Movie Review - 'సామాన్యుడు'

Friday,February 04,2022 - 03:42 by Z_CLU

నటీనటులు :  విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, బాబురాజ్ జాకబ్, తులసి, రవీనా రవి. రాజా

సంగీతం  : యువన్ శంకర్ రాజా

కెమెరామెన్  :  కెవిన్ రాజా

ఎడిటర్ :  ఎన్ బి శ్రీకాంత్

ఆర్ట్  : ఎస్ఎస్ మూర్తి

నిర్మాత  : విశాల్

దర్శకత్వం  : తు.పా. శరవణన్

నిడివి : 166 నిమిషాలు

హీరో విశాల్ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ‘అభిమన్యుడు’ తర్వాత విజయం అందుకోలేకపోయాడు. తాజాగా ‘సామాన్యుడు’ టైటిల్ తో ఓ రివేంజ్ యాక్షన్ డ్రామా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి సామాన్యుడు మెప్పించాడా ?  విశాల్ సూపర్ హిట్ కొట్టాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ : 

కానిస్టేబుల్ కొడుకు పోరస్ (విశాల్) ఎప్పటికైనా S I అవ్వాలనుకుంటాడు. దానికోసం పరీక్షలు కూడా రాస్తాడు. బ్యాంక్ లో జాబ్ చేసే మైథిలి(డింపుల్ హయతి) తో ప్రేమలో ఉంటాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న పోరస్ కుటుంబంలో ఓ ఘటన జరుగుతుంది. తన చెల్లెలు(రవీన) ఊహించని విధంగా హత్య చేయబడుతుంది.

అప్పుడప్పుడు టీజింగ్ చేస్తుండే వీధి రౌడీ  ఆమెను హత్య చేశాడని అందరూ భావిస్తారు. అతడు కూడా పోలీసులకి లొంగిపోతాడు. కానీ తన చెల్లెలి హత్య చేసింది అతడు కాదని గమనించి అసలు నేరస్థుడిని పసిగట్టే ప్రయత్నం చేస్తాడు పోరస్.

ఈ క్రమంలో ఒక్కొక్కడిని పట్టుకుంటూ చివరికి వ్యాపారవేత్త నీలకంఠంని చేరుకుంటాడు. ఇంతకీ నీలకంఠం ఎవరు ? అతనికి పోరస్ చెల్లెలి హత్యకి సంబంధం ఏమిటి ? ఫైనల్ గా ఈ హత్య కేసుని సాల్వ్ చేసి పోరస్ తన చెల్లెలిని చంపినా వారిని ఎలా అంతమొందించాడు ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు : 

హీరో విశాల్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇంటెన్స్ ఉన్న కుర్రాడి పాత్రలో బాగా నటించాడు. ఎప్పటిలానే యాక్షన్ ఎపిసోడ్స్ లో తన మార్క్ చూపించాడు. డింపుల్ హయతి పరవాలేదనిపించుకుంది. ఆమె యాక్టింగ్ కి స్కోప్ ఉండే సన్నివేశాలు లేకపోవడంతో హీరోయిన్ గా గ్లామర్ కే పరిమితం అయింది. స్టైలిష్ విలన్ గా బాబురాజ్ జాకబ్ ఆకట్టుకున్నాడు. కాకపోతే పవర్ ఫుల్ విలనిజం చూపించలేకపోయాడు. యోగిబాబు డైలాగ్ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. పా తులసి, రవీనా రవి. రాజా మిగతా నటీ నటులంతా వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

సినిమాకు యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలకు , అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కి బెస్ట్ బీజీఎం అందించాడు. కెవిన్ రాజా సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాలను తన కెమెరాతో బాగా పిక్చరైజ్ చేశాడు. ఎస్ఎస్ మూర్తి ఆర్ట్ వర్క్ పరవాలేదు. ఎన్ బి శ్రీకాంత్ ఎడిటింగ్ సినిమాకు మైనస్. కొన్ని సన్నివేశాలు డ్రాగ్ అనిపించాయి. యాక్షన్ సీక్వెన్స్ లు మాస్ ఆడియన్స్ ని మెప్పించేలా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష : 

హీరో విశాల్ నుండి సినిమా వస్తుందంటే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కాస్త కొత్తదనం కూడా ఉంటుందని అంచనా వేయొచ్చు. కానీ ఈ మధ్య విశాల్ సినిమాల్లో కొత్తదనం కనిపించడం లేదు. రొటీన్ కంటెంట్ తోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ‘సామాన్యుడు’ తో  అయినా కొత్తదనం ఉన్న కథతో వస్తాడనుకునే ప్రేక్షకులను మరోసారి నిరాశ పరిచాడు విశాల్. రొటీన్ రివేంజ్ డ్రామా కథతోనే ఈ సినిమా చేశాడు . కాకపోతే కథలో సిస్టర్ సెంటిమెంట్ , డ్రామా  యాడ్ చేశారు.

సినిమా ఆరంభం అంతా ఏదో అలా సాగిపోతుంది. అసలు కథ మొదలయ్యేది ఇంటర్వెల్ తర్వాతే. దానికి లీడ్ గా ముందు కథను రాసుకోవడానికి చాలానే కష్టపడ్డాడు దర్శకుడు. పోలీస్ అవ్వాలనుకునే కుర్రాడు తన కుటుంబంలో జరిగిన హత్య ని ఎలా చేదించి ఫైనల్ గా విలన్ ని అంతమొందించాడనేది ఈ సినిమా కథ. ఈ రొటీన్ కథకి స్క్రీన్ ప్లే అయినా ఆసక్తిగా రాసుకోవాల్సింది. అదీ జరగలేదు. సన్నివేశాలు కూడా పేలవంగా ఉన్నాయి. సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఉంది. ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ కలిగించే స్కోప్ కూడా ఉంది. దాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయాడు దర్శకుడు.

ఇంటర్వెల్ వరకూ హీరో క్యారెక్టరైజేషణ్ , లవ్ ట్రాక్ , ఫ్యామిలీ ఎపిసోడ్స్ తో నడిపించేసిన దర్శకుడు సెకండాఫ్ లో కథలోకి తీసుకెళ్ళి పరవాలేదనిపించాడు. ఇంటర్వెల్ నుండి రెండో భాగం కాస్త స్పీడ్ అందుకొని కథ పరిగెడుతుంది. కానీ హీరో విలన్ ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు మాత్రం మళ్ళీ రౌటిన్ యాక్షన్ సినిమాలనే గుర్తుచేస్తాయి. సినిమాలో ఒక ఫ్యాక్టరీ వల్ల నష్టపోయిన కుటుంబం తరుపున పోరాడే వ్యక్తి తాలూకు కథని కూడా జత చేశాడు దర్శకుడు. దాన్ని లీడ్ గా తీసుకొని ఒక కాన్ఫ్లిక్ట్ తో కొత్త కథ అల్లాలని ట్రై చేశాడు కానీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. విశాల్ యాక్టింగ్ , యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం , కొన్ని సన్నివేశాలు , ప్రీ క్లైమాక్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్ కాగా రొటీన్ స్టోరీ -స్క్రీన్ ప్లే సినిమాకు మేజర్ మైనస్ అనిపించాయి. ముఖ్యంగా ఫైట్స్ బాగున్నాయి.  ఓవరాల్ గా యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ‘సామాన్యుడు’ ఓసారి చూడొచ్చు.

రేటింగ్ 2.5/5