Movie Review - విక్రాంత్ రోణ

Thursday,July 28,2022 - 03:28 by Z_CLU

నటీనటులు: కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రవిశంకర్ గౌడ్ తదితరులు..
రచయిత-దర్శకుడు: అనూప్ భండారి
బ్యానర్లు: జీ స్టుడియోస్, కిచ్చా క్రియేషన్స్, షాలినీ ఆర్ట్స్
నిర్మాత: షాలిని జాక్ మంజు, అలంకార్ పాండియన్
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: విలియం డేవిడ్
ఎడిటర్: ఆశిక్ కుసుగొల్లి
రన్ టైమ్: 147 నిమిషాలు
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: జులై 28

విక్రాంత్ రోణ.. సుదీప్ హీరోగా నటించిన మూవీ. ఇలా చెబితే సరిపోదు. పాన్ ఇండియా హీరోగా అవతరించడానికి సుదీప్ చేసిన విశ్వప్రయత్నమే ఈ సినిమా. మరి సుదీప్ ప్రయత్నం ఫలించిందా? విక్రాంత్ రోణ ఆకట్టుకున్నాడా? పాన్ ఇండియా అప్పీల్ తీసుకొచ్చేంత స్టఫ్ ఈ సినిమాలో ఉందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

Kichha Sudeep's Vikranth Rona Grand Release Tomorrow

కథ

విశాఖ అడవుల్లో కామరాట్టు అనే చిన్న ఊరు. ప్రాచీనమైన ఆ ఊరిలో చిన్న పిల్లలు హత్యకు గురవుతుంటారు. దీనికి ఊరిలో ఉన్న ఓ పెద్ద ఇల్లు కారణమంటూ ఆ ఇంటిని మూసేస్తారు. ఆ ఇంటి బావిలోనే ఎస్సై మృతదేహం దొరుకుతుంది. ఈ మొత్తం కేసుల్ని ఛేదించేందుకు ఊరిలో అడుగుపెడతాడు విక్రాంత్ రోణ (సుదీప్). మరోవైపు ఊరి పెద్ద జనార్థన గంభీర (మధుసూధన్ రావు) ఇంట్లో మరో స్టోరీ నడుస్తుంది. అతడి కొడుకు సంజు, గుడిలో నగలు దొంగిలించి చిన్నప్పుడే ఊరు వదిలి పారిపోతాడు. విక్రాంత్ రోణ ఊరిలో అడుగుపెట్టే సమయానికి కొన్ని రోజుల ముందు సంజు (నిరూప్ భండారీ)కూడా అదే ఊరిలోకి అడుగుపెడతాడు. తన ప్రాణ స్నేహితుడి కూతురు అపర్ణ (నీతా అశోక్) పెళ్లిని తన ఇంట్లో జరిపించడానికి సిద్ధమౌతుంటాడు జనార్థన్ గంభీర. సంజు, అపర్ణ ప్రేమించుకుంటారు. విక్రాంత్ రోణ ఇన్వెస్టిగేషన్ కు సంజుకు సంబంధం ఏంటి? ఈ హత్యలతో, ఆ ఊరితో విక్రాంత్ రోణకు ఉన్న సంబంధం ఏంటి? వరుస హత్యల కేసుల్ని విక్రాంత్ రోణ లా ఛేధించాడు అనేది బ్యాలెన్స్ కథ.

నటీనటుల పనితీరు
సుదీప్ వన్ మేన్ షో కనిపిస్తుంది ఈ సినిమాలో. ఇంట్రో నుంచి క్లైమాక్స్ వరకు సినిమా కథ మొత్తం సుదీప్ చుట్టూ తిరుగుతుంది. కేసును ఛేదించే క్రమంలో కొన్ని సందర్భాల్లో విలన్ గా, మరికొన్ని సందర్భాల్లో హీరాగా కనిపించి మెప్పించాడు సుదీప్. హీరోయిన్ గా నటించిన నీతా అశోక్, సంజు పాత్ర పోషించిన నిరుప్ భండారీ చక్కగా నటించారు. బార్ గర్ల్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆకట్టుకుంది. రక్కమ్మా పాటలో తన హాట్ స్టెప్పులతో పైసా వసూల్ అనిపించింది. రవిశంకర్ గౌడ, సిద్ధు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు
టెక్నికల్ గా సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంది. శివకుమార్ ఆర్ట్ వర్క్, విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రఫీ, ఎ.విజయ్ స్టంట్స్, నిర్మల్ కుమార్ విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాయి. జీ స్టుడియోస్, కిచ్చా క్రియేషన్స్, షాలినీ ఆర్ట్స్ సంస్థల ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండియర్ గా ఉన్నాయి. అజనీష్ లోక్ నాధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫస్టాఫ్ లో వచ్చే సెంటిమెంట్ సాంగ్ కంటే, సెకెండాఫ్ లో వచ్చే రక్కమ్మ సాంగ్ తో ఎక్కువగా ఆకట్టుకున్నాడు ఈ సంగీత దర్శకుడు. అనూప్ భండారీ ఈ సినిమా కథ కోసం పెద్దగా కష్టపడలేదు. చిన్న పాయింట్ నే సెలక్ట్ చేసుకున్నాడు. అయితే దాన్ని భారీగా చెప్పాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో స్క్రీన్ ప్లేలో కొన్ని తడబాట్లు కనిపిస్తాయి. దర్శకుడిగా మాత్రం పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాడు.

జీ సినిమాలు రివ్యూ

పాన్ ఇండియా సినిమాకు ఉండాల్సిన లక్షణాలన్నీ విక్రాంత్ రోణకు ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది అద్భుతమైన ఆర్ట్ వర్క్ గురించే. అడవి, పోలీస్ స్టేషన్, ఇల్లు, గుహలు, దేవాలయాలు, కార్లు, బార్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఎలిమెంట్ లో ఆర్ట్ వర్క్ ఎట్రాక్ట్ చేస్తుంది. కళ్లుచెదిరే సెట్స్ కు, ఆకట్టుకునే విజువల్స్ తోడయ్యాయి. దీంతో చూసే ప్రతి కంటిని ఆకట్టుకుంటుంది విక్రాంత్ రోణ సినిమా. దీనికితోడు రక్కమ్మ సాంగ్, ఆడియోగా ఆకట్టుకోవడంతో పాటు, విజువల్ గా కూడా మెరిసింది.

అయితే అన్ని రాష్ట్రాల ఆడియన్స్ ను ఆకట్టుకొని, పాన్ ఇండియా సినిమాగా నిలవాలంటే, ఈ అంశాలు ఉంటే సరిపోతాయా? కథ-కథనం అక్కర్లేదా? ఈ విషయంలో విక్రాంత్ రోణ కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. ఈ సినిమాను కొత్తగా, గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు దర్శకుడు. హీరో ఇంట్రడక్షన్ నుంచి ఆ గ్రామంలో ఏదో జరుగుతోందనే క్యూరియాసిటీ వరకు అన్నీ బాగా బిల్డప్ చేశాడు. అయితే ప్రీ-క్లయిమాక్స్ నుంచి ఇదొక సగటు రివెంజ్ డ్రామా టర్న్ తీసుకోవడమే బాధాకరం.

అవును.. విక్రాంత్ రోణ సినిమా ఓ సింపుల్ రివెంజ్ డ్రామా. కూతురు చావుకు కారణమైన వాళ్లను పట్టుకొని చంపేసే ఓ తండ్రి కథ. దీన్ని ఇలా సింపుల్ గా చెబితే ఈ కాలం వర్కవుట్ అవ్వదనుకున్నాడు దర్శకుడు. అందుకే తను చెప్పాలనుకున్న సింపుల్ కథ కోసం కామరాట్టు అనే గ్రామాన్ని సృష్టించాడు. అందులో పిల్లలు మాయమవ్వడం, ఓ పెద్ద ఇల్లు దెయ్యాల కొంపగా మారడం, కథ 30 ఏళ్ల కిందకు జరగడం, బాలీవుడ్ హీరోయిన్ బార్ గర్ల్ అవతారం ఎత్తడం, చిన్నారి ఆత్మ, భారీ సెట్లు, కెమెరా యాంగిల్స్ లాంటి ఎన్నో అంశాల్ని చుట్టూ పేర్చాడు. ఇలా పాన్ ఇండియా అనే పెద్ద గోడను కట్టిన దర్శకుడు, దానికి ఆధారమైన స్టోరీ అనే పిల్లర్ స్ట్రాంగ్ గా ఉందో లేదో చూసుకోలేకపోయాడు.

అడవి మధ్యలో ఉండే ఓ ఊరు, అందులో ఉన్న పిల్లలు మాయమవ్వడం అనే కాన్సెప్ట్ తో కథను చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేశాడు దర్శకుడు. చివరికి పోలీస్ స్టేషన్ లో ఉండే ఎస్సై కూడా హత్యకు గురవుతాడు. ఈ మిస్టరీ హత్యల్ని చేధించడానికి రంగంలోకి దిగుతాడు విక్రాంత్ రోణ. అదే టైమ్ లో ఊరు పెద్ద జనార్థన్ ఇంట్లో ఓ లవ్ స్టోరీని స్టార్ట్ చేశాడు దర్శకుడు. ఇటు లవ్ స్టోరీని, అటు విక్రాంత్ రోణ ఇన్వెస్టిగేషన్ ను సమాంతరంగా తీసుకెళ్తాడు. ఓ టైమ్ లో విక్రాంత్ రోణనే ఈ హత్యలు చేస్తున్నాడేమో అనే అనుమానం కలిగేలా చక్కటి ట్విస్ట్ తో ఇంటర్వెల్ కార్డ్ వేశారు.

ఇంటర్వెల్ తర్వాత కథ పరుగులు పెడుతుంది. విక్రాంత్ విలన్ కాదు, హీరో అనే యాంగిల్ ఎలివేట్ అవుతుంది. ఊరి పెద్ద కూడా విలన్ కాదనే విషయం తేలిపోతుంది. స్మగ్లర్ చావును ఎరగా వేసి విక్రాంత్ రోణ, అసలు హంతకుడ్ని పట్టుకునే విధానం సీన్ బై సీన్ చాలా బాగా కుదిరింది. క్లైమాక్స్ కు వచ్చేసరికి రివెంజ్ డ్రామా ఫ్లాష్ బ్యాక్ తో కథకు ఓ మంచి ముగింపు ఇచ్చాడు దర్శకుడు.

ఈ పాన్ ఇండియా సినిమాలో సుదీప్ వన్ మేన్ ఆర్మీలా పనిచేశాడు. తన నటన, డాన్స్, ఫైట్స్ తో ఆకట్టుకున్నాడు. సుదీప్ మినహా మరో వ్యక్తికి ఈ సినిమాలో చోటు లేదనే చెప్పాలి. సంజు పాత్ర పోషించిన నిరూప్ భండారీకి సుదీప్ తర్వాత నటించడానికి ఎక్కువ స్కోప్ దొరికింది. సినిమాలో ఇతడో సర్ ప్రైజ్ ప్యాకేజీ. దాన్ని ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు, సినిమా చూసి తెలుసుకోవాలి. అపర్ణ పాత్ర పోషించిన నీతా అశోక్ కూడా ఉన్నంతలో ఆకట్టుకుంది.

దర్శకుడు అనూప్ భండారీ సింపుల్ స్టోరీనే రాసుకున్నాడు కానీ, ఇంతకుముందే చెప్పుకున్నట్టు దానిచుట్టూ భారీ సెటప్ పెట్టాడు. ఫస్టాఫ్ వరకు అతడి స్క్రీన్ ప్లే బాగుంది కానీ, సెకెండాఫ్ కు వచ్చేసరికి రైటర్ గా తడబడ్డాడు. మరీ ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ లో కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే పెట్టాడు. డైరక్టర్ గా మాత్రం అనూప్ కు మంచి మార్కులు పడతాయి. ఆర్ట్ వర్క్, విజువల్ ఎఫెక్టులు, కెమెరా వర్క్ హై-లెవెల్లో ఉన్నాయి. జీ స్టుడియోస్, కిచ్చా క్రియేషన్స్, షాలినీ ఆర్ట్స్ సంస్థల ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండియర్ గా ఉన్నాయి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ప్రమోషన్స్ లో ప్రముఖంగా చూపించి, సినిమాలో కేవలం ఐటెంసాంగ్ కు పరిమితం చేయడం బాగాలేదు.

ఇక తెలుగు వెర్షన్ విషయానికొస్తే అక్కడక్కడ డబ్బింగ్ కుదరలేదు. సినిమాలో వచ్చే కన్నడ పదాల్ని, వాక్యాల్ని కూడా మార్చలేదు. సినిమాలో నేపథ్యాన్ని రాజమండ్రి, విశాఖ గా చూపించిన మేకర్స్.. అక్షరాల్ని మాత్రం కన్నడంలోనే చూపించారు. తెలుగు సీజీ వర్క్ లేదు. త్రీడీ ఎఫెక్టులు బాగున్నాయి. త్రీడీ గ్లాసెస్ పెట్టుకొని చూసేవాళ్లకు మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా.

ఓవరాల్ గా చూసుకుంటే, మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన విక్రాంత్ రోణ సినిమాను అద్భుతమైన విజువల్స్, కళ్లుచెదిరే ఆర్ట్ వర్క్, సుదీప్ యాక్టింగ్ కోసం ఓసారి చూడొచ్చు.

రేటింగ్ – 2.75/5