Movie Review - ది వారియర్

Thursday,July 14,2022 - 02:48 by Z_CLU

నటీనటులు: రామ్ పోతినేని ,  కృతి శెట్టి, ఆది పినిశెట్టి, నదియా తదితరులు

కూర్పు : నవీన్ నూలి

కళ : డి.వై. సత్యనారాయణ

యాక్షన్ : విజయ్ మాస్టర్ & అన్బు-అరివు

ఛాయాగ్రహణం : సుజీత్ వాసుదేవ్

మాటలు: సాయిమాధవ్ బుర్రా – లింగుస్వామిసాయిమాధవ్ బుర్రా – లింగుస్వామి

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్

స‌మ‌ర్ప‌ణ: ప‌వ‌న్ కుమార్‌

నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి

రచన – దర్శ‌క‌త్వం: ఎన్‌. లింగుస్వామి

నిడివి : 155 నిమిషాలు

విడుదల తేది : 14 జులై 2022

రామ్ పోతినేని , లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘ది వారియర్’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. పవర్ ఫుల్ IPS పాత్రతో రామ్ మెప్పించాడా ? లింగుస్వామి ఫస్ట్ టైం తెలుగులో చేసిన ఈ సినిమా ఆయనకి దర్శకుడిగా సక్సెస్ అందించిందా? జీ సినిమాలు ఎక్స్ క్లూసీవ్ రివ్యూ.

the warrior movie review

కథ :

హైదరాబాద్ లో డాక్టర్ చదువు పూర్తి చేసుకొని కర్నూల్ లో హాస్పిటల్ లో డాక్టర్ గా జాయిన్ అవుతాడు సత్య (రామ్ పోతినేని). రేడియో జాకీ గా పనిచేసే విజిల్ మహాలక్ష్మి(కృతి శెట్టి)తో ప్రేమలో పెడతాడు. మహాలక్ష్మి కూడా సత్యని ప్రేమిస్తుంది.

ఇక డాక్టర్ గా ప్రాణాలు పోస్తూ ప్రాణం విలువ తెలిసిన సత్య ఎదురుగా గురు (ఆది పినిశెట్టి) మననుషులు ప్రాణాలు తీయడం చూసి తట్టుకోలేక వారిపై ఎదురు తిరుగుతాడు. తన పై ఒకడు ఎదురు తిరిగాడాని తెలుసుకున్న గురు సత్య ని చావగొట్టి వదిలేస్తారు.

రెండేళ్ల తర్వాత సత్య IPS ఆఫీసర్ గా మళ్లీ కర్నూలు లో అడుగుపెట్టి గురు కి అతని మనుషులకు ఎదురెళ్లి వారితో ఢీ కొడతాడు. ఫైనల్ గా గురుని సత్య పోలీసుగా మారి ఎలా అంతమొందించడానేది కథ.

నటీ నటుల పనితీరు :

సత్య IPS పాత్రలో రామ్ పవర్ ఫుల్ గా కనిపించాడు. తన ఎనర్జీ కి పర్ఫెక్ట్ పోలీస్ పాత్ర దక్కడంతో సెకండాఫ్ లో చెలరేగిపోయాడు. అటు డాక్టర్ గా ఇటు పోలీస్ గా హీరోయిజంతో మెప్పించాడు. విజిల్ మహాలక్ష్మి గా కృతి శెట్టి పర్ఫెక్ట్ అనిపించుకుంది. కాకపోతే తనకి ఇంపార్టెన్స్ లేని పాత్ర దక్కడంతో కేవలం లవ్ ట్రాక్ కి అలాగే పాటల కోసం పెట్టుకున్నట్టు అనిపించింది. గురు పాత్రతో పవర్ ఫుల్ విలనిజం చూపించాడు ఆది పినిశెట్టి. ఇది వరకూ చేసిన రోలే కావడంతో మళ్లీ విలన్ గా మెస్మరైజ్ చేశాడు. బ్రహ్మాజీ కి సెకండాఫ్ లో ఎలివేషన్ సీన్స్ పడటంతో ఆకట్టుకున్నాడు. అక్షర గౌడ తన కేరెక్టర్ కి న్యాయం చేసింది. అమ్మగా నదియా కూడా రొటీన్ గా కనిపించింది.  జయప్రకాష్ , పోసాని, శరణ్య ప్రదీప్ , అజయ్ , ఛత్రపతి శేఖర్ మిగతా నటీ నటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు కానీ క్లిక్ అవ్వలేదు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు దేవి మ్యూజిక్ కొంత వరకూ ప్లస్ అయ్యింది. ముఖ్యంగా బుల్లెట్ సాంగ్ థియేటర్స్ కి జనాలని రప్పించడానికి ఒక రీజన్ అయింది. ఆ సాంగ్ స్క్రీన్ పై కూడా వర్కౌట్ అయింది. విజిల్ సాంగ్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో దడ దడ సాంగ్ వినసొంపుగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ కి దేవి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉంది. సుజిత్  సినిమాటోగ్రఫీ మూవీకి మరో ప్లస్ పాయింట్. కొన్ని ఫ్రేమ్స్ బాగున్నాయి. అలాగే సాంగ్స్ పిక్చరైజేషన్ లో అతనికి మంచి మార్కులు పడ్డాయి. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ లో సుజిత్ కెమెరా పనితనం కనిపించింది. నవీన్ నూలి ఎడిటింగ్ ఫరవాలేదు. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయకుండా అలాగే ఉంచేసినట్టుగా అనిపించింది.

విజయ్ మాస్టర్ & అన్బు-అరివు ఫైట్స్ మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ , సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ బ్లాక్స్ బాగా కంపోజ్ చేశారు. సాయి మాధవ్ బుర్రా , లింగుస్వామి మాటలు అక్కడక్కడా బాగున్నాయి. లింగుస్వామి కథ -కథనం రొటీన్ గానే ఉన్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

కమర్షియల్ సినిమా కంటూ ఓ ఫార్మేట్ ఉంటుంది. ఒక ఊరు అక్కడ అరాచకాలు చేసే విలన్, హీరో ఆ ఊరికెళ్లి అక్కడ విలన్ ని ఢీ కొట్టి హీరోయిజం చూపిస్తూ క్లైమాక్స్ లో రాముడు, రావణుడిని అంతమొందించినట్టు ఫినిష్ చేయడం. సరిగ్గా ఇదే టెంప్లెట్ ని ఫాలో అయ్యి స్క్రీన్ ప్లే అటు ఇటుగా రాసుకుంటూ చాలా మంది దర్శకులు ఇంకా అదే పట్టుకొని సినిమాలు తీస్తున్నారు. లింగుస్వామి కూడా అదే చేశాడు. తను తీసుకున్న డాక్టర్ కమ్ పోలీస్ అనే పాయింట్ కొత్తగా ఉంది. కానీ దాన్ని రొటీన్ కమర్షియల్ సినిమా ఫార్మేట్ లో తెరకెక్కించి ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయాడు.

ఇప్పటి వరకూ రామ్ పోలీస్ పాత్ర చేయలేదు కాబట్టి ఈ లైన్ అతనికి కొత్తగా ఉండొచ్చు. కానీ ఈ తరహా కాప్ యాక్షన్ డ్రామా సినిమాలు చాలానే చూసేసిన ప్రేక్షకులకి ఇది రొటీన్ అనిపిస్తుంది తప్ప కిక్కివ్వదు. నిజానికి పోలీస్ యాక్షన్ డ్రామాతో మంచి స్క్రీన్ ప్లే రాసుకుంటే కమర్షియల్ గా హిట్ కొట్టడం సులువే. దానికి ఈ మధ్య వచ్చిన క్రాక్ నే ఉదాహరణ.

నిజానికి డాక్టర్ కి కోపం వచ్చి పోలీస్ గా మారడం అనేది ఇందులో కాస్త కొత్తగా అనిపిస్తుంది మిగతాదంతా రొటీన్ యాక్షన్ సినిమాలను గుర్తుచేస్తుంది.  ఒక డాక్టర్ పోలీస్ గా మారి ప్రాణం విలువ తెలియని వారికి దాని విలువ చెప్పాలనుకునే స్టోరీ లైన్ బాగుంది. దాన్ని కాస్త కొత్త ఫార్మేట్ స్క్రీన్ ప్లే తో చెప్తే వర్కౌట్ అయ్యే సబ్జెక్టు ఇది. కానీ లింగుస్వామి ట్రాక్ తప్పలేదు. తనకు బాగా అలవాటైన పక్కా రొటీన్ కమర్షియల్ సినిమాగానే దీన్ని మలిచాడు.

ఇటు సేవియర్ గా అటు వారియర్ గా రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో రామ్ మంచి నటన కనబరిచి సినిమాకు మెయిన్ హైలైట్ అనిపించుకున్నాడు. అలాగే ఆది పినిశెట్టి పవర్ ఫుల్ విలనిజం కూడా ప్లస్ అయ్యింది. కానీ ఇది వరకే ఈ తరహా విలనిజం అతను చూపించేశాడు కాబట్టి కొత్తగా అనిపించదు కానీ తన నటన ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ ఫైట్ లో మెరుపుల్లేవు.

ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్, రామ్ డాక్టర్ సీన్స్ జస్ట్ ఫరవాలేదనిపిస్తాయి. లవ్ ట్రాక్ ఇంకా బాగా రాసుకుంటే బెటర్ గా ఉండేది. అలాగే సెకండాఫ్ లో వచ్చే హీరో Vs విలన్ ట్రాక్ కూడా గతంలో చూసేసినట్టే అనిపిస్తుంది. కాకపోతే సెకండాఫ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ మెప్పిస్తాయి.

ఓవరాల్ గా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, దేవిశ్రీప్రసాద్ సాంగ్స్, రామ్ పెర్ఫార్మెన్స్ కోసం ‘ది వారియర్’ ని ఓ సారి చూడొచ్చు. యాక్షన్ మూవీస్ ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా సెకండాఫ్ పండగే.

రేటింగ్ : 2.75 / 5