Movie Review - స్టాండప్ రాహుల్

Friday,March 18,2022 - 01:50 by Z_CLU

న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్‌, వ‌ర్ష‌బొల్ల‌మ్మ‌, వెన్నెల‌కిషోర్‌, ముర‌ళిశ‌ర్మ‌, ఇంద్ర‌జ‌, దేవీ ప్ర‌సాద్ తదిత‌రులు
ర‌చ‌న‌- ద‌ర్శ‌కత్వం: సాంటో మోహన్ వీరంకి
నిర్మాణ సంస్థ‌లు : డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్
నిర్మాత‌లు : నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి
సంగీతం : స్వీకర్ అగస్తి
సినిమాటోగ్ర‌ఫి : శ్రీరాజ్ రవీంద్రన్
ఎడిట‌ర్ : ర‌వితేజ గిరిజెల్ల‌
రన్ టైమ్: 134 నిమిషాలు
సెన్సార్ : U/A
రిలీజ్ డేట్: మార్చి 18, 2022

ట్రయిలర్ బాగా క్లిక్ అయింది. వరుణ్ తేజ్ లాంటి హీరోలు ప్రమోట్ చేశారు. హీరో లుక్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా ఓ మోస్తరు పాజిటివ్ బజ్ తో ఈరోజు థియేటర్లలోకి వచ్చింది స్టాండప్ రాహుల్. రాజ్ తరుణ్ నటించిన ఈ సినిమా ఎలా ఉంది? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Raj Tarun Stand Up Rahul First Look

కథ

రాహుల్ (రాజ్ తరుణ్)కు జీవితంలో ఏం చేయాలో అర్థం కాదు. స్డాండప్ కమెడియన్ అవ్వాలనుకుంటాడు. కానీ విడిపోయిన తల్లిదండ్రులు (ఇంద్రజ, మురళీశర్మ) మధ్య నలిగిపోతుంటాడు. మనసుకు నచ్చింది చేయమంటాడు తండ్రి. ఉద్యోగం చేసి జీవితంలో సెటిల్ అవ్వమంటుంది తల్లి. సరిగ్గా అప్పుడే రాహుల్ లైఫ్ లోకి వస్తుంది శ్రేయ (వర్ష బొల్లమ్మ). ఇద్దరూ చిన్నప్పుడు కలిసి చదువుకుంటారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఉద్యోగంలో కలుస్తారు. రాహుల్ ను శ్రేయ ఇష్టపడుతుంది.

కానీ తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, తల్లిదండ్రులు విడిపోవడం లాంటి కారణాల వల్ల రాహుల్ కు శ్రేయ అంటే ఇష్టం ఉన్నప్పటికీ ప్రేమించడు. పెళ్లికి నో చెబుతుంటాడు. దీంతో రాహుల్ ను మార్చేందుకు లివ్ ఇన్ రిలేషన్ షిప్ (సహజీవనం) చేద్దామంటుంది శ్రేయ. అలా ఇద్దరూ కలిసి కొత్త జీవితం స్టార్ట్ చేస్తారు. తండ్రి చెప్పినట్టు స్టాండప్ కమెడియన్ గా ఉంటూనే, అమ్మకు ఇష్టమైన ఉద్యోగం కూడా చేస్తుంటాడు రాహుల్. ఫైనల్ గా రాహుల్ తనకు ఏం కావాలో రియలైజ్ అయ్యాడా? తను వదిలేసిన శ్రేయను దక్కించుకున్నాడా లేదా అనేది స్టోరీ.

నటీనటుల పనితీరు

రాజ్ తరుణ్ యాక్టింగ్ కంటే అతడి లుక్ గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఇన్నేళ్లయినా ఈ హీరో అలానే ఉన్నాడు. అతడి మెయింటైనెన్స్ ను మెచ్చుకోవాల్సిందే. యాక్టింగ్ పరంగా ఈ సినిమాలో రాజ్ తరుణ్ పెద్దగా కష్టపడిందేం లేనప్పటికీ, మేకోవర్ పరంగా మాత్రం బాగున్నాడు. వర్ష బొల్లమ్మను ఈ సినిమాలో ఎందుకు తీసుకున్నారో క్లైమాక్స్, ప్రీ-క్లైమాక్స్ చూస్తే అర్థమౌతుంది. ఆమె యాక్టింగ్ చాలా బాగుంది. తల్లి పాత్రలో ఇంద్రజ, తండ్రి పాత్రలో మురళీశర్మ సరిగ్గా సూట్ అయ్యారు. ఇంద్రజ, మురళీశర్మ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. వెన్నెల కిషోర్ కామెడీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇతర నటీనటులంతా తమ పాత్రల మేరకు మెప్పించారు.

టెక్నీషియన్స్ పనితీరు

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి ఈ సినిమా కథకు తగ్గట్టు బాగా ఖర్చుపెట్టారు. స్వీకర్ అగస్తి కంపోజ్ చేసిన ఒక పాట బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఫెయిల్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ ఓకే. రచయిత కమ్ దర్శకుడు శాంటో ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు కానీ.. నెరేషన్ విషయంలో మాత్రం అతడికి పూర్తిస్థాయిలో మార్కులు పడవు. ఒక దశలో (మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో) అతడి నెరేషన్ లో కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. దర్శకుడిగా అతడు సక్సెస్ అయ్యాడు కానీ, రచయితగా మాత్రం అతడు ఇంకాస్త హోం వర్క్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఎడిటర్ రవితేజ ఈ సినిమాను మరింత ట్రిమ్ చేసి ఉండొచ్చు.

stand up rahul movie stills 2

జీ సినిమాలు సమీక్ష

స్వయంవరం సినిమా గుర్తుందా? అందులో హీరో ప్రేమిస్తానంటాడు, కానీ పెళ్లి చేసుకోనంటాడు. దానికి కారణం అతడి తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడ్డమే. ఇక కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా గుర్తుందా? అందులో తల్లిదండ్రులు విడిపోతారు. కానీ కొడుకంటే ఇద్దరికీ ఇష్టమే. ఈ రెండు కాన్సెప్టుల్ని కలిపి, దానికి స్టాండప్ కామెడీ యాంగిల్ మిక్స్ చేస్తే అదే స్టాండప్ రాహుల్. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కన్ఫ్యూజింగ్ లో ఉన్న ఓ వ్యక్తి ఎలా రియలైజ్ అయ్యాడు, తన ప్రేమను, కెరీర్ ను ఎలా మలుచుకున్నాడనే కథను కామెడీగా చెప్పే ప్రయత్నం చేశారు.

సినిమా స్టార్ట్ అవ్వడమే హీరో క్యారెక్టర్ ఏంటనే విషయంతో పాటు.. క్లైమాక్స్ ఏంటనే అంశం కూడా తెలిసిపోతుంది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇలాంటి రియలైజేషన్ కథలు చాలానే చూసేశాం. కాకపోతే స్టాండప్ రాహుల్ విషయానికొచ్చేసరికి కొన్ని ఎట్రాక్షన్స్ ఉన్నాయి. ఇప్పటితరానికి కనెక్ట్ అయ్యేలా స్టాండప్ కామెడీ పెట్టారు. మోడ్రన్ తల్లిదండ్రుల్ని చూపించారు. ఇంకాస్త ముందుకెళ్తే లివ్ ఇన్ రిలేషన్ షిప్ ను కూడా టచ్ చేశారు. దీంతో ఈ సినిమా చూడ్డానికి ఈ కాలం అర్బన్ రొమాంటిక్ కామెడీ లా కనిపిస్తుంది. కానీ లోపలికి తొంగిచూస్తే పాత కథే అనిపిస్తుంది.

ఈ స్టోరీలైన్ కొత్తగా, పాతదా అనేది ఆలోచించలేదు దర్శకుడు శాంటో. ఇప్పటిజనరేషన్ కు తగ్గట్టు చెప్పామా లేదా అనేది మాత్రమే ఆలోచించాడు. ఈ క్రమంలో అక్కడక్కడ కొన్ని బూతు డైలాగులు పెట్టినప్పటికీ ఫర్వాలేదు. కానీ నెరేషన్ విషయంలో అతడు ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. మరీ ముఖ్యంగా సినిమా ఫ్లాట్ గా స్టార్ట్ అవుతుంది. మనందరం ఎలా ఊహించుకుంటామో అలానే నడుస్తుంది. ఈ వీక్ నెరేషన్ ను కామెడీతో కవర్ చేయాలనే దర్శకుడి ప్రయత్నం కూడా ఫస్టాఫ్ లో నెరవేరలేదు.

ఆఫీస్ ఎపిసోడ్లు, స్టాండప్ కామెడీ సీన్లు మరీ అంత గట్టిగా నవ్వించవు. దీనికితోడు వెన్నెల కిషోర్ తో చేయించిన కామెడీ మరీ అతి అయింది. అతడి మాటలు, డైలాగ్ డెలివరీ సామాన్య ప్రేక్షకుడికి అర్థంకావు. ఒక దశలో తెలుగు పదాలు వెదుక్కోవాల్సి వస్తుంది. ఇక కామెడీ ఎలా పండుతుందో మీరే ఊహించుకోవచ్చు. స్టాండప్ కామెడీ సన్నివేశాలు కూడా ఓకే అనిపిస్తాయి.

ఫస్టాఫ్ తో కంపేర్ చేస్తే సెకెండాఫ్ కొంత బెటర్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ తో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన దర్శకుడు.. సెకెండాఫ్ లో కొన్ని మంచి సీన్లు పెట్టాడు. అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నప్పటికీ 3-4 ఎపిసోడ్స్ లో కామెడీ వర్కవుట్ అయింది. ఇక అసలైన కథలోకి ఎంటరైనప్పుడు దర్శకుడు బాగానే సీన్స్ రాసుకున్నాడు. హీరోహీరోయిన్ల మధ్య కాన్ ఫ్లిక్ట్ ను బాగానే ఎస్టాబ్లిష్ చేశాడు. కానీ ఆ సన్నివేశాల్లో మరింత ఎమోషన్స్ పండితే బాగుండేదనిపిస్తుంది. అదే టైమ్ లో వర్ష బొల్లమ్మ లేకపోతే, ఆ మాత్రం కూడా సీన్లు పండేవి కాదు.

మొదట్నుంచి కామెడీ కోటింగ్ తోనే సినిమాను నడిపించిన దర్శకుడు.. క్లైమాక్స్ లో కూడా ఎమోషన్స్ కంటే కామెడీనే నమ్ముకున్నాడు. అయితే అటు హిలేరియస్ కామెడీ అందించలేక, ఇటు పూర్తిస్థాయిలో ఎమోషన్స్ పండించలేక తన అనుభవరాహిత్యాన్ని చాటుకున్నాడు. రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ, ఇంద్రజ యాక్టింగ్ తో పాటు.. 2-3 కామెడీ సీన్లు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా.. వీక్ నెరేషన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్ అనిపిస్తాయి.

ఓవరాల్ గా స్టాండప్ రాహుల్ సినిమాలో కామెడీ ఇంకాస్త వర్కవుట్ అయి, ఎమోషన్స్ ఇంకొంచెం పండితే బాగుండేదనిపిస్తుంది.

బాటమ్ లైన్ : సిట్ డౌన్ రాహుల్

రేటింగ్ : 2.25/5