Movie Review - టక్ జగదీష్

Friday,September 10,2021 - 09:18 by Z_CLU

నటీనటులు: నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్ త‌దిత‌రులు
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్
సంగీతం: త‌మ‌న్‌ (పాటలు) గోపీసుందర్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్)
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
రన్ టైమ్: 148 నిమిషాలు
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 10, 2021

ఈ ఏడాది థియేట్రికల్ రిలీజ్ మిస్సయిన పెద్ద సినిమాల్లో ఒకటిగా నిలిచింది టక్ జగదీశ్. నాని హీరోగా నటించిన ఈ సినిమా ఓటీటీలో డైరక్ట్ గా రిలీజైంది. నాని-శివనిర్వాణ సూపర్ హిట్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? జీ సినిమాలు రివ్యూ

tuck jagadish movie review in telugu zeecinemalu

కథ

భూదేవిపురం అనే ఊరిలో ఆదిశేషగిరి నాయుడు (నాజర్) పెద్ద మనిషి. ఆయనది పెద్ద కుటుంబం కూడా. ఆయనకు ఇద్దరు భార్యలు. పెద్ద కొడుకు బోస్ (జగపతి బాబు), చిన్న కొడుకు టక్ జగదీశ్ (నాని). మధ్యలో ఇద్దరు అక్కలు. ఊరిలో ఆదిశేషగిరి నాయుడు కుటుంబానికి వీరేంద్ర (డేనియల్ బాలాజీ) కుటుంబానికి పడదు. ఓ ప్రాజెక్టుకు సంబంధించి రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో హఠాత్తుగా
ఆదిశేషగిరి మరణిస్తాడు. కుటుంబంతో పాటు ఊరు బాధ్యతల్ని బోసు తీసుకుంటాడు.

అయితే ఊహించని విధంగా బోస్ మారిపోతాడు. వీరేంద్ర కొడుకుతో చేతులు కలుపుతాడు. మేనకోడల్ని (ఐశ్వర్యరాజేష్) శత్రువు కుటుంబానికి కోడలిగా పంపిస్తాడు. అక్కచెల్లెళ్లని ఇంట్లోంచి తరిమేస్తాడు. ఊరిలో భూముల్ని తన పేరిట రాయించుకుంటాడు. ఇలాంటి టైమ్ లో టక్ జగదీష్ ఏం చేశాడు? అన్నలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాడు? కుటుంబం మొత్తాన్ని తిరిగి ఎలా ఒక్కటిగా చేశాడు? అనేది బ్యాలెన్స్ కథ.

నటీనటుల పనితీరు

నాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టక్ జగదీశ్ పాత్రలో లీనమైపోయాడు. ప్రతి సన్నివేశంలో తన మార్క్ చూపించాడు. కథతో సంబంధం లేకుండా దర్శకుడ పెట్టిన మాస్ ఎలిమెంట్స్ ను కూడా రక్తి కట్టించాడు. నాని తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర ఐశ్వర్య రాజేష్ ది. ఆమెకు మంచి క్యారెక్టర్ పడింది. ఇక డబుల్ షేడ్స్ లో జగపతిబాబు ఆకట్టుకోగా.. నాజర్, రావురమేశ్, నరేష్, రోహిణి, ప్రవీణ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. రీతూవర్మకు నటించే స్కోప్ ఇవ్వలేదు.

టెక్నీషియన్స్ పనితీరు

టెక్నికల్ గా సినిమా రిచ్ గా ఉంది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తమన్ పాటలు, గోపీసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ప్రవీణ్ పూడి ఎడిటింగ్, షైన్ స్క్రీన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడి విషయానికొస్తే.. శివనిర్వాణ పాత కథనే ఎంచుకున్నప్పటికీ ”ఎమోషన్”పై తనకున్న గ్రిప్ తో టక్ జగదీశ్ తీశాడు. అయితే ఈసారి కేవలం ఎమోషన్ కే పరిమితం కాకుండా, మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్ లాంటివి కూడా ట్రై చేశాడు. నాని ఇంట్రడక్షన్ సీన్, పొలం ఫైట్, నాని నాన్-వెజ్ భోజనం ఎపిసోడ్ లాంటి సన్నివేశాల్ని శివనిర్వాణ సినిమాల్లో ఊహించలేం. పాత కథకు కొత్తదనం ఆపాదించేందుకు శివ ఇవన్నీ యాడ్ చేశాడనే విషయం తెలుస్తూనే ఉంటుంది. కానీ బాగుంటుంది.

Tuck Jagadish movie Nani Ritu Varma

జీ సినిమాలు రివ్యూ

కుటుంబ బంధాలు, ఆస్తి పంపకాల్లో గొడవలు, సవతి తల్లి కాన్సెప్ట్ కథలు ఇప్పటివి కావు. ఎన్టీఆర్, ఏఎన్నార్ జమానా నుంచి చూస్తున్నాం. మరి ఇప్పటి జనరేషన్ కు ఇలాంటి కథను వినిపించాలంటే ఏం చేయాలి? సీటు నుంచి కదలకుండా కూర్చోబెట్టాలంటే ఏం చూపించాలి? దీనికి సమాధానమే టక్ జగదీష్. ఓ పాత కథకు దర్శకుడు శివ నిర్వాణ ఇచ్చిన టచప్, చేసిన మేకప్ బాగుంది. దాన్ని నాని నిలబెట్టిన విధానం ఇంకా
బాగుంది. అందుకే సినిమా హిట్టయింది.

మరో తల్లి బిడ్డల్ని కూడా సవతి తల్లి ఎంతో ప్రేమగా చూస్తుంది. ఆస్తి పంపకాల్లో అన్నదమ్ములే విడిపోతుంటారు. ఓ పెద్ద కుటుంబంలో చిచ్చు పెట్టడం కోసం మరో కుటుంబం ఎన్నాళ్ల నుంచో కాచుక్కూర్చుంటుంది. ఇవన్నీ రొటీన్ ఫార్మాట్స్. ఈ పార్ములాలో సినిమా తీస్తే సన్నివేశాలు ఎలా ఉంటాయో అందరం ఊహించుకోగలం. చివరికి క్లైమాక్స్ ఎలా ఉంటుందో కూడా చెప్పేయగలం. టక్ జగదీష్ కూడా అలానే ఉంది. కానీ నిరాశపరచదు. బోర్ కొట్టకుండా చివరి వరకు కూర్చోబెడుతుంది.

పాత చింతకాయపచ్చడి లాంటి కథకైనా మంచి ఎమోషన్ అందిస్తే ఆడియన్ లైక్ చేస్తాడనడానికి పెద్ద ఉదాహరణ టక్ జగదీష్. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న దర్శకుల్లో ఎమోషన్ ను పండించడంలో ది బెస్ట్ అనిపించుకున్న శివ నిర్వాణ, టక్ జగదీష్ ను ఎమోషనల్ రైడ్ గా మార్చేశాడు. ఇది అతడికి అలవాటైన విద్యే. సీన్స్ కూడా తెలిసిపోతుంటాయి. కానీ శివ నిర్వాణ-నాని కలిసి మేజిక్ చేశారు. అదే ఈ సినిమాకు బలం.

సినిమా స్టార్ట్ అవ్వడమే రొటీన్ గా స్టార్ట్ అవుతుంది. గ్రామాల్లో కక్షలు, ఊరిలోకి హీరో ఎంట్రీ, ఓ పెద్ద కుటుంబం, హీరో హీరోయిన్ ను కలవడం, లవ్ ట్రాక్, ఊరిలో రాజకీయాలు, భూతగదాలు.. ఇలా సాదాసీదాగానే ఉంటుంది సెటప్ అంతా. స్క్రీన్ ప్లే అంతా మన కనుసన్నల్లోనే సాగిపోతుంటుంది. క్యారెక్టర్స్, వాటి మధ్య బంధాల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైమ్ తీసుకున్న శివ నిర్వాణ, అసలు మేటర్ లోకి రావడానికి లేట్ చేశాడు. అలా హీరో ఎంట్రీతో పాటు, అసలు ట్విస్ట్ కూడా ఆలస్యంగా మొదలవుతుంది ఈ సినిమాలో.

అయితే ఎప్పుడైతే ఒక్కో ట్విస్ట్ ను రివీల్ చేసుకుంటూ వచ్చాడో, ఇక అక్కడ్నుంచి కథ పరుగులు పెడుతుంది. ఓవైపు ఐశ్వర్యరాజేష్ కథను, మరోవైపు నాని కథను, ఇంకోవైపు జగపతిబాబు ట్రాక్ ను సమాంతరంగా నడిపిస్తూ దర్శకుడు సినిమాను పరుగులుపెట్టించాడు. క్లైమాక్స్ లో సీన్లు అతుకుల బొంతలా అనిపించినప్పటికీ, లాజిక్ కు దూరంగా ఉన్నప్పటికీ జగపతిబాబు, నాని, ఐశ్వర్యరాజేష్ కలిసి వాటిని మరిచిపోయేలా చేశారు.

ఇక టక్ జగదీష్ అనే టైటిల్ కు, సినిమా కథకు పెద్ద సంబంధం కనిపించదు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు పాత కథకు కొత్త సొబగులు అద్దాలంటే ఏదో ఒక మేకప్ వేయాల్సిందే. అలా వేసిన మేకప్స్ లో ఒకటే ఈ టక్ ఎలిమెంట్. అంతకుమించి ఈ కథకు దీనికి పెద్దగా లింక్ కనిపించదు. అయినప్పటికీ కొత్తగా ఉంది కాబట్టి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారనడంలో సందేహం లేదు.

కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన నాని, క్లైమాక్స్ వరకు అన్నీ తానై టోటల్ సినిమాను తన భుజంపై మోశాడు. కేవలం కథ, తన క్యారెక్టర్ కు మాత్రమే పరిమితమైపోకుండా.. ఈసారి తనలో మాస్ యాంగిల్ ను కూడా చూపించాడు. శివ నిర్వాణ ఎప్పట్లానే ఈ సినిమాను స్లోగా చెప్పినా, ఎఫెక్టివ్ గా చూపించాడు. టెక్నికల్ గా సినిమా రిచ్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్
– నాని
– ఐశ్వర్యరాజేష్ క్యారెక్టర్
– పొలం ఫైట్, భోజనం ఎపిసోడ్
– ఫ్యామిలీ ఎమోషన్స్

మైనస్ పాయింట్స్
– మ్యూజిక్ (పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా)
– క్లైమాక్స్
– స్లో నెరేషన్

ఫైనల్ గా టక్ జగదీశ్ సినిమా ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది. ఈమధ్య కాలంలో ఇంత హెవీ డోస్ ఎమోషనల్ మూవీ రాలేదు కాబట్టి, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

బాటమ్ లైన్: ”హిట్” జగదీశ్
రేటింగ్2.75/5