Movie Review - రావణాసుర

Friday,April 07,2023 - 03:25 by Z_CLU

నటీనటులు: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు…
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌ వర్క్స్
కథ & డైలాగ్స్ : శ్రీకాంత్ విస్సా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: నవీన్ నూలి
రన్ టైమ్: 2 గంటల 20 నిమిషాలు
సెన్సార్: A
రిలీజ్ డేట్: ఏప్రిల్ 7, 2023

ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. వాల్తేరు వీరయ్యతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మరి రావణాసుర సినిమాతో ఆ సక్సెస్ ను రిపీట్ చేశాడా? రవితేజ హ్యాట్రిక్ అందుకున్నాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ..

ravanasura movie review

 

కథ

రవి (రవితేజ) ఓ జూనియర్ లాయర్. కనక మహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర పనిచేస్తుంటాడు. సిటీలో అనుకోకుండా ఓ పెద్ద హత్య జరుగుతుంది. ఆ హత్య హారిక (మేఘా ఆకాష్) తండ్రిపై పడుతుంది. ఆ వెంటనే అదే తరహాలో మరిన్ని హత్యలు జరుగుతుంటాయి. వీటిని సాల్వ్ చేయడానికి మురళీ శర్మ, జయరాం రంగంలోకి దిగుతారు. కేసులో లోతుకు వెళ్లేకొద్దీ ఈ కేసులకు రవికి సంబంధం ఉందనే విషయం తెలుసుకుంటారు? ఇంతకీ రవి ఎవరు? రవికి రామ్ (సుశాంత్)కు సంబంధం ఏంటి? ఫైనల్ గా కేసులన్నీ ఎలా సాల్వ్ అయ్యాయనేది స్టోరీ.

నటీనటుల పనితీరు
రావణాసురగా రవితేజ మెప్పించాడు. తొలిసారి నెగెటివ్ షేడ్స్ లో కనిపించిన ఈ హీరో, అద్భుతమైన యాక్టింగ్ తో తన సీనియారిటీ చూపించుకున్నాడు. రవితేజ తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర సుశాంత్ ది. సపోర్టింగ్ రోల్ లో సుశాంత్ అదరగొట్టాడు. అయితే ఇతడిది నెగెటివ్ క్యారెక్టరా లేక పాజిటివ్ పాత్రా అనేది ఇక్కడ చెప్పకూడదు. హీరోయిన్లుగా నటించిన దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ, అను ఎమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. వీళ్లలో మేఘా ఆకాష్ కు మంచి పాత్ర దక్కింది. రావు రమేష్, మురళీశర్మ, సంపత్ రాజ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు
ముందుగా అభిషేక్ పిక్టర్స్, ఆర్టీ టీమ్ వర్క్క్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పుకోవాలి. నిజానికి థ్రిల్లర్ సబ్జెక్టులకు పెద్దగా బడ్జెట్ పెట్టరు. కానీ అభిషేక్ నామా, రవితేజ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను నిర్మించారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఎడిటింగ్ ఫర్వాలేదు.

తనకిష్టమైన జానర్ కావడంతో దర్శకుడిగా సుధీర్ వర్మ తన టాలెంట్ చూపించాడు. ట్విస్టులు, టర్నులు బాగానే ఇచ్చాడు. అయితే ఈ దర్శకుడి ప్రతి సినిమాలో స్క్రీన్ ప్లే సమస్యలుంటాయి. రావణాసురలో కూడా అలాంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అయినప్పటికీ ఈ టిపికల్ స్క్రీన్ ప్లే సినిమాకు సుధీర్ వర్మ ఉన్నంతలో న్యాయం చేశాడు. క్రైమ్ లో ఓ కొత్త ఎలిమెంట్ తీసుకొని, సినిమాను బాగా నడిపించాడు.

ravanasura movie review

జీ సినిమాలు రివ్యూ
కొంతమంది హీరోలు, కొన్ని సినిమాల్లో నెగెటివ్ గా కనిపించడం చాలా సినిమాల్లో చూశాం. బాలీవుడ్ లో బాజీగర్ నుంచి ఈ ట్రెండ్ ఇంకా ఎక్కువైంది. దాదాపు దీనికి కొనసాగింపుగానే రావణాసుర సినిమా ఉంది. అయితే కథగా కంటే కూడా, ఇందులో మలుపులు ఎక్కువ థ్రిల్ ఇస్తాయి. మేకర్స్ ఎక్స్ పెక్ట్ చేసింది కూడా ఇదే. ఇలాంటి ఉత్కంఠ అందించడంలో రావణాసుర సక్సెస్ అయింది.

సాధారణంగా థ్రిల్లర్ జానర్ కథలు ఓ ప్రత్యేకమైన అంశం దగ్గర ఫెయిల్ అవుతుంటాయి. అసలైన ట్విస్ట్ ను ఆఖరి నిమిషం వరకు దాచిపెట్టడానికి స్క్రీన్ ప్లేలో చాలా కసరత్తులు చేస్తారు. కొన్నిసార్లు ఇలాంటి ప్రయత్నాలు ఫెయిల్ అవుతుంటాయి. రావణాసురకు ఈ సమస్య లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కంటే ముందే విలన్ ఎవరనేది చెప్పేస్తారు. ఇక అక్కడ్నుంచి ప్రేక్షకుడ్ని నడిపించే హుక్ పాయింట్ ఒక్కటే. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్న హంట్ చేస్తుంది. ప్రీ-క్లయిమాక్స్ నుంచి అన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తాడు దర్శకుడు.

థ్రిల్లర్ జానర్ కాబట్టి ఇంతకుమించి చెప్పడం కరెక్ట్ కాదు. ఈ సినిమా ప్రమోషన్ లో రవితేజ చెప్పినట్టు.. అతడికిది చాలా కొత్త పాత్ర. అలాగే మేకర్స్ చెప్పినట్టు ఈ పాయింట్ తో సినిమా ఇప్పటివరకు రాలేదు. కంప్లీట్ నెగెటివ్ షేడ్స్ లో రవితేజ, నిజంగానే రావణాసురను తలపించాడు. అతడి నెగెటివ్ మేనరిజమ్స్ సినిమాకు సరిగ్గా సరిపోయాయి. మరీ ముఖ్యంగా రవితేజ విలనీ స్మైల్ టోటల్ సినిమాకే హైలెట్.

ఓ మంచి థ్రిల్లర్ కు ఉండాల్సిన లక్షణాలన్నీ రావణాసురలో ఉన్నాయి. సినిమా స్టార్టింగ్ నుంచే ఆ టెంపో మెయింటైన్ చేశాడు దర్శకుడు సుధీర్ వర్మ. కథకు సంబంధించిన ట్విస్టులన్నీ బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తుంటాయి. ఆ వెంటనే హత్యలన్నీ ఎవరు చేస్తున్నారనే విషయాన్ని కూడా చెప్పేయడం మంచి ఎత్తుగడ. అయితే ఇలా ఫాస్ట్ గా సాగిపోతున్న థ్రిల్లర్ లోకి రవితేజను దృష్టిలో పెట్టుకొని పెట్టిన పాటలు, కామెడీ లాంటివి సినిమా ఫ్లోను దెబ్బతీశాయి.

అయినప్పటికీ వాటి నుంచి తొందరగానే బయటకొచ్చిన దర్శకుడు, ప్రీ-ఇంటర్వెల్ టైమ్ కే సినిమాలో ఉత్కంఠను తీసుకొస్తాడు. అదే ఊపులో, అదిరిపోయే ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా వేస్తాడు. సెకెండాఫ్ నుంచి సినిమాలో ఎలాంటి డీవియేషన్స్ కనిపించవు. స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది. చివర్లో ప్రీ-క్లయిమాక్స్ కు వచ్చేసరికి, మళ్లీ రవితేజ ఫ్యాన్స్ కోసం అన్నట్టు ఓ ఐటెంసాంగ్ పెట్టడంతో ఫ్లో పడిపోతుంది. తిరిగి క్లయిమాక్స్ లో సినిమా ఆకట్టుకుంటుంది. పాటలు, కామెడీ సీన్స్, రొమాన్స్ లాంటివి పెట్టకుండా స్క్రీన్ ప్లేకు కట్టుబడి సినిమా తీసినట్టయితే రావణాసుర మరింత మెప్పించేవాడు, రవితేజ కెరీర్ లో ఇదొక విలక్షణమైన సినిమాగా కూడా నిలిచేది.

మాస్ రాజా మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నెగెటివ్ షేడ్స్ తో మెప్పించాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమాతో తన డాన్సింగ్ టాలెంట్ చూపించాడు. అల వైకుంఠపురములో లాంటి బిగ్ హిట్ తర్వాత సుశాంత్ ఈ సినిమాలో నటించడానికి ఎందుకు ఒప్పుకున్నాడో, సినిమాలో అతడి పాత్ర చూస్తే అర్థమౌతుంది. ఇక ఐదుగురు హీరోయిన్లు ఉన్న ఈ సినిమాలో, ప్రతి హీరోయిన్ కు ఓ కీలక పాత్ర ఉండడం విశేషం. మురళీశర్మ, జయరాం, రావురమేష్, సంపత్ రాజ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ గా సినిమా ఉన్నంతలో బాగుంది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇది A-సర్టిఫికేట్ మూవీ కావడంతో.. కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలతో కలిసి ఈ సినిమాను చూడలేం.

ఓవరాల్ గా.. రావణాసుర సినిమాతో రవితేజ ఓ డిఫరెంట్ ఎటెంప్ట్ చేశాడు. కథ రొటీన్ అయినప్పటికీ, కథనంలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ.. రవితేజ యాక్టింగ్, అతడి డాన్స్ కోసం ఈ సినిమాను చూడొచ్చు.

రేటింగ్2.75/5