్ మజ్ను' మూవీ రివ్యూ 

Friday,January 25,2019 - 01:50 by Z_CLU

నటీ నటులు : అఖిల్, నిధి అగర్వాల్, నాగబాబు , జయప్రకాష్, రావు రమేష్ , హైపర్ ఆది తదితరులు

సంగీతం  : థమన్

ఛాయాగ్రహణం : జార్జ్ సి. విలియమ్స్

నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్ పీ

నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్

కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం: వెంకీ అట్లూరి

నిడివి : 145 నిమిషాలు

విడుదల తేది : 25 జనవరి , 2019

‘తొలిప్రేమ’తో డైరెక్టర్ గా పరిచయమై సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి తో కలిసి ‘మిస్టర్ మజ్ను’ గా  ప్రేక్షకుల ముందుకొచ్చాడు అఖిల్. ఈసారి కూడా అక్కినేని వారి ఫేవరెట్ జోనర్ లోనే  సినిమా చేసాడు.  మరి ఈ మజ్ను తన లవ్ స్టోరీ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడా..? మజ్ను టైటిల్ అక్కినేని ఫ్యామిలీ కి మరోసారి కలిసోచ్చిందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ : 

లండన్ లో చదువుకునే విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కి(అఖిల్) నిత్యం అమ్మాయిలను తన మాయలో పడేస్తూ వారిని ఆనందంగా ఉంచుతుంటాడు.  అదే లండన్ లో అబద్దాలు చెప్పకుండా తనని  మాత్రమే ప్రేమించే అబ్బాయి కోసం ఎదురుచూస్తోంటుంది నిఖిత(నిధి అగర్వాల్). అనుకోకుండా వీరిద్దరూ లండన్ లో పరిచయమవుతారు. విక్కి ప్లే బాయ్ క్యారెక్టర్ చూసి అతనికి దూరంగా ఉండాలనుకుంటుంది నిఖిత.. ఈ క్రమంలో ఇండియా తిరిగి వచ్చిన వీరిద్దరికీ విక్కీ చెల్లికి , నిఖిత అన్నయ్య కి పెళ్లి కుదిరిందని తెలుస్తుంది.

అయితే విక్కీ తన ఫ్యామిలీ కి ఇచ్చే ఇంపార్టెన్స్ , తండ్రిపై అతనికున్న గౌరవం, దగ్గరైన వారిని ఎంతగా ప్రేమిస్తాడో తెలుసుకొని అతనితో ప్రేమలో పడిపోతుంది నిఖిత. అయితే ప్రేమ అనేది జస్ట్ నెలకే పరిమితం అనే ఫీలింగ్ లో ఉంటూ పెళ్ళికి దూరంగా ఉండే విక్కీ కి లవ్ ప్రపోజ్ చేస్తుంది నిఖిత. అతనికి ఇష్టం లేకపోవడంతో ఓ రెండు నెలలు తనను ప్రేమించాలని, ఆ తర్వాత ఇష్టం కలిగితే పెళ్లి చేసుకోవాలని ఒప్పందం కుదుర్చుకుంటుంది నిఖిత. అక్కడి నుండి అసలు కథ మొదలవుతోంది. అలా నిఖిత ఒప్పందానికి లాక్ అయిన విక్కీ ఎలాంటి సంఘటనలు ఎదుర్కున్నాడు.. చివరికి విక్కీ-నిఖిత ఎలా ఒకటయ్యారు..అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు: 

రెండు సినిమాల అనుభవంతో విక్కీ అనే ప్లే బాయ్ క్యారెక్టర్ ని చాలా ఈజీగా చేసేసాడు అఖిల్. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , డాన్సులతో మెప్పించాడు. ఎమోషన్ సీన్స్ లో పరవాలేదనిపించుకున్నాడు.  కొన్ని సందర్భాల్లో తన నటన , డైలాగ్ డెలివరీ తో తండ్రిని గుర్తుచేసాడు అక్కినేని యంగ్ హీరో. నిధి అగర్వాల్ గ్లామర్ తో పరవాలేదనిపించుకుంది. సెకండ్ హాఫ్ లో పుల్లారావు అంటూ హైపర్ ఆది పండించిన కామెడీ నవ్వించింది. దిల్ రాజు మనవడు అరణ్ష్ క్యారెక్టర్ తో పండించిన కామెడీ బాగా పేలింది. ప్రియదర్శి కూడా తన కామెడీ టైమింగ్ తో అలరించాడు. సుబ్బరాజు రోటీన్ క్యారెక్టర్ తో అలరించలేకపోయాడు. జయప్రకాశ్, రావు రమేష్, నాగబాబు, పవిత్ర లోకేష్ , తులసి , రాజా సెటిల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు  మెయిన్ హైలైట్ సినిమాటోగ్రఫీ. జార్జ్ సి.విలియమ్స్ కెమెరా వర్క్ బాగుంది. ముఖ్యంగా లండన్ లో తెరకెక్కించిన సీన్స్, సాంగ్స్ పిక్చరైజేషన్ లో అతని పనితనం కనిపించింది. థమన్ అందించిన సాంగ్స్ లో ‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్, ‘ఏమైందో’, ‘కోపంగా కోపంగా’ ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సన్నివేశాలను ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకాస్త ట్రిమ్ చేయొచ్చు.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది. టైటిల్ సాంగ్, కోపంగా కోపంగా సాంగ్ లో అఖిల్ తో అదిరిపోయే స్టెప్స్ వేయించాడు.  శ్రీమణి అందించిన లిరిక్స్ బాగున్నాయి. కొన్ని సందర్భాల్లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. వెంకీ అట్లూరి రాసుకున్న స్టోరీ రొటీన్ అనిపించినా స్క్రీన్ ప్లే పరవాలేదు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు రివ్యూ:

అక్కినేని హీరోల బలమే ప్రేమకథలు. సరైన లవ్ స్టోరీ పడితే చెలరేగిపోతారు. లెజెండ్ ఏఎన్నార్ నుంచి నాగార్జున, నాగచైతన్య వరకు ప్రూవ్ అయిన ఫిక్స్ డ్ ఫార్ములా ఇది. ఇప్పుడు ఇదే ఫార్ములా అఖిల్ కు కూడా సూట్ అయింది. జూనియర్ గ్రీకువీరుడిలా అదరగొట్టాడు అఖిల్.

అమ్మాయిలంతా ఇతడి చుట్టూ తిరుగుతుంటే నిజమే అనిపిస్తుంది. అమ్మాయిల్ని అఖిల్ పడేసే తీరు అత్యంత సహజంగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఆ లుక్స్, ఆ స్మైల్, ఆ స్టయిల్ చూస్తుంటే.. ఈ కథకు అఖిల్ ను తప్ప మరో హీరోను ఊహించుకోలేం. ప్లేబాయ్ అంటే ఇలానే ఉంటాడేమో అనిపిస్తుంది.

ఇలా అఖిల్ కోసం అద్భుతమైన క్యారెక్టరైజేషన్ తయారుచేశాడు దర్శకుడు వెంకీ అట్లూరి. అయితే ఈ క్యారెక్టర్ క్రియేట్ చేసే క్రమంలో బ్యాలెన్స్ స్టోరీపై అంతగా దృష్టిపెట్టినట్టు కనిపించలేదు. అందుకేనేమో ఎమోషనల్ గా ఆకట్టుకోవాల్సిన ప్రేమ సన్నివేశాలు కూడా అక్కడక్కడ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవు. అయినప్పటికీ ఆ సీన్స్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, కారణం అఖిల్ ప్రజెన్స్.

తన మూడో సినిమాకే వన్ మ్యాన్ షో చూపించాడు అఖిల్. తన బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యే కథ పడితే ఎలా ఉంటుందో ప్రూవ్ చేశాడు. యాక్టింగ్, డైలాగ్ మాడ్యులేషన్, ఎక్స్ ప్రెషన్స్ విషయంలో చాలా డెవలప్ అయ్యాడు. ప్లేబాయ్ క్యారెక్టర్ ను అండర్-కరెంట్ గా అలాగే కొనసాగిస్తూ, ఇంకాస్త ఫన్ యాడ్ చేసి స్క్రీన్ ప్లే రాసుకుంటే మిస్టర్ మజ్ను మరో లెవెల్లో ఉండేది. వెంకీ అట్లూరి రైటింగ్ లో అది మిస్ అయింది.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు కాస్త బలహీనంగా ఉన్న ప్రేమ సన్నివేశాలు మజ్నును కొంచెం వెనక్కి లాగుతుంటే.. అఖిల్ ఒక్కడే సినిమాను తన భుజాలపై ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో అఖిల్ కు నూటికి నూరు మార్కులు వేసేయొచ్చు. జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దీనికి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాడ్ అవ్వడంతో అక్కడక్కడ వీక్ గా ఉన్న సీన్స్ కూడా భలేగా ఎలివేట్ అయ్యాయి.

అటు అఖిల్, ఇటు తమన్, మరోవైపు సినిమాటోగ్రాఫర్ వీళ్లు ముగ్గురు మాత్రమే సినిమాను నిలబెట్టారు. హైపర్ ఆది, ప్రియదర్శి కామెడీ ఓ 3 చోట్ల పేలింది. చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని దర్శకుడు సమర్థవంతగా వాడుకోలేకపోయాడు. కథనం స్లోగా సాగడం, సినిమాను హై-పాయింట్ కు తీసుకెళ్లే సీన్స్ లేకపోవడం, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ లో క్లారిటీ లేకపోవడం  ఈ సినిమాకు ప్రధానంగా మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు.

వీటిని మినహాయిస్తే.. ఓవరాల్ గా మజ్ను మైమరిపిస్తాడు. అక్కినేని ఫ్యాన్స్ అయితే పండగ చేసుకునే సినిమా ఇది.

రేటింగ్3/5